గిరిజన మహిళల జీవితాల్లో వెలుగుల కోసం పెద్ద ఉద్యోగాన్నీ వదిలేసిన ఆరుషి

చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర చూసిన కుట్లు, అల్లికలు... పెద్దయ్యాక ఆమె జీవితాన్నే మార్చేసాయి. ఆమెకే కాక, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మరికొంత మంది మహిళలకు కూడా జీవనోపాధిగా మారాయి. ఆమె ఆరుషి అగర్వాల్.. ఆమె ఆశయం.. ది ఇనీషియేటివ్..

గిరిజన మహిళల జీవితాల్లో వెలుగుల కోసం పెద్ద ఉద్యోగాన్నీ వదిలేసిన ఆరుషి

Tuesday April 28, 2015,

3 min Read

ఇంటికి కావలసిన చాలా వస్తువులను ఆరుషి అమ్మమ్మ చాలా అందంగా తానే చేసేది. వేడి వేడి కాఫీ కప్పులకు అందంగా తొడిగిన కవర్లను ఆమె స్వయంగా అల్లేవారు. చలికాలం వేసుకునే స్వెటర్లు కూడా ఆమె చేతిలోనే తయారయ్యేవి. అందగా, పొందికగా, అవసరానికి తగ్గట్టు అమరిపోయే ఈ హస్తకళలను చూసి ముచ్చట పెంచుకుంది చిన్నారి ఆరుషి.

ఆరుషి అగర్వాల్, ది ఇనీషియేటివ్ వ్యవస్థాపకురాలు

ఆరుషి అగర్వాల్, ది ఇనీషియేటివ్ వ్యవస్థాపకురాలు


ఈ ముచ్చట అక్కడితో ఆగలేదు . ఆమె పెరిగి పెద్దయ్యాక కూడా ఇంజనీరింగ్, డాక్టర్ చదువుల వైపు పోలేదు. తను చదువుకున్న సైన్స్, తనకు ఆసక్తి వున్న కళలు, చరిత్ర, ఆంత్రోపాలజీ.. ఇలా అన్ని మిళితమైన సబ్జెక్టు చదువుకోవాలని అనుకుంది. డిజైనింగ్ కోర్స్ చేస్తున్న బంధువును అదే సమయంలో కలవడంతో, ఆమెకు దారి దొరకింది. ‘‘ అనేక విషయాల మేలు కలయికే డిజైనింగ్. మరింత మెరుగైన, అనువైన వస్తువులను ఎలా రూపొందించాలో నిరంతరం ఆలోచించడమే డిజైనింగ్..’’ అని తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటారామె. పూణేలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ నుంచి 2012లో ఆరుషి ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ మెనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసారు.

కాలేజీలో వుండగానే ఒక డానిష్ కంపెనీలో ఆరుషి ఇంటర్న్‌షిప్ చేసారు. అదే కంపెనీ పిజి పూర్తయ్యాక, ఆమెకి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అక్కడ చేరడానికి ఆమె కూడా సిద్ధమై, తన వర్కింగ్ విసా కోసం ఎదురు చూస్తున్న రోజుల్లోనే సతారాకి చెందిన ఒక సంస్థ ఆమెని సంప్రదించింది. ఈ సంస్థ గ్రామీణ, గిరిజన మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తోంది. అయితే సంస్థలో మహిళలు చేస్తున్న ఉత్పత్తులకు తగినంత గిరాకీ రాకపోవడంతో, ఈ ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా చేయడానికి సలహా సంప్రదింపుల కోసం సంస్థ ప్రతినిధులు ఆరుషిని కలిసారు. ‘‘ఆ మహిళలకు ఒక వర్క్ షాప్ నిర్వహించి, వస్తువులకు తుదిమెరుగులు దిద్దడం, డిజైన్ చేయడం, కంటికి ఇంపుగా రూపొందించడం వంటి విషయాల ప్రాముఖ్యాన్ని వివరించాను..’’ అని ఆ సంస్థలో తన అనుభవాల గురించి చెప్పారామె.

కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ప్రొడక్ట్ డిజైనింగ్ చేస్తూ...

కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ప్రొడక్ట్ డిజైనింగ్ చేస్తూ...


ఈ వర్కషాప్ అనుభవం తర్వాత ఆరుషికి ఒక విషయం అర్థమైంది. ఈ గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్‌లో మెషిన్లతో తయారయిన ఉత్పత్తులతో పోటీ పడాల్సి వస్తోంది. సహజంగానే మెషిన్‌తో తక్కువ సమయంలో భారీ సంఖ్యలో వస్తువులు తయారవుతాయి కనుక, వారు తక్కువ ధరలో అమ్మగలుగుతారు. ఈ పరిస్థితుల్లో వారితో ధరలో పోటీ పడడం కంటే, గిరిజనులు తమ హస్త కళల్లో ఏదైనా ఒక ప్రత్యేకతను చూపించాలి. మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. అప్పుడే వారి వస్తువులకు మరింత మంచి గిరాకీ, వారికి జీవనోపాధి దొరుకుతాయని ఆరుషి అర్థం చేసుకున్నారు. ఈ అవగాహనే చివరికి ది ఇనీషియేటివ్‌కు దారి తీసింది.

2013 మేలో ఆరుషి 'ది ఇనీషియేటివ్' ను నెలకొల్పారు. చేతి వృత్తుల మీద ఆమెకున్న ప్రేమ, వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులను అందించాలన్న నిబద్ధత, హస్త కళల ద్వారా మహిళలకు మెరుగైన జీవనోపాధిని అందించాలన్న పట్టుదల కలిసి ది ఇనీషియేటివ్‌గా రూపుదిద్దుకున్నాయి. వాళ్ళకు క్రమం తప్పకుండా పని కల్పించగలిగితే, వారికి ఓ క్రమమైన ఆదాయం కూడా వస్తుందని ఆమె నమ్మకం.

తుదిమెరుగులు ఎలా దిద్దాలో చెబ్తూ.. తమ ఉద్యోగులతో

తుదిమెరుగులు ఎలా దిద్దాలో చెబ్తూ.. తమ ఉద్యోగులతో


ది ఇనీషియేటివ్‌లో ఆరుషి చీఫ్ డిజైనర్ కాగా.. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా జత కలిసారు. ఒకరు లరికా మాలియర్, ఇంకొకరు ఆకాష్ దివాన్. సోషల్ మీడియా తదితర మార్గాల్లో మార్కెటింగ్ వ్యవహారాలను లరికా చూస్తారు. ఇక ఆకాష్ కూడా డిజైనర్ కావడంతో, ప్రోడక్ట్ డిజైన్, రీసెర్చి వ్యవహారాలను చూస్తారు.

ది ఇనీషియేటివ్ ముఖ్యంగా మూడు రకాల ఉత్పత్తులు తయారు చేస్తుంది. గోధాడి( అల్లిన బొంతలు), ప్యాచ్ వర్క్, చేతితో అల్లిన కవర్లు తయారు చేస్తారు. ఈ మూడింటిలో ప్రతి దానిలోనూ రెండు మూడు స్టాండర్డ్ ప్రోడక్ట్స్ వుంటాయి. వాటిని కస్టమర్లకి కావలసిన డిజైన్లలో అందిస్తారు. ది ఇనీషియేటివ్‌కు వున్న మేజర్ క్లయింట్లలో నెదర్లాండ్స్‌లోని ఈ-కామర్స్ పోర్టల్, www.thefairladies.com ఒకటి. వారికోసం యోగా బ్యాగ్‌లను తయారు చేసి పంపిస్తారు. ఇండియాలో ది ఇనీషియేటివ్ ఉత్పత్తులు ముంబైలోని ది కాంటెంపరరీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షోరూమ్ లో దొరుకుతాయి.

ది ఇనీషియేటివ్ కార్యకలాపాల్లో మహిళలే కీలకం. వారి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వారి పనితీరును సరళతరం చేయడానికీ ఆరుషి చాలా కష్టపడ్డారు. ఎంతో సమయం వెచ్చించారు. అప్పటికీ ఈ మహిళలు పండగలనీ, పబ్బాలనీ పని ఎగ్గొట్టేయడం వల్ల అనుకున్న సమయానికి క్లయింట్లకు డెలీవరీ చేయడం చాలా కష్టమయ్యేది. మళ్ళీ వీరందరితో మాట్లాడి , వాళ్లు చేస్తున్న పని ఎంత ముఖ్యమో వారికి అర్ధమయ్యేలా చెప్పడం మరో పెద్ద పని. నిజానికి బాగా పని వచ్చిన మహిళలను నియమించుకోవడమే ది ఇనీషియేటివ్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.

ఎలాగైతేనేం.. సంస్థ ప్రారంభించి ఏడాదిన్నర గడిచింది. ఇప్పటికి ముంబైలోని మూడు ప్రాంతాల నుంచి 18మంది మహిళలు ఈ సంస్థకోసం పని చేస్తున్నారు. వాళ్లు ఎంత టైమ్ కేటాయించగలిగితే, అంత పనిని వారికి అప్పగిస్తారు.

చేత్తో తయారు చేసిన నాణ్యమైన, అందమైన, ఉపయోగకరమైన వస్తువులను అందించాలనేదే ఆరుషి ఆశయం. అదే సమయంలో వాటిని తయారు చేసే మహిళల జీవితాలు కూడా మెరుగుపడాలని కోరుకుంటారామె. ది ఇనీషియేటివ్ సంస్థ అందించే ఉత్పత్తుల సంఖ్య ఇంకా పెంచాలని ఆమె ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఏది తయారు చేసినా, అది..సంప్రదాయకళ, ఆధునిక డిజైన్ల మేళవింపుగా వుండాలని ఆమె భావిస్తారు.

తమ సంస్థలో పనిచేసే మహిళలతో ఆరుషి

తమ సంస్థలో పనిచేసే మహిళలతో ఆరుషి


ఉత్పత్తుల సంఖ్య పెంచడం కంటే ముందు తనదగ్గర పనిచేసే మహిళల సంఖ్య పెంచేందుకు ఆరుషి ప్రయత్నిస్తున్నారు. జూన్,2015 కల్లా కనీసం 40 మంది మహిళలకు పని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే చేయితిరిగిన పనివారి కోసం అన్వేషిస్తున్నారు.

సమాజంలో మార్పు తీసుకురావలనే ఆశయం, అద్భుతమైన డిజైన్లు రూపొందించాలనే ఆసక్తి కలగలిసిన ది ఇనీషియేటివ్ మునుముందు మరిన్ని విజయశిఖరాలు చేరుకోవాలి.