విధిరాతను ఎదురించిన ఆనంద్

ఆశయం ముందు తలదించుకున్న అంగవైకల్యం

0

సచిన్ టెండుల్కర్ క్రికట్ ప్రారంభించింది చిన్న వయసులోనే. గుర్తింపు రాడానికి పెద్ద సమయం పట్టలేదు. 16ఏళ్ల ప్రాయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరగ్రేటం చేసిన టెండుల్కర్ కెరియర్ ముగిసే సమయానికి మిలియన్ల కొద్ది అభిమానులను సంపాదించుకున్నారు. క్రికెట్ ను ఓ మతంగా ఆరాధించే మన లాంటి దేశాల్లో ఇది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు. క్రికెట్ ముందు మిగిలిన క్రీడలన్నీ దిగదుడుపుగానే మిగిలిపోతున్నాయి. ప్రపంచ వేదికల్లో స్టార్ లాగా క్రీడాకారులు మెరిసిన ప్రతి సారి ఆ క్రీడ గురించి పత్రికల్లో పతాక శీర్షికలు వస్తాయి తప్పితే మిగిలిన క్రీడలపై జనానికి ఎందుకనో ఆసక్తి తక్కువ. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ క్రీడాకారుడు వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడంటే మాటలు కాదు. బాడ్మింటన్ లో వరల్డ్ నంబర్ వన్. అది కూడా పారా బాడ్మింటన్. నమ్మకం కలగడం లేదా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

“నాకు 41ఏళ్లు వచ్చే టప్పటికి నేను ఒలంపిక్ మెడల్ సాధిస్తా. నా ముందున్న టార్గెట్ ఇదే” ఆనంద్ కుమార్.

ఆనంద్ కుమార్ ది కర్నాటక. 19ఏళ్ల ప్రాయంలో బాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టారు. అప్పటికి ఫిజికల్ గా ఫిట్ గానే ఉన్నాడు. కానీ కాలు మాత్రం సహకరించలేదు. దీంతో పారా స్పోర్ట్స్ మెన్ గా ఆటను కొనసాగించారు. సాధారణ క్రీడలకే ఆదరణ అంతంత మాత్రంగా ఉన్న ఇలాంటి సమయంలో తనదైన స్టైల్ ల రాణించి ఆ ఆటలకు గుర్తింపు తీసుకొస్తున్నారు ఆనంద్.

విజయ పరంపరను ఆపలేకపోయిన పోలియో

“పోలియో నాపై చిన్నప్పుడే దాడి చేసింది. కానీ నా విజయాలను ఆపలేకపోయింది.” ఆనంద్

చిన్నప్పుడే ఆనంద్ కు పోలియో సోకి కుడి కాలు, కుడి చేయి పనిచేయకుండా ఆగిపోయాయి. అయితే సాధనతో దాన్ని జయించారాయన. స్పోర్ట్స్ మెన్ కావాలన్న నా ఆకాంక్షను ఏ శక్తి ఆపలేకపోయిందంటారు. ఒక్కొక్కటిగా స్టెప్స్ ఎక్కుతూ ముందుకు సాగిన ఆనంద్ మరిన్ని విజయాలను టార్గెట్ గా పెట్టుకున్నారు. మాలాంటి క్రీడాకారులను మీరు గుర్తించకపోయినా ఫర్వాలేదు. కానీ జాలి మాత్రం చూపించొద్దు. దాన్ని మేం భరించలేదు. వీలుంటే మమ్మల్ని ప్రోత్సహించేలా నాలుగు మాటలు చెప్పండి. మేం ఎవరి సహాయ సహకారాలతో బతకడం లేదు. మమ్మల్ని ఫేమస్ చేయమని మేం అడగటం లేదు. అంటూ కొద్దిసేపు ఎమోషనల్ అయ్యారు. తర్వాత తేరుకొని చిరునవ్వులు చిందిస్తూ పారా స్పోర్ట్స్ కు గుర్తింపు తీసుకురావాలనేది తన జీవిత లక్ష్యంగా చెప్పుకొచ్చారు.

ఆనంద్ సాధించిన విజయాలు

  1. 2002 లో ఆనంద్ భారత్ తరుపును పారా బాడ్మింటన్ లో ఫస్ట్ మెడల్ సాధించారు. అప్పుడు మొదలైంది విజయాల పరంపర. ఇక వెనుదిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు.
  2. 2012లో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్ సాధించారు. భారత్ తరుపున ఈ ర్యాంక్ సాధించిన మొదటి పార బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆనందే.
  3. ఆ తర్వాతి ఏడాది అంటే 2013లోనే వరల్డ్ నంబర్ 1ర్యాంకు సాధించారు. భారత్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తిరుగులేని విజయాలతో దూసుకుపోయారు.
  4. 2015లో వరల్డ్ చాంపియన్ గా నిలిచారు. గోల్డ్ మెడల్ తో పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కాపాడుకున్నారు.

అయితే కొన్ని మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి. విజయం సాధించిన మ్యాచ్ ల వివరాలన్నింటినీ రాయాల్సి వస్తే ఈ స్టోరీ మొత్తం విజయాల లిస్టు తోనే నిండిపోతుంది.

“మొదటిసారి గెలిచినప్పుడు మంచి కిక్ లభించింది. ఆ తర్వాత గెలవడాన్ని అలవాటుగా చేసుకున్నా. ఇప్పటికీ గెలుస్తునే ఉన్నా” ఆనంద్

క్రికెట్ ఆరాధ్య దేశంలో మేము సైతం

ఇండియా అంటే క్రికెట్, క్రికెట్ అంటే ఇండియా అనేలా ఇప్పుడు క్రేజ్ ఉంది. క్రికెటర్లను దేవుళ్లను చూసినట్లు చూస్తారు. క్రీడాకారులను ఈ స్థాయిలో చూడటం ఓ క్రీడాకారుడిగా సంతోషిస్తా. కానీ క్రికెట్ కాకుండా ఎన్నో క్రీడలున్నాయనే విషయం జనం ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదంటారు ఆనంద్.

“ప్రభుత్వాలు కూడా క్రికెట్ ప్లేయర్స్ కు సౌకర్యాలను ఎక్కువగా కల్పిస్తాయి.” ఆనంద్

అందరూ క్రీడాకారులే అయినప్పుడు క్రికెట్ కి మాత్రమే ప్రభుత్వం గుర్తించి మిగిలిన క్రీడలను పట్టించుకోనట్లు వ్యవహరించడం అప్పుడప్పుడు బాధ కలిగిస్తుంటుంది. కానీ సొసైటీలో ఇతర క్రీడలకు ఆదరణ లేనప్పుడు వాటికి ఆదరణ వచ్చేలా ప్రోత్సహించడం ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస బాధ్యత కాదా అని ప్రశ్నించిన ఆనంద్, దాన్ని మేం పట్టించుకోవడం లేదని, తామేం చేయాలో చేస్తామని దీమా గా అన్నారు.

“ఒలంపిక్ మెడల్సే టార్గెట్.” ఆనంద్

ఒలంపిక్ మెడల్ సాధించడమే తన తర్వాతి టార్గెట్ గా చెప్పుకొచ్చిన ఆనంద్. మెడల్ సాధించిన తర్వాత తమలాంటి క్రీడలకు గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదని అభిప్రాయడ్డారు. ఒలంపిక్ మెడల్ సాధించడానికి శక్తి వంచన లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నానని, కచ్చితంగా సాధిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు.

అకాడమీ పెడతున్నాం

ఆధిత్య మెహతా ఫౌండేషన్ నాకు సాయం అందిస్తోంది. అది చిన్న సాయమైనప్పటికీ నాలాంటి క్రీడాకారులకు అలాంటిది ఎంతగానో అవసరం. నాలా ఎంత మంది క్రీడాకారులు దేశం మొత్తం మీద ఉన్నారు. వాళ్లందరికీ సాయం అందిచాలంటే అకాడమీ పెట్టడమే సరైన మార్గంగా మేం భావిస్తున్నాం. తొందరలోనే అకాడమీ ప్రారంభం తాలూకు శుభవార్తను వెల్లడిస్తా అంటున్నారు.

“అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇస్తే ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలికి తీయొచ్చు” ఆనంద్

అకాడమీ ఏర్పాటుతో చాలా పరిష్కార మార్గాలు లభిస్తాయని భావిస్తున్నాం. నాతో చేతులు కలపడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పారా స్పోర్ట్స్ కోసం ప్రపంచంలో చాలా చోట్ల అకాడమీలున్నాయి. మన దేశంలో కూడా ప్రపంచ స్థాయి అకాడమీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఆనంద్.

“ముందుంది గొప్ప ఆశయం. చేస్తోంది గొప్ప ప్రయత్నం. మిగిలింది గొప్ప విజయం. అని ముగించారు ఆనంద్”
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik