పేరెంట్స్-టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ లో కొత్త ట్రెండ్

నలుగురు ముంబై ఐఐటియన్ల ఎడ్యు బేస్డ్ స్టార్టప్ నిట్ యాప్ తో రోజూ 10వేల మెసేజ్ లు సర్క్యులేట్


పేరెంట్స్-టీచర్స్ మధ్య కమ్యూనికేషన్ లో కొత్త ట్రెండ్

Saturday July 25, 2015,

3 min Read

సాధార‌ణంగా స్కూల్ డైరీ అంటే ఎలా వుంటుంది? క్లాసులో చేసిన ప్రతీ పనినీ అందులో నోట్ చేయ‌డం.. దాన్ని పేరెంట్స్ కి చూపించ‌డం.. వాళ్ల‌చేత‌ సంతకాలు పెట్టించుకోవడం. అప్పుడప్పుడూ దొంగసంతకాలు చేసి తీసుకెళ్లి దొరికిపోవ‌డం. ఆ రోజులు అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కానీ న‌యా జ‌మానా ఆ డైరీ తాలూకు విష‌యాలు మ‌రిచిపొమ్మంటోంది.

కాలం మారింది..స్కూల్ డైరీ కూడా..

కాలం మారింది..స్కూల్ డైరీని కూడా మార్చేద్దాం. ఇంకా అదే పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి ఎందుకు అంటున్నారు న‌లుగురు ఐఐటీ స్టూడెంట్స్. జైదీప్ పూనియా( సివిల్) ధనేష్ కుమార్(CSE) శీతల్ గోద్రా(CSE), వికాస్ చాహర్ (ఏరో స్పేస్). ముంబై ఐఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ నలుగురి చ‌దవూ నేప‌థ్య‌మూ వేర్వేరు. కానీ కామ‌న్ ఇంట్ర‌స్ట్ మాత్రం ఒక‌టే. అదే ఐడియా ఓ మొబైల్ యాప్ తయారు చేసేలా చేసింది.


ట్రంప్ ల్యాబ్‌. దీని గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే- ఈ యాప్ పిల్ల‌లకూ పేరెంట్స్ కూ టీచ‌ర్ల‌కూ మ‌ధ్య ఒక సైబ‌ర్ వార‌ధిలా ప‌ని చేస్తుంది. యాప్‌ లాంచ్ చేసి కొద్ది రోజులే అవుతోంది. కానీ రెస్పాన్స్ మాత్రం బీభ‌త్సంగా ఉంది. కొంతమంది బిజినెస్‌మేన్లు సీడ్ ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చారు. నిట్ యాప్ మార్కెట్ లోకి వచ్చి కొన్ని నెలలే అయినా పాపులారిటీ మాత్రం కొన్ని ఏళ్లు కష్టపడితే కానీ రానంతగా వచ్చేసింది. రోహిత్ జైన్ లీడ్ చేసే మెక్సస్ ఎడ్యుకేషన్ , అమిత్ రాంబియా లీడ్ చేసే వర్ధమాన్ టెక్నాలజీ క‌లిసి నిట్ యాప్ కి అవసరమైన నిధులు సమకూర్చాయి.

ట్రంప్ ల్యాబ్ టీమ్

ట్రంప్ ల్యాబ్ టీమ్


అలా వచ్చింది ఐడియా

అస‌లీ ఐడియా మొద‌ట వ‌చ్చింది జైదీప్‌కి. అప్పుడ‌త‌ను ఐఐటీ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్నాడు. ఆ రోజుల్లో క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఫీల్డ్ ఓ రేంజిలో ఉంది. ఆ ఫీల్డులో జైదీప్‌కి తెలిసిన ఫ్రెండ్స్ కొంద‌రున్నారు. హెల్ప్ కోసం ర‌మ్మంటే జై వెళ్లి వాళ్ల‌తో జాయిన్ అయ్యాడు. త‌ర్వాతి ప్రాజెక్టు హైద‌రాబాద్‌లో. ప్రాజెక్టు బాధ్యతలన్నీ జైదీపే చూసేవాడు. అప్పుడే జైదీప్ మ‌న‌సులో స్టార్ట్ అప్ ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌ కలిగింది.

ఎవరేం వాడితే అదే

బేసిగ్గా స్కూల్ యాజ‌మాన్యాలు పేరెంట్స్ కి స‌మాచారం పంపే విష‌యంలో చాలా త‌క్కువ టెక్నాల‌జీని వాడ‌తాయి. అది చూసే నిట్ యాప్ త‌యారు చేశానంటాడు జైదీప్‌. పైగా పాఠ‌శాల యాజ‌మాన్యాలు వాడే సాఫ్ట్ వేర్ కూడా గొర్రెదాటు ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ప‌దిమంది ఏది వాడుతున్నారో చూసి అదే తాము వాడుతుంటాయి. ఇలాంటి వాటికి స్వ‌స్తి ప‌ల‌కాల‌నే ఉద్దేశంతో ఈ యాప్ లాంఛ్ చేశాడు. మొదట్లో స్కూల్ నుంచి పేరెంట్స్ కు వీలైనంత ఎక్కువ సమాచారం అందేలా ప్రొడక్ట్ తయారు చేయాలనుకున్నాడు. కానీ ఏమైందంటే రాను రాను ఆది మొబైల్ ఈఆర్పీ సొల్యూషన్ లా తయారయింది. ఇలా అయితే లాభం లేద‌ని డిజైన్ మార్చాడు. జస్ట్ పేరెంట్-టీచర్ కమ్యూనికేషన్ వరకూ యాప్ పరిమితం చేశాడు.

జైదీప్ పూనియా

జైదీప్ పూనియా


సమస్య అర్ధం చేసుకోవాలి

ముంబైలో ప్రతీ స్కూలూ తల్లిదండ్రులకు ఎస్ఎమ్మెస్ రూపంలోనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అయితే ఇదంత ఎఫెక్టివ్ కాదని రుజువైంది. ఇక‌ మరో పద్దతి వాట్సప్. ఇందులో పేరెంట్స్ కి మెసేజ్ పంపండం వ‌ర‌కు బాగానే ఉంది. కానీ తిరిగి పేరెంట్స్ నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం టీచర్లకు తలకి మించిన భారంగా తయారయ్యేది. ఈ పరిమితులన్నింటినీ ట్రంప్ ల్యాబ్ టీమ్ అధిగమించేలా నిట్ యాప్ ను తయారు చేసింది. వన్ వే ట్రాఫిక్ లా ఒకవైపు నుంచే ఇన్ఫర్మేషన్ పాసయ్యేలా యాప్ డిజైన్ చేశారు.

టార్గెట్ ఫిక్స్ డ్ అండ్ క్లియర్

మనదేశంలో ఎడ్యుకేషన్ పై ప్రతి ఏటా 110 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఆన్ లైన్ విషయానికి వస్తే వాటిలో కేవలం అందులో 20 బిలియన్ డాలర్ల బిజినెస్ మాత్రమే జరుగుతోంది. అందుకే ట్రంప్ ల్యాబ్ 20వేల స్కూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. 20మిలియన్ పేరెంట్స్ అంటే 2కోట్ల మంది తల్లిదండ్రులన్నమాట. అల్రెడీ ట్రంప్ ల్యాబ్ పైలెట్ ప్రాజెక్టును పిజి గెరోడియా స్కూల్ లో ప్రారంభించింది. ప్రతి రోజూ 10వేల మెసేజ్ లు నిట్ యాప్ ద్వారా సర్క్యులేట్ అవుతున్నాయి. వచ్చే రెండేళ్లలో 50 లక్షలమంది యూజర్లు యాప్ ని వాడతారని కంపెనీ అంచనా వేస్తోంది. ఇదెలా సాధిస్తారనే ప్లాన్ బయటకు చెప్పకపోయినా వారికో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండే ఉంటుంది.