త్వరలో తెరుచుకోనున్న నల్లగొండ భీమా సిమెంట్స్ ఫ్యాక్టరీ

త్వరలో తెరుచుకోనున్న నల్లగొండ భీమా సిమెంట్స్ ఫ్యాక్టరీ

Wednesday June 21, 2017,

1 min Read

ఇటీవలే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరించిన తెలంగాణ ప్రభుత్వం.. నల్లగొండ భీమా సిమెంట్స్ ఫ్యాక్టరీని కూడా తిరిగి ప్రారంభించేందుకు కృషిచేస్తోంది. దీంట్లో భాగంగా కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రొత్సాహకాలను, పలు అంశాల్లోని సడలింపులను ప్రతినిధులకు తెలిపారు.

image


నల్లగొండ జిల్లాలోని మేళ్లచేరువు మండలంలో 1986లో ప్రారంభమయిన భీమా సిమెంట్స్ 2010 నాటికి 9 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. కానీ విద్యుత్ కొరతతో సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఫలితంగా రూ.34 కోట్ల నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో 2014లో ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కంపెనీ మూతపడింది.

ఇప్పుడు ప్రభుత్వం చొరవతో గత ఏడాది అధికారులతో అధ్యయన కమిటీ వేశారు. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు అందివ్వాల్సిన సహకారంపై సమగ్రంగా చర్చించారు. వాణిజ్య శాఖకు చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో కట్టేందుకు అనుమతించారు. దీంతోపాటు విద్యుత్ శాఖ, గనులశాఖ బకాయిలను సైతం వాయిదాల్లో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అంతా సవ్యంగా సాగి కంపెనీ ఉత్పత్తి ప్రారంభిస్తే సుమారు వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఉన్న ప్రతీ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూతపడిన పరిశ్రమల పునరుద్దరణ కోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దతో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలిచ్చాయని గుర్తు చేశారు.

అదే స్ఫూర్తితో సిర్పూర్ పేపర్ మిల్స్ పురుద్దరణ కోసం కూడా పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు పలు కంపెనీలతో అడ్వాన్స్ లెవల్ చర్చలు సానూకూలంగా సాగుతున్నాయని తెలిపారు. కొత్త పెట్టుబడుల కోసం టీఎస్ ఐపాస్ పాలసీని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇండస్ర్టీయల్ హెల్త్ క్లినిక్ పేరిట మరో వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేటీఆర్ అన్నారు. దీని ద్వారా త్వరలోనే మరిన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.