ఏప్రిల్ 4న తెలంగాణ ఐటి పాలసీ.. స్టార్టప్ విధానమూ అప్పుడే..!

అట్టహాసంగా కార్యక్రమం నిర్వహించనున్న ప్రభుత్వం

0


తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు, మరిన్ని కంపెనీలు ఆకర్షించేందుకు ఇక్కడి ప్రభుత్వం నూతన ఐటి విధానాన్ని ప్రకటించబోతోంది. ఇప్పటికే టిఎస్ - ఐపాస్ పేరుతో పరిశ్రమలకు సింగిల్ విండో పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఐటిలో కూడా అదే దూకుడు చూపించాలని భావిస్తోంది. అయితే కేవలం ఒక పాలసీని ప్రకటించి సరిపెట్టుకోకుండా, దీన్ని నాలుగు విభాగాలుగా విభజించాలని నిర్ణయించింది.

ఏప్రిల్ 4వ తేదీన హెచ్ఐసిసిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ ఐటి విధానాన్ని ప్రకటించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, సహ వ్యవస్థాపకులు మోహన్‌దాస్ పాయ్, టై సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి, శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ భరద్వాజ్, విజువల్ ఎఫెక్స్ట్ సొసైటీ, నాస్కాం ప్రెసిడెంట్ చంద్రశేఖరన్, నాస్కాం ఛైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి సహా.. మరికొంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.

నాలుగు విభాగాలుగా..

ఐటి పాలసీని నాలుగు భాగాలుగా మార్చడం వల్ల వీటిపై అధిక దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశముందని ప్రభుత్వం చెబ్తోంది.

1. ఇన్నోవేషన్ పాలసీ

2. రూరల్ టెక్నాలజీ పాలసీ

3. ఎలక్ట్రానిక్ టెక్నాలజీ పాలసీ

4. గేమింగ్, యానిమేషన్, మల్టీమీడియా పాలసీ

ఇన్నోవేషన్ పాలసీలోనే స్టార్టప్స్‌కు సంబంధించిన విధివిధానాలు కూడా ఉండబోతున్నాయి. అంకుర సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగా ఏర్పాటు చేయదలిచిన 'ఇన్నోవేషన్ ఫండ్' మార్గదర్శకాలు కూడా వెల్లడించబోతున్నారు. హైదరాబాద్‌ను స్టార్టప్ క్యాపిటల్‌లా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ విధానం అందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

అభివృద్ధిని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది ? ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తే కంపెనీలు అక్కడికి వెళ్లేందుకు మొగ్గుచూపుతాయి.. అనే అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపధ్యంలో విధాన ప్రకటనలో ఈ రాయితీలను వెల్లడిస్తారు.

సాఫ్ట్‌వేర్‌కు మాత్రమే పరిమితం కాకుండా హార్డ్‌వేర్ రంగంపై కూడా దృష్టి సారించేందుకు ఎలక్ట్రానిక్ టెక్నాలజీని పాలసీని రూపొందిస్తున్నారు. ఐటిఐ, బిటెక్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షించాలని ప్రభుత్వం చూస్తోంది. 'మేకిన్ తెలంగాణ'ను కూడా ఈ సందర్భంగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

ఇప్పటికే IMAGE పేరుతో గేమింగ్,యానిమేషన్ సిటీకి రూపకల్పన చేయాలని భావించిన ప్రభుత్వం.. ఈ రంగానికి కూడా ప్రత్యేక పాలసీ ఉండాలని భావించింది. మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్‌కు రాబోయే రోజుల్లో మెరుగైన భవిష్యత్ ఉందని భావిస్తున్న తరుణంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు.

''ఐటి రంగంలో తెలంగాణ 16 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. మొదటి స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పుడు వృద్ధిలో తర్వాతి స్థాయి గురించి ఆలోచిస్తున్నాం. ఏప్రిల్ 4న ప్రకటించబోయే ఐటి పాలసీలో కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నాం. టి-హబ్, టాస్క్ వంటివి కూడా కీలకపాత్ర పోషించబోతున్నాయి'' - ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు. 


Image credit - Shutterstock