స్టార్టప్ ఓటమి నేర్పిన పాఠాలు

స్టార్టప్ ఓటమి నేర్పిన పాఠాలు

Saturday March 12, 2016,

3 min Read


అప్పుడు నాకు ఈ వ్యవస్థ గురించి పెద్దగా తెలియదు. కానీ ఎంతైనా ఉడుకు రక్తం కదా.. అర్జెంటుగా ఏదో చేయాలన్న తపన. నేనేం చేసినా తిరుగుండొద్దు.. కత్తిలా దూసుకుపోవాలి.. శాసించాలి.. మొత్తం స్టార్టప్ వ్యవస్థకే భగవద్గీతగా ఉండాలి.. అని ఓ రేంజిలో కలలుగన్నాను. అంతే.. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. 2014లో ముంబైకి చెందిన చాకులాంటి కుర్రాళ్లను, ఓ ఆంట్రప్రెన్యూర్ ని కలిశాను. అందరం కలిసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా స్టార్టప్ సర్వీసెస్ కంపెనీపై రీసెర్చి చేశాం. కొన్నాళ్ల తర్వాత రంగంలోకి దూకేశాం. 

ముంబైలో ఆఫీసు అద్దెకు తీసుకున్నాం. రిక్రూట్ స్టార్టయింది. కొందరు కుర్రాళ్లను నియమించుకున్నాం. మొదటి మూడు నెలల్లో 15 మంది టీమ్ ఫామయింది. చూస్తుంటే అన్నీ శుభ శకునాలే అనిపించాయి. అంతా మంచే జరుగుతుందని మనసులో గట్టి ఫీలింగ్ ఏర్పడింది. ఇక ఢోకా లేదనుకున్నాం. టార్గెట్ ఎంతో దూరంలో లేదనిపించింది. ఇంతలో ఆంట్రప్రెన్యూర్ షిప్- తాజా పరిణామాలు- ఒక అవగాహన టైపులో కొన్ని ఈవెంట్లు నిర్వహించాం. దాని ద్వారా ముంబైలో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కాకపోతే చిన్న గుణపాఠం. డబ్బులు అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు అలాంటి ఈవెంట్లు పెట్టుకోవద్దనరి తెలిసొచ్చింది. పైగా టైం వేస్ట్ వ్యవహారం అనిపించింది. అలా మొదలయ్యాయి వైఫల్యాలు. వాటి ద్వారా నేనేం నేర్చుకున్నానో వివరిస్తాను.

మొదటి పాఠం: ఒకే సమయంలో ఒక ఆలోచన

ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండు పడవలపై కాళ్లు పెట్టి సముద్రంలో ప్రయాణించుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. మా విషయంలో అదే జరిగింది. రెండు పడవలు కాదు ఏకంగా నాలుగు పడవలపై కాళ్లు పెట్టేశాం. తొలి నాలుగు నెలల్లోనే మా దగ్గర నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఒకేసారి ఎక్కువగా సంపాదించాలన్న కక్కుర్తితో పనిమొదలుపెట్టాం. అయితే విచిత్రం ఏంటంటే చేతిలో నాలుగు ఉన్నా కనీసం ఒక్కదాంట్లో కూడా సక్సెస్ కాలేదు. ఒక్క ప్రాజెక్టూ సవ్యంగా పూర్తికాలేదు. పనికిరాలేదు.

రెండో పాఠం: నియామకాల్లో నిదానం

ఆలస్యం అమృతం విషం అన్నది ఎంత ముఖ్యమో... కొన్ని సందర్భాల్లో నిదానం కూడా ప్రధానమవుతుంది. పెద్ద ప్రాజెక్టు కాబట్టి చేతికింద నలుగురు మనుషులు ఉండటం అవసరం. అయితే ఎంత ముఖ్యమైనా సరే అత్యవసరమైతే తప్ప నియమించుకోకూడదు. ప్రయత్నిస్తే ఉన్న టీమ్ తోనే ప్రాడక్ట్ పెంచుకోవచ్చు. కొత్తవారిని నియమించుకోవాలని ఆలోచించడానికి ముందు... సరైన రెవెన్యూ మోడల్ తో మీ వ్యాపారం పట్టాలెక్కాలన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే దారుణమైన యాంటీ క్లైమాక్స్ తప్పదు. మా విషయంలో జరిగిందదే.

మూడో పాఠం: వర్క్ కల్చర్

స్టార్టప్ కి వర్క్ కల్చర్ లేకపోతే. మీరు పరాజయం బాటలో ఉన్నట్టే. అదిలేకే.. కో-ఫౌండర్లతో మేం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నెమ్మదిగా ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోతూ వచ్చాం. స్టార్టప్ ప్రారంభించక ముందు మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఆఫీసులో ఉండే రాజకీయాల గురించే. కో-ఫౌండర్లు, ఉద్యోగుల మధ్య దాన్ని తుడిచేసి.. విశ్వాసాన్ని నింపేలా ఫౌండేషన్ వేయాలి.

నాలుగో పాఠం: ఎప్పుడూ మీరు బరిలో ఉండాలి.

స్టార్టప్ మేనేజ్ మెంట్ కోసం సమయాన్ని వృథా చేస్తూ ప్రతీసారీ మేం చాలా పెద్ద తప్పు చేశాం. ఆ సమయాన్ని మేం సేల్స్, మార్కెటింగ్ పైన కేటాయించాల్సింది. వాస్తవానికి మీ స్టార్టప్ ను ఎక్కువకాలం నడిపించేది సేల్స్, మార్కెటింగే. మీ వెంచర్ లక్ష్యం, దాన్ని ఎలా అందుకోబోతున్నాం అనేదాని గురించి మీ టీమ్ కు క్లుప్తంగా తెలిసుండాలి. అందుకే మీరు స్టార్టప్ నిర్వహిస్తున్నారంటే కస్టమర్ ఉన్నచోట నేరుగా మీరే రంగంలో ఉండాలి.

ఐదో పాఠం: థీయరీ వేరు... రియల్ మార్కెట్ వేరు

"థియరీ బోధించేప్పుడు... థీయరీకి, ప్రాక్టికల్ కి తేడా ఏమీ ఉండదు. కానీ ప్రాక్టీస్ విషయానికొచ్చేసరికి థియరీకి, ప్రాక్టీస్ కి చాలా తేడా ఉంటుంది". సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అంశమిది. ప్రతీ స్టార్టప్ పై మొదట్లో కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈ అంచనాలు రియాల్టీకి దగ్గర ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. అలా లేవంటే అంతకంటే దారుణమైన పరిస్థితి మరోటి లేదు. అందుకే స్టార్టప్ పనితీరుపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూ ఉండాలి. మార్కెట్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. మీ స్టార్టప్ ని మార్కెట్ మొత్తానికి పరిచయం చేయాలి.

ఆరో పాఠం: ఫైనాన్షియల్ బ్యాకప్

స్టార్టప్ సాఫీగా నడిచేందుకు కనీసం ఆరు నెలల రొక్కం సిద్ధంగా పెట్టుకోవాలి. ప్రతీ స్టార్టప్ పాటించాల్సిన సాధారణ నియమం. ఎందుకంటే మనపై డబ్బులు ఖర్చుపెట్టగల కస్టమర్లు వచ్చేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఆర్థిక వనరుల్ని సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. భవిష్యత్తు అంతా బాగానే ఉంటుందని అనుకోవడం మంచిదే కానీ.. కీడెంచి మేలెంచడం కూడా అవసరమే. పొయిన తర్వత పుర్రె బాదుకుంటే లాభం లేదు.  

image


ముగింపు

అమావాస్య కొన్నాళ్లు. పౌర్ణమి కొన్నాళ్లు. అలాగే ప్రతీ స్టార్టప్ కు మంచిరోజులుంటాయి. గడ్డు పరిస్థితులూ ఉంటాయి. అయితే నేను ఎదుర్కొన్న ఆ కష్టమైన రోజులే నా జీవితంలో చాలా మంచి రోజులుగా భావిస్తాను. ఎందుకంటే నేను ఆ వైఫల్యాలతో ఎంతో నేర్చుకున్నాను. విజయం నుంచి నేర్చుకోవడం కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకోవచ్చనేది నా ఫీలింగ్. స్టార్టప్ ని ముందుకు నడపడానికి ఇంకొన్ని రోజులు ఎందుకు ఎదురు చూడలేకపోయావని.. కొందరు ఆంట్రప్రెన్యూర్లు నన్నడుగుతుంటారు. అయితే స్టార్టప్ ఏ దశలో ఉందన్న నిజాన్ని గుర్తించగలగాలి. టీమ్ పై, ప్రొడక్ట్, సర్వీస్ పై నమ్మకముంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడొచ్చు. కానీ నా విషయంలో అలాంటి ఆశలేమీ లేవు. కేవలం ఒక్క ఏడాదిలో మొత్తం కంపెనీ నేలమట్టమైంది. అయితే అలా జరిగిందని బాధపడుతూ కూర్చోం. మరిన్ని అద్భుతమైన స్టార్టప్ లను ప్రారంభించేందుకు కృషి చేస్తాం. ముందుకు వెళ్తూనే ఉంటాం.

రచయిత గురించి:

చిరాగ్ దోడియా: పదహారేళ్ల వయస్సులోనే తొలి కంపెనీని ప్రారంభించిన ఆంట్రప్రెన్యూర్. 20 ఏళ్లకే తొలి వైఫల్యాన్ని చూశారు. పనిలో లేనప్పుడు ఆయన ఎక్కువగా మాట్లాడుతూ, చదువుతూ, ప్రయాణిస్తూ కనిపిస్తారు.