నెలకు రూ. లక్షన్నర సంపాదిస్తున్న స్కూల్ డ్రాపవుట్ కుర్రాడు  

0

కష్టమొచ్చినప్పుడే మనిషిలోని గుండె ధైర్యమేంటో బయటపడుతుంది. అపజయానికి కుంగిపోకుండా విజయం వైపు నడిచినవాడే అసలైక కృషీవలుడు. ఆ కోవలోకే వస్తాడు మధ్యప్రదేశ్ కి చెందిన హేమంత్ అనే కుర్రాడు. టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, అకాడమిక్ స్కిల్స్ నేర్చుకోకున్నా.. నెలకు లక్షన్నర సంపాదించే స్థాయికి ఎదిగాడు.

అంతా బాగుందున్న తరుణంలోనే నాన్న మరణం కలచివేసింది. ఒక్కసారిగా శూన్యం ఆవహించింది. అప్పటికీ హేమంత్ వయసు 15. అర్ధాంతరంగా చదువు ఆగిపోయింది. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. డిపెండెంట్ జాబ్ ఇస్తామన్నారు. కానీ వయసు సరిపోకపోవడంతో తాత్కాలికంగా ఉత్తర్వులు నిలిపివేశారు. టెన్త్ పాసై, 18 ఏళ్లు నిండగానే రమ్మని కబురు పెట్టారు. అంతవరకు లైఫ్ లీడ్ చేయాలంటే ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరి అయింది. చిన్నాచితకా జాబ్స్ చేశాడు. ఈలోగా 18 ఏళ్లు నిండాయి. ఎంతో ఆశతో నాన్న చేసే ఆఫీసుకి వెళ్లాడు. ఉద్యోగం కచ్చితంగా ఇస్తారనే భరోసాతో వెళ్తే.. అక్కడ నిరాశ ఎదురైంది. ఏవో కారణాల చేత ఉద్యోగం ఇప్పుడప్పుడే ఇవ్వలేమని చెప్పారు. ఉసూరుమంటూ బయటకు నడిచాడు.

ఆ క్రమంలో ఒకసారి పేపర్లో ఒక వార్త కనిపించింది... వెబ్, యాప్ డెవలప్‌మెంట్ లో బోలెడంత ఫ్యూచర్ ఉందని. డబ్బు సంపాదనకు అదే మార్గమని మనసులో గట్టిగా ఫిక్సయ్యాడు. కంప్యూటర్ అన్నా టెక్నాలజీతో ముడిపడిన అంశాలన్నా హేమంత్‌ కి మొదట్నుంచీ ప్రత్యేకమైన ఇంట్రస్ట్ ఉండేది. ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేసేవాడు. స్కూల్లో టీచర్లు అతడి షార్ప్ నెస్ చూసి అ బ్బురపడేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే క్విక్ లెర్నర్. హేమంత్ ఆసక్తిని గమనించి.. క్లాసులో సీనియర్లతో కూడా కూర్చోబెట్టేవారు.

హేమంత్ సొంతూరు మధ్యప్రదేశ్ లోని హోసంగాబాద్ జిల్లా గ్వాల్ తోలి గ్రామం. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని నేపథ్యం. పోనీ వేరే సిటీకి వెళ్దామంటే ఆర్ధికంగా వెసులుబాటు అయ్యేలా లేదు. అకాడమిక్ స్కిల్స్ డెవలప్ చేసుకోడనికి ఎలాంటి కోచింగ్ సదుపాయం అందుబాటులో లేదు. అందుకే కంప్యూటర్ పై సొంతంగా పట్టుసాధించాలని భావించాడు. ఆ క్రమంలోనే సమీపంలోని సైబర్ కేఫ్‌ కి తరుచుగా వెళ్లేవాడు. పుస్తకాలు రిఫర్ చేస్తూ కోడింగ్ పరిజ్ఞానంపై పట్టుసాధించాడు.

హేమంత్ ఎంచుకున్న మార్గంపై ఊరివాళ్లకు నమ్మకం లేదు. ఇటు బంధువుల్లో కూడా పాజిటివ్ రియాక్షన్ లేదు. బామ్మకు మాత్రమే మనవడి మీద విశ్వాసంతో ఉంది. అతను అనుకున్నది సాధిస్తాడని ఆమె తప్ప, వేరెవరూ నమ్మలేదు. ఆ నమ్మకంతోనే హేమంత్‌ కి ఒక లాప్ టాప్ కొనిచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఇప్పించింది. నెట్ బిల్లు నెలకి ఐదారు వేలు వచ్చేవి. అంతా ఆవిడే చూసుకునేది.

అలా ఎన్నో కష్టాల నడుమ సొంతంగా టెక్నికల్ స్కిల్స్ పెంచుకున్నాడు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మొట్టమొదటిసారిగా 2012 నవంబర్‌లో ఒక యాప్ క్రియేట్ చేశాడు. దానిపేరు మ్యాపీ. అదృష్టంకొద్దీ అది క్లిక్కయింది. దాంతో హేమంత్ వెనుదిరిగి చూడలేదు. మొదటి యాప్ విడుదల చేసిన కొద్ది రోజులకే 15 యాప్స్ క్రియేట్ చేశాడు. అందులో పాపుల్ యాప్"లవర్స్ ఇన్ ఏ స్పిన్". సుమారు 500 డౌన్ లోడ్లు నమోదు చేసిందా యాప్. అది కూడా ఎక్కువ శాతం అమెరికాలో. హేమంత్ క్రియేట్ చేసిన యాప్స్ ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ప్రస్తుతానికి హేమంత్ నెలకు ఎంతలేదన్నా లక్షన్నర సంపాదిస్తున్నాడు.

ఈ రోజుల్లో తండ్రి ఉద్యోగం కొడుకుకి వస్తుందంటే దానికోసమే అర్రులు చాచేవాళ్లకు కొదవలేదు. సర్కారీ కొలువు.. కాలుమీద కాలేసుకుని బతికేయొచ్చనే భ్రమ వాళ్లను అలా తయారు చేస్తుంది. కానీ హేమంత్ మాత్రం అలాంటి ఉద్యోగానికి ఆశపడకుండా, టెక్నాలజీపై పట్టుసాధించి బిందాస్ సంపాదనతో పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.  

Related Stories