దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ

దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ

Saturday July 01, 2017,

1 min Read

భారతదేశ చరిత్రలోనే పరోక్ష పన్నుల విధానంలో జీఎస్టీ అతిపెద్ద ఆర్థిక సంస్కరణ. ప్రపంచంలో జీఎస్టీని అమలు చేస్తున్న 142 దేశాల సరసన భారతదేశం నిలిచింది. జీఎస్టీ రాకతో.. వివిధ వస్తువులు, సేవలపై 1500 వేర్వేరు స్లాబ్ రేట్లు అంతమయ్యాయి. నిత్యావసర వస్తువులకు, విలాస వస్తువులకు ఇక నుంచి వేర్వేరు రేట్లలో పన్నులుంటాయి. 

image


18 శాతం పన్ను పరిధిలోకి మొత్తం 81 శాతం వస్తువులు వచ్చాయి. మొత్తంమీద 16 పరోక్ష పన్నుల స్థానంలో.. ఇకపై ఒకే వస్తుసేవల పన్ను వసూలు చేస్తారు. కస్టమ్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీస్ టాక్స్, వ్యాట్‌ కు.. ఇక శాశ్వత సెలవు ప్రకటించినట్టే.

5 రకాల పన్ను రేట్లతో జీఎస్టీ రూపకల్పన చేశారు. 0, 5, 12, 18, 28 శాతంగా జీఎస్టీ శ్లాబులు నిర్ణయించారు. 1,211 రకాల వస్తువులకు జీఎస్టీ వర్తిస్తుంది. ఐతే ఈసారి పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, విద్యుత్‌ శక్తి మాత్రం జీఎస్టీ పరిధిలోకి రాలేదు. భవిష్యత్ లో వీటిని కూడా జీఎస్టీ పరిధీలో చేర్చే అవకాశముంది. దాదాపు 30 ఏళ్లుగా జీఎస్టీపై కసరత్తు జరగ్గా ఇప్పటికి అది అమలుకు నోచుకుంది.

మోడీ ప్రధాని అయ్యాక .. 2014 డిసెంబర్ 18న జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 2015 మే 6న జీఎస్టీ రాజ్యంగా సవరణ బిల్లుకు లోక్ సభ పచ్చజెండా ఊపింది. 2016 ఆగస్టు 3న జీఎస్టీ రాజ్యంగా సవరణ బిల్లుకు రాజ్యసభ మద్దతు పలికింది. 2017 మార్చిలో జీఎస్టీ అనుబంధ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలుపగా.. 2017 ఏప్రిల్ 6న రాజ్యసభలో అనుబంధ బిల్లుకు మోక్షం లభించింది.