ఘనంగా ఉస్మానియా యూనివర్శిటీ వందేళ్ల వేడుకలు  

విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

0

వందేళ్ల విద్యానవనం ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రారంభ వేడుకకు విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ కేకే, మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డితో పాటు ఓయూ అధికారులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఇనాగరల్ ఫంక్షన్ కు హాజరయ్యారు.

ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవం జరుపుకోవడం.. ఆ వేడుకకు తాను హాజరవడం గర్వంగా ఉందని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. సరిగ్గా వందేళ్ల క్రితం ఇదే రోజున ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఒక ముందుచూపుతో హైదరాబాద్ లో యూనివర్సిటీకి శ్రీకారం చుట్టారని, ఆయన దార్శనికతను అనుగుణంగానే విశ్వవిద్యాలయం దేశంలోనే ఉత్తమ విద్యాలయాల్లో ఒకటిగా నిలిచిందని రాష్ట్రపతి అభివర్ణించారు. 1956లో జవహర్ లాల్ నెహ్రూ యూజీసీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

యూనివర్సిటీ అంటే కేవలం విద్య నేర్చుకోవడమే కాదు.. ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోడానికి కూడా మంచి వేదిక కావాలని ఆయన ఆకాంక్షించరు. అదే యూనివర్శిటీల లక్ష్యంగా కూడా ఉండాలని అభిలషించారు. అలాంటి స్ఫూర్తిని గత వందేళ్ల నుంచి ఓయూ కొనసాగిస్తోందని ప్రశంసించారు. 1500 ఏళ్లుగా మన విద్యారంగం అంతర్జాతీయ స్థాయిలో ముందున్న విషయాన్ని ప్రణబ్ కోట్ చేశారు. 15వ శతాబ్దంలోనే ఏర్పాటైన నలంద యూనివర్సిటీ, తక్షశిల, విక్రమశిల, ఉధంపూర్ లాంటి ఉత్తమ విద్యాలయాలను ఆయన ప్రస్తావించారు.

దేశంలో 757 యూనివర్సిటీలు , 16 ఐఐటీలు, 30 ఎన్ఐటీలు, ఐఐసీఆర్, ఐఐఎంలు.. ఉంటే వాటిలో చాలావరకు వందశాతం క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు గ్లోబల్ లీడర్లుగా ఉన్న సంగతి గుర్తు చేశారు. వాటితోనే సంతృప్తి పడకుండా యూనివర్సిటీలను కూడా అదే స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఐదేళ్లుగా స్నాతకోత్సవాలకు వెళ్లిన ప్రతీచోటా విద్యాప్రమాణాలు పెరగాలని పదేపదే కోరిన విషయాన్ని ప్రణబ్ చెప్పారు. భారతీయ యూనివర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలన్నదే తన తపన అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ఆహ్వానించిన యూనివర్సిటీ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాదర స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.30కి ప్రణబ్ ఓయూ క్యాంపస్ కు చేరుకున్నారు. పోలీసు బ్యాండ్ జాతీయ గీతాలాపనతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి శతాబ్ది వేడుకనలు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీసీ రాంచంద్రం శాలువా, మెమొంటోతో రాష్ట్రపతిని ఘనంగా సత్కరించారు. తర్వాత గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను సన్మానించారు. అనంతరం శతాబ్ది పైలాన్ ఆవిష్కరించి, సెంటినరీ బిల్డింగుకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు రాష్ట్రపతి. 3 భాషల్లో రూపొందించిన సెంటినరీ సావనీర్‌ ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.

అనంతరం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రాంచంద్రం స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఓయూ విశిష్టతను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఉత్సవాల కోసం 200 కోట్ల నిధులు కేటాయించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Related Stories

Stories by team ys telugu