ఇతిహాస రచనల ఆథర్‌ ప్రెన్యూర్ అమిష్ త్రిపాఠి

0

భారతదేశం. వేదభూమి. రామాయణ మహాభారతాలు పరిఢవిల్లిన పుణ్యభూమి. తరాలు మారినా, అంతరాలు మారినా పురాణేతిహాసాలకు ఇంకా కాలం చెల్లిపోలేదు. కానీ ఈకాలం యువత ఇంకా వాటిని నమ్ముతోందా.. ? పుక్కిటి పురాణాలు మనకెందుకని కొట్టిపారేస్తోందా..?

ఇలా అనుకుంటే పొరపాటే అంటున్నారు అమిష్ త్రిపాఠి. ఇతిహాసాలను ఈ తరానికి అర్థమయ్యేలా రాసి పేరునే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించారాయన. దేశంలో ఇంత వరకూ ఏ రచయితకూ రానంత పేరు, డబ్బు వచ్చిందంటే ఆశ్చర్యమేస్తుంది. రాయబోయే పుస్తకానికి ముందుగా ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది. శివ ట్రయాలజీ సిరీస్ కింద వచ్చిన మూడు పుస్తకాలు 16 భాషల్లో తర్జుమా అయ్యాయి. ప్రపంచ దేశాల్లో వాటికి పాపులర్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం ట్రయాలజీ సీరిస్ పుస్తకాలే సుమారు 25 లక్షల కాపీలు అమ్ముడుపోయాయంటేనే అర్థం చేసుకోవచ్చు మనోడి పెన్ పవర్ ఏంటో!!

అమిష్ స్పెషాలిటీ ఏంటంటే.. ఎంత బాగా రాయగలడో.. అంతే బాగా మార్కెటింగ్ కూడా చేసుకోగలడు. కారణం ఏంటంటే.. ఐఐఎం కోల్‌కతాలో ఎంబిఏ పూర్తి చేయడమే. అంతే కాదు.. రచయితగా మారడానికి ముందు పదహారేళ్ల పాటు ఫైనాన్స్ రంగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలూ చేశారు. ఇప్పుడు ఆథర్‌ ప్రెన్యూర్‌గా జనాలకు చిరపరిచితమయ్యారు.

సైన్ ఆఫ్ ఇక్ష్వాకు తో అమిష్
సైన్ ఆఫ్ ఇక్ష్వాకు తో అమిష్

“నా రచనలన్నీ నేను మనసుతో రాస్తాను. ముందుగా నేనొక రచయితను” అంటారు అమిష్ త్రిపాటి.

ఆథర్‌ప్రెన్యూర్‌గా (ఆథర్ + ఆంట్ర్రప్రెన్యూర్) ఇంకా మారలేదంటూనే సరికొత్త వ్యాపార వ్యూహంతో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పుస్తకాలను విడుదల చేస్తున్నారాయన. ఎలాంటి సంచలనాలు లేకుండానే ఆయన రాసిన పుస్తకాలు లక్షల సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. కోల్ కతా ఐఐఎం నుంచి ఎంబీఏ చేసిన ఆయన హిందూ మైథాలజీ పై ఇప్పటి వరకూ 4 పుస్తకాలను విడుదల చేశారు. అందులో మూడు పుస్తకాలు శివపురాణానికి సంబంధించినవి. మరొకటి ఈ మధ్యే జనాల్లోకి వచ్చింది రామచంద్ర సిరీస్ సంబంధించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హ్యారీ పోటర్ పుస్తకాల స్థాయిలో మన దేశంలో అమిష్ త్రిపాటి పుస్తకాలు సేల్ అవుతుంటాయి.

నమ్మే సిద్ధంతం

‘కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన ! కర్మలు చేయడమే నీ చేతిలో ఉంది. దాని ఫలితాలను నువ్వు నిర్ణయించలేవు. ఈ శ్లోకాన్ని అమిష్ ఫాలో అవుతారట. తను రాయడం వరకే. ఫలితాల గురించి ఆశించరట. భవిష్యత్తులో కూడా ఇదే సిద్ధాంతానే అనుసరిస్తానని అంటున్నారు. వ్యాపారం చేయడం వరకే మన చేతుల్లో ఉంది. దాని ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినప్పటికీ .. మన కృషిని మాత్రం విడిచపెట్టకూడదు. ఇంత గొప్పదైన వ్యాపారానికి సంబంధించిన అంతరార్థం దాగి ఉంది ఆయన మాటల్లో.  

సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు. వాటికి భయపడి మనం ఖాళీగా ఉంటే.. నిజంగా ఓటమిపాలైనట్టే అంటారు అమీష్.

ఎంతో మోడ్రన్‌గా, కొత్త తరానికి ఓ ఐకాన్ లా కనిపించే అమిష్ తన రామచంద్ర సిరీస్‌లో మొదటి పుస్తకాన్ని విడుదల చేశారు. శివైకంతో ఇప్పటి వరకూ మూడు పుస్తకాలను మార్కెట్లోకి తెచ్చారు. మొదటిసారి విష్ణువుకి సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈశ్వరుడైనా, విష్ణువైనా ఒకరే అంటారాయన. రాయటం నాకు శివుడిచ్చిన వరం అంటున్నఈ మోడ్రన్ రచయిత హిందూయిజంలో రెండు రకాల మేనిఫెస్టోలు ఉన్నాయని విశ్లేషిస్తారు. అందులో ఒకటి శైవం, రెండోది వైదికం. ప్రస్తుతం ఆయన విడుదల చేసిన పుస్తకం ‘సియన్ ఆఫ్ ఇక్ష్వాకు’. వాల్మీకి, ఇతర రామాయణాల నుంచి సేకరించిన విషయాలతో రాసిందది. రామాయణం చాలా మంది రాశారు. కానీ దానికి ఆద్యం మాత్రం రామచరిత్ మానస్ అంటారు అమిష్. తన రచనాల్లో కూడా రామచరిత్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావించారు.

రచయితలే వివాదాలకు కారణం

నూటికి తొంబై శాతం వివాదాలకు రచయితలే కారణమంటారు అమిష్. వారి రచనలు అమ్ముడు పోవాలని ఎక్కడలేని వివాదాలను తెరపైకి తెస్తారని విమర్శిస్తూనే.. తాను మాత్రం వాటికి దూరమని చెప్తున్నారు. హిందూ మైథాలజీపై తాను రాస్తున్న పుస్తకాలు జనంలోకి బాగా చొచ్చుకెళ్తున్నాయని.. అతివాదులు అన్నిచోట్లా ఉన్నారని, వారి అభిప్రాయాలను పట్టించకోవాల్సిన అవసరం లేదంటారు.

ఆథర్‌ ప్రెన్యూర్ 

వ్యాపార రంగంలో సరికొత్తగా వినిపిస్తోన్న పదం ఆథర్‌ ప్రెన్యూర్. ఐఐఎం నుంచి బయటకు వచ్చిన ఈ యువ రచయిత తన పుస్తకాలను బిజినెస్ చేసుకోవడంలో నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పుస్తకాలకు హిట్ టాక్ వచ్చింది. కొత్త నవల సియన్ ఆఫ్ ఇక్ష్వాకు విడుదలకు ముందు నెట్లో ట్రైలర్లు విడుదల చేశారు. తన పుస్తకానికి తానే ప్రమోషన్ ప్రారంభించి దేశ వ్యాప్తంగా దాని గురించి అంతా ఎదురు చూసేలా చేశారు. అప్పట్లో ఎప్పుడో హ్యారీ పోటర్ తర్వాత ఆ స్థాయిలో పుస్తకాలకు ప్రమోషన్‌తో అమ్మిన ఘనత అమిష్ త్రిపాటీదే. పుస్తకాలు రాయడం ఒక ఎత్తయితే.. వాటిని వ్యాపారం చేసుకోవడం మరింత కష్టం. రచయితలకు వ్యాపార లక్షణాలు ఉండవు. కానీ తను చదువుకున్న ఐఐఎం కోల్‌కతాలోని మేనేజ్మెంట్ పాఠాలు తన పుస్తకాలను జనంలోనికి ఎలా తీసుకువెళ్లాలో నేర్పాయని ఒప్పుకుంటారు.

“ నేను ఆథర్‌ ప్రెన్యూర్‌ నా.. లేకా ఆంట్రప్రెన్యూర్‌ నా అనే విషయం నాకు తెలియదు. కానీ మొదటగా నేనొక రచయితను ” అంటారు అమిష్.

యువ రచయితలకు ఇచ్చే సలహా

రచనా రంగంలోకి రావాలంటే క్రియేటివిటీ ఉండక్కర్లేదు. ఎందకంటే నాకంత క్రియేటివిటీ ఉందని నేను అనుకోవడం లేదు, మీ మనసు చెప్పింది చేయండి. మీ మనసుతో రాయండి. అని చిరునవ్వులు చిందిస్తూ ముగించారు అమిష్ త్రిపాటి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik