స్టార్టప్ కోసం లక్షన్నర జీతం వదులుకున్న ఐఐటీ కుర్రాడు..

స్టార్టప్ కోసం లక్షన్నర జీతం వదులుకున్న ఐఐటీ కుర్రాడు..

Tuesday March 29, 2016,

3 min Read


ఆర్గానిక్ ఫుడ్ పై ఉన్న మక్కువతో దాన్నే స్టార్టప్ గా చేసుకుని సక్సెస్ అయ్యాడు సాయి క్రిష్ణ. మార్కెటింగ్ చేసి రైతులకు చేయూతనివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి చిరు ధాన్యాలతో సరికొత్త తినుబండారాలను తయారుచేసి మోడ్రన్ జనరేషన్ కి సాంప్రదాయ పంటల రుచి చూపిస్తున్నాడు. 

image


చిరుధాన్యాలకు మంచి మార్కెట్ తీసుకు రావాలి

అమ్మానాన్నలు రైతులు కాకపోయినా వ్యవసాయ కుటుంబ నేపధ్యం సాయిక్రిష్ణది. సాంప్రదాయ వంటకాలంటే మక్కువ ఎక్కువ. ఢిల్లీ ఐఐటిలో చదివే రోజుల్లో తెలుగు వంటకాల కోసం తహతహలాడేవాడు. హెల్దీఫుడ్ కోసం తిరగని ప్లేసంటూ లేదు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్లు ఉద్యోగం చేసి, అది నచ్చక హెల్డీ ఫుడ్ నే స్టార్టప్ గా ప్రారంభించాడు.

హెల్త్ సూత్ర అనేది సాయి స్టార్టప్ పేరు. తన ప్రాడక్టులన్నీ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల సాయంతోనే డిజైన్ చేశాడు. నిజానికి వారి సాయం లేకుండా తన స్టార్టప్ గురించి ఎంత మాట్లాడినా తక్కవే అంటాడు. చిరు ధాన్యాల్లో ఉన్న పోషక విలువల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఈ ప్రాడక్టులను తయారు చేశానన్నాడు. దీన్ని గురించి పెద్ద ఎత్తున ప్రచారం అవసరం అంటున్నాడు. రోజూ తినే ఓట్స్ బదులు జొన్నలను ఆల్టర్నేట్ చేసి, రెడీ టు కుక్ లాంటి ఎన్నో రకాల ప్రాడక్టులను రూపొందించి జనం ముందుకు తెచ్చింది హెల్త్ సూత్ర. రెండు నిమిషాల్లో తయారయ్యే యాపిల్, క్యారెట్, టమోటా, జొన్న అటుకులు అందుబాటులో ఉన్నాయి. వీటి పేటెంట్ కోసం ఇప్పటికే అప్లై చేశారు. తోందరలోనే దాని రిజల్ట్ వస్తుందని సాయి అంటున్నాడు.

image


స్టార్టప్ కోసం ఉద్యోగానికి రాజీనామా

ఐఐటి నుంచి బయటకు వచ్చిన సాయికి లక్షన్నర వేతనం వచ్చే ఉద్యోగం లభించింది. కానీ దాన్ని కొంత కాలానికే వదిలేసాడు. కాలేజీ నుంచే స్టార్టప్ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాక, ఉద్యోగంలో పెద్ద ఎగ్జైట్ మెంట్ ఫ్యాక్టరేమీ కనపడలేదని అంటున్నాడు. 2013 ఏప్రిల్ లో ఉద్యోగానికి గుడ్ బై చెప్పాక, దాదాపు 6 నెలలు పల్లె బాట పట్టాడు. మెదక్, గుంటూరు జిల్లాల్లో మూడేసి నెలలు పర్యటించాడు. 

పాతతరం చిరు ధాన్యాలను విరివిగా ఉపయోగించే వారు. కానీ మన తరానికి అవి కనపడకుండా పోయాయి. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మెట్టుపంటల్లో చిరు ధాన్యాలే ప్రధానమైనవి. సాధారణ వరికంటే ఈ పంటలు ఎంతో ఆరోగ్యకరమైనవి. విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న ఓట్స్ కంటే మన జోన్నలు ఎంతో మేలు- సాయి. 
image


హెల్త్ సూత్ర పని తీరు

హెల్త్ సూత్ర నెలకి పది టన్నులు చిరు ధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. అయితే దీన్ని 30 టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 500 స్టోర్స్ లలో ఈ ప్రాడక్టులు లభిస్తున్నాయి. నెలకి 20నుంచి 25 ప్రాడక్టులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవన్నీ రూ.10 నుంచి రూ. 50 మధ్యనే ఉన్నాయి. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండటం స్టార్టప్ కు మంచి అడ్వాంటేజ్. మామూలు ఆర్గానికి ప్రాడక్టులతో పోలిస్తే, ఇవి మంచి టేస్టీగా ఉంటాయని సాయి అంటున్నాడు.

సాయి చెప్పిన ప్రకారం, ఈ ప్రాడక్టులన్నింటిలో దాదాపు రెడీ టు ఈట్, రెడీ టు కుక్ మాత్రమే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చిన్న చిన్న కమ్యూనిటీలను టార్గెట్ గా పెట్టుకున్న హెల్త్ సూత్ర.. భవిష్యత్ ప్రణాళికలు భారీగానే వేస్తోంది. ఆఫ్ లైన్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా విస్తిరించినప్పటికీ.. ఆన్ లైన్ లో కూడా దూసుకుపోవాలనేది సాయి ప్లాన్.

హెల్త్ సూత్ర టీం

ఫౌండర్ సాయిక్రిష్ణ సొంతూరు గుంటూరు జిల్లా నరసరావు పేట. అమ్మ, నాన్నలిద్దరూ టీచర్లే. వారికి ఓ స్కూలు కూడా ఉంది. ఢిల్లీ ఐఐటీ నుంచి ఈసీఈ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సాయి, తర్వాత ఓ ఐటి కంపెనీలో పనిచేశాడు. పంటలపై మక్కువ పెంచుకుని పల్లె బాట పట్టాడు. అనంతరం ఫుడ్ టెక్ పై మైసూర్ ఐఐఎంఆర్ నుంచి డిప్లొమా పొందాడు. ఇప్పుడు తెలుగు ప్రజలకు ఆరోగ్యకరమైన తినుబండారాలందించే సంస్థను నెలకొల్పాడు. ఇటీవలే కో ఫౌండర్ గా మహీధర్ చేరాడు. అతను కూడా ఐఐటి ఢిల్లీ నుంచి బిటిక్ పూర్తిచేశాడు. ఆపరేషన్స్, ఫినాన్స్ వ్యవహారాలు చూస్తున్నాడు. వారితోపాటు మరో 15 మంది ఉద్యోగులు ప్రాసెసింగ్ యూనిట్లో పని చేస్తున్నారు.

image


పోటీదారులు, ఫ్యూచర్ ప్లాన్స్

స్థానికంగా చాలామంది ఈ రంగంలో ఉన్నారు. ఆర్గానిక్ పేరు చెప్పి ఆకాశాన్నంటే రేట్లతో జనం జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. వారిని చాలెంజింగ్ ప్రైస్ తో ఎదుర్కొంటున్నామని సాయి చెప్పాడు. ప్రజల్లో చిరుధాన్యాల గురించి అవగాహన కల్పించడం తమకు పెద్ద సవాలని అంటున్నాడు.

సక్సెస్ తో దూసుకు పోతున్న హెల్త్ సూత్ర.. ప్రస్తుతం ఫండింగ్ కోసం ఎదురు చూస్తోంది. 500 నుంచి 600 మిలియన్ల ఫండింగ్ తో ఎవరైనా వస్తే కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సాయి ప్రకటించాడు. సీడ్ ఫండింగ్ తర్వాత, సిరీస్ కంటే ముందు రౌండ్ లో ఫండింగ్ కోసం ఈ స్టార్టప్ ఎదురు చూస్తోంది. ఫండింగ్ వస్తే దేశ వ్యాప్తంగా విస్తరించాలనేది వీరి ప్లాన్. ఈ రంగంలో స్టాండ్ ఎలోన్ గా ఉండాలని చూస్తున్నారు.

“భారత్ లో దాదాపు 20 నుంచి 25 వేల కోట్ల మార్కెట్ ఉన్న ఈ రంగంలో.. వచ్చే ఐదేళ్లలో నంబర్ వన్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాం”-సాయి

website