అమ్మకు ప్రేమతో..! బిడ్డకు భరోసాతో..!!

అమ్మకు ప్రేమతో..! బిడ్డకు భరోసాతో..!!

Saturday June 03, 2017,

2 min Read

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం లాంఛనంగా మొదలైంది. హైదరాబాదులోని పేట్ల బుర్జ్ ఆస్పత్రిలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బాలింతలకు ఆయనే స్వయంగా కిట్స్ అందించారు. ముందుగా మేకల సవిత అనే మహిళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా కిట్ అందుకున్నారు. అనంతరం కేసీఆర్ కిట్ వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ కిట్ లో 2 వేల రూపాయల విలువైన16 వస్తువులుంటాయి. జాన్సన్ బేబీ ఆయిల్, జాన్సన్ బేబీ సోప్, జాన్సన్ బేబీ క్రీమ్, జాన్సన్ బేబీ షాంపూ, మదర్ సోప్ ఉంటాయి. అలాగే 2 చీరలు, 2 జతల చిన్న పిల్లల బట్టలు, డైపర్లు , బేబీ మాట్రెస్, మస్కిటో నెట్ ఉంటాయి. వీటితో పాటు మరో 6 రకాల ఉపకరణాలు కిట్ లో ఉన్నాయి.

image


అంతకుముందు పేట్ల బుర్జ్ ఆస్పత్రిలోని వార్డుల్లో సీఎం కేసీఆర్ కలియతిరిగారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రిలో వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆసుపత్రిలోని అల్ట్రాసౌండ్ సెంటర్, ఎమర్జెన్సీ వార్డు, జనరల్ వార్డు, స్టెబిలైజేషన్ సెంటర్లను పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు ఎంతో మెరుగవుతున్నాయని, అందుకే బెడ్ల సంఖ్యకు మించి పేషంట్లు వస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతోపాటు ఇతరత్రా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత మానవత్వంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కూడా పెంచామన్నారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరుగుతున్నది సీఎం వెల్లడించారు.

పేట్ల బుర్జ్ ఆసుపత్రిలో 462 పడకలుంటే ఉంటే, 700 మంది పేషంట్లు వచ్చారని, దీనివల్ల బెడ్ల కొరత ఏర్పడిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అయినా సరే, బెడ్లు లేవనే కారణంగా పేషంట్లను వెనక్కి పంపించడం లేదని స్పష్టం చేశారు. ఎక్కువ మందికి సేవలందిస్తున్నందుకు ప్రభుత్వ వైద్యులను అభినందించాలన్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున పేట్ల బుర్జ్ ఆసుపత్రిలో మరో బ్లాక్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

image


ఇదే ఆసుపత్రిలో గతంలో మహాలక్ష్మి అనే డాక్టర్ మంచి వైద్య సేవలు అందించారని, ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే వారని సీఎం గుర్తు చేశారు. పేట్ల బుర్జ్ ఆసుపత్రి మళ్లీ అదే స్థాయిలో సేవలందించడానికి వీలుగా మరో భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పేషెంట్ల బంధువులు ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానంగా ధర్మశాలలు ఉండేవని, మళ్లీ అలాంటి ధర్మశాలలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నర్సింగ్ స్టాఫ్ కు స్టయిఫండ్, మెస్ నిర్వహణ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇటు కేసీఆర్ కిట్ పథకం నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కేసీఆర్ కిట్ పథకంపై బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.