18 ఏళ్లకే వందలాది నేపాల్ అనాధ పిల్లలకు అమ్మ ఈ అమెరికా అమ్మాయి

మనకెవ్వరూ లేరనుకుని ఆశ వదులుకున్న తరుణంలో ఆశాజ్యోతిలా ఎవరో వస్తారు. మన జీవితాన్నే మార్చేస్తారు.మ్యాగీ కూడా అంతే .. టీనేజ్ లోనే సేవా భావంతో ముందుకు వచ్చారు. అమెరికాలో చదువుకుని ఇప్పుడు నేపాల్లో స్థిరపడ్డారు. అనాథ బాలలకు విద్యాదానం చేస్తున్నారు.

18 ఏళ్లకే వందలాది నేపాల్ అనాధ పిల్లలకు అమ్మ ఈ అమెరికా అమ్మాయి

Monday June 22, 2015,

4 min Read

అప్పుడామెకు పదిహేడేళ్లు. సమాజాభివృద్ధి కోసం ప్రపంచంలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించాలని ఆమె నిర్ణయించుకున్నారు. పదేళ్ల తర్వాత ఆమె కల సాకారమైనట్లే కనిపిస్తోంది. 27 ఏళ్లే మ్యాగీ డోయనే .. కోపిలా వ్యాలీ చిల్ట్రన్స్ హోమ్ మరియు బ్లింక్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. న్యూ జెర్సీలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీలో చేరే ముందర ఏడాది పాటు మార్పు కోసం విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకున్నారు. “తరగతి గది బైట జరిగేదేమిటో తెలుసుకోవాలనుకున్నాను. ప్రపంచాన్ని అన్వేషించాలనుకున్నాను. ఇండియా వచ్చి ఇక్కడ నేపాలీ శరణార్థుల కోసం పనిచేసే సంస్థలో చేరాలనుకున్నాను. హిమాలయ రాజ్యంలో పదమూడేళ్ల అనిశ్చితి నుంచి బైట పడి వాళ్లంతా ఇండియా వచ్చారు” అని తన ప్రారంభాన్ని మ్యాగీ వివరించారు.

తన స్కూల్ పిల్లలను అక్కున చేర్చుకున్న మ్యాగీ డోన్

తన స్కూల్ పిల్లలను అక్కున చేర్చుకున్న మ్యాగీ డోన్


ఆ అనుభవం ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆరేడేళ్ల క్రితం దేశం విడిచి వచ్చి మళ్లీ తిరిగి వెళ్లని నేపాలీ అమ్మాయిని ఆమె కలుసుకునే అవకాశం లభించింది. ఆమెతో కలిసి నేపాల్ వెళ్లాలని మ్యాగీ నిర్ణయించుకున్నారు. “అది 2006 సంవత్సరం. నేను మొదటి సారి నేపాల్ వెళ్లాను. నేను ఆ దేశం మొత్తం తిరిగాను. అక్కడ కనీస వసతులు లేకపోవడం గమనించాను. అభివృద్ధికి నోచుకోని దేశంలో పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకున్నాను. అంతర్యుద్ధం తర్వాత నేపాల్‌లో పది లక్షల మంది అనాథలున్నారు. నేను న్యూజెర్సీలో ఉన్న మా తల్లిదండ్రులకు లేఖ రాశాను. చిన్న చిన్న పనులు చేసి నేను దాచుకున్న డబ్బు పంపించాలని కోరాను. మొత్తం ఐదువేల డాలర్లు వచ్చాయి. వాటితో నేపాల్ లో ఒక స్థలం కొన్నాను. అనాథ బాలల కోసం బడిని ప్రారంభించాను…” అని మ్యాగీ గుర్తు చేసుకున్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత ఆ బడిలో 230 మంది పిల్లలున్నారు. 14 మంది ఫుల్ టైమ్ టీచర్లున్నారు. నేడు మ్యాగీ... నేపాల్ విద్యారంగంలో ధృవతారగా వెలుగుతోంది. ఆమె అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. చిన్న వయస్సులో ఏ అవరోధమూ లేకపోవడంతో సదవకాశమైంది.

“నేను 18 ఏళ్ల వయస్సులో ఈ ప్రయాణం ప్రారంభించాను. నా ఆలోచనలు మారడానికి కూడా అదే కారణం కావచ్చు. నాలో ఎలాంటి అయోమయం లేదు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. అన్ని సమస్యలకు నా దగ్గర సమాధానం లేదన్న స్పష్టత కూడా నాకు ఉంది. అందుకే సాయం అడగడం కోసం నేను వెనుకాడలేదు. అడగగానే సహాయం అందించటానికి సలహాదారులు, సహాయకులు ఎంతో మంది ముందుకు వచ్చారు…” అని మ్యాగీ వివరించారు.

పిల్లలపై ఆమెకున్న ప్రేమ, ఆమె చేపట్టిన పనిపై అంకితభావం మ్యాగీ మాటల్లోనే అర్థమవుతుంది. ఆమె తప్పితే ఆ పిల్లలకు ఎవరూ లేరు. చిన్న వయస్సులోనే ఆమె మాతృ వాత్సల్యాన్నీ ఆస్వాదిస్తున్నారు. “ చాలా మంది పిల్లలు చాలా చిన్న వయస్సులోనే ఈ బడిలో చేరారు. తమ గత జీవితం గురించి వాళ్లకేమీ తెలీదు. అందుకే వాళ్లు నన్ను అమ్మా అని పిలుస్తారు. మా తల్లిదండ్రులు ఈ బడికి వచ్చినప్పుడు పిల్లలు వారిని తాతయ్య, బామ్మా అని పిలవడం మరింత సంతోషాన్నిస్తోంది..” అని మ్యాగీ నవ్వుతూ చెబుతున్నారు. మ్యాగీ 40 మంది పిల్లల్ని పెంచుతున్నారు. తన నమూనా నేపాల్ ప్రజల్లో మార్పును తీసుకొస్తుందని ఆమె నమ్ముతున్నారు.

image


వీళ్లలో కలిసిపోవడానికే నేపాలీ నేర్చుకున్నా

“ఈ దేశంలో సాధికారత సాధించాలంటే పిల్లలను విద్యావంతులను చేయడమే సరైన మార్గం. వారి కోసం ఒక నివాస ప్రాంతం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నాను. అనాథ శరణాలయాలంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ వారికి ప్రేమను పంచుతాం. కుటుంబ సభ్యుల్లా చూస్తాం. గతంలో నాకు ఇలాంటి అనుభవం లేదు..” అని మ్యాగీ అంటున్నారు. మ్యాగీ నిస్వార్థ సేవ ప్రపంచంలో చాలా మందికి ఆదర్శం. అయితే అందుకు ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. “నేపాలీ మాట్లాడటం తెలియకుండానే ఇక్కడకు వచ్చాను. కమ్యూనికేషన్ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు నేను నేపాలీ మాట్లాడుతున్నాను. పిల్లలంతా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే ఇంతవరకూ వారికి ప్రేమ లభించలేదు. సాధారణ పరిస్థితులు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారితో అనుబంధం పెంచుకోవడం చాలా కష్టం. వారు పెద్దవారై టీనేజర్లుగా మా చుట్టూ తిరుగుతుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అని మ్యాగీ చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె సవాళ్లను ఎదుర్కొన్నారు. చిన్న వయస్సులో కుటుంబానికి దూరంగా ఉండటం ఆమెకు చాలా ఇబ్బందిని కలిగించింది. “ముందు అసౌకర్యంగా ఉండేది. ఉన్నత విద్యపై దృష్టి సారించలేదని నా తల్లిదండ్రులు నామీద చాలా అసంతృప్తితో ఉండేవారు. తరచూ ఇక్కడకు వస్తూ వారు ఈ పిల్లలతో కలిసిపోయి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అదే వారి ఆలోచన మారడానికి కారణమైంది. ఇప్పుడు వారు నాకు మద్దతిస్తున్నారు. నా సహాయ కార్యక్రమాలు చూసి గర్వంగా భావిస్తున్నారు..” అంటున్నారు

ఈ తొమ్మిదేళ్ల అనుభవంలో పేదరికం తెచ్చే తంటను ఆమె అర్థం చేసుకున్నారు. “పేదరిక నిర్మూలన సాధ్యమేనన్న నమ్మకం మనకు కలగాలి. దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను అమలు చేయాలి” అని మ్యాగీ అంటున్నారు. బ్లింక్ నౌ ఫౌండేషన్ నేపాల్లోనే పనిచేస్తోంది. అసాధారణ సేవలను అందిస్తోంది. అయితే ప్రపంచంలోని ఇతర చోట్ల పాఠశాలలు తెరిచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని మ్యాగీ అంటున్నారు. తమ సంస్థ కోసం ఆమె అమెరికాలో నిధులు సమీకరిస్తున్నారు.

''నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నా కథ ఇతరులకు స్పూర్తిదాయకం కావాలన్నదే నా ఆకాంక్ష. మార్పు అవసరమనిపిస్తే అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే నా బడి పిల్లలపైనే నేను ప్రత్యక దృష్టి పెడతాను'' - మ్యాగీ 

మ్యాగీ మదిలో అనుమానాలు, అపనమ్మకాలు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. “ ఓరి దేవుడా నేనేం చేస్తున్నాను ? అని ప్రశ్నించుకున్న రోజులున్నాయి. నా జీవితంలో ఎంతో సాధించిన తృప్తి ఉంది. నేను పెరిగిన చోటుకు దూరంగా ఉన్నాను. కొంచెం కష్టమే. అయితే ఈ మార్గంలో నడవకుండా నేను ఉండలేకపోతున్నాను. ఈ పిల్లలు లేకుండా నేను ఉండలేను. నేపాల్‌తో నాకు ఎన్నో అనుబంధాలు, ఉద్వేగాలు ముడిపడి ఉన్నాయి. పెరుగుతున్న పిల్లలను చూస్తే నాకు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. వాళ్ల నుంచి నేనెంతో సంతృప్తిని పొందుతాను” అని మ్యాగీ ఉద్వేగానికి లోనయ్యారు. 

ప్రపంచాన్ని మార్చాలనుకునే యువతకు ఆమె ఇచ్చే అమూల్యమైన సందేశం ఒక్కటే………. “ మీకు వయస్సు మళ్లే దాకా వేచి చూడకండి. డబ్బు కూడబెట్టుకునేందుకు, మాస్టర్స్ డిగ్రీ సాధించేందుకు రిటైర్మెంట్ వరకూ ఆగాల్సిన పనిలేదు. ఎవరికోసం, దేనికోసం వేచివుండకూడదు. ఏ పనైనా అనుకున్నదే తడవుగా మొదలు పెట్టాలి. నేను కొన్ని రోజులు వేచి ఉంటే ఇంత మంది నా పిల్లలకు ఇంత మంచి జీవితం వచ్చేది కాదు..”