రూ.2 లక్షల కోట్ల ఆధ్యాత్మిక మార్కెట్‌ ఆమె టార్గెట్

0

భారత దేశం.. ఓ వేద భూమి. ఎంత ప్రపంచీకరణ జరిగినా, విదేశీ కల్చర్ ఇక్కడి యువతలో పూర్తిగా కలిసిపోయినా మన మూలాలు మాత్రం ఎప్పటికీ సమసిపోయే అవకాశమే లేదు. ఇక్కడ మతానికి, ఆచారాలకు ఇచ్చే విలువ తగ్గడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అంతే కాదు పెళ్లిళ్లకు, దైవ సంబంధ కార్యక్రమాలకు డబ్బు చెల్లించేందుకు జనాలు ఏ మాత్రం వెనుకాడరు. కులం, మతం, వర్గం, ఆర్థిక స్థితితో సంబంధంలేకుండా ఈ రెండింటికీ ఎంత ఖర్చైనా చేయగలరు మన వాళ్లు. ఖచ్చితంగా ఈ పాయింట్‌నే ఆంట్రప్రెన్యూర్లు పట్టుకుంటారు. ఇంత విలువైన మార్కెట్‌ను, అదికూడా ఎలాంటి మాంద్యాలు ముంచెత్తినా ఏ మాత్రం ఢోకాలేని వ్యాపారాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి ? పెళ్లిళ్లు జరిపించే మార్కెట్ ఒకటైతే మిగిలిన కార్యక్రమాలైన పూజలు, వేడుకలు, ఇతర తంతులది కూడా చాలా పెద్ద మార్కెట్‌ అనడంలో సందేహమే లేదు.

'శుభ్‌పూజ' అనే సంస్థ కూడా ఆ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు పుట్టిందే. ఢిల్లీకి చెందిన సౌమ్యవర్ధన్ ఈ స్టార్టప్ రూపకర్త. వివిధ వర్గాల వారికి వాళ్ల అవసరాలకు తగ్గట్టు పూజలు, ఇతర దైవ సంబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఓ మతసంబంధమైన పోర్టల్. శుభ్‌పూజ ఏర్పాటుకు ముందు సౌమ్య లండన్ ఎర్న్‌స్ట్ అండ్ యంగ్, కెపిఎంజి సంస్థల్లో ఆపరేషన్స్, టెక్నాలజీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆమె బ్రిటన్ ఇంపీరియల్ కాలేజీ నుంచి ఎంబిఏ కూడా పూర్తిచేశారు. అయితే విదేశాల్లో ఉద్యోగాల కంటే భారత్‌‌లో ఏదైనా కొత్తగా, జనాల జీవితాలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనేది ఆమెకు కోరికగా ఉండేది.


ఒకసారి భారత్‌కు వచ్చిన తనకు ఓ అనుభవం ఎదురైంది. తన స్నేహితురాలి తండ్రి మరణించారు. అప్పుడు ఒక పూజారిని పిలిచి ఆఖరి సంస్కారాలు చేయించడానికి ఆమె ఎంతో ఇబ్బంది పడింది. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి ఇలాంటి సేవలు పొందే వెసులుబాటు ఏదీ లేకపోవడమే సౌమ్యకు ఓ బిజినెస్ ఐడియాను ఇచ్చింది.

డిసెంబర్ 2013లో శుభ్‌పూజ అధికారికంగా లాంఛ్ అయింది. మొదటి ఏడాదిలోనే వంద మంది క్లైంట్లకు సేవలందించి ఇప్పుడు వృద్ధి పధంలో దూసుకుపోతోంది. 100కు పైగా పండిట్స్, ఆస్ట్రాలజర్స్, వాస్తు కన్సల్టెంట్లు ఢిల్లీలో ఉన్నారు. అయితే వీళ్లంతా వీధి చివర్లో ఉన్న బాబాలో, ఆసాములో కాదు పెద్ద యూనివర్సిటీలో బాగా చదువుకున్న స్కాలర్స్. వారణాసి, నాసిక్, ఉజ్జైని, ఢిల్లీ వంటి వైదిక విశ్వవిద్యాలయాల్లో వేద విద్యను ఔపోసన పట్టినవారే. సాధారణంగా ఈ మార్కెట్లో ఎవరినైనా తెలిసిన వాళ్లు పిలవాలి. లేకపోతే ఫలానా వాళ్లు బాగా చేస్తారట అనే సలహాతో అయినా మన అవసరాలకు పంతులుగారిని ఇంటికి పిలిపించుకోవాలి. వాళ్లకు ఏం వచ్చో ఏం రాదో మనకు తెలియదు. రేట్‌ కూడా ఇంతా అనే నిర్ధారణ ఏమీ ఉండదు. అందుకే ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించి సరైన సేవలను అందిస్తామంటోంది శుభ్‌పూజ.

జాతకాలు చెప్పడం, ఆన్‌లైన్ సలహాలు, దోషపరిహారాలు, పెళ్లిళ్లు, పుట్టువెంట్రుకలు, బారసాల, నోములు, వ్రతాలు.. చివరకు ఆఖరి సంస్కారాలకు అవసరమైన క్రతువులు జరిపించే వారందరినీ ఒక్క వేదికపైకి తెచ్చారు.

అవసరమైతే కస్టమర్ ఇంటికే వెళ్లి కన్సల్టేషన్ చేయడమే, లేకపోతే వీళ్ల ఆఫీస్‌కే వచ్చి సమాధానాలు తెలుసుకోవచ్చని కంపెనీ చెబ్తోంది. మార్కెటింగ్ కోసం ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేయడం, హాలిడే కార్నివల్స్‌లో పాల్గొంటున్నారు. జ్యోతిష్యంపై మక్కువ ఉన్నవాళ్లకు వర్క్‌షాప్స్ ఏర్పాటు చేయడం, వాస్తు శాస్త్త, సంఖ్యా శాస్త్రంపై అవగాహన పెంచడం కూడా చేస్తున్నారు.

శుభ్‌పూజలో ఆరుగురు సభ్యుల ఆపరేషన్స్ టీమ్ ఉంది. త్వరలో తమ నెట్వర్క్‌ను పెంచుకోవాలని సౌమ్య ఆశిస్తున్నారు. భారత దేశ స్పిరిచ్యువల్ మార్కెట్ దాదాపు 30 బిలియన్ డాలర్లని (దాదాపు రూ.2 లక్షల కోట్లు) అని ఓ అంచనా. ఆన్ లైన్ ప్రసాద్, ప్రౌడ్ ఉమ్మా(ఇస్లాం సంబంధిత సైట్) ఈ రంగంలో తమ సేవలను అందిస్తున్నాయి. సమాజానికి ఏదో చేయాలనే ఆలోచనలో మొదలైన ఈ సైట్‌ అందుకు ఈ వేదిక ద్వారా ఏం చేస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టంకానీ.. దీనికైతే భారత్‌లో మాత్రం పుష్కలమైన మార్కెట్ ఉంది. ఇంకా ఎంతో మంది ప్లేయర్స్‌కు ఇక్కడ అవకాశముంది. ఆధ్యాత్మిక మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మెరుగైన మార్గాలే ఉన్నాయి.

website