తెలంగాణలో రూ.600 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ !

0


స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఇప్పటికే టి-హబ్ ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లను ఆర్థికంగా కూడా చేయూనిచ్చేందుకు ఇన్నోవేషన్‌ ఫండ్‌ను సిద్ధం చేసింది. రూ.125 కోట్లతో మొదలుపెట్టబోతున్న ఫండ్‌ ఆఫ్ ఫండ్స్ కోసం ఎన్నోసంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఇప్పుడు రూ.125 కోట్లతో మొదలవుతున్న ఫండ్‌ను త్వరలో రూ.600 కోట్లకు పెంచేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ ఫండ్‌లో పది శాతం వాటాను తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుంది. మిగిలిన వాటాను ఆంట్రప్రెన్యూర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఫండ్ హౌజ్‌లు తీసుకుంటాయని జయేష్ చెబ్తున్నారు.

ఇప్పటికే ఎన్నో బడా కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరిన నేపధ్యంలో వాళ్లను స్టార్టప్స్‌తో కలిసి పనిచేయించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. పరిశ్రమ - విద్యార్థి లోకం - పారిశ్రామికవేత్తలు - రీసెర్చ్ సంస్థలన్నింటినీ ఒక్క చోటకు తెచ్చే విధంగా 'రిచ్' (RICH - Research and innovative circle of Hyderabad) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం కావడం వల్ల అందరికీ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం చెబ్తోంది.

హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఏర్పాటైన డిజిటల్ సమ్మిట్‌లో భాగంగా జయేష్ రంజన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మార్చ్11, 12వ తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌లో ఎకానమీ షేరింగ్, ఇన్నోవేషన్‌, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌, బిగ్‌ డేటా ఎనలిటిక్స్‌, మొబైల్‌ కామర్స్‌, వంటి అంశాలపై రెండు రోజుల పాటు విస్తృత చర్చ జరగనుంది. వివిధ నగరాల నుంచి కార్పొరేట్ ప్రముఖులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లు, మెంటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఫ్లాట్ ఫర్నింగ్, కాంటెక్స్ట్, ఎంషిప్పర్, రెకాన్ గ్రీన్, బ్రిస్కీ, క్సెడ్, మైండ్లర్ వంటి స్టార్టప్ సంస్థలు ఈ రోజు తమ బిజినెస్ మోడల్‌ను షో కేస్ చేయబోతున్నాయి.

Related Stories

Stories by Chanukya