వీళ్లు కనిపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్మార్ట్ గురూ..!!

వీళ్లు కనిపెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్మార్ట్ గురూ..!!

Wednesday February 17, 2016,

5 min Read

పెట్టిన డబ్బులెన్ని.. వచ్చిన లాభమెంత? అందులో నీకెంత? నాకెంత? దేశంలో చాలామంది కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు ఈ బాక్స్ దాటి బయటకు రారు. ఎందుకులే రిస్క్ అనుకుంటారు. సేఫ్ జోన్ లో ఉండి గేమ్ ఆడటానికే ఇష్టపడతారు. సరిగ్గా ఇక్కడే క్రియేటివిటీ మీద దెబ్బ పడుతోంది. రొటేషన్ మాయలో పడి ఇన్నోవేషన్ తగ్గిపోతోంది. ఆవిష్కరణలకంటే ఆదాయమార్గాలే పరమావధిగా మారుతున్నాయి...

బిజినెస్ చేయాలి. డబ్బు సంపాదించాలి. కాదనట్లేదు. వ్యాపారం అంతస్సూత్రం కూడా అదే. . కానీ, అయితే, డబ్బు సంపాదనలో కిక్ కూడా ఉండాలి. అలాంటి కిక్ రావాలంటే కొత్తగా ఆలోచించాలి. రిస్క్ చేయాలి. ఫెయిల్ అయితే అవొచ్చు. రెండోసారి.. మూడోసారి. నాలుగోసారి కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. మీరు చదవబోయే క్రియేటివ్ స్టార్టప్ కథ కూడా అలాంటిదే.

అయితే పెట్రోల్, లేదంటే డీజిల్. ఇవి తప్ప వాహనాలకు ఆల్టర్నేట్ లేదు. బ్యాటరీ కార్స్ ఉన్నాయిగానీ వాడే పరిధి తక్కువ. ఆ మధ్యలో ఎలక్ర్టిక్ స్కూటర్లు వచ్చాయి గానీ అవి అంతపెద్దగా క్లిక్ అవలేదు. దానికి కారణాలు అనేకం. ఆ అనేక కారణాలను, అనేక సమస్యలు ఎందుకు సాల్వ్ చేయకూడదు? స్మార్ట్ గా ఆలోచిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఎందుకు అవదు? సరిగ్గా ఇలాంటి ఐడియా మీదనే వర్కవుట్ చేశారు తరుణ్ మెహతా, స్వాప్నిల్ జైన్. ఇద్దరూ మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు. దేశంలోనే తొలి స్మార్ట్ స్కూటర్ తయారు చేయాలనేది వీరి ప్లాన్. 2013లో స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. దానికి ఏథర్ ఎనర్జీ అని పేరు పెట్టారు. లిథియం ఆయాన్ బ్యాటరీ బ్యాకప్ తో ఈ స్కూటర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దాలనుకున్నారు. గత రెండేళ్ల నుంచి ఏథర్ ఎస్-340 స్కూటర్ రూపొందించడంలో నిమగ్నమయ్యారు. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు స్కూటరును ముస్తాబు చేసి మార్కెట్ లోకి తీసుకు రావాలనుకున్నారు.

image


ఏథెర్ ఎస్-340 స్పెషాలిటీ ఏంటి?

ఏథెర్ ఎస్-340లో లిథియం ఆయాన్ బ్యాటర్ ప్యాక్ ఉంటుంది. డిజిటల్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్, అత్యంత తేలికైన అల్యామినియం ఛాసెస్. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. దీనిలోని డిజిటల్ స్క్రీన్ డ్యాష్ బోర్డులో మనం స్మార్ట్ సెట్టింగ్ ఆఫ్షన్స్ ఇచ్చుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ ను ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఒక గంటలో 90 శాతం బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డులో వెహికిల్ కంట్రోల్ యూనిట్ (డయాగ్నాస్టిక్ సిస్టమ్) ఉంటుంది. ఇది స్కూటర్ ను నడిపే వ్యక్తి ప్రవర్తనను పసిగట్టి ఏమాత్రం తేడాగా ఉన్నా హెచ్చరిస్తుంది. జీపీఎస్ సిస్టమ్ సరేసరి. ఉన్న ఛార్జింగ్ తో ఎన్నికిలోమీటర్ల ప్రయాణించవచ్చో ఇండికేటర్ ముందుగానే చెప్పేస్తుంది. ఛార్జింగ్ అయిపోతుంటే రెడ్ అలర్ట్ ఇస్తుంది. పర్సనలైజ్డ్ ప్రొఫైల్ ఫీచర్స్ వల్ల వాహనాన్ని ఎలా నడపాలోముందుగానే సెట్ చేసుకోవచ్చు. అంటే అంతా ఆటోమేటిక్ అన్నమాట. పెట్రోల్ టూవీలర్ నడిపిన ఫీలింగే వస్తుంది.

ఏథర్ ఎస్-340 డిజైన్

ఏథర్ ఎస్-340 డిజైన్


నిధులు ఎలా?

స్మార్ట్ స్టూటర్ ప్లాన్ బాగానే ఉంది. మరి నిధులెలా వస్తాయన్నదే ప్రశ్న. బడాబడా కంపెనీలే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విజయవంతం చేయలేక చతికిల పడ్డాయి. ఎలారా భగవంతుడా అనుకుంటున్న తరుణంలో ఐఐటీ మద్రాస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిపడింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు 45 లక్షల రూపాయల ఆడ్వాన్స్ ఇచ్చారు. దీంతో నిధుల కొరత కొంతమేర తీరింది. అయితే అవి ఏ మూలకూ చాల్లేదు. పెట్టుబడిదారులెవరూ ముందుకు రాలేదు. ఎందుకులే రిస్క్ అనుకున్నారు. ఇక లాభం లేదనుకుని స్టార్టప్స్ తో బిలియనీర్లుగామారిన బిగ్ షాట్స్ నే ఒప్పించాలనుకున్నారు. ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ తో భేటీ అయ్యారు. స్మార్ట్ స్టూటర్ కాన్సెప్ట్ వారికి వివరించారు. వాటిని మెచ్చిన బన్సాల్ బ్రదర్స్ ఒక మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు ఏడుకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. 2014 డిసెంబర్ లో డబ్బు అందించారు. ఆ తర్వాత మరో ఔత్సాహిక పారిశ్రామికవేత్త మెడ్ ఆల్ సీఈఓ రాజు వెంకట్రామన్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. టైగర్ గ్లోబల్ సంస్థ 2015 మేలో 12 మిలియన్ డాలర్లు అంటే.. 81 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామని మాటిచ్చింది. ఇంకేముంది స్కూటర్ లాంచింగ్ మార్గం సుగగమైంది. ప్రొడక్షన్, టెస్టింగ్, డెవలప్మెంట్ అన్నీ చకచకా సాగిపోతున్నాయి.

డిజైన్ , డెవలప్మెంట్ కోసమే ఎక్కువ శాతం నిధులను కేటాయిస్తున్నాం. ఒక మంచి ఎలక్ట్రిక్ వాహనం తయారే చేయడమే మా ఉద్దేశం. బ్యాటరీ ప్యాకప్ ఒక్కటేకాదు, దానికి తగ్గట్టు ఫాస్ట్ ఛార్జర్, బీఎంఎస్, టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ లాంటి ముఖ్యమైన సబ్ సిస్టమ్స్ కూడా అభివృద్ధి చేస్తున్నాం- స్వాప్నిల్.

బెంగళూరులో ఏథర్ ఎనర్జీ తొలి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సన్నాహాలు కొనసాగుతున్నాయి. విక్టోరియా రోడ్డులో దీనికి అదనంగా డిజైన్ సెంటర్ ఉంది. 2013 నుంచి చూస్తే ఏథర్ ఎనర్జీ ఉద్యోగుల నంబర్ 10 నుంచి 90 కి పెరిగింది. ప్రాడక్ట్ డెవలప్మెంట్ టీంలో 70 మంది పనిచేస్తున్నారు. 20 మంది సేల్స్ అండ్ సపోర్ట్ టీంలో సేవలందిస్తున్నారు. ప్రాడక్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. వాహనాన్ని టెస్ట్ చేస్తున్నారు. తర్వాత వాణిజ్య అవసరాలకోసం తయారు చేస్తారు. ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ పైనా దృష్టిపెడుతున్నారు.

ఏథర్ ఎనర్జీ టీం

ఏథర్ ఎనర్జీ టీం


గతంలో సీన్ ఎందుకు రివర్సయింది?

నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఈఎంఎంపీ) 2020ని కేంద్ర ప్రభుత్వం 2013లోనే ప్రకటించింది. అయితే ఆ పథకం అమలు ఆలస్యం కావడంతో 2011-12లో 28 యూనిట్లుగా ఉన్న ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీదారుల సంఖ్య 2014-15 నాటికి 7కి పడిపోయింది.

2011-12లో లక్ష ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోగా, 2014-15 అమ్మకాలు 16వేలకు పడిపోయాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి. వీటి తయారీ ఖర్చు బాగా ఎక్కువ. అలాగని ఎక్కువ ధరకు వాహనాలను అమ్మితే ఎవరూ కొనరు. ఇదో విచిత్రమైన పరిస్థితి.

అయితే కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి 100 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటోంది. 70 లక్షల ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలను 2020 నాటికి రోడ్లపై తిరుగుతాయని ప్రకటించింది. ఆ లెక్కన చూసుకుంటే భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఉంటుందని చెప్పవచ్చు.

గ్లోబల్ మార్కెట్

1895 లోనే ఎలక్ట్రిక్ సైనిక్ తయారీకి పేటెంట్ కావాలంటూ ఒహియోలో ఒక అప్లికేషన్ వచ్చింది. ఇంగ్లండ్ లో రాన్ సోమ్స్, సిమ్స్ అండ్ జెఫరీస్ కంపెనీ తొలిసారిగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారు చేసింది. ఈ కంపెనీయే ఎలక్ట్రిక్ వాహనరంగానికి మార్గదర్శి. 1936లో తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ బ్రసెల్స్ లో ఏర్పాటయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి తెచ్చాయి. బ్రమ్మో, జీరో మోటార్స్, BMW, ఎలక్ట్రిక్ మోటార్ స్పోర్ట్స్, హాలీవుడ్ ఎలక్ట్రిక్స్, యమహా, హ్యార్లీ డేవిడ్సన్, లిటో కంపెనీలు ఈరంగంలో ముందున్నాయి. జపాన్ కు చెందిన టెర్రామోటార్స్ భారత్ లో 2015 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మడం మొదలుపెట్టింది. ఐదు మిలియన్ డాలర్లతో అంటే 34 కోట్ల రూపాయలతో గుర్గావ్ లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ స్కూటర్ తయారు చేస్తామని 2015 ఎలక్ట్రానిక్ షోలో గోగొరో ఎనర్జీ నెట్ వర్క్ ప్రకటించింది.

యువర్ స్టోరీ అభిప్రాయం

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా ఆరు రాష్ట్రాల్లో 2 లక్షల 50వేల ఈ-రిక్షాలు వాడకంలోకి వచ్చాయి. కాలుష్యాన్ని తగ్గించడంలో ఎలక్ట్రిక్ వాహనాలు చక్కని ప్రత్యామ్నాయం. నగరాల్లో వీటి వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ వాహనాలను ఉపయోగిస్తే 2035 నాటికి నగరాల్లో కాలుష్యం సగానికి సగం తగ్గుతుందని ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక చెబుతోంది.

మహింద్రా E20 దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ కారు. దీని వెల రూ.4.79 లక్షలు. గుజరాత్ కు చెందిన యో బైక్స్ దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. హీరో ఆర్ఎన్టీ డీజిల్ హైబ్రిడ్ స్కూటర్, హిరో స్ప్లెండర్ ఐ స్మార్ట్, హీరో లీప్, మహింద్రా జెన్ జీ, టీవీఎస్ క్యూబ్, హోసంగ్ ST-E3 EVA కంపెనీలు … ఈ రంగంలో చెప్పుకోదగ్గవి. ఇవన్నీ మనదేశంలో సానుకూల అంశాలు.

కోయంబత్తూర్ కు చెందిన యాంపెర్ ఎలక్ట్రిక్ స్టార్టప్ ఎలక్ట్రిక్ సైకిల్స్, టూవీలర్స్, ఇ-స్కూటర్స్ తయారు చేస్తోంది. E-వాహనాలకోసం దేశంలోని తొలిసారిగా ఛార్జర్స్ తయారు చేస్తోంది.

ఏథర్ ఎనర్జీ మిగతా కంపెనీలకన్నా కాస్త భిన్నమైనది. ఎస్-340లో కనెక్టెడ్ రైడ్ ఎక్స్ పీరియన్స్, ఆన్ బోర్డ్ నేవిగేషన్, పర్సనలైజ్డ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. గంటకు 72కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్తోంది. అంతేకాదు గంట ఛార్జింగ్ చేస్తే చాలు.

ఏథర్ ఎనర్జీ స్టార్టప్ కు ఐఐటీ మద్రాస్, ప్లిఫ్ కార్ట్ వ్యవస్థాపకులు, టైగర్ గ్లోబల్ అండ ఉంది. అందుకే ఈ ఏడాదిలోనే 25 కోట్ల పెట్టుబడితో ఎస్ -340స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తొలి స్మార్ట్ స్కూటర్ ఎస్-340. అయితే ఈ స్మార్ట్ స్కూటర్ ఎంతవరకు విజయవంతం అవుతుందన్నది కాలమే నిర్ణయించాలి. ..

వెబ్ సైట్