బుల్లెట్ మీద బార్బీక్యూ చికెన్.. బీభత్సంగా క్లిక్కయిన క్రేజీ ఐడియా

రాయల్ ఎన్ ఫీల్డ్ మీద ఫుడ్ బిజినెస్ దున్నేస్తున్న అన్నదమ్ములు

బుల్లెట్ మీద బార్బీక్యూ చికెన్.. బీభత్సంగా క్లిక్కయిన క్రేజీ ఐడియా

Sunday January 15, 2017,

3 min Read

రాయల్ ఎన్ఫీల్డ్. రాజసం ఉట్టిపడే లెజెండ్రీ బైక్. చూపుతిప్పుకోలేం. దాని సౌండు గంభీరంగా ఉంటంది. రోడ్డుమీద వెళ్తుంటే వైబ్రేషన్ అటెన్షన్ తెస్తుంది. అనకొండ శ్వాస విడిచినట్టుగా.. పొగగొట్టం నుంచి ఎగ్జాస్ట్ బలంగా తాకుతుంది. అలాంటి బండిమీద బార్బీక్యూ చికెన్ చేసి అమ్మితే ఎలా వుంటుంది? క్రేజీ ఐడియా కదా.. బెంగళూరులో ఇద్దరు అన్నాదమ్ములు అదే ప్రయోగం చేసి.. వీరలెవ్లలో సంపాదిస్తున్నారు. ఆ కథేంటో మీరే చదవండి.

షోలే సినిమా తెలుసుగా. ఏ దోస్తీ పాట, అందులో సయామీ కవలల్లాంటి సైడ్ కార్ బైక్ ఇప్పటికీ మరిచిపోలేని ఇంట్రస్టింగ్ ప్రాపర్టీ. అలాంటి కాన్సెప్టుతోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైకును.. కిచెన్ ఆన్ బైక్ రూపంలో మేకోవర్ చేశారు. గ్రిల్, గ్యాస్ సిలిండర్, వంటసామాను, దాంతోపాటు ఒక గొడుగు.. అన్నీ సైడ్ కారులో డిజైన్ చేశారు. ఇంకేముంది మొబైల్ బార్బీక్యూ గ్రిల్ రెడీ. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఐడియా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది.

image


అరుణ్, క్రిష్ణ వర్మ అనే ఇద్దరు సోదరులకు వచ్చిన ఐడియా ఇది. 500సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్, దాంతోపాటు 350 సీసీ క్లాసిస్ ఎన్ ఫీల్డ్ బైక్- రెండింటినీ జోడించి మొబైల్ ఫుడ్ కోర్ట్ తయారు చేశారు.

వీళ్లకు ఆల్రెడీ ఒక ఫుడ్ బిజినెస్ ఉంది. బెంగళూరులో మూడు ట్రక్కులున్నాయి. దాంతోపాటు నానో కారుని మాడిఫై చేసి, దాన్నొక ఐస్ క్రీం బండిలా తయారు చేశారు. ప్రస్తుతం ఆ నాలుగింటి బిజినెస్ మాంచి ఊపులో ఉంది.

ఈ బైక్ ఐడియా ఎలా వచ్చిందంటే- ఫుడ్ ట్రక్కులు, ఐస్ క్రీం కారుతో ఎక్కడికి పోయినా పార్కింగ్ సమస్య ఎదురయ్యేది. మూడు టెంపోలు, ఒక కారును రద్దీ ఏరియాలో నిలపడం, గంటలపాటు దాన్ని మెయింటెన్ చేయడం కష్టంగా ఉండేది.

వీళ్ల ఒక్కరికే కాదు.. బెంగళూరు వ్యాప్తంగా ఉన్న వందల ఫుడ్ ట్రక్కులదీ ఇదే సమస్య. ఇటు ట్రాఫిక్ జాం, అటు పార్కింగ్, మధ్యలో లైసెన్స్ గొడవ, వెరసి అధికారులతో తలనొప్పులు. ఇన్ని ఆటంకాల మధ్య కూడా బిజినెస్ బ్రహ్మాండంగా నడిచేది. కానీ నిత్యం రోడ్డుమీద టెన్షన్.

image


అందుకే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుంటుంది అనే తీవ్రంగా ఆలోచించారు. అలా మేథోమథనం చేయగా చేయగా.. పుట్టుకొచ్చిందీ బైక్ బార్బీక్యూ ఐడియా. షోలే సినిమాలో సైడ్ కారులో 90 కిలోల బరువున్న వ్యక్తి ఈజీగా ట్రావెల్ చేశాడు. అలాంటప్పుడు, అంతే బరువు, లేదంటే అంతకంటే తక్కువ బరువున్న కిచెన్ సామాగ్రితో ఫుడ్ బైక్ ఎందుకు తయారుచేయలేం అనుకున్నారు.

ఒక బైక్ మీద ఇద్దరు మనుషులు, ఇంకో ఫాబ్రికేటెడ్ డబ్బాలో ఒక గ్రిల్, ఎల్పీజీ గ్యాస్. కొన్ని వంటసామాన్లు. అంతే.. ప్లాన్ బీభత్సంగా వర్కవుట్ అయింది. బైక్ రోడ్డుమీద అడుగు పెట్టిందో లేదో మంత్రమేసినట్టుగానే క్లిక్కయింది.

బెంగళూరులో ఇప్పుడు అందరి చూపు బార్బీక్యూ బైక్ మీదనే. చాలామంది ఇన్వెస్ట్ చేస్తామని ముందుకొస్తున్నారు. అన్నట్టు సినిమావాళ్లు కూడా సెట్ ప్రాపర్టీలా వాడుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు. బైక్ కంపెనీ కూడా వీళ్ల మాడిఫికేషన్ చూసి ముచ్చట పడింది. వాళ్లు కోరినన్ని బండ్లను ఆలస్యం చేయకుండా అందిస్తామని ప్రామిస్ చేసింది. అవసరమైతే తామే సొంతంగా కొన్ని వెహికిల్స్ ఫాబ్రికేట్ చేసి ఇస్తామని కూడా తెలిపింది.

image


రోజూ సాయంత్రం వీళ్ల బండి కమ్మనహళ్లి కాఫీ బోర్డ్ లే అవుట్ దగ్గర ఆగుతుంది. ఆగీఆగగానే జనం పొలోమని మూగుతారు.. సైడ్ కార్ టాప్ ఓపెన్ చేసి గ్రిల్ వెలిగిస్తారు. దానికింద ఐదు కిలోల ఎల్పీజీ సిలిండర్ వుంటుంది. గ్రిల్ నాన్ స్టాప్ గా వెలుగుతునే వుంటంది. చికెన్ వేగుతునే ఉంటంది. కమ్మటి పొగలతో ఆ ప్రాంతమంతా ఒకరకమైన మత్తును ఆవహిస్తుంది. పదంటే పదినిమిషాల్లో ఐటెం రెడీ అవుతుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఫిదా అయిపోవాల్సిందే. ఒకవేళ వర్షం పడితే గార్డెన్ గొడుగు కూడా రెడీగా ఉంటుంది.

చికెన్ లెగ్ పీసులు, చికెన్ స్ట్రిప్స్, బర్గర్స్, రోల్స్, దాంతోపాటు వెజ్ ఐటెమ్స్ పైనాపిల్ వెజీస్ అన్నీ చిటికెలో తయారు చేస్తారు. పిల్లలు పెద్దలు అంతా బార్బీక్యూ బండికి అడిక్టయ్యారు. ఎంత లేదన్నా 200 మంది కస్టమర్లకు కావల్సినవి వండిస్తారు. వెజ్, నాన్ వెజ్ సెపరేట్ లేదు. అంతా ఒకే తవాలో చేసిస్తారు. కాకపోతే పచ్చిశాఖాహారులు కాస్త ఇబ్బంది పడతారు కానీ, ఇప్పటికిప్పుడు ఏం చేయలేమంటాడు అరుణ్.

image


వచ్చే ఆరు నెలల్లో 150 బైకులను అనుసంధానం చేసి, దేశంలోనే మొట్టమొదటి ఫుడ్ బైక్ చైన్ తో మార్కెట్ దున్నేయాలనే కసితో ఉన్నారు. త్వరలో ఇండియా అంతా ఫ్రాంచైజీలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. పఠాన్ కోట్, గూర్గావ్, విశాఖపట్టణం లాంటి సిటీలతో పాటు, దుబాయ్ లో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. 350సీసీ బుల్లెట్ కొనుగోలు, మాడిఫై కలిపి రూ. 3.5లక్షలు అవుతుందని అరుణ్ అంటున్నాడు. త్వరలో గోవాలో నాలుగు బైకులు ఏర్పాటు చేస్తున్నామని ఉత్సాహంతో చెప్తున్నారీ అన్నదమ్ములు.