86 ఏళ్ల వయస్సు ఉన్న యూత్ ! డాక్టర్ సీతా భతేజా

86 ఏళ్ల వయస్సు ఉన్న యూత్ ! డాక్టర్ సీతా భతేజా

Wednesday November 04, 2015,

4 min Read

చేయాలనే ఉత్సాహం, పట్టుదల ఉంటే 86 ఏళ్ల వయస్సు కూడా దేనికీ అడ్డురాదు. వయస్సు అనేది చెప్పుకునే సంఖ్య మాత్రమేనని డాక్టర్ సీతా భతెజాను చూస్తే అనిపిస్తుంది. ఆ వయసులోనూ తనకున్న ఎనర్జీ చూస్తే ఎవరికైనా తనలాగే పనిచేయాలనిపిస్తుంది. జీవితంలో సులభంగా ఏదీ లభించదు. అయితే మనచుట్టూ ఉన్న పరిసరాల్లో ఆనందాన్ని వెతుక్కుంటే అంతకు మించిందేదీ ఉండదని భావిస్తున్నారు ఈ డాక్టర్. తలలో పెట్టుకునే పువ్వైనా, చిరునవ్వైనా, మనస్సు నిండుగా నవ్వే నవ్వైనా...ప్రతీ దానిలోనూ సంతోషాన్ని వెతుక్కోవచ్చు. యువర్ స్టోరీ టీం ఆమెను కలిసినపుడు తన జీవితం, వైద్య విద్య, విభజన, ఎదురుదెబ్బల నుంచి తను ఎలా హాస్పిటల్ ఏర్పాటు చేసింది చెప్పుకొచ్చారు డా.సీత.

image


జైళ్ల దగ్గరే పెరిగారు

ముల్తాన్‌లో పుట్టిన సీత, జైళ్లు ఉన్న కాంపౌండ్‌లో పెరిగింది. అందుకు కారణం తన తండ్రి, తాత ఇద్దరూ జైలర్లుగా పనిచేయడమే. యుక్త వయస్సులో ఉన్నవారు తప్పుచేసి జైళ్లకు వెళితే వారిని తిరిగి సన్మార్గంలో నడిపించే బృహత్తర బాధ్యత వారిద్దరిదీ. తండ్రికి ఎక్కువగా బదిలీలు అవుతుండడంతో ఎన్నో ప్రాంతాలు తిరిగింది సీత. ప్రతీ చోటా ఉన్న ప్రభుత్వ స్కూల్స్‌లోనే తన చదువు కొనసాగింది

పెళ్లి, పిల్లలే జీవితమా అనుకున్నా ?

అప్పటిదాకా జీవితం గురించి ఆలోచించని సీత, ఎనిమిదో తరగతి అయిపోయేసరికి ఒక్కసారిగా మారిపోయింది. తనకంటూ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యను అభ్యసించాలని నిశ్చయించుకుంది. దానికొక కారణం ఉంది. మెట్రిక్యులేషన్ పాసయిన వెంటనే పెళ్లి చేసుకుని, కుటుంబ బాధ్యతల్ని మోస్తూ, పిల్లల్ని కన్న అమ్మాయిల్ని తని చూసింది. అలాంటి జీవితం తనకు వద్దని అనుకున్న సీత, చదువుకొనసాగించాలని భావించింది. "వైద్య విద్యను అభ్యసిస్తే నేను బిజీగా మారిపోతానని, పెళ్లికి దూరంగా ఉంటానని అనిపించింది" అంటూ నవ్వుతూ గతాన్ని గుర్తు చేసుకుంది సీత.

అయితే సీత తండ్రి మాత్రం చదువుకయ్యే మొత్తాన్ని భరించడానికి సిద్ధపడకపోతే, వాళ్ల తాత ముందుకొచ్చి సహాయపడ్డాడు. దాంతో లాహోర్‌లోని కింగ్స్ ఎడ్వర్డ్ కాలేజ్ కెళ్లి చదువుకున్నారు సీత. తన ధ్యాసంతా చదువుమీదే పెట్టారు. వైద్య విద్యలో ఉన్నపుడే జీవితం మారిపోయింది. సెలవుల్లో తాతగారింటి సియాల్‌కోట్ వెళ్లినపుడు, దేశ విభజన జరిగింది.

image


దేశ విభజన

"విభజన సమయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిల్ని ఎత్తుకెళ్తే, వృద్ధుల్ని చంపేసేవారు. లక్షలాది మంది సర్వస్వం కోల్పోయారు. ఆ పరిస్థితి ఊహకే అందనిది" అంటారు ఆ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయిన సీత. అప్పుడు తనకు 19 ఏళ్లు.

సీత తన గ్రాండ్ పేరెంట్స్‌తో కలిసి సియాల్‌కోట్ నుంచి భారత దేశ బాట పట్టారు. వారితో కలిసి జమ్మూ చేరుకున్నారు. అక్కడి నుంచి సీత తాత.. అతి కష్టమ్మీద బస్సులో రెండు సీట్లు సంపాదించి సీతను, ఆమె నానమ్మను అమృత్‌సర్ బస్ ఎక్కించారు. చాలా రోజుల వ్యధాభరిత ప్రయాణం తర్వాత సురక్షితంగా బంధువుల ఇంటికి వారిద్దరు చేరుకున్నారు. ముల్తాన్‌లో చావు నీడలో బతుకుతున్న సీత తల్లితండ్రులు, ఎలాగోలా తప్పించుకుని తాత దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ కలిసి సరిహద్దును దాటారు. తర్వాత తాత మెక్‌లాయిడ్ గంజ్‌లో స్థిరపడితే, తండ్రి జైలర్‌గా ఫిరోజ్‌పూర్‌లో కొనసాగారు.

కలను సాకారం చేసుకునే దిశగా

ముంబైలోని హాస్పిటల్‌లో చదువు కొనసాగించడానికి సీత చేరారు. మూడు పూటలా తిండి తినడానికి కూడా కష్టపడ్డారు. అక్కడే ఓ మహిళ పెద్ద మనసుతో కొంత మొత్తం ఇచ్చి ఆమెకు సహకరించింది. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చదువు కొనసాగించిన సీత.. 1949లో డాక్టర్ అయ్యారు.

చిన్నతనంలో మేరీక్యూరీని ఆదర్శంగా తీసుకున్నారు సీత. అతి పేదరికాన్ని ఎదిరించి, సంక్లిష్ట సమయాల్ని ఎదుర్కొని విజయాల్ని సాధించిన మేరీక్యూరీ లాగే తాను కూడా ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారు.

image


డాక్టర్‌గా జీవిత ప్రయాణం

తాను సాధించిన పట్టాతో ఇతరులకు సహాయపడాలనే నిర్ణయించుకున్నారు సీత. అలా రెఫ్యూజీ క్యాంప్స్‌లో ఆశ్రయం పొందుతున్న వారికి సహాయం చేసేవారు. కురుక్షేత్రలోని రెఫ్యూజి క్యాంప్‌లో మొట్టమొదటి పోస్టింగ్‌లో చేరిన ఆమె, గర్భిణీ మహిళలకు చికిత్స అందించేవారు. ఆ తర్వాత జమ్ము క్యాంప్‌కు ఉద్యోగం మారింది.

1950లో తిరిగి వచ్చిన సీత... బాంబే యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కామా హాస్పిటల్లో జాయినయ్యారు. పిజి ఎగ్జామ్స్ ఫినిష్ చేయడం కష్టమయినా ఒక ప్రొఫెసర్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆయనిచ్చిన రిమార్క్స్ ఆమెకు ఎంతగానో సహకరించాయి. 26 ఏళ్ల వయసున్న ఆమెకు స్వతంత్ర హోదా ఇచ్చేట్లు ఆయన చేయగలిగారు.

బెంగుళూరుతో అనుబంధం

మేజర్ అమృత్ భతేజాతో సీత వివాహం అయింది. ఆర్మీ అఫీసర్ అయిన అమృత్ కిర్కీకి మారారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్లేవారు సీత. ఆ తర్వాత ఇద్దరూ 1957లో బెంగుళూర్ చేరుకున్నారు. 1965లో అక్కడే క్లినిక్‌ను ప్రారంభించారు ఆవిడ. "ప్రభుత్వం డాక్టర్లకు చాలా తక్కువే చెల్లించేది. అప్పట్లో ప్రైవేటు హాస్పిటల్స్‌కు జనం అతి తక్కువగానే వచ్చేవారు. దీంతో నేను ఆయన జీతం మీదే ఆధారపడేదాన్ని. కన్సల్టేషన్ కోసం వచ్చే వారికి మందులు అవసరం లేదని సలహా ఇచ్చినపుడు, దాని కోసం ఎందుకు 5 రూపాయల ఫీజ్ ఇవ్వాలని ప్రశ్నించేవారు. అలా చాలా కష్టపడ్డాను. అయినప్పటికీ అలాగే పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఆ పనిని నేను అంతలా ప్రేమించాను." అంటారు సీత.

కొన్నేళ్ల తర్వాత అదే క్లినిక్ సీత పేరుతో హాస్పిటల్‌గా మారింది. ప్రయాణం అంత సులభంగా జరగకపోయినా సీత మాత్రం, చాలా శ్రద్ధతో ఆ పని చేసేవారు. గైనకాలజీ, ప్రసూతి విభాగంలో మంచి పేరు సంపాదించిన ఆమెకు పిల్లల సంక్షేమం కోసం చేసిన కృషికి 'రాష్ట్రీయ రతన్' అవార్డు దక్కింది.

image


టెక్నాలజీతో మార్పులు

హాస్పిటల్లో జరిగే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోయినా పేషెంట్లను మాత్రం చూసేవారు. తన చిన్న కొడుకు హాస్పిటల్ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. వైద్య వృత్తిలో ఉన్న సీత, తన రంగంలో వస్తున్న మార్పుల్ని నిశితంగా గమనిస్తారు. "అప్పట్లో మా చేతుల్ని మేము నమ్ముకునే వాళ్లం, కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా మార్చేసింది" అంటారు.

ఏళ్లు గడిచే కొద్దీ వస్తున్న టెక్నాలజీ మార్పుల్ని గమనిస్తూ, పుస్తకాల్ని చదువుతూ, కాన్ఫరెన్సుల్లో పాల్గొంటూ... నెట్‌లో అవసరమైన సమాచారాన్ని సేకరించేవాళ్లం. జీవితం అంతా నేర్చుకుంటూనే ఉండాలి, అలా అయితేనే పేషెంట్లకు ఉత్తమమైన వైద్యాన్ని అందిస్తాం అంటారు డాక్టర్ సీత.

స్టాంప్స్ సేకరణ

వైద్య రంగంతో పాటుగా సీత, హబీగా పువ్వుల్ని, నాణేల్ని కూడా సేకరించేవారు. అయితే ఎన్ని చేసినా స్టాంప్స్ సేకరణ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు. చిన్నతనం నుంచే స్టాంప్స్ సేకరించినా, యుక్త వయస్సులో తన సంపాదనతో వాటిని కొనుక్కునేవారు. పెళ్లి, కుటుంబ వ్యవహారాలు, పనుల్లో పడి తన ఉత్సుకతను కాస్త పక్కన పెట్టాల్సివచ్చింది. అయితే తన పిల్లలు మాత్రం ఆ కలెక్షన్‌ను కొనసాగించారు. స్వాతంత్ర్యానికంటే ముందు ఉన్న స్టాంప్స్ ఆమె దగ్గర ఉండడంతో, ఇద్దరు రాష్ట్రపతులు ఆమె కలెక్షన్ చూస్తామని చెప్పారు.

డాక్టర్ ప్రిస్కిప్షన్

ఇతర విషయాలతో పాటుగా డాక్టర్లే బ్యాడ్ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా చెబ్తారు. ఒబెసిటి, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, కాన్సర్ వంటి వ్యాధులకు మంచి ఆహారపు అలవాట్లతో పాటుగా, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని సూచిస్తారు డాక్టర్ సీత. ప్రతీ చిన్న విషయంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే ప్రతీ క్షణం ఆనందంగా ఉండొచ్చని నమ్ముతారు. ఊరికే చెప్పడం కాకుండా ఆచరించి చూపిస్తున్నారు.

86 ఏళ్ల వయస్సులో తన మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతూ ఉన్నా, పని చేస్తున్నపుడు కలిగే ఆనందమే ఎక్కువ. "ఆయాసము, అలసట అంటే ఏంటో నాకు తెలియదు. మీకిష్టమైన పని చేస్తున్నపుడు ఎలా అలిసిపోతారు" అంటు ఆశ్చర్యపోతారు డా. సీత.

ఉదయం, రాత్రి పనిచేస్తూనే ఉన్నా ఆమె రిటైర్మెంట్ గురించి ఆలోచించట్లేదు. ఆ పదం తన డిక్షనరీలోనే లేదంటూ నవ్వుతారు. అలసట అనేదే లేకుండా, నిండుగా, పూర్తి ఎనర్జీతో నవ్వుతారు. జీవితంలో ఎదురైన ప్రతీ దాన్నీ ఆలింగనం చేసుకుని ముందుకు సాగిపోవాలని చెప్పి ముగించారు డా. సీతా భతేజా.