టెక్ కంపెనీని దశల వారీగా ఎలా నిర్మించాలి ?

టెక్ కంపెనీని దశల వారీగా ఎలా నిర్మించాలి ?

Sunday November 01, 2015,

4 min Read

కోట్లాది మందికి టెక్నాలజీని అందించాలంటే... సంస్థలో ప్రతీ దశలో చేయాల్సిన మార్పుల్ని టెక్ కంపెనీలు తెలుసుకోవడం అత్యవసరం. టెక్ స్పార్క్స్ 2015 సదస్సులో ఇన్‌మొబి సీటీఓ మోహిత్ సక్సేనా సరిగ్గా ఇలాంటి విశేషాలనే వివరించారు. వివిధ దశల్లో తన కంపెనీ ఎలా రూపాంతరం చెందిందో ఉదాహరణలతో సహా విడమర్చి చెప్పారు.

image


సున్నా నుంచి మొదటి స్టేజ్ వరకు

మొదటి అడుగుతోనే మీ ప్రయాణం మొదలవుతుంది. అందుకే ఇది కీలకం. ప్రతీ సంస్థకు ఇది చాలా ముఖ్యమైన దశ. మోహిత్ ఉద్దేశంలో... ముందుగా ఐడియాను డెవలప్ చెయ్యడం వ్యాపారంలో ముఖ్యం కాదు... ఉద్యోగుల్ని నియమించుకోవడం ముఖ్యం అంటారు.

చాకుల్లాంటి వారిని నియమించుకోవాలి

ఏ సంస్థకైనా నియమకాలు చాలా ముఖ్యం. "చాలామంది వ్యవస్థాపకులు ముందుగా నిపుణుల కోసం వెతుకుతుంటారు. కానీ ఈ దశలో మీకు కావాల్సింది నిపుణులు కాదు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్నతెలివితేటలు, కసి ఉన్నవాళ్లు " అంటారు మోహిత్. అందుకే ఉద్యోగుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచిస్తారు. నియమించుకోవడం, నచ్చకపోతే తొలగించడం వంటివి చేస్తూ ఉండకూడదు. మొదట్లో మీరు నియమించుకునే ఇంజనీర్లే మీకు ముఖ్యం. వాళ్లు కూడా చురుకైన వాళ్లుండాలి. వేగంగా కదులుతూ సంస్థను వృద్ధి పథంలో నడిపించాలి. "ప్రారంభ దశలో కీలకమైన నియామకాల్ని సవ్యంగా చేయాల్సిన బాధ్యత వ్యవస్థాపకుల భుజాలపై ఉంటుంది" అంటారు మోహిత్. మీ సంస్థ కోసం సరైన బృందాన్ని తీసుకోవడం కోసమే ప్రతీ రూపాయి ఖర్చు చేయాలి. ఈ దశలో మీకు మంచి ఇంజనీర్ల బృందం ఉందంటే మీకు రెక్కలు ఉన్నట్టే.

సులభంగా ఉండాలి

సంస్థలో చేసే ప్రతీ ఆవిష్కరణ సులభంగా, సాధ్యమయ్యేలా ఉండాలి. ఉదాహరణకు అంతరిక్షంలో సైతం రాయగల పెన్ కోసం నాసా పది మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. కానీ రష్యన్లు దాని బదులు పెన్సిల్ వాడారు అంటారు మోహిత్. వ్యవస్థాపకుడిగా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా సులభంగా, పొదుపుగా ఆలోచించేలా మీ టీమ్ ని ప్రోత్సహిస్తూ ఉండాలి.

"30 లైన్ల కోడ్‌తో పూర్తయ్యేదానికి 300 లైన్లు రాయాల్సిన అవసరం లేదు" అంటారు మోహిత్.

బతిమాలాలి, సాయం కోరాలి, అవసరమైతే దోచుకోవాలి

చక్రాన్ని మళ్లీ మళ్లీ ఆవిష్కరించాల్సిన అవసరం లేదు. చక్రం ఎప్పుడో ఆవిష్కరించేశారు కాబట్టి దాన్ని దర్జాగా వాడుకోవాలన్నది మోహిత్ ఫిలాసఫీ. " సర్వర్లు, సాఫ్ట్‌వేర్లు కొనడానికి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా సిద్ధంగా ఉంటే వాడుకోండి అంతే" అంటారు మోహిత్.

కొత్త టెక్నాలజీని ప్రయత్నించాలి

సున్నా నుంచి మొదటి స్టేజ్ లోనే మీ ప్రదర్శన సరిగ్గా లేకపోతే ... మిగతా దశల్లో మీరెలా ఉండగలరు ? ప్రారంభ దశలో మీరు కోల్పోవడానికి ఏమీ ఉండదు. కాబట్టి ప్రయోగాలు చేయడం చాలా ముఖ్యం. నిత్యం చురుగ్గా ఉంటూ కొత్తవి ప్రయత్నిస్తూ ఉండాలని సూచిస్తారు మోహిత్.

ఆలోచన, వేగం, అమలు

ఏదైనా ఒక ఆలోచన వస్తే దానిపై దృష్టిపెట్టండి. ఐడియాను వ్యతిరేకించడం కంటే దాని గురించి ఆలోచించి అమలు పర్చండి. "కొత్త ఐడియాను అమలు చేస్తే మీకు జరిగే నష్టం ఏమీ ఉండదు. అయితే విఫలమవుతారంతే. కానీ వైఫల్యాలెప్పుడూ జీవితానికి మార్గదర్శకులే. మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోగలరు. వెనక్కి వెళ్లి ఆ తప్పును సరిచేసుకొని మళ్లీ మొదలుపెట్టాలి" అని ప్రోత్సహిస్తున్నారాయన.

ఒకటి నుంచి 10,00,000 దశ వరకు...

ఈ దశ చాలా విభిన్నం. వివిధ నియమాల మధ్య మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. ఆకాంక్షలు వేరుగా ఉంటాయి. ఇక మీరు విశాల దృక్పథంతో ఆలోచించడం మొదలుపెట్టాలి.

దేశం దాటి ప్రపంచంతో పోటీ పడాలి

"మాది ఇండియాలో పుట్టిన కంపెనీ. ఇందుకు గర్విస్తున్నాం. కానీ మాది ప్రపంచస్థాయి సంస్థ. అలాంటి ప్రపంచ స్థాయి సంస్థలతోనే పోటీపడుతున్నాం" అంటారు మోహిత్.

టెక్ కంపెనీలకు ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. వాళ్లు తమ ఉత్పత్తిని, సేవల్ని ప్రపంచంలో ఎక్కడైనా పరిచయం చెయ్యొచ్చు.

త్వరగా విఫలమవ్వాలి

"కోడ్‌లు తప్పుగా రాస్తున్నందుకు బెంగపడకండి. మీరు విఫలమవుతున్నారంటే కార్యాచరణలో అనుభవం సాధిస్తున్నట్టే. దీన్ని ఇలాగే కొనసాగించాలి. వంద, వెయ్యి, లక్ష దశల వరకు ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉండాలి"

లోతైన నైపుణ్యం ఉన్న వారిని నియమించుకోవాలి

"డబ్బులు ఎలాగైనా సంపాదించేవాళ్లు అప్పటికే మీ దగ్గర ఉంటారు. కాబట్టి ఈసారి నైపుణ్యం ఉన్న వారిని నియమించుకోవాలి. కుర్రాళ్లని, పనిపై ప్రేమ ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి" అంటారు మోహిత్.

బిల్డ్ vs బయ్

మీకేదైనా టెక్నాలజీ కావాలంటే సొంతగా తయారు చేసుకోవాలా... ? లేక తక్కువ ధరకే ఎక్కడైనా దొరుకుతుందా... ? అనేది గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే... అప్పటికే ఆ టెక్నాలజీ సిద్ధంగా ఉంటే దాన్ని తయారు చేసుకోవడానికి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. కొన్నిసార్లు కొత్త టెక్నాలజీ తయారు చెయ్యడంలో చాలా సమయం వృథా అవుతుంటుంది.

కీలకమైన బృందాన్ని తయారుచేసుకోవాలి

ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ సంస్థకు శక్తియుక్తుల్ని అందించే కీలకమైన బృందాన్ని సిద్ధం చేసుకోవాలి. వాళ్లే మీ సంస్థను నిలబెట్టగలరు.

10,00,000 నుంచి బిలియన్ స్టేజ్

ఈ దశల్లో ప్రపంచ స్థాయి సంస్థల నుంచి ఎదుర్కొంటున్న కాంపిటీషన్ కు తగ్గట్టుగా మీరు మీ ప్రణాళికల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

మీ టెక్నాలజీని సరిచూసుకోవాలి... నిర్దయగా ఉండాలి

" ఏ ఇంజనీరైనా వాళ్లు తయారుచేసిన టెక్నాలజీని ప్రేమిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఏ టెక్నాలజీ అయినా ఆరు నెలలకు మించి ఉండదు" అంటారు మోహిత్. మీ సంస్థలో ఏదైనా టెక్నాలజీ ఔట్ డేటెడ్ అనిపించినా, ఇకపై అవసరం లేదనిపించినా ఏమాత్రం ఆలోచించకుండా పక్కకు పెట్టెయ్యడమే మంచిది అంటారు.

మీ వేగాన్ని తగ్గిస్తున్న పద్ధతులుంటే మార్చెయ్యండి

కంపెనీ పెద్దగా అవుతున్న కొద్దీ కొన్నికొన్ని పద్ధతులు స్థిరపడిపోతుంటాయి " చాలామంది ఇలాంటి పద్ధతుల్ని తొలగించడం గురించి ఆలోచించరు. అది కాస్త ఇబ్బందికర పరిస్థితే. కానీ ఆ ఇబ్బందిని జయించాలి. మార్పులు చేయాలి " అంటారు మోహిత్. వీటి వల్ల సంస్థ వృద్ధి మందగించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు టెక్ కంపెనీల్లో అస్సలు రాకూడదు అంటారాయన.

ఆవిష్కరణలను కొనసాగిస్తుండాలి

మీ సంస్థ మూడు నాలుగు వందల మంది సిబ్బందికి పెరిగినా ఆవిష్కరణలు కొనసాగిస్తుండాలి. ఎంతా బాగా చేసినా ఇంకా బాగా చెయ్యడానికి ఎప్పుడూ అవకాశాలు ఉండనే ఉంటాయి.

టెక్ బ్రాండ్‌ని నిర్మించాలి

చివరగా "గొప్ప ఇంజనీర్లు ఎప్పుడూ గొప్ప ఇంజనీర్లతోనే పనిచేసేందుకు ఇష్టపడుతుంటారు" అంటూ ముగించారు మోహిత్.