నీళ్ల గురించి తెలియాలంటే.. ముందు ఆ ముగ్గురి గురించి తెలియాలి..

నీటికి నిలకడ నేర్పుతున్న "వాటర్ వారియర్స్"

నీళ్ల గురించి తెలియాలంటే.. ముందు ఆ ముగ్గురి గురించి తెలియాలి..

Thursday April 21, 2016,

5 min Read


"లాతూర్ కి రైలు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా..!"

ఈ ఒక్క అంశం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గత రెండు మూడేళ్లుగా వర్షాలు అంతంతమాత్రమే. పైగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చండ ప్రచండం. దేశంలో ప్రతీ చోటా నీటి కొరత. అందుకే నిన్నా మొన్నటిదాకా ప్రతి వేసవిలో ఉండే కష్టమే కదా.. అనుకున్నారు. కానీ లాతూర్ కి రైల్లో నీరు తరలించాల్సిన పరిస్థితిని తెలుసుకున్నాక.. అందరికీ ఈ ఏడాది వచ్చిన నీటి కొరత... గతంలో ఎప్పుడూ రాలేదని అర్థమయింది. రుతుపవనాలు రావడానికి ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికే బిందె నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడవాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేంద్ర జలవనరుల సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో ఉన్న 91 మేజర్ రిజర్వాయర్లలో మెజారిటీ జలాశయాలు వట్టిపోయాయి. అన్నింటి సామర్థ్యం 250 బిలియన్ క్యూబిక్ మీటర్లయితే.. ఇప్పుడు ఉన్న నీటి నిల్వ మాత్రం 157.8బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అందుబాటులో ఉన్న నీరు 71శాతం మాత్రమే. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. అందుబాటులో నీరు ఎక్కువగా ఈశాన్య, మధ్య భారత్ లో ఉంది. ఈశాన్య భారతంలో 44శాతం, మధ్య భారతంలో 36 శాతం నీరు ఉంది. సౌత్, వెస్ట్, నార్త్ ఇండియా ప్రాంతాల్లో అవసరాలకు తగ్గనీటిలో ఇరవై నుంచి ఇరవై ఏడు శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొరత వల్ల గృహా, వ్యవసాయ, పరిశ్రమల అవసరాల కోసం నీటి విషయంలో తరచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి.

లాతూర్ లో ప్రజలు మూడు వారాలకు ఒక్కసారి మాత్రమే నీటిని పొందుతున్నారు. ఒక్కో మనిషి ఎనిమిది గంటలు వెయిట్ చేస్తేగానీ తమ కోటా పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితితో ఘర్షణలు పెరిగిపోవడంతో లాతూర్ మొత్తం 144 సెక్షన్ విధించారు. దీని ప్రకారం మే 31వ తారీఖు వరకు వాటర్ స్టోరేజ్ ట్యాంకుల వద్ద ఐదుగురు కన్నా ఎక్కువ గుమికూడితే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు.

ఈ వాటర్ ఎమర్జెన్సీని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఎప్పుడో ఊహించి దాన్నుంచి తప్పించడానికి జీవితాన్ని ధారపోస్తున్నవాళ్లు ఉన్నారు. నీటి విలువను గుర్తించి.. దాన్నో అపురూపమైన వస్తువుగా కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్న ముగ్గురు వాటర్ వారియర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

<br>



వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా .. రాజేందర్ సింగ్

వేయి గ్రామాలకు నీరందించి 5 నదులకు జీవం పోయడం అంటే మానవమాత్రులు చేయగలిగేపనేనా..? మనిషి రూపంలో మహనీయులు మాత్రమే చేయగలరు. ఆ మహనీయుడే రాజేందర్ సింగ్. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్ లో వాటర్ కన్జర్వేషన్ విషయంలో ప్రజల్లో మార్పు తీసుకువచ్చి... ప్రభుత్వాలతో పని లేకుండా వెయ్యి గ్రామాలను సస్యశ్యామలం చేశారు. వట్టిపోయిన ఐదు నదులకు జీవం పోశారు. నీళ్లకు నిలకడ నేర్పిన రాజేందర్ సింగ్ కు గత ఏడాది స్టాక్ హోం వాటర్ ప్రైజ్ లభించింది. 2000వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ రివర్ ప్రైజ్...అదే సంవత్సరం ప్రతిష్ఠాత్మక మెగసెసె అవార్డు కూడా అందుకున్నారు.

ఆయుర్వేద వైద్యం, సర్జరీ చదవిన రాజేందర్ సింగ్ మొదట గ్రామీణుల వైద్యసేవల కోసం ఆస్పత్రులు పెట్టాలనుకున్నారు. కానీ ఆ పని మీద గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలందరికీ ఆరోగ్యం కంటే ముందు నీరు అవసరం ఉందని గుర్తించారు. నీటి కోసం అక్కడి ప్రజలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లడం... తమ జీవితంలో ఎక్కువ భాగం నీటి అన్వేషణలోనే గడిపేయడం గుర్తించి.. తన లక్ష్యాలను మార్చుకున్నారు. నీటి గురించి గ్రామీణులందర్నీ చైతన్యపరిచే లక్ష్యంతో ముందుకు వెళ్లాడు. కష్టమైన అందర్నీ ఒక చోటకు చేర్చి వాటర్ కష్టాల నుంచి బయటపడే మార్గాలను వివరించాడు. తనతో పాటు వచ్చినవారితోనే ముందుకు కదిలాడు.

మొదట గ్రామాల్లో అక్కడక్కడా వర్షపునీటిని ఒడిసిపట్టే చిన్నపాటి చెక్‌డ్యాంలు, స్టోరేజ్ ట్యాంక్‌లను నిర్మాణం చేశాడు. దీంతో వర్షాలు పడిన తర్వాత భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు ఎండిపోయిన బావులు కూడా రాజేంద్ర సింగ్ పుణ్యమాని నిండిపోయాయి. ఇప్పుడు కేవలం 15 అడుగుల లోతులోనే ఆయా గ్రామాలకు నీళ్లు లభిస్తున్నాయి. ఇలా దాదాపు వేయి గ్రామాలకు ఆయన నీరందించగలిగారు. ఆ తర్వాత ఓ పార్క్ నిర్వహణ బాధ్యతను అటవీ అధికారుల నుంచి తీసుకున్నాడు. దానికి అసరమైన నీటి వనరుల కోసం సమీపంలో ఉన్న నదులన్నింటి వద్ద వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చెక్‌డ్యాంలు, స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టాడు. దీంతో 4 ఏళ్ల కాలంలోనే నదులన్నీ తిరిగి ప్రవహించడం మొదలు పెట్టాయి. ఇలా ఆయన 5 నదులకు తిరిగి జీవం పోశారు.

" సైన్స్, టెక్నాలజీనే నేటి నీటి అవసరాలను తీర్చలేవు. నాయకత్వం, విధానాలు, సామాజిక బాధ్యతతో అందరూ ప్రయత్నిస్తేనే ఫలితం ఉంటుంది" -రాజేందర్ సింగ్ 

ప్రస్తుతం రాజేందర్ సింగ్ తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్చంద సంస్థ ద్వారా రాజస్థాన్ లో సహజవనరుల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నారు. భూమిని రక్షించే సామర్ధ్యం ఉన్న యాభై మంది వ్యక్తుల్లో రాజేందర్ సింగ్ ఒకరని- ద గార్డియన్ పత్రిక కీర్తించింది.

రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా<br>

రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా


ఇంకుడుగుంతల ఆద్యుడు అయ్యప్ప మసాగి ...

కర్నాటకలో లక్షల మంది రైతులను కరువు కోరల నుండి కాపాడిన వాటర్ వారియర్ అయ్యప్ప మసాగి. నార్త్ కర్నాటకలోని ఓ మరుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అయ్యప్ప మసాగి.. కష్టపడి చదివి మెకానికల్ ఇంజినీర్ అయ్యారు.    ఎల్ అండ్ టీలో దాదాపు ఇరవై మూడేళ్ల సర్వీస్ చేశారు. ఎప్పటికైనా సైన్స్ ను గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించాలనేది ఆయన కల. అందుకే ఉద్యోగ బాధ్యతల నుంచి విరామం తీసుకున్న తర్వాత వచ్చిన సొమ్ముతో స్వగ్రామానికి వచ్చి ఆరెకరాల పొలం కొనుక్కుని వ్యవసాయం ప్రారంభించారు. కరువుకు నిలయమైన ఆ ప్రాంతంలో అతి తక్కువ నీటి వినియోగంతో వ్యవసాయం చేయడం ఎలాగో మిగిలిన రైతులకు చూపించాలనే లక్ష్యంతో సాగు ప్రారంభించారు. అయితే భారత వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో ఒక్కోసారి విరుచుకుపడే కరువు.. ఒక్కోసారి వచ్చే వరదలతో చాలా కష్టాలు పడ్డాడు. ఈ అనుభవాలతో వాటర్ హర్వెస్టింగ్ తోనే అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిర్ణయానికి వచ్చి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.

సాగులో ఫెయిలైన అయ్యప్ప చేసిన పరిశోధన లక్షకు పైగా రైతుల కుటుంబాలకు వెలుగునిచ్చింది. చిన్న చిన్న టెక్నిక్స్ తో కరువు పరిస్థితుల్లో ఎలా సాగు చేయాలో ఇంకుడు గుంతల ద్వారా అయ్యప్ప రైతులకు తెలియజేశారు. ఒక్క ఎకరంలో ఎనిమిది చోట్ల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి... వాటిలోకి నీరు వెళ్లేలా రైతులందరికీ అవగాహన కల్పించారు. ఈ ఎనిమిది ఇంకుడు గుంతులు శాశ్వతంగా రెయిన్ హార్వెస్టింగ్ యూనిట్లుగా ఉండిపోతాయి. వర్షం పడినప్పుడు ఇవి భూగర్భజలాలు పెరిగేందుకు ఉపయోగపడుతాయి. వీటి వల్ల ఎక్కడ పడిన వర్షం అక్కడే నిల్వ ఉండినట్లవుతుంది. లక్షల మంది రైతులు అయ్యప్ప చూపించిన బాటలో నడిచి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ విధానం సూపర్ సక్సెస్ కావడంతో అయ్యప్ప మసాగి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం అయ్యప్ప దేశవ్యాప్తంగా కొన్ని వేల వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంటున్నారు. ఆరు వందలకుపైగా చెరువులను సృష్టించారు. మసాగి ప్రయత్నాల వల్ల 70బిలియన్ల లీటర్ల వర్షపు నీరు పునర్వినియోగంలోకి వచ్చిందని అంచనా. అయ్యప్ప బెంగళూరు కేంద్రం వాటర్ లిటరసి ఫౌండేషన్ ను నడుపుతున్నారు. 2020 కల్లా ఇండియాను వాటర్ ఎఫిషియంట్ కంట్రీగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ లక్ష్యం.

 అయ్యప్ప మసాగి,  వాటర్ లిటరసి ఫౌండేషన్<br>

అయ్యప్ప మసాగి, వాటర్ లిటరసి ఫౌండేషన్


చుక్క..చుక్క ఒడిసిపట్టే అబిద్ సుర్తి

ఎనభై ఏళ్ల అబిద్ సుర్తి... ముంబైలోని చాలా ఇళ్లకు సుపరిచితుడు. అందుకని ఇతనేమీ వాటర్ ట్యాంకర్ సప్లయర్ కాదు. మున్సిపాలిటీ వాటర్ ఎంప్లాయీ అసలే కాదు. కానీ ఏ ఇంట్లో అయినా ఒక్క చుక్క వాటర్ లీకవుతున్నట్లు అనుమానం వచ్చినా అక్కడ వాలిపోతాడు. సొంత ఖర్చుతో ప్లంబింగ్ పని చేయించి.. వాటర్ లీక్ కావడం లేదని నిర్ణయించుకున్న తర్వాతే అక్కడ్నుంచి కదులుతాడు. అబిద్ ముంబై లో డ్రాప్ డెడ్ ఫౌండేషన్ ను నడుపుతున్నారు. ఇదేమీ పెద్ద సంస్థ కాదు.. ఇందులో అబిద్ ఒక్కడే సభ్యుడు. పైగా అబిద్ వయసు ఎనభై ఏళ్లు. రోజంతా ఓ ప్లంబర్ ను తన వెంట తీసుకుని.. ఎక్కడెక్కడ నీళ్లు లీకవుతున్నాయో తెలుసుకోవడం ... దాన్ని ఆపేందుకు ప్లంబింగ్ వర్క్ చేయించడం.. ఇదే అబిద్ పని. ఇదంతా ఉచితంగానే చేస్తూంటాడు. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి తీసుకోడు.

ముంబై పేవ్ మెంట్స్ మీద పుట్టిపెరిగిన అబిద్ కి నీటి విలువేంటో తెలుసు. ఒక్క బిందె నీటి కోసం ట్యాంకర్ల దగ్గర జరిగే ఘర్షణలు చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాడు. అయితే ఇలాంటి సేవ చేయడానికి అతనికి ఎప్పుడూ ఆలోచన లేదు. కానీ నీటి కష్టాలపై ఓ పత్రికలో వచ్చిన వార్త చదివిన తర్వాత అబిద్ మనసు పూర్తిగా మారిపోయింది. 2007లో తన రచనకు గాను.. హిందీ సాహిత్య సంస్థ ఇచ్చిన అవార్డుకు వచ్చిన లక్ష రూపాయల నగదుతో - వాటర్ కన్జర్వేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాడు. పన్నెండు నెలల కాలంలో 1,666 ఇళ్లలో లీకవుతున్న ట్యాపుల్ని గుర్తించి సీల్ వేశాడు. ఫలితంగా 414,000 లీటర్ల నీటిని వృధా కాకుండా కాపాడగలిగారు. 

 అబిద్ సుర్తి, డ్రాప్ డెడ్ ఫౌండేషన్ 

 అబిద్ సుర్తి, డ్రాప్ డెడ్ ఫౌండేషన్ 


ఈ వాటర్ వారియర్స్ చేసే పనులు కరువు సమయంలోనే అందరూ గుర్తు చేసుకుంటారు. కానీ తర్వాత అంతా మర్చిపోతూంటారు. కానీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుని అంతో ఇంతో ఆచరిస్తూ ఉంటే దేశంలో మరిన్ని లాతూర్ లు బయటపడకుండా ఉంటాయి. బాధ్యత మనది కాదు.. వాటర్ వారియర్స్ వేరే ఉంటారు అనుకుంటే జలగండాన్ని అనుభవించేందుకు సిద్దంగా ఉండాల్సిందే.