ముంబై స్టార్టప్ అడ్డా 'పొవాయ్'

ఐఐటితో ఈ ప్రాంతానికి మరింత వన్నెఎన్నో స్టార్టప్స్‌కు ఈ ప్రాంతం వేదికరాబోయే 2-3 ఏళ్లలో ఈ ప్రాంతానికి తిరుగులేదు

ముంబై స్టార్టప్ అడ్డా 'పొవాయ్'

Monday May 25, 2015,

3 min Read

ముంబై అంటే గుర్తొచ్చే హడావిడి, గజిబిజి లైఫ్ స్టైల్ కి భిన్నంగా నగరానికి దూరంగా ఈశాన్యం మూలన వుండే శివారు ప్రాంతం పొవాయ్. 120 ఏళ్ళక్రితం మంచినీళ్ళ కోసం తవ్వించిన ఓ సరస్సు పేరుతోనే ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు. ఇప్పుడీ సరస్సులో మంచినీళ్ళు లేవుకానీ, ఐఐటి బాంబేకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్‌గా మాత్రం పనికొస్తోంది.

తళుకులీనుతున్న పొవాయ్ ప్రాంతం, పొవాయ్ లేక్

తళుకులీనుతున్న పొవాయ్ ప్రాంతం, పొవాయ్ లేక్


1958లో నెలకొల్పిన ఈ ఐఐటి, దేశం గర్వించదగ్గ టెక్నాలజీ నిపుణులను తీర్చిదిద్దింది. అయితే, ఈ మధ్య మాత్రం ఈ ఇన్స్‌స్టిట్యూట్ నుంచి టెక్నాలజీ ఆంట్రప్రన్యూర్స్ వస్తున్నారు. అత్యంత వివాదస్పదమైన రాహూల్ యాదవ్ (హౌసింగ్ డాట్ కామ్ వ్యవస్థాపకుల్లో ఒకరు)తో కాసేపు మాట్లాడాక అసలు ఈ ఐఐటి తీరుతెన్నులేంటో తెలుసుకోవడానికి ఈ భవనం నలుమూలలా కాసేపు యువర్ స్టోరీ బృందం తిరిగింది. ఎంతో దూరం వెళ్ళక్కర్లేకుండానే, ప్రవేశద్వారం దగ్గరే Instilive.com అనే పోస్టర్ కనిపించింది. ఐఐటి బాంబే క్యాంపస్ లోపలి వారి కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఒక సోషల్ నెట్ వర్క్ ఇది.

ఐఐటి బాంబే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా నెట్వర్క్

ఐఐటి బాంబే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా నెట్వర్క్


Housing.com, Tinyowl ఈ రెండూ ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్లు ఏర్పాటు చేసిన సంస్థలే. రెండిటికీ హీరానందని బిజినెస్ పార్క్ లో బ్రహ్మాండమైన ఆఫీసులున్నాయి. చకచకా అభివృద్ధి చెందుతున్న ఈ రెండు సంస్థలతో పాటు గడిచిన కొద్ది నెలల్లోనే తారాజువ్వలా దూసుకుపోతున్న ఆసాన్ జాబ్స్ కూడా మరో ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి నెలకొల్సిందే. 2013లో దినేష్ గోయెల్ ఈ ఆసాన్ జాబ్స్‌ను నెలకొల్పాడు. బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ లాంటి విభాగాల్లో ఈ సంస్థ దాదాపు 180 మందికి ఉద్యోగాలచ్చింది. ఐఐటియన్స్ అంటేనే దేశంలో పదునైన మెదడు వున్న వాళ్ళంటారు. అలాంటి వాళ్ళకు ఆంట్రప్రన్యూర్‌షిప్ కూడా సహజంగానే వస్తుంది. అందుకే టెక్నాలజీ ప్లాట్ ఫామ్ సవాలును తీసుకోవడానికి వీళ్ళంతా ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. నిజానికి ఐఐటిలో వున్నప్పుడే .. బయటికెళ్ళాక ఏం బిజినెస్ పెడదామా ? అన్న ఆలోచనలకు పదునుపెడుతూ వుంటారు. ఈ వ్యవస్థ కూడా అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

మొత్తం మీద పొవాయ్‌లో జాబ్స్, రియల్ ఎస్టేట్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్ సేవలందిస్తున్న దాదాపు 50 టెక్నాలజీ సంస్థలున్నాయి. ఇప్పటికే వీటిలో పది హేను నుంచి ఇరవై సంస్థలకు ఫండింగ్ అందుతోంది. మిగిలిన సంస్థలకు కూడా నేడో రేపో అందే అవకాశాలున్నాయి. ఇలాంటి వాటిల్లో డోర్ మింట్ సంస్థ ఒకటి. 2015 జనవరిలో నమన్ లహోటీ, అభినవ్ అగర్వాల్, పియూష్ రంజన్ అనే ముగ్గురు ఐఐటి గ్రాడ్యుయేట్లు ఈ డోర్ మింట్‌ను ప్రారంభించారు. ఇందులో నమన్, అభినవ్‌లు ఐఐటి బాంబే, అయితే, పియూష్ ఐఐటి కోల్‌కతా నుంచి పట్టా పొందారు. ఈ సంస్థ ఇప్పటికే పోవై లేక్ వెంచర్స్ నుంచి పెట్టుబడులను సంపాదించింది. సొంతంగా సంస్థలు పెట్టి లాభాలు ఆర్జించిన వారు కొత్తగా వచ్చే సంస్థలను ప్రోత్సహించడానికి వాటిలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో పి ఎల్ వి ని నెలకొల్పారు.

వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కూడా ఈ పొవాయ్ స్టార్టప్స్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. ముగ్గురు నుంచి ఆరుగురు వ్యక్తులతో మొదలయ్యే స్టార్టప్స్‌కు మౌలిక సదుపాయాలు అందించేందుకు పొవాయ్‌లో 'ది స్పేస్' ఏర్పడింది. మాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, రహేజా కార్పొరేషన్ కలిసి ది స్పేస్‌ను ప్రారంభిస్తున్నాయి.

ముంబైలో ఉన్న పొవాయ్ ప్లాజా

ముంబైలో ఉన్న పొవాయ్ ప్లాజా


ఈ బిజినెస్ వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణం మాత్రం ఐఐటి బాంబే అనే చెప్పి తీరాలి. పొవాయ్‌లో ఇంకొన్ని స్కూళ్లు, కాలేజీలు వున్నప్పటికీ వాటి ప్రభావం ఏ మాత్రం లేదు. దీనివల్ల ప్రధానంగా రెండు ఫలితాలు కనిపిస్తున్నాయి.

1. సాధారణంగా ముంబైలో టెక్నాలజీ టాలెంట్ కొరత వుందని ఇక్కడి కంపెనీలు విమర్శిస్తుంటాయి. ఉన్న కొద్ది మంది కూడా బెంగళూరులో ఎక్కువ జీతాలకు వెళ్లిపోతుంటారనేది వీరి వాదన. ఈ పరిస్థితుల్లో బాంబే ఐఐటి బ్రహ్మాండమైన టాలెంట్‌ను ఇక్కడి మార్కెట్ కు అందజేస్తోందని చెప్పాలి.

2. అయితే, ఇందులో ఓ తిరకాసుంది. ఒక పక్క ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళకు జీతాలు బాగా ఎక్కువ ఇవ్వాల్సుంటుంది. మరో వైపు సొంత కంపెనీలు పెట్టుకున్నవారంతా సక్సెస్ అవుతుండడంతో, ఎవరికి వాళ్ళే సొంత వ్యాపారాలు పెట్టుకునే ఆలోచనలో వుంటున్నారు.

ప్రస్తతం వున్న ట్రెండ్ గురించి ఓ ఐఐటి ప్రొఫెసర్ ఏం చెప్పారో చూద్దాం‘‘ అసలు ఐఐటి బాంబేలో సీటు సంపాదించడమంటేనే వాళ్ళు చాలా కష్టపడి చదివారని అర్థం. ఒకసారి ఇక్కడికొచ్చాక సవాళ్ళను స్వీకరించడం వారికి అలవాటైపోతుంది. కొన్నిసార్లు ప్రవాహంలో కొట్టుకుపోయినా.. వెంటనే తేరుకుని తమకేం కావాలో తేల్చుకుంటారు. దాన్ని సాధించడానికి పగలూ రాత్రీ కష్టపడతారు. ’’

విద్యాసంస్థల నుంచే స్టార్టప్ వ్యాపారసంస్థలు పుట్టుకురావడమనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వున్న ట్రెండ్. ఐఐటి బాంబే వల్లే పొవాయ్ కళకళ లాడుతోంది. ఆంట్రప్రన్యూర్లు, ఇన్వెస్టర్లు, కోర్ టీమ్ సభ్యులు ఇలా .. ఎందులో చూసినా ఆ ప్రాంతానికి తిరుగులేదు. ఒకరకంగా చెప్పాలంటే, స్టార్టప్స్‌కి మంచి మ్యాన్ పవర్ కావాలి. అందుకు మంచి సంస్థలు కావాలి.. ఈ రెండూ పొవాయ్‌లో దొరుకుతాయని డోర్ మింట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అభివన్ అంటారు.

‘‘మొత్తానికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా వున్నాయని ఆంట్రప్రన్యూర్స్ కి, ఇన్వెస్టర్లకు అర్థమైపోయింది. వచ్చే రెండు మడేళ్ల లో పొవాయ్ వ్యాలీలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు’’ అంటారు హౌసింగ్ వ్యవస్థాపకుడు రాహూల్ యాదవ్.