పర్యావరణ, పర్వతారోహణ.. రెండూ ముఖ్యమే అంటున్న వోయజర్

దేశమంతా ఎండలు మండిపోతున్నప్పుడు.. మన మనసు చల్లని గాలి కోరుకుంటుంది. కళ్ళు.. మంచుపర్వతాలవైపు చూస్తాయి. అలాంటప్పుడే వోయేజర్ మనకో హెచ్చరికలాంటి సూచన చేస్తుంది. పర్వతాలను అధిరోహించండి.. కానీ మీ ఆనవాళ్ళు మాత్రం మిగల్చకండి..అంటారు వోయేజర్ వ్యవస్థాపకులు.

0

బెహ్జాడ్ లారీ, ఎలీజా మన్రో లు 2014లో వోయేజర్‌ను ప్రారంభించారు. సాహసయాత్రల్లో పర్యావరణ స్పృహను పెంచడం, గైడ్స్, పర్వత ప్రాంతాల్లో నివసించేవాళ్లకు సరిపడా జీవన భృతిని అందించడం లక్ష్యాలుగా ఈ సంస్థ ఏర్పడింది. స్వతహాగా పర్వతారోహణ అంటే ప్రాణం పెట్టే లారీ, మన్రోలు ..రెండేళ్ళ క్రితం సిక్కింలో పర్వతారోహణ సందర్భంగా ఓ గైడ్‌తో మాట్లాడుతున్నప్పుడు ఈ వోయేజర్ ఆలోచన వచ్చింది. ‘‘ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఆ గైడ్ నన్ను మీరెంత డబ్బులు ఇచ్చారు అని అడిగాడు. అప్పుడే అర్థమైంది. పర్వతారోహణకు అవసరమైన గైడ్ కోసం నేనిచ్చిన డబ్బుల్లో 60 శాతం మధ్యదళారీలకే పోతోంది. మొత్తం ట్రెక్కింగ్‌కి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసుకునే ఈ గైడ్‌కి వచ్చేది 40 శాతమే.. ’’అని తన అనుభవాన్ని వివరించాడు బెహ్జడ్. 

‘‘నేను ఇంతకు ముందు వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థల్లో దళారీలను రూపుమాపే ప్రయోగాలను చూసాను. ఇప్పుడు ట్రెకింగ్‌లో కూడా దళారీలు మొత్తం కమిషన్ దోచుకుపోవడం చూసాక నాకొక ఐడియా వచ్చింది. సాహస యాత్రల్లో కూడా పారదర్శకతను తీసుకొస్తే, ఇటు యాత్రీకులకు , అటు గైడ్‌లకు ప్రయోజనకరంగా ఉంటుందనిపించింది. ఒక ఏడాది పాటు, ఈ పరిశ్రమను అధ్యయనం చేసాను. ఆ తర్వాత 2013లో అమెరికాలో నేను చేస్తున్న క్లింటన్ ఫెలోషిప్స్ ఆపరేషన్స్‌లో ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వెళ్ళిపోయాను.’’అన్నారు బెహ్జడ్.

ఆ తర్వాత ఎలి కూడా చేరాడు. దాంతో 2014 నుంచి వోయేజర్‌కు ఒక రూపం వచ్చింది. ఈ వోయేజర్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి వోయేజర్ .కామ్ (voygr.com) ఇది వ్యాపారసంస్థ. ట్రెకింగ్, రాఫ్టింగ్, పర్వతారోహణ ప్యాకేజీలను విక్రయించడం, ఫోటోగ్రఫీ వర్క్ షాపులను నిర్వహించడం లాంటి సేవలతో ఇది లాభార్జన కోసం ఉద్దేశించింది. ఇక రెండోది వోయేజర్ .ఆర్గ్ (voygr.org) . ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. లీవ్ నో ట్రేస్ సంస్థతో వోయేజర్‌కు వ్యాపార భాగస్వామ్యం వుంది. అలాగే, ఇంటర్నేషనల్ ఎకోటూరిజమ్ సొసైటీలో కూడా వోయేజర్‌కు సభ్యత్వం వుంది. voygr.com ద్వారా విక్రయించే టూర్ పేకేజిలన్నీ పర్యావరణ సంరక్షణ, కార్బన్ నిరోధానికి కట్టుబడి వుంటాయి.

కస్టమర్లతో వొయేజర్ బృందం
కస్టమర్లతో వొయేజర్ బృందం

పర్యావరణానికి నష్టం కలిగించని పర్వతారోహణకు voygr.com చిరునామాగా వుండాలనుకుంటోంది. ముందుగా స్థానిక గైడ్స్‌కి వోయేజర్ బృందం పర్యావరణ పరిరక్షణ, సురక్షితమైన ట్రెకంగ్ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తుంది. ఆ తర్వాత ఈ స్థానిక గైడ్ల భాగస్వామ్యంతోనే ట్రిప్ ప్యాకేజీలను రూపొందిస్తారు. ఒకసారి స్థానిక గైడ్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం పూర్తయ్యాక.. బెహ్జద్, ఎలి ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో చర్చలు జరుపుతారు. వాళ్ళ సర్టిఫికేషన్‌కు అయిన ఖర్చు, టూర్‌లో వాళ్ళు తీసుకెళ్ళాల్సిన వస్తువుల ఖరీదు (ఇవన్నీ పర్యావరణానికి నష్టం కలిగించనివి అయి వుంటాయి), స్థానిక జీవనప్రమాణాలకు అనువైన వేతనం.. లాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రెకింగ్ ధరలను నిర్ణయిస్తారు. ఈ ట్రెకింగ్‌లన్నీ, లీవ్ నో ట్రేస్, ఎకో టూరిజమ్ సొసైటీలు రూపొందించిన కఠినమైన పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే వుంటాయి.

డార్జిలింగ్ ప్రాంతంలోని ఓ పోర్టర్
డార్జిలింగ్ ప్రాంతంలోని ఓ పోర్టర్

voygr.org

ఎకోటూరిజాన్ని గ్రామీణ జీవనభృతిగా మార్చేందుకు వోయేజర్ .ఆర్గ్ కృషి చేస్తోంది. వోయేజర్ .కామ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని తిరిగి పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చోట్ల ఖర్చుపెడుతుంది. ప్రస్తుతం పర్వత ప్రాంతాల్లో voygr.అర్జ్ వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తోంది. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో తాగే నీటిని వేడి చేస్తారు. వంట గ్యాస్ ధర ఎక్కువ కావడం, పర్వత ప్రాంతాలకు సిలిండర్ల రవాణా కూడా కష్టం కావడంతో ఇక్కడి ప్రజలు ఎక్కువగా కలప మీదే ఆధార పడతారు. అసలే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో చెట్లు పెరగడం కష్టం. అలాంటది వందల కిలోల కొద్దీ కలపను, నీళ్ళు వేడిచేయడానికి వాడడమనేది పర్యవరణానికి పెనుముప్పుగా మారుతోంది. పర్యావరణ పరిరక్షణకు అయ్యే ఈ ఖర్చులు, స్థానిక హోమ్ స్టేలకు, పోర్టర్లకు, గైడ్లకు తగిన వేతనాలను దృష్టిలో పెట్టుకునే వోయేజర్ ట్రెక్ లకు ధరలను నిర్ణయిస్తారు.

తమ దగ్గరకొచ్చే సాహసయాత్రీకులకు తమ ధరలు ఎందుకు కొంత ఎక్కువగా వుంటాయో వోయేజర్ బృందం సమగ్రంగా వివరిస్తుంది. మిగిలిన ట్రెకింగ్ ఆపరేటర్లు ధరలు తగ్గించడానికి ఎక్కడెక్కడ రాజీ పడతారో వివరిస్తుంది. ఏ పర్యావరణానికి ముగ్ధులై యాత్రలకు బయల్దేరతారో... దానికే హాని కలిగించేలా ట్రెకింగ్ నిర్వహించడం, స్థానిక గైడ్లను దోచుకుని ధరలు తగ్గించడం తమకు ఇష్టం వుండదని చెప్తారు.

నిజానికి పర్వతారోహణలో ఒక వైరుథ్యం వుంది. టూరిస్టులొస్తే కానీ ఇక్కడి సమాజాలు మనుగడ సాగించలేవు. కానీ, అదే టూరిస్టులు ఇక్కడ పర్యారణానికి ఎంతో కొంత నష్టం కలిగిస్తుంటారు. ‘‘అస్సలు టూరిస్టుల ఆనవాళ్ళు లేకుండా టూరిజమ్ వుండదు. పర్యావరణ స్పృహ ఎంత వున్నా, ఎంతో కొంత నష్టం కలిగిస్తూనే వుంటాం. పర్యావరణానికి ఏమాత్రం నష్టం కలిగించకూడదనుకుంటే, అసలు మనం ఆ చోటుకే వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం మన ప్రభావం పర్యావరణం మీద వీలైనంత తక్కువ వుండేలా శాయశక్తులా ప్రయత్నించాలి.’’ అంటారు బెహ్జద్.

మొదట్లో మారు మూల ప్రాంతాల్లోని గైడ్లతో కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ, అది ప్రస్తుతం వాళ్ళ బిజినెస్‌కి అనుకూలించేంతగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు రవాణా తదితర సదుపాయాలు లేవని గ్రహించారు. దీంతో అన్నివిధాలా కనెక్టివిటీ బాగా వున్న ప్రాంతాలకు మాత్రమే తమ ఆపరేషన్స్‌ను పరిమితం చేసారు . కొంత కాలం గడిచాక ఆ యా ప్రాంతాల్లో నియమించిన రీజనల్ మేనేజర్లు మరింత మారుమూల ప్రాంతాలకు బిజినెస్‌ను విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు.

ముందు ముందు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే ట్రెకింగ్ సంస్థల్లో వోయేజర్‌ను కూడా ప్రపంచ స్థాయిలో నిలపాలని ప్రయత్నిస్తున్నారు. ‘‘ ప్రపంచపర్యాటక పరిశ్రమను మనం ఆపలేం. కనుక దాన్ని వీలైనంత మెరుగుపరుద్దాం’’ అనేది వోయేజర్ వ్యాపార సూత్రం.

వోయేజర్ గురించి మరింత తెలుసుకోవాలన్నా, ఈ సంస్థ లో ట్రెకింగ్ టూర్ బుక్ చేసుకోవాలన్నా... voygr.com వెబ్ సైట్ చూడండి. ఎకో టూరిజమ్, పర్యావరణ సమతుల్యత, పర్యావరణంపై పర్యటనల ప్రభావం, వంటి అంశాల గురించి మరింత సమాచారం కావాలంటే, https://lnt.org, http://www.ecotourism.org సైట్లను చూడండి.

Related Stories

Stories by bharathi paluri