చేనేతలకు కొత్త జీవితాన్నిస్తున్న సివిల్ ఇంజినీర్

చేనేతలకు కొత్త జీవితాన్నిస్తున్న సివిల్ ఇంజినీర్

Friday April 01, 2016,

4 min Read


చదువు: సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా

ఉద్యోగం: రైల్వేలో ఇంజినీర్

వ్యాపకం: యాడ్ ఫిల్మ్, సీరియల్ మేకింగ్

వ్యాపారం : చేనేతలకు కొత్త జీవితాన్నివ్వడం...

ఇదీ బీహార్ కు చెందిన ఉద్యాన్ సింగ్ సింపుల్ ప్రొఫైల్. చదువు, ఉద్యోగం, వ్యాపకం విషయంలో తన అభివృద్ధినే చూసుకున్న ఉద్యాన్... వ్యాపారం విషయంలో మాత్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న చేనేతల స్థితిగతులను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎనిమిది నెలల కిందట పరుగు ప్రారంభించాడు. మెదటి దశలోనే లక్ష్యం అంచనాలకు మించి సక్సెస్ అయింది. చేనేత కార్మికుల కళ్లలో చూస్తున్న ఆనందం అతనికి అమితమైన శక్తిని ఇస్తోంది.

బంకా సిల్క్... ఒక ప్రారంభం

బీహార్ లోని బంకా జిల్లా. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అలాగే కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తోంది చేనేత పరిశ్రమ. ఉపాధి అనే పేరే కానీ... కనీసం ఈ పరిశ్రమలో ఉపాధి హామీ పనులకు ఇచ్చే వేతనంలో నాలుగో వంతు కూడా రాదు. అంటే ఈ పరిశ్రమలో పనిచేసేవారి రోజు కూలీ కేవలం 30 రూపాయలు మాత్రమే. ఇంటిల్లిపాదీ పనిచేస్తేగానీ ఆ రోజుకు తిండిగింజలు కొనుక్కోలేరు. పిల్లలను బడికి పంపించడం అనే మాట చాలా అరుదుగా వినిపిస్తుంది. అందుకే చేనేత వృత్తిని వదిలివేసేవారి సంఖ్య శరవేగంగా పెరిగిపోయింది. ఒకటి రెండేళ్లలో బంకా ప్రాంతం నుంచి చేనేత పరిశ్రమ కనిపించకుండా పోతుందని కూడా కొంతమంది భావించారు. కానీ ఇది కొంతకాలం కిందట వరకు... ఇప్పుడు అక్కడ చేనేత అని చెప్పుకోవడానికి నేతన్నలు గర్వపడుతున్నారు. కొద్దికాంలోనే ఇంతలా మార్పురావడానికి కారణం ఉద్యాన్ సింగ్ స్టార్ట్ చేసిన స్టార్టప్ "బంకా సిల్క్" 

సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన ఉద్యాన్ సింగ్... బంకా జిల్లాలోనే పుట్టి పెరిగాడు. అంతో ఇంతో ఆర్థికంగా ఉన్న కుటుంబం కావడంతో చదువు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. చదువు అయిపోయిన తర్వాత రైల్వేలో ఉద్యోగం రావడంతో చేరిపోయాడు. ఐదేళ్లు పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగం బోర్ కొట్టేసింది. క్రియేటివ్ ఫీల్డ్ మీద ఉన్న ఆసక్తితో ఢిల్లీ వెళ్లిపోయాడు. యాడ్ ఫిల్మ్ మేకింగ్ చేపట్టారు. ప్రసిద్ధ సంస్థలకు 100కు పైగా ప్రకటనలకు రూపకల్పన చేశాడు. దూరదర్శన్ లో ప్రైమ్ టైమ్ లో వచ్చే ఓ సీరియల్ ను సైతం రూపొందించాడు. ఇక సినిమా దర్శకత్వమే ఫైనల్ అనుకుంటూండగా... ఓసారి తన సొంత ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు కానీ... తన ఊరి పరిస్థితులు అతన్ని కుదురుగా ఉండనీయలేదు. ముఖ్యంగా చేనేత కార్మికుల దుర్భర జీవనం ఉద్యాన్ సింగ్ ను కదిలించింది. వారి కోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే బంకా సిల్క్.

 <br>

 


డిజైనర్లతో మేకోవర్

బంకా జిల్లాలోని చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మార్చే లక్ష్యంతో బంకా సిల్క్ ను ప్రారంభించిన ఉద్యాన్.. ముందుగా వారి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశాడు. పట్నా, ఢిల్లీల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాడు. అద్భుతమైన నైపుణ్యం బంకా చేనేతల సొంతం. అందుకే ఈ ఎగ్జిబిషన్లలో చేనేత ఉత్పత్తులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. చేనేతలకు ఎప్పుడూ రానంత ఆదాయం వచ్చింది. వారి కళ్లలో మొదటిసారిగా మెరుపులు చూశాడు. ఆ ఉత్సాహంతో ఉద్యాన్ సింగ్ మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఉన్నత వర్గాలను ఆకట్టుకునే విధంగా డిజైన్లను రూపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు, నిఫ్ట్ డిజైనర్లను ఆహ్వానించేవారు. తమ సంప్రదాయకళకు డిజైనర్ల క్రియేటివిటీ తోడవడంతో బంకా చేనేతలకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కనిపించడం లేదు.

"బంకా సిల్క్ ద్వారా ఐదు వేల మందికిపైగా చేనేతలు ఉపాధి పొందుతున్నారు. ఓ కుటుంబంలో అయితే ఎనిమిది మంది సంపాదించుకుంటున్నారు. ఇంకా ఆనందకరమైన విషయం ఏమిటంటే.. అన్ని కుటుంబాలు తమ పిల్లలను సంతోషంగా స్కూలుకు పంపిచగలుగుతున్నాయి" ఉద్యాన్ సింగ్, బంకా సిల్క్ ఫౌండర్

పూర్తిగా స్థానికంగా పండించిన ముడిసరుకులతోనే వస్త్రాలు సిద్ధం చేయడం బంకా చేనేత ఉత్పత్తుల ప్రత్యేకత. తరతరాలుగా అదే పద్దతుల్లోనే నూలు వడుకుతారు. పట్టుకాయలను స్వయంగా పండించుకుంటారు. ప్రాసెస్ మొత్తం పర్యావరణ హితంగా ఉంటుంది. ఎక్కడా కాలుష్య కారకాలను ఉపయోగించరు. చివరికి నేసిన వస్త్రాలను వేసే రంగులు కూడా కూరగాయల నుంచి వచ్చేవే. 

ఆన్ లైన్ రేసులో పరుగులు

చేనేతలకు పూర్తిస్థాయి శిక్షణా కార్యక్రమాల తర్వాత గత ఏడాది జూన్ లో పాతిక లక్షల రూపాయల పెట్టుబడితో బంకాసిల్క్ పేరుతో ఆన్ లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఉద్యాన్ సింగ్. మధ్యవర్తులు ఎవరూ లేకుండా నేరుగా బంకా చేనేత కార్మికుల నుంచి వినియోగదారుడికి సరుకును చేర్చడమే బంకా సిల్క్ లక్ష్యం. ఎగువ మధ్యతరగతిని ఆకట్టుకునేవిధంగా డిజైన్లను ఆన్ లైన్లో ఉంచుతున్నారు. సిల్క్, ఖాదీ, లైనెన్ ఉత్పత్తులు ఒక్కోటి నాలుగు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు పెట్టి ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. కేవలం బంకా సిల్క్ ద్వారానే కాకుండా చేనేతలకు ఏ కొంచెం లాభం కలిగేలా ఉన్నా.. వేరే సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇండియా రూట్స్.కామ్, ఇండియన్ ఆర్టిజన్స్.కామ్, సాబ్ సమాన్.కామ్ సంస్థలతో ఒప్పందం చేసుకుని.. వాటిలోనూ బంకా చేనేతల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. బంకా సిల్క్ టర్నోవర్ ఇప్పుడు నెలకు రూ. 25 లక్షలు దాటింది. గత త్రైమాసికంలో సాధించిన టర్నోవర్ నాలుగు కోట్లకుపైగా ఉంది.రెండు వందల శాతం వృద్ధి నమోదు చేసి నెలకు యాభై లక్షల ఆదాయాన్ని టార్గెట్ చేస్తున్నారు. బిబా, జీవిక, అవంతిక అథంటిక్ వంటి బ్రాండ్లతో టైఅప్ చేసుకున్నామంటున్నారు ఉద్యాన్ సింగ్. 

ఉద్యాన్ సింగ్, బంకా సిల్క్ ఫౌండర్<br>

ఉద్యాన్ సింగ్, బంకా సిల్క్ ఫౌండర్


కారణాలేవైనా చేనేతలకు ప్రభుత్వం నుంచి లభించే ప్రొత్సాహకాలు తక్కువే. ఆర్భాటపు ప్రకటనలు ఎన్ని వచ్చినా పథకాలేవీ వారి దగ్గరకు చేరవు. అందుకే ప్రభుత్వం నుంచి కూడా బంకా సిల్క్ ఎలాంటి సబ్సిడీలు ఆశించలేదు. కానీ చేనేతల నైపుణ్యాన్ని పెంచేందుకు, పర్యావరణ హితంగా ఉండే టెక్నాలజీని చేనేత రంగానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఉద్యాన్ కోరుకుంటున్నారు. అందివస్తున్న ఆన్ లైన్ మార్కెట్ అవకాశాలతో పాటు సుప్రసిద్ధ బ్రాండ్లతో ఒప్పందాలు బంకా చేనేతల జీవితాల్లో మరింత వెలుగును తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రీటైల్ మార్కెట్ పైనా ఉద్యాన్ దృష్టిపెట్టారు. పాంటలూన్స్, ఫ్యాబ్ ఇండియా సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.


బంకాసిల్క్ విజయం... దేశవ్యాప్తంగా సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమకు కొత్త ఊపిరిలూదుతోంది. చేనేతల్లో భవిష్యత్ పై ఆశలు రేపుతోంది. చేనేతలకు అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ వీరికి కొత్త శక్తిని ఇస్తోంది. ఉద్యాన్ చేపట్టిన ఈ ప్రయత్నం ఉద్యమంలా మారితే ... భారతదేశ అతి పురాతన చేనేత కళకు మళ్లీ స్వర్ణయుగం వస్తుందనడంలో సందేహం లేదు.