యాప్స్ కు కేరాఫ్ హైదరాబాద్ ఎమ్ టచ్ ల్యాబ్స్ !!

0

ఈ రోజుల్లో వ్యాపారానికి వెబ్ సైట్ ఎంత ముఖ్యమో.. యాప్ కూడా అంతే ఇంపార్టెంట్. డబ్బుల్లేకుంటే అప్పు తెచ్చుకోవచ్చుగానీ యాప్ లేకుండా మాత్రం బిజినెస్ మనుగడ అసాధ్యం. అలా అని.. యాప్ ఏదో ఉన్నదంటే ఉందీ అన్నట్టుకాదు. దాంట్లో ఫీచర్లుండాలి. అప్పుడే వ్యాపారానికి ఫ్యూచర్. యూజర్లు వెల్లువలా వస్తేనే బిజినెస్ కలర్ ఫుల్. ఇవన్నీ కలగలిసిన యాప్స్ తయారుచేయడానికి రెడీ అంటోంది హైదరాబాద్ బేస్డ్ ఎమ్ టచ్ లాబ్స్.

మీకు డబ్ స్మాష్ యాప్ తెలుసుగా. సినిమాల్లో పాపులర్ డైలాగ్స్ కు లిప్ సింక్ ఇస్తే చాలు అవుట్ పుట్ అదిరిపోద్ది! అది జర్మనీకి చెందిన యాప్. దీనికి లోకల్ ఫ్లేవర్ యాడ్ చేసి దుమ్మురేపింది ఎమ్ టచ్ లాబ్స్. దానిపేరే డబ్ షూట్. తెలుగుతో పాటు మరో ఏడు భాషల డైలాగులను బ్రౌజ్ చేసి చూడొచ్చు. మాటలు లేకుండా విచిత్రమైన శబ్దాలతో డబ్ షూట్ చేయవచ్చు. ఏదైనా మ్యూజిక్ ట్రాక్ ని అప్ లోడ్ చేసి యాప్ లో జత చేయొచ్చు. అయితే రీజనల్ లాంగ్వేజీల్లోకి డబ్ స్మాష్ రాకముందే డబ్ షూట్ దూసుకొచ్చింది. ఇప్పటిదాకా ఈ యాప్ ను 6 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 20వేల మంది విజిట్ చేస్తున్నారు. క్రేజ్ బీభత్సంగా ఉండటంతో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే.

ఐఓఎస్, యాండ్రాయిడ్ తో పాటు విండోస్ ఫోన్ డెవలప్ మెంట్ లోనూ ఎక్స్ పర్ట్స్. ఇప్పటిదాకా ఐఓఎస్ యాప్స్ 150 దాకా డెవలప్ చేస్తే, యాండ్రాయిడ్ ఒక యాభై దాకా ఉంటాయి. అమెరికా, యూకే,మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు. యాప్స్ చేయడమే కాదు వాటికి కావల్సిన క్యాంపెయిన్ కూడా చేసిస్తారు. తాము చేసిన చాలా యాప్ లకు మంచి స్టార్ రేటింగ్ ఉందని ఎమ్ టచ్ లాబ్స్ సీఈవో వెంకీ అంటున్నారు. ఐఓఎస్ యాప్ అంటే అదేదో కాస్ట్ లీ వ్యవహారం కాదంటారాయన. సాధారణంగా యాప్ లాంచ్ చేసి వాటిని మోనిటైజ్ చేయకుండా వదిలేస్తారు. స్టార్టప్ సక్సెస్ ఫెయిల్యూర్ దీనిపైన కూడా ఆధారపడి ఉంటాయి. కనక ఆ బాధ్యత కూడా తామే తీసుకుంటామని అంటున్నారు.

టీం సంగతులు

ఇక టీం విషయానికొస్తే వెంకటేశ్వరరావు సీఈవో. సొంతూరు అనకాపల్లి దగ్గర చుచుకొండ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని ఎంబీయే పూర్తి చేశారు. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ కు సెలెక్ట్ అయ్యారు. ఉద్యోగం చేస్తూ 2012 లో స్టార్టప్ మొదలు పెట్టారు. అయితే ఆ ఆలోచన మాత్రం వెంకీ అన్నయ్య సత్యం రాజుది. ఆయన ఈ సంస్థకు కో ఫౌండర్. ఐఐటి ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్, ఆ తర్వాత ఎంటెక్ చేశారు. ఒక ఎమ్మెన్సీలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. టెక్నికల్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారు. 20 మంది ఉద్యోగులు ఈ సంస్థ లో పనిచేస్తున్నారు.

మొదట్లో పెద్దగా పోటీ ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఓ రేంజిలో ఉంది. హైదరాబాదులో మల్టీనేషనల్ యాప్ డెవలప్మెంట్ కంపెనీలతో పాటు, స్థానిక కంపెనీలు దాదాపు వందకు పైగా ఉన్నాయి. వీటన్నింటి కంటే తమకున్న క్లెయింట్ బేస్ పెద్దదని వారితో ఈ పోటీని తట్టుకొని ముందుకు సాగుతున్నామని వెంకీ చెప్పుకొచ్చారు.

ఐఓఎస్ యాప్ డెవలప్ మెంట్ కోసం భారత్ లో క్లయింట్స్ ముందకు రావడం లేదు. ఆండ్రాయిడ్ యాప్ కే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. స్థానికంగా మార్కెట్ విస్తరించడానికి ఇదే పెద్ద సవాల్. అయితే ఇప్పుడిప్పుడే మార్కెట్ మారుతోంది. త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని వెంకీ అంటున్నారు.

భవిష్యత్ ప్లాన్

బిటుబి లో ఉన్నప్పటికీ మరిన్ని ప్రాడక్టులతో బిటుసి లోకి వస్తామని సంస్థ చెప్తోంది. డబ్ షూట్ ని గ్లోబల్ మార్కెట్ లోకి తీసుకెళ్లాలనేది కంపెనీ మరో ప్లాన్. ఫండింగ్ వస్తే మరికొన్ని ప్రాడక్టులకు కమర్షియల్ టచ్ ఇస్తామంటున్నారు. ఫండింగ్ కోసం ఎదురుచూస్తున్నామని, వన్స్ అది సక్సెస్ అయితే అమెరికాలో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని వెంకీ చెప్పారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik