ఆఫీసు ప్రాంగణంలోనే పొలం పనులు.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కత్తిలాంటి ఐడియా

ఆఫీసు ప్రాంగణంలోనే పొలం పనులు.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కత్తిలాంటి ఐడియా

Wednesday March 01, 2017,

2 min Read

సాఫ్ట్ వేర్ కంపెనీ అంటే ఎంతసేపూ కంప్యూటర్లు, కాన్ఫరెన్సులు, కెఫెటేరియాలు మాత్రమేనా? పగలూ రాత్రి షిఫ్టుల్లో మెషీన్ లా పనిచేయడమేనా? ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం ఆఫీసు టైంలోనే ఏమీ చేయలేమా? ఖాళీ సమయాల్లో క్యాంటీన్లో చెత్త డిస్కషన్లకంటే, ఆరోగ్యానికి ఉపయోగపడేలా రైతు అవతరామెత్తలేమా? పిజాలు బర్గర్లు తిని ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే స్వయంగా పండించిన ఆర్గానిక్ ఫుడ్ ఎంజాయ్ చేయలేమా? ఇదే యాంగిల్లో ఆలోచించారు బెంగళూరుకు చెందిన మాన్యతా టెక్ పార్క్ ఉద్యోగులు. ప్రాజెక్టు వర్క్ చేస్తూనే, క్యాంపస్‌ని కాస్తా పొలంగా మార్చేశారు.

image


ఈ ఐడియా మొదట కంపెనీ లాండ్ స్కేప్ డిపార్టుమెంట్ నుంచి వచ్చింది. అదలా వచ్చిందే ఆలస్యం పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. టెకీలంతా రెట్టించిన ఉత్సాహంతో ఖాళీ సమయాల్లో పొలం పనులు చేయడం మొదలు పెట్టారు. మట్టిలో దిగడం నామూషీగా ఫీలవడం లేదు. బట్టలు పాడవుతాయని వెనుకడుగు వేయడం లేదు. పైగా గర్వంగా ఫీలవుతున్నారు. నీళ్ల కొరతను దృష్టిలో పెట్టుకుని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిన సాగు చేస్తున్నారు. ఎండిపోయిన ఆకులు, పనికిరాని గడ్డితో ఎరువులు తయారు చేస్తున్నారు.

110 ఎకరాల సువిశాలమైన టెక్ క్యాంపస్‌ లో 15 ఎకరాలు మొదట గార్డెనింగ్ కోసం కేటాయించారు. దాన్నిప్పుడు వ్యవసాయం కోసం మడులుగా తయారు చేశారు. 144 ప్లాట్స్ గా విభజించి మొక్కజొన్నలు, సజ్జలు, ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు.

కావల్సిన విత్తనాలు, ఎరువులు అన్నీ యాజమాన్యం చూసుకుంటుంది. గార్డెనింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో ఉద్యోగులు పంటల బాధ్యత చూసుకుంటారు. అవసరమైతే వాళ్ల సాయం తీసుకుంటారు.

వాస్తవానికి చాలామంది గార్డెనింగ్ అంటే ఇష్టపడతారు. కానీ పట్టణీకరణ పెరిగిపోయి, స్థలాభావం మూలంగా అది కలగానే మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆఫీసులోనే గార్డెనింగ్ చేయడమనేది గ్రేట్ ఫీలింగ్ అంటున్నారు ఉద్యోగులు. ఇలాంటి వినూత్న ప్రయత్నం మంచి సక్సెస్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు. కూరగాయలే కాకుండా మామిడి, అరటి, దానిమ్మ లాంటి చెట్ల పెంపకం కూడా చేపడితే ఇంకా బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

నేను పెంచుకున్న మొక్కజొన్న కర్ర ఏపుగా పెరిగింది. బచ్చలితీగ పచ్చగా ఇగురు వేసింది అంటూ ఎక్సయిటింగ్‌గా చెప్తోంది జయశ్రీ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. గతంలో ఎక్కడా ఎవరూ చేయని ఈ ప్రయత్నాన్ని మేం చేస్తున్నందుకు గర్వపడుతున్నాం అంటున్నారామె. క్యాంటీన్ లో పనికిమాలిన కబుర్లు చెప్పుకునేదానికంటే ఇలా గార్డెనింగ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని మరో టెకీ అంటున్నాడు.

అన్నట్టు ఆఫీస్ క్యాంపస్ లో పండించిన వాటిని ఎంచక్కా ఇంటికి కూడా తీసుకుని పోవచ్చు. ఈ ఐడియా ఏదో బావుంది కదా..