క్రియేటివ్ గొడుగులతో.. లక్షలు సంపాదించి చూపిస్తున్న ఎంబిఏ విద్యార్థి

రూ.లక్షన్నరతో వ్యాపారం మొదలు..రెండు నెలల్లో రూ.30 లక్షల వ్యాపారం..డిజైనర్ గొడుగులకు కేరాఫ్ అడ్రస్ చీకీచంక్ ..నలుపు రంగు గొడుగుల స్థానంలో వెరైటీ డిజైనర్ గొడుగులు

క్రియేటివ్ గొడుగులతో.. లక్షలు సంపాదించి చూపిస్తున్న ఎంబిఏ విద్యార్థి

Monday September 21, 2015,

5 min Read

మన నిత్యజీవితంలో మనతో విడదీయలేని బంధం ఏర్పాటుచేసుకుంది గొడుగు. తెలుగులో దీన్నే ఛత్రం అంటారు. మహాభారతంలోనూ గొడుగు ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఇతరుల దాడి నుంచి తమను రక్షించుకునేందుకు, ప్రత్యర్థుల పై దాడిచేసేందుకు ఛత్రాన్ని ఉపయోగించేవారు. పురాణకాలం నుంచే దీని ప్రస్తావన మనకు కనిపిస్తుంది.

వర్షం, ఎండ నుంచి మనల్ని కాపాడే ఆయుధం గొడుగు. ఇదే తమకు ఓ మంచి వ్యాపార సాధనం అవుతుందని ప్రతీక్ దోషి ఊహించలేదు. రెండునెలల్లో ఏకంగా 50 వేల అమెరికన్ డాలర్లు అంటే మనక కరెన్సీలో 30 లక్షలరూపాయల వ్యాపారం సాగించారు. వర్షం అంటే ప్రతీక్‌కి అంతగా ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు అదే వర్షం వారి వ్యాపారాన్ని ముప్పై ఆర్డర్లు, అరవై గొడుగులుగా మార్చేసిందని చెప్పాలి.

ప్రతీక్ దోషి, ఫౌండర్, చీకీ చంక్

ప్రతీక్ దోషి, ఫౌండర్, చీకీ చంక్


2014 లో చిరువ్యాపారంగా...

చీకీచంక్ బ్రాండ్ పేరుతో గొడుగులు అమ్ముతూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు ప్రతీక్. 2014 లో ఈ వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించారు ప్రతీక్. దానికే ఎంతో గుర్తింపు, గౌరవం, డిమాండ్ లభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అందరూ అమ్మేలా మామూలు వాటిని అమ్మకుండా, మంచి డిజైన్లతో కొత్తరకం గొడుగులను విక్రయించాలని నిర్ణయించారు. అందరికీ అందుబాటులో ఉండేలా డిజైనర్ వాటిని కొనుగోలుదార్లకు పరిచయం చేశారు ప్రతీక్.

అందరిలా ఆలోచిస్తే మనకు వాళ్ళకి తేడా ఏం ఉంటుంది. ప్రతీక్‌ది కూడా అదే వైఖరి. రొటీన్ జాబ్‌తో సరిపెట్టుకోకుండా ఏదైనా సాధించాలని సంకల్పించారు. తన మనసులోని మాటలను మిత్రులముందు ప్రవేశపెట్టారు. గొడుగులు అమ్ముతావా ? ! , బతకడానికి వేరే వ్యాపారాలే లేవా అని ఎగతాళిగా మాట్లాడారు చాలామంది. అయితే తాను అనుకున్నది సాధించకుండా ఉండడం అతనికి అలవాటు లేదు.

ఎంబీయే పూర్తిచేసుకుని అప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అతని మిత్రులు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే వారికి ఏం కష్టాలు లేవు. అయితే అలా బతకడం తనకు ఇష్టంలేదంటారు ప్రతీక్. ఎలాగైనా గొడుగుల వ్యాపారంలో ఉన్నత శిఖరాలు చేరాలనే ఆలోచన ఆ యువకుడి మనసులో బలంగా పాతుకుపోయింది.

చికీ చంక్ డిజైన్ గొడుగులు

చికీ చంక్ డిజైన్ గొడుగులు


చిన్న పెట్టుబడి పెద్ద లాభం

తక్కువ పెట్టుబడితో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు ప్రతీక్. తొలుత 500 గొడుగులు తయారుచేయాలని నిర్ణయించారు. తన చేతిలో ఉన్న పొదుపు మొత్తం 1.35 లక్షలు మాత్రమే. మిత్రులు, బంధువులు కొంత సాయం చేశారు. తనదగ్గరున్న మొత్తంతో డిజైనింగ్, తయారీలోకి దిగారు. ఆలోచన బాగానే ఉన్నా డబ్బులు సేకరించడం మాత్రం బాగా కష్టంగా మారింది.

ఉద్యోగం లేకుండా ఎంతకాలం ఇలాంటి ప్రయోగాలు చేస్తావంటూ మిత్రులు నిరుత్సాహ పరిచారు. కానీ అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. టైంపాస్ కోసం వ్యాపారం చేయడంలేదని అందరికీ చెప్పాలనిపించింది. ఓ ఇంజనీర్ నూడుల్స్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన ఉదాహరణలు వాళ్లకు చెప్పి అప్పటికి నోరుమూయించేవారు ప్రతీక్.

గొడుగుల తయారీ కష్టమే...

గొడుగులు తయారు చేయడం మాటలు చెప్పినంత ఈజీ కాదని కొన్నాళ్ళకే అతనికి అర్థమైంది. హ్యాండిల్, ప్యానెల్స్, మంచి క్లాత్, ఫ్రేం, ప్రింట్, స్టిచింగ్.. ఇలా ప్రతి దాన్లోనూ కొత్తదనం చూపించాల్సి ఉంటుంది. లేదంటే మార్కెట్లో ఉన్న మామూలు గొడుగులకీ, వీటికీ పెద్దగా తేడా ఏమీ ఉండందంటారు ప్రతీక్.

అందుకే గొడుగుల తయారీని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. తన మిత్రుల ద్వారా రాజస్థాన్ నుంచి ఫ్రేమ్‌లు తెప్పించేవారు. ప్రింటింగ్, స్టిచింగ్, క్లాత్ మార్కెట్లో నమ్మకమయిన వారి దగ్గరి నుంచి సరుకును కొనుగోలు చేశారు. చివరకు వాటి తయారీ సకాలంలో పూర్తిచేసేందుకు ఎంతో శ్రమపడ్డారు ప్రతీక్.

image


చీకీ చంక్ బ్రాండ్‌నేమ్

రోజుకి 400 గొడుగులు తయారుచేయాలని నిర్ణయించారు ప్రతీక్. తనకున్న టీంతో వీటి సంఖ్య పెంచడం అంతగా సాధ్యంకాలేదు. ప్రతీ ప్రొడక్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని తన సిబ్బందికి పదేపదే చెప్పేవారు. ఈ- కామర్స్ కంపెనీలు ఎలా నడుస్తున్నాయో దృష్టిసారిస్తూనే.. మార్కెటింగ్‌లో వారికి ఎదురవుతున్న అనుభవాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. గొడుగుల డిజైన్‌లో కొత్త మార్పులు తీసుకురావాలని భావించాడు. సంప్రదాయకంగా నలుపు రంగు గొడుగులే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలని సూచిస్తారు.

భగవద్గీతలోని ఒక శ్లోకం ప్రతీక్‌ని ప్రతీ నిత్యం ముందుకి నడిపిస్తూ ఉంటుంది.

  • కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన!
  • మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ!!

ముందు పని చేసుకుని వెళ్ళు, ఫలితం గురించి నీవు ఆశించకు అంటాడు శ్రీకృష్ణుడు. ఉదాసీనంగా పని చేయమని భగవానుడు చెప్పడం లేదు. ఉత్సాహంగా శ్రమించు; తుది ఫలితాన్ని మాత్రం తనకు వదిలిపెట్టమంటున్నాడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకు దక్కే తీరుతుంది; అర్హత లేకపోతే ఎంత తాపత్రయపడ్డా అందే అవకాశమే లేదు. కర్తవ్యాన్ని ఎంత దీక్షతో చేస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితమేదైనా, మహాప్రసాదం అనుకోవడమే ఆనందదాయకం. ఈ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటించాడు ప్రతీక్.

చీకీ చంక్‌లో ప్యాకేజింగ్

చీకీ చంక్‌లో ప్యాకేజింగ్


చీకీ చంక్‌ని నడిపించేది ఏడుగురే

కేవలం ఏడుగురితో చీకీ చంక్ నడుస్తోందంటే ప్రతీక్‌కే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇద్దరు ఎంబీయే గ్రాడ్యుయేట్స్, ఒక అకౌంటెంట్, ఇద్దరు సాధారణ ఉద్యోగులు. తయారైన వాటిని ముందుగా నీటితో పరీక్షిస్తారు. ఆ తర్వాత వివిధ డిజైన్ గొడుగులను వీళ్లే అందంగా ప్యాక్ చేసి డెలివరీకి పంపిస్తూ ఉంటారు. ఏవైనా లోపాలుంటే వెంటనే వాటిని పక్కన పెట్టేస్తారు. అందుకే పాడైన గొడుగులంటూ కస్టమర్ల నుంచి తిరిగి రావడం చాలా అరుదు.

ఖర్చులేని మార్కెటింగ్

తమ దగ్గర గొడుగులు కొన్న వినియోగదారులకు అధిక ప్రయోజనం చేకూర్చడమే తమ లక్ష్యం అంటారు ప్రతీక్. గొడుగులు కొని వాడే వినియోగదారుల నుంచి మంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించి, ఇతరులకు తెలియజేయడం ద్వారా మార్కెటింగ్ బాగుంటుందంటారు. షాపు యజమాని మాటకంటే పదిమంది కొనుగోలుదార్ల ఫీడ్‌బ్యాక్ మంచి ఫలితం ఇస్తుంది. అమ్మకాలు పెంచుతుంది. రూ.475, రూ.525, రూ.545, రూ.595 రేట్లలో చీకీ చంక్ గొడుగులు లభిస్తున్నాయి.

ఈ కామర్సే కీలకం

ప్రస్తుతం స్మార్ట్ ట్రెండ్ నడుస్తోంది. మనం తయారుచేసిన వస్తువుల గురించి వినియోగదారులకు తెలియచేయడం ద్వారా వారినుంచి ఎప్పటికప్పుడు ఆర్డర్లు పొందవచ్చు. సోషల్ మీడియా, వెబ్‌సైట్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని అందించాలి. మనం తయారుచేసిన లేటెస్ట్ డిజైన్ వివరాలు సరిగా ఉండాలి. సరిగ్గా చీకీ చంక్ కూడా అదే చేస్తోంది. కంపెనీ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన 100 కీ వర్డ్స్‌ని అందుబాటులో ఉంచారు. ఇందులో ఏది టైప్ చేసినా వెంటనే చీకిచంక్ వెబ్‌సైట్‌లోని గొడుగులు ప్రత్యక్షం అవుతాయి.

మరిచిపోలేని రోజు

మే 27, 2014 తేదీని జీవితంలో మరిచిపోలేని రోజంటారు ప్రతీక్. ఎందుకంటే ఆయన తయారుచేసిన గొడుగుల్లో మొదటిది అమెజాన్‌లో అమ్మకానికి పెట్టారు. ఆ టైంలో ప్రతీక్ బంధువు ఒకాయన కనీసం నేను ఒకటైనా కొంటానన్నారు. ప్రతీక్ ఏం అనలేకపోయాడు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎలా సక్సెస్ అవుతుందో అంతగా అవగాహన లేదు. కానీ ఓ ట్రైల్ వేద్దామని అందులోకి దిగారు.

అయితే ప్రతీక్ నిరుత్సాహపడలేదు. కానీ మూడువారాల్లో అమెజాన్‌లో పెట్టిన గొడుగులకు మంచి స్పందనే వచ్చింది. అమెజాన్.ఇన్‌లో అత్యధికంగా చూసిన పేజీగా మారింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ సరుకు అమ్మగలిగారు. వినియోగదారులకు మనం తయారుచేసిన ప్రొడక్టే కొనాలని ఎప్పుడూ చెప్పకూడదు. వారికి అందుబాటులో ఉన్నవాటిని శోధించి కొనుగోలుచేస్తారు. ఆ శోధనలో మనం తయారుచేసిన ప్రొడక్ట్ ఉండేలా చూసుకోవాలంటారు. వర్షంలో తడవడం కొందరికి అలవాటు. అయితే అనారోగ్యం పాలుకాకుండా మంచి గొడుగులు ఉపయోగించి మీ గమ్మస్థానాలు చేరమని మేం చెబుతుంటాం అంటారు ప్రతీక్. వర్షం మంచి అనుభూతి కావాలంటారు ప్రతీక్.

image


ఇంటర్నెట్ ఆలంబనగా మునుముందుకు...

చీకీ చంక్ తన వ్యాపారాన్ని ఆన్‌లైన్ ద్వారా కొనసాగిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ ద్వారా తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. అంతేకాదు ముంబైలో బాంద్రా, మతుంగా, బ్రీచ్‌క్యాండీ, చర్చ్‌గేట్ దగ్గర రిటైల్ దుకాణాలల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ల ద్వారా 7వేలకు పైగా గొడుగులను విక్రయించారు. బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాల్లో వేయికి పైగా పీసులను అమ్మేశారు. ఈ ఏడాది చివరికి 10 వేల గొడుగులు అమ్మాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

కొంతమంది అమ్మకందారులకు క్రెడిట్ ఇచ్చి తన ప్రొడక్ట్స్ అమ్ముడయ్యాక వాటిని తిరిగి చెల్లించే అవకాశం ఇస్తున్నారు. ఈ ఏడాది దీపావళి నాటికి మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రతీక్. మంచి పెట్టుబడిదారులు వస్తే మరింతగా తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారు ప్రతీక్.

పదిమంది నలుపు రంగుతో ఉన్న గొడుగులతో రోడ్డుపైకి వస్తుంటారు. అదే టైంలో మీరు పసుపు రంగు గొడుగుతో కనిపిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. మంచి డిజైన్ గల గొడుగు పట్టుకున్న వ్యక్తిని పదిమంది ఆసక్తిగా గమనిస్తారు. ఆ డిజైన్ చీకీ చంక్‌ది అయి ఉండాలనేది ప్రతీక్ ఆశ.

చీకీ చంక్ వాళ్ళు తయారుచేస్తున్న డిజైనర్ గొడుగులు చూస్తే మనకు ఇది నిజమే అనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకోసం వెబ్‌సైట్ చూడొచ్చు.