ఆన్ లైన్ కొనుగోలుదార్లకు డబ్బు మిగిల్చే ఐడియా

- ఫర్నిచర్ కొనుగోలు ప్రయత్నంలో యామిని మనసులో మెదిలిన ఆలోచన- డిస్కౌంట్స్, కూపన్లకోసం డిస్కౌంట్ ఇన్.బాక్స్- క్యాషబుల్‌తో క్యాష్ బ్యాక్ కూడా

ఆన్ లైన్ కొనుగోలుదార్లకు డబ్బు మిగిల్చే ఐడియా

Saturday April 18, 2015,

3 min Read

ప్రతిభ, కృషి ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలు అందుకోవడం సాధ్యమే. దీనికి యామినీ ధోతే కన్నా ఉదాహరణ అక్కర్లేదు. జైపూర్ లో ఇంజనీరింగ్ పట్టభద్రురాలై, హై వోల్టేజ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆమె అవతరించారు. అప్రమత్తంగా షాపింగ్ చేయడం, డిస్కౌంట్లూ, ఆఫర్ల కోసం చురుగ్గా వెతకడం ఆమెకు ఇష్టం. అదే ఆమెకు భవిష్యత్తులో పునాదిగా నిలిచింది. వివాహం అయ్యాక, ఒకసారి ఫర్నిచర్‌ను తగిన ధరలో కొనడం కోసం ఆమె హోమ్ టౌన్ నుంచీ హోమ్ స్టాప్‌కూ, అక్కడినుంచి హౌస్ ఫుల్‌కూ... ఇలా ప్రసిద్ధ ఫర్నీచర్ దుకాణాలన్నిటికీ చక్కర్లు కొట్టారు. ఈ వెతుకులాటే 2011లో తన తొలి వెంచర్ అయిన డిస్కౌంట్ బాక్స్.ఇన్ ఆరంభించడానికి ప్రేరేపించింది.

యామిని ధోతే

యామిని ధోతే


“తమ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఈ-కామర్స్ కంపెనీల్లో చాలావాటికి ఉంది, అలాగే వీలైనంత తక్కువ ఖర్చుతో విక్రయాల్ని పెంచుకోవడం కూడా వాటికి కావాలి. మరోవైపు, వీలైనంత ఆదా చేద్దామని కొనుగోలుదార్లు కూడా కోరుకుంటారు. ఈ ఇద్దరి అవసరాలనూ తీర్చేదే పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అందుకనే రెండేళ్ళ కిందట నేను డిస్కౌంట్ బాక్స్.ఇన్‌కు సహ వ్యవస్థాపకురాలిని అయ్యాను. డిస్కౌంట్ బాక్స్.ఇన్ డిస్కౌంట్లనూ, కూపన్లనూ అందిస్తుంది, కానీ దానికి మించిన సేవలు అందించాలన్నది నా కోరిక. కాబట్టి క్యాష్ బ్యాక్ కూడా అందించాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆలోచనలోంచే క్యాషబుల్ ఆవిర్భవించింది” అని వివరించారు యామిని.

“కిందటి ఏడాది నుంచీ ఈ-కామర్స్ లో అవకాశాలనూ లేదా లోపాలనూ నేను జాగ్రత్తగా పరిశీలించాను. ఈ ఆలోచనతో ముందుకెళ్లాలని గత ఏడాది ఆగస్ట్‌లో నిర్ణయించుకున్నాను. రెండు నెలల్లోపే ఈ ఉత్పత్తిని మేం అభివృద్ధి చేశాం, 2014 నవంబర్ లో దీన్ని ఆరంభించాం. ఒక నెలలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రాలాంటి 500కు పైగా అగ్రశ్రేణి ఈ-కామర్స్ కంపెనీలతో మేం భాగస్వాములమయ్యాం. మిగతా ఈ-కామర్స్ కంపెనీలకు మద్దతు అందించడం కోసం మా నెట్‌వర్క్‌ను చాలా వేగంగా పెంచుకున్నాం” అని హెర్ స్టోరీతో ఆమె చెప్పారు.

పూణే, బెంగళూర్ లలో ఉన్న నలుగురు సభ్యుల బృందంతో కలిసి ఆమె ఇప్పుడు పని చేస్తున్నారు. డిస్కౌంట్ బాక్స్.ఇన్ కు మాత్రమే కాదు, క్యాషబుల్ కు కూడా యామినీ థోతే, అమోల్ ఙోర్మేడ్ సహ వ్యవస్థాపకులు. క్యాషబుల్ లో కంటెంట్, లావాదేవీల మేనేజిమెంట్ బాధ్యతల్ని యామిని నిర్వర్తిస్తున్నారు.

యామిని ప్రస్థానానికి ప్రేరణ ఇస్తున్నదేమిటంటే...

తనను ముందుకు నడిపిస్తూ, వైదొలకుండా నిలబెట్టే శక్తి ఒకటి ఉన్నదని యామిని చెప్పారు. “తమకు ఏం కావాలనేది ప్రతిఒక్కరికీ తెలుసని నేను అనుకుంటున్నా. తమకు తెలిసో, తెలియకో దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే తమకు నిజంగా ఏం కావాలనేది కొంతమందికి మాత్రమే తెలుసు, మరి కొందరికి తెలీదు. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం, ఉద్యోగాలనూ, ఆకాంక్షలనూ, అవకాశాలనూ సృష్టించడం నా లక్ష్యం” అన్నారామె.

  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తన ప్రయాణంలో యామిని నేర్చుకున్నవేమిటంటే:
  • స్టార్టప్ ఆరంభంలో మరీ ఆలస్యం తగదు.
  • అమలులో పెట్టడం కీలకం.
  • ముందుచూపుతో ఆలోచించాలి, మొదటే వైఫల్యం ఎదురైతే మంచిదే, తప్పుల్ని సరిదిద్దుకోవాలి, వీలైనంత త్వరగా ముందుకు కదలాలి.
మార్కెటింగ్ మనం అనుకున్నంత ఈజీ కాదని నా స్వానుభవం. ఉత్పత్తికే కాదు మార్కెటింగ్‌కు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే

మార్కెటింగ్ మనం అనుకున్నంత ఈజీ కాదని నా స్వానుభవం. ఉత్పత్తికే కాదు మార్కెటింగ్‌కు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే


“మన ప్రయాణం అనేది ఓటమికీ, దానినుంచి నేర్చుకోవడానికీ సంబంధించింది. డిస్కౌంట్ బాక్స్.ఇన్ ఆరంభించినప్పుడు, ఏ సాంకేతిక వ్యాపారానికైనా సాంకేతికత అనేది అత్యంత ముఖ్యమైన విషయమనీ, మార్కెటింగ్ మీదా, ఇతర అంశాలమీదా పెద్దగా దృష్టి పెట్టక్కర్లేదనీ అనుకున్నాం. అయితే, సాంకేతికత కన్నా మార్కెటింగ్ ప్రధానమనే కఠిన సత్యం మాకు తెలిసొచ్చింది. ప్రచారాల కోసం సరైన మార్గాలను ఎంచుకోవడం కూడా ముఖ్యమే. మేం అక్కడే ఒకటి రెండు పొరపాట్లు చేశాం, ఇప్పటికీ వాటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. పారిశ్రామికంగా విజయవంతమవడానికి వ్యక్తులూ, టీమ్ కూడా ప్రధానమే. కాబట్టి, అంతిమంగా చెప్పేదేమిటంటే, ఉత్పత్తికీ, ప్రచారానికీ, వ్యక్తులకూ సంబంధించిన సమతూకం ఎంత సరిగ్గా ఉంటే విజయం సాధించే అవకాశాలు మీకు అంత ఎక్కువగా ఉంటాయి” అని ముక్తాయించారు యామిని.

భవిష్యత్తు వైపు చూపు

భారతదేశం ఈ-కామర్స్ నుంచి ఎం-కామర్స్ కు చాలా వేగంగా మారుతోంది. 20 శాతం అన్ లైన్ షాపింగ్ మొబైల్ ఫోన్ల ద్వారా జరుగుతోంది. ఇది ఎంతో వేగంగా పెరుగుతోంది కూడా. ఈ అవకాశాలను గమనించిన యామిని ఓ క్యాషబుల్ మొబైల్ ఆప్ ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. తద్వారా కొనుగోలుదార్లు తమ మొబైల్ ఫోన్ల లోంచీ షాపింగ్ చేయవచ్చు, డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. “భారతదేశంలో ఆన్ లైన్ షాపింగ్ ఇప్పటికైతే ఆరంభ దశలోనే ఉంది. కానీ ఈ ఏడాది చివరికి ఇది 34 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా. భారతీయ కొనుగోలుదార్లకు ధరల విషయంలో చాలా పట్టింపు ఉంది. ధర మీద ఆధారపడే కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భారతదేశ ఆన్ లౌన్ కొనుగోలుదార్లలో 85 శాతానికి పైగా డిస్కౌంట్లూ, కూపన్లూ ఉపయోగించుకుంటున్నారు. క్యాషబుల్ ద్వారా డిస్కౌంట్లనూ, కూపన్లనూ క్యాష్ బ్యాక్, రిఫరెల్ కమిషన్ తో కూడా కలిపి అందిస్తున్నాం. ఆన్ లైన్ కొనుగోలుదార్లకు ఇది ఓ భారీ పొదుపు అవకాశాన్ని అందిస్తోంది. ఇది మేం సానుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న అవకాశం కూడా” అని ఆమె వెల్లడించారు.