మరో మదర్ థెరిసా సుగత కుమారి

0

మానవసేవే.. మాధవ సేవ.. దీన్ని అక్షరాల పాటిస్తున్నారు ప్రముఖ మలయాళ రచయిత్రి సుగుత కుమారి. కల్లాకపటం, కల్మషం లేని మానసిక రోగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి మరో జన్మ ఇస్తున్నారు. కేరళలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో రోగుల దుస్థితిని చూసి చలించి, మానసిక రోగుల కోసం ఏకంగా ఓ గ్రామాన్నే నెలకొల్పారు. వేలాదిమందిని తన పిల్లలుగా చూసుకుంటూ, వారి కలలనే తన కలలుగా చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. మానసిక రోగులకే కాదు, అనాథ బాలికలు, మహిళలు, ఆల్కాహాల్, డ్రగ్ బాధితులకు కూడా ఆశ్రయం కల్పిస్తున్నారు.

అన్ని కేర్ హోమ్ సెంటర్‌లాంటిది కాదు. వీరూ వారూ అనే తేడా లేదు.. అక్కడ అందరికీ చోటు ఉంటుంది. తిరువనంతపురంలోని కేర్ సెంటర్‌లో లైంగిక వేధింపుల బాధితులున్నారు. గృహ హింస బాధితులున్నారు. డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. అనాథ బాలికలునున్నారు. ఎవరూ లేని మహిళలూ ఉన్నారు. ఎదుర్కొన్న సమస్యలన్నీ ఇప్పుడు వారికి గతం. ఇప్పుడు వారు కొత్త జీవితాన్ని గడుపుతున్నారు. చదువుకుంటున్నారు. ఉపాధి పొందుతున్నారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో మరో కొత్త జీవితానికి పునాది వేసుకుంటున్నారు.

మూడు దశాబ్దాల సేవ..

ప్రఖ్యాత రచయిత్రి-సామాజిక కార్యకర్త సుగతకుమారి ఆధ్వర్యంలో తిరువనంతపురంలో అనాథలు, నిరాశ్రయులు, బాధితుల కోసం ఎయిటీస్‌లో ‘అభయ’పేరుతో ఓ ఆశ్రమాన్ని నెలకొల్పారు. వచ్చే నెలలో ఆ సంస్థ 30వ వసంతాన్ని పూర్తి చేసుకోబోతోంది. లైంగిక వేధింపుల బాధితులతోపాటు వివిధ కారణాలతో అనాథలుగా మారిన, ననిరాశ్రయులైన వేలాదిమంది జీవితాల్లో ఈ సంస్థ వెలుగులు నింపుతోంది.

అభయకు మొదటి నుంచి నిధుల కొరత ఉంది. నిధుల కొరత కారణంగా సౌకర్యాలు కూడా అంతంతే. అయితే ఆ సంస్థలో చేరిన వారు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్తున్నారు. ఆశ్రమంలో చేరినప్పుడు బేల చూపులు, భవిష్యత్‌పై భయంతో కనిపించిన వారి కళ్లలో ఇప్పుడు మెరుపులు కనిపిస్తున్నాయి. భవిష్యత్‌పై ఆశ, కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికసలాడుతున్నాయి. సుగతకుమారి విజయానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు.

14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు..

‘సరస్వతి సమ్మాన్’ అవార్డు గ్రహీత, రచయిత్రి సుగతకుమారీ ‘అభయ’ను మరింత విస్తరించాలనుకుంటున్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారి కోసం కేరళలోలని 14 జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు కూడా.

‘‘ఇప్పటికే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. వేలాదిమంది నిరాశ్రయులకు జీవితంపై ఆశ కల్పించాం. ఈ మూడు దశాబ్దాలలో వదిలివేసిన, నిరాశ్రయులైన, అనాథలకు అండగా నిలిచాం’’

అనుకోకుండా ‘అభయం’..

కేరళలలోని ప్రభుత్వ ఆసుప్రతులలో మానసిక వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోవడంతో 1985లో ప్రత్యేకంగా మానసిక రోగుల కోసమే ‘అభయ’ ఏర్పాటైంది. ప్రస్తుతం మల్టీ యూనిట్ ఇన్‌స్టిట్యూట్‌గా ఎదిగింది. ప్రస్తుతం పునరావాసంతోపాటు చికిత్సను కూడా అందిస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్, అనాథ బాలికలకు కేర్‌హోమ్, మహిళలకు వసతి గృహాలను నెలకొల్పారు.

సన్నిహితులంతా ‘టీచర్’ అని పిలుచుకునే సుగత కుమారి ఓసారి తిరువనంతపురంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆ సమయంలో రోగులతో ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుతో ఆమె కలత చెందారు. ఆ సమయంలోనే ‘అభయ’ను నెలకొల్పాలని ఆమె డిసైడయ్యారు. ‘‘మేం అడుగుపెట్టేవరకు కేరళలో మానసిక రోగుల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారిని పట్టించుకునే నాథుడే లేరు. హాస్పిటల్‌లో నేను చూసిన పరిస్థితులను వివరించడానికి కూడా నోరు రావడం లేదు.. అర్ధనగ్నంగా, గాయాలతో రోగులు విలవిలలాడుతూ కనిపించారు. ఓ చిన్నరూమ్‌లో వారిని బంధించారు. చాలామంది నా కాళ్లు పట్టుకుని భోజనం పెట్టమని వేడుకున్నారు’’ అని ఆనాటి పరిస్థితులను ఆమె కళ్లకు కట్టారు. 81 ఏళ్ల సుగతకుమారి పోరాట ఫలితంగా, ఏళ్లుగా అధికారుల వెనకపడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది.

ప్రస్తుతం ‘‘అభయ’ సేవలను మరింత విస్తరించారు. మలయిన్‌కీజు గ్రామం శివార్లలో 10 ఎకరాల విస్తీర్ణంలో ‘అభయగ్రామం’ పేరుతో మానసిక రోగుల కోసం మరో ప్రపంచాన్ని 1992లో నిర్మించారు. ఈ ‘అభయ గ్రామం’ నర్వ్ సెంటర్‌కు ప్రఖ్యాత టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పునాది రాయి వేశారు.

దలైలామా స్ఫూర్తితో..

దలైలామా ప్రసంగాలు విని, స్ఫూర్తి పొందే సుగతకుమారి, నిరాశ్రయులకు బాసటగా నిలుస్తున్నారు. ‘‘ఓసారి దలైలామా ఇలా అన్నారు. ఈ భూమిని నిరుపేదలకు, ఇళ్లులేని వారికి ఆశ్రయంగా చేయాలి అని. అప్పటి నుంచి ఆయన ఆశయాల సాధనకు ప్రయత్నిస్తున్నాను’’ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం అభయ ఎనిమిది కేంద్రాలుగా విస్తరించింది, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి చికిత్స, ఆశ్రయం కోసం ‘కర్మ’ మానసిక రోగల తాత్కాలిక, దీర్ఘకాల సంరక్షణ కోసం ‘శ్రద్ధభవనం’, మిత్ర పేరుతో డీ అడిక్షన్, మెంటల్ హెల్త్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అనాథ బాలికల కోసం ‘అభయబాల’, మహిళల తాత్కాలిక వసతి కోసం ‘అతని’, అల్కాహాల్, డ్రగ్‌ బాధితుల కోసం ‘బోధి’ మానసిక రోగుల కోసం ‘పకల్‌వీడు’ డే కేర్ సెంటర్లను కూడా ‘అభయ’ నిర్వహిస్తోంది. ఇవే కాకుండా మహిళల కోసం 24 గంటల హెల్ప్‌లైన్, మహిళల కోసం ఉచితంగా న్యాయ సాయం కూడా అందిస్తున్నది.

నిధుల కొరత..

నిరాశ్రయుల కోసం, ముఖ్యంగా మానసిక రోగుల కోసం వివిధ రకాల సెంటర్లను నిర్వహిస్తున్న ‘అభయ’ను నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రస్తుతం ‘అభయ’లో 200 మంది నిరాశ్రయులు, 80 మంది ఉద్యోగులున్నారు. ‘ప్రభుత్వ కేటాయింపులు, వ్యక్తిగత విరాళాలపైనే ఆధారపడుతున్నాం. నిధుల కొరత కారణంగా ఎక్కువమందిని ఉద్యోగులను పెట్టుకోలేకపోతున్నాం. అందువల్ల నిరాశ్రయులు సమస్యలపాలవుతున్నారు. ఉద్యోగంలో పెట్టుకున్నవారికి సైతం సరిపోయేంత జీతం ఇవ్వలేకపోతున్నాం’’ అని సుగత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మతాలు, కులాలతో ‘అభయ’కు ఎలాంటి సంబంధం లేదు. ఇదే సంస్థకు బలమూ, బలహీనత. ఒకవేళ ఎదైనా మతపర సంస్థతో సంబంధం ఉండి ఉంటే, లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చేవి’’

పర్యావరణ పరిరక్షణ ఉద్యమం..

సుగత కుమారి కేవలం అనాథలను ఆదుకోవడమే కాదు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా పోరాటం చేస్తున్నారు. మూడు దశాబ్దాల కింద పశ్చిమ కనుమల్లోని సైలెంట్ వ్యాలీలో హైడల్ ప్రాజెక్ట్‌ను నిర్మాణాన్ని అడ్డుకొన్నారు. అందుకోసం పెద్ద ఉద్యమాన్నే లేవదీసారు. తన కవితలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చారు. ఇటీవల కూడా మరో ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారు. అర్నములాలో విమానాశ్రయం నిర్మాణానికి వ్యతిరేకంగా సుగతకుమారి నేతృత్వంలో ఉద్యమం చేపట్టారు. తన ‘చిన్నారుల’ కలలను సంపూర్ణం చేసేవరకు తన పోరాటం కొనసాగుతుందని సుగతకుమారి తెలిపారు.

సుగత కుమారిలాంటి వారు రాష్ట్రానికి ఒక్కరుంటే చాలు.. అనాథలు, నిరాశ్రయులు భరోసాగా జీవించగలుగుతారు. సుగతకుమారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ఆమె బాటలో నడవాలని యువర్‌స్టోరీ కోరుకుంటోంది.


ఇమేజ్ కర్టసీ: వికీ మీడియా కామన్స్