ఈ రియల్ హీరోల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ?

చరిత్ర మలుపు తిప్పిన మగధీరులుసామాజిక స్పృహే వీళ్ల ధ్యేయంయావత్ ప్రపంచానికే ఆదర్శం

ఈ రియల్ హీరోల నుంచి మనం ఏం నేర్చుకోవాలి ?

Wednesday June 24, 2015,

6 min Read

వ్యాపార ధ్యేయం లాభార్జన. లాభాలతో పని లేకుండా కేవలం సామాజిక ధృక్పధంతో పని చేసే సంస్థలెన్ని ? అలాంటి సంస్ధలు ప్రారంభించేందుకు సాహసించే వ్యక్తులెంతమంది ? అలాంటి వాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అందుకే వాళ్లు రియల్ హీరోలయ్యారు. భారత్‌లో సమాజానికి తమవంతు సాయం చేయాలనే ఆలోచనలున్న వ్యక్తులు బిలియన్ డాలర్ల పెట్టుబడితో సంస్థలను స్థాపించారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు కూడా. హస్క్ పవర్, రంగసూత్ర, డి లైట్, వాటర్ లైఫ్, వాత్సాలయ హెల్త్ కేర్ లాంటి సంస్థలన్నీ ఈ కోవకు చెందినవే. లాభార్జనే వ్యాపార ధ్యేయంగా భావించే యూకే, ఇటలీ, కొరియా, సింగపూర్ దేశాలకు ఈ ఆలోచన ఏమాత్రం నచ్చలేదు. కాని భారత్‌లో ఇలాంటి సామాజిక ఆలోచన కలిగిన సంస్థలు యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయంగా నిలిచాయి. స్వత్రంత్ర భారతంలో ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన పది మంది హీరోలకు ప్రతి ఒక్కరూ చేతులెత్తి జై కొట్టాలి.

ఆ పదిమంది రియల్ హీరోలు వీళ్లే....

1. మహాత్మాగాంధీ

image


గాంధీ... మహాత్ముడు ఎందుకయ్యారు...? ఆయన మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారనే కాదు. ఆయనలో ఎన్నో సుగుణాలు మహాత్ముడిగా తీర్చిదిద్దాయి. మనకు అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని గాంధీజీ చెబుతారు. వనరులు సద్వినియోగం చేసుకుంటే ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరమే రాదని సూచిస్తారు. గాంధీజీ కొత్త ఆలోచన భారతీయుల్ని మేల్కొలిపింది. తను వేసుకునే వస్త్రాలను కూడా తానే తయారు చేసుకోవడం గాంధీజీకి అలవాటు. అందులోనుంచి పుట్టుకొచ్చిందే ఖాదీ. విదేశీ వస్తువులు భారత్‌లోకి దిగుమతి చేస్తూ దానిపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేసి బ్రిటీష్ వాళ్లు దారుణంగా దోచుకున్నారు. ఆ సమయంలోనే ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికారు మహాత్ముడు. ఉప్పుపై కూడా తెల్లదొరలు పన్నులు వేయడంతో మనమే సొంతంగా ఉప్పు తయారు చేసుకుందామని గాంధీ పిలుపునిచ్చారు. మహిళా సాధికారిత, పంచాయితీలపై గాంధీ ఎక్కువగా దృష్టి పెట్టారు. అందుకే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తుల్లో ఆయన మొదటివారిగా నిలిచారు. భారతీయులకు రియల్ హీరో అయ్యారు.

2. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్

వర్గీస్ కురియన్

వర్గీస్ కురియన్


త్రిభువన్‌దాస్ కేశ్‌భాయ్ పటేల్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు. 1946 గుజరాత్‌లో ఇది పురుడుపోసుకుంది. అమూల్ అంటేనే ఇప్పటి వారికి అర్ధమవుతుంది. భారత్‌లో శ్వేత విప్లవానికి నాంది పలికారు వర్గీస్ కురియన్. ఇక్కడ ఏకంగా ఓ ఉద్యమానికే తెరలేపారు. కురియన్ దూరదృష్టి, ప్లానింగ్‌తో శ్వేత విప్లవానికి బలమైన పునాది పడింది. అప్పట్లో పాల వ్యాపారం చాలా పెద్దది. పాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కురియన్ విప్లవంతో ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పొచ్చింది. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండటంలో కురియన్ ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలో పాల ఉత్పత్తికి 30 సంస్థలను స్థాపించారు. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్, ద నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ కూడా వర్గీస్ ఆధ్వర్యంలో మొదలైన సంస్థలే.


3. సంజిత్ బంకర్ రాయ్, బేర్ ఫుట్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు

సంజిత్ బంకర్ రాయ్

సంజిత్ బంకర్ రాయ్


1965లో సంజిత్ రాయ్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యూషన్ పూర్తి చేశారు. సమ్మర్ టైంలో జార్ఖండ్ రాష్ట్రం పాలామా జిల్లాలోని వంద కరవు పీడి ప్రాంతాల్లో రాయ్ పర్యటించారు. ఇలాంటి అనుభూతి ఇంతకుముందెన్నడూ రాయ్‌కు ఎదురుకాలేదు. అక్కడి ప్రజలు పేదరికంతో పోరాడుతున్నారు. వారి కష్టాలు దూరం చేయాలని రాయ్ నిశ్చయించుకున్నారు. అక్కడ సోషల్ వర్క్స్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను 1972లో స్థాపించారు. ముఖ్యంగా కరవు ప్రాంతాల్లో నీటి కొరతను రాయ్ గుర్తించారు. అక్కడ సమస్యల పరిష్కారానికి ఓ కాలేజీ స్థాపించారు. అదే బేర్ ఫుట్ కాలేజీ. ఆ వ్యవస్థే గ్రామాల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతుంది. సోలార్ ఎనర్జీ, వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, హ్యాండీ క్రాఫ్ట్స్, కమ్యూనికేషన్, విమెన్ ఎంపవర్‌మెంట్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు. 2010లో ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రాయ్ కూడా ఒకరిగా నిలిచారు. బేర్ ఫుట్ కాలేజీ పల్లె ప్రజలకు స్వయం ఉపాధిపై చక్కని శిక్షణ ఇస్తుంది. మెగసెసే అవార్డు గ్రహీత అరుణ రాయ్‌నే సంజిత్ రాయ్ వివాహమాడారు.


4. అనిల్ కుమార్ గుప్త, ఐఐఎం ప్రొఫెసర్, హనీబీ నెట్వర్క్ వ్యవస్థాపకులు

అనిల్ కుమార్ గుప్త

అనిల్ కుమార్ గుప్త


1981లో అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు గుప్త. మంచి ఉద్యోగం, జీతం. కాని ఆయన ప్రయాణం దానికే పరిమితమవ్వలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరచే దిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే హనీబీ నెట్వర్క్ సంస్థను స్ధాపించారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌కూ గుప్త వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు సొసైటీ రీసెర్చ్ అండ్ ఇనీషియేటివ్స్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్, గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ అగ్‌మెంటేషన్ నెట్ వర్క్ లాంటి వాటిని గుప్త స్థాపించారు. శోభ్ యాత్ర పేరుతో పల్లెల్లో పర్యటించి వారిని విద్యావంతులను చేస్తూ.. అనేక అంశాలపై అవగాహన పెంచేవారు. ఇలా ఎన్నో వేల గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.


5. హరీశ్ హండే, కో ఫౌండర్ సెల్కో సోలార్

డా. హరీష్ హండే, సెల్కో వ్యవస్థాపకులు

డా. హరీష్ హండే, సెల్కో వ్యవస్థాపకులు


1995లో సెల్కో ప్రారంభమైంది. సోలార్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసి పల్లెల్లో వెలుగులు నింపడమే దీని లక్ష్యం. సెల్కో వ్యవస్థాపకుల్లో హరీశ‌ హండే ఒకరు. సోలార్ విద్యుత్ పై పల్లె ప్రజలకు అవగాహన తెచ్చేందుకు హండే ఎంతో కష్టపడ్డారు. సెల్కో ప్రభావం ఇప్పుడు పల్లెల్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సంస్ధ ద్వారా 18 ఏళ్లలో దేశవ్యాప్తంగా లక్షా 35 వేల గృహాలకు సోలార్ దీపాలు అందాయి. ఈ సేవలకు గుర్తింపుగానే 2011లో ఆసియా నోబుల్ ప్రైజ్‌గా భావించే రామన్ మెగసెసే అవార్డును హరీశ్ హండే అందుకున్నారు. హండే సృష్టించింది విద్యుత్ వెలుగులే కాదు దాని చుట్టు పర్యావరణ పరిరక్షణ కూడా దాగి ఉంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు బ్యాంకులు, ఎన్జీఓ సంస్థలతోనూ సెల్కో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో సెల్కోకు .. కర్నాటక,గుజరాత్‌లో 25 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు సోలార్‌పై ప్రజలకు ఈ స్థాయిలో అవగాహన రావడానికి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా హండే 20 ఏళ్ల కృషి దాగి ఉంది.


6. డాక్టర్ జి. వెంకటస్వామి, అరవింద్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకులు

డా. జి.వెంకటస్వామి

డా. జి.వెంకటస్వామి


1976లో డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అరవింద్ ఐ హాస్పిటల్‌ను ప్రారంభించారు. కంటి జబ్బులతో బాధపడేవారికి మంచి వైద్యం అందించేందుకు ఆ వైద్య సంస్థ మొదలైంది. అప్పట్లో కేవలం 11 బెడ్లు, ఓ నలుగురు వైద్యులతో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కంటి ఆసుపత్రుల్లో ఒకటిగా మారింది. మొదట్లో వెంకటస్వామి డాక్టర్ కాకముందు ఇండియన్ ఆర్మీలో సేవలందించారు. అనంతరం మెడిసన్ పూర్తి చేశారు. ఒక రోజులో అత్యధికంగా వంద సర్జీలు కూడా చేసేవారు. తక్కువ ఫీజులకే మెరుగైన కంటి వైద్యం అందించాలన్న సదుద్దేశ్యంతోనే అరవింద్ హాస్పిటల్ ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మే వ్యక్తుల్లో వెంకటస్వామి ఒకరు. ఇప్పటివరకు అరవింద్ హాస్పిటల్‌కు 3.2 కోట్ల మంది ప్రజలు వైద్యం కోసం వచ్చారు. అందులో 40 లక్షల మందికి సర్జరీలు నిర్వహించారు. అరవింద్ ఆసుపత్రిలో సాధారణంగా తక్కువ ఫీజులే తీసుకుంటారు. బీద వారికైతే ఉచితంగా వైద్యం అందిస్తారు.


7. సునీల్ భారతి మిట్టల్, ఎయిర్ టెల్ వ్యవస్థాపకులు

సునీల్ భారతి మిట్టల్

సునీల్ భారతి మిట్టల్


సునీల్ భారతి మిట్టల్.. పరిచయం అక్కర్లేని పేరిది. పారిశ్రామికవేత్త అయిన టెలికాం మొఘల్‌ సామాజిక వేత్త కూడా అని చెబితే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎయిర్‌టెల్ భారత్‌లోనే అతిపెద్ద సామాజిక సంస్థ. అవును నిజమే ! కమ్యూనికేషన్ వ్యవస్థను మారుమూల గ్రామాల్లోకి తీసుకెళ్లింది. అందుకే మొదటి పది సామాజిక వ్యవస్థాపకుల్లో సునీల్ మిట్టల్ ఒకరుగా నిలిచారు. కాల్ ఛార్జీలతో ఓ విప్లవం తీసుకుని వచ్చి సామాన్యులకూ మొబైల్‌ను దగ్గర చేశారు. మొబైల్‌తో న్యూస్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందుబాటులో ఉంచారు. రైతులు ఎప్పటికప్పుడు వాతావరణ వార్తలు, వ్యవసాయానికి సంబంధించిన విశేషాలు సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ సంస్థ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది. మొత్తంగా సమాచార విప్లవానికి సునీల్ మిట్టల్ నాంది పలికారు. ప్రస్తుతం దేశంలో ఎయిర్‌టెల్ వినియోగదారులు 23 కోట్ల మంది పైనే ఉన్నారు. మిట్టల్ భారతి ఫౌండేషన్ పేరుతో సొంతూరిలోనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.


8. వినీత్ రాయ్, ఆవిష్కార్ వ్యవస్థాపకుడు

సామాజిక వ్యవస్థాపకుల్లో వినీత్ రాయ్ ఒకరు. ఆవిష్కార్ వెంచర్ మేనేజ్‌మెంట్ సర్వీస్ వ్యవస్థాపకురాలు. ఆవిష్కార్ .. కొత్త ఆలోచనలకు కేంద్ర బిందువు. సంస్థ ప్రారంభానికి ముందు గెయిన్‌లో వినీత్ రాయ్ సీఈవోగా విధులు నిర్వర్తించారు. రాయ్ మంచి విజన్ ఉన్న వ్యక్తి. 2001లో సెప్టెంబర్ లో ఆవిష్కార్ ప్రారంభమైంది. రంగ సూత్ర, వాత్సాలయ హెల్త్ కేర్, వాటర్ లైఫ్ ఇవన్నీ సమాజానికి మేలు చేసిన సంస్థలే. ఇందులో పెట్టుబడి సమాజానికి ఎంతో సేవ చేసింది. రాయ్ కూడా అదే దారిలో నడిచారు.

సంకల్ప్ కూడా రాయ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకుందే. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు సంకల్ప్ ఓ ప్లాట్ ఫాం. అవసరాన్ని.. అవకాశాన్ని.. ఇది అనుసంధానం చేస్తుంది. సమాజం వ్యాపారం వేరు కాదు. వ్యాపారం ద్వారానే సమాజం తనకు అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చుకుంటుంది. నా దృష్టిలో సామాజిక బాధ్యత, వ్యాపార బాధ్యత వేరు వేరు కాదు. అందుకే సామాజానికి ఉపయోగపడే వస్తువుల ఆవిష్కరణకు వ్యాపార సూత్రాలు జోడించాను. ఇదే నా విజయానికి కారణం అంటారు వినీతా రాయ్.


9. విక్రమ్ ఆకుల, SKS మైక్రో ఫైనాన్స్ వ్యవస్థాపకుడు

1998లో విక్రమ్ ఎస్.కే.ఎస్ మైక్రోఫైనాన్స్ స్థాపించారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు సూక్ష్మ రుణాలు ఇస్తుంది. 12 ఏళ్లలో ఏకంగా 1347 మిలియన్ మంది మైక్రో ఫైన్సాన్స్‌తో లబ్ధి పొందారు. 1994 -95 మధ్య ఆకుల స్కాలర్. అది పూర్తయ్యాక మైక్రో ఫైనాన్స్ పై దృష్టి పెట్టారు. ఎస్.కే.ఎస్ మైక్రో ఫైనాన్స్ రైతులకు ఆహార భ్రదత కల్పించింది. 2006లో టైమ్స్ మ్యాగజైన్ వంద మంది ప్రభావిత వ్యక్తుల్లో విక్రమ్ ఆకుల ఒకరుగా నిలిచారు.

విక్రమ్ ఆకుల

విక్రమ్ ఆకుల


ఎస్.కే.ఎస్ మైక్రో ఫైనాన్స్ వివాదాల్లో చిక్కుకున్న తర్వాత విక్రమ్ ఆకులు దాని నుంచి బయటకొచ్చారు. సంస్థను రెండు దశాబ్దాల క్రితమే స్థాపించినప్పటికి , దాని ప్రగతి ప్రస్థానం అంతా గత అయిదేళ్లలో నమోదు అయింది. ఎంత వేగంగా పైకెదిగిందో అంతే వేగంగా కుప్పకూలింది. అయినా సూక్ష్మ రుణాలు మధ్య తగరతి మహిళలకు అండగా నిలిచాయి. పేద ప్రజలను ఆదుకున్నాయి. విక్రమ్ మంచి ఉద్దేశ్యంతోనే కంపెనీ ప్రారంభించారు. పేద మధ్య తరగతి ప్రజలకు మైక్రో ఫైనాన్స్ ఓ భరోసా కల్పించింది.


10. సత్యనారాయణ గంగారాం పిట్రోడా, నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఛైర్మన్

శాం పిట్రోడా

శాం పిట్రోడా


సత్యనారాయణ గంగారాం పిట్రోడా అనే కంటే శామ్ పిట్రోడా అంటే అందరూ ఇట్టే గుర్తు పడతారు. సామాజిక వ్యవస్థాపకుల్లో పిట్రోడా ఒకరు. కమ్యూనికేషన్ రెవల్యూషన్ సృష్టించారు. అయితే అందరిలా ఈయన ఒకే రంగంలో ప్రజలకు సేవ చేయలేదు. అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేశారు. టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇతనో సంచలనం. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి టెక్నాలజీ అడ్వైజర్‌గానూ పని చేశారు.

నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ దేశాభివృద్ధి కోసం పని చేస్తుంది. సామాజిక వెంచర్ల కోసం 5 వేల కోట్ల నిధులు పెట్టారు.వీటిని సామాజిక సంస్థల చేయూతకు ఉపయోగిస్తారు. ఇలాంటి సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు. పిట్రోడా data.government.in అనే సైట్ కూడా డెవలప్ చేశారు. ఈ సైట్ తో విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సైట్‌లో 3వేల 500 రంగాలకు సంబంధించిన డేటా ఉంచారు. మొత్తంగా దేశంలో శ్యాం పిట్రోడా కమ్యూనికేషన్ విప్లవం సృష్టించారు. 


ఇలా ఈ పదే మందే కాదు.. దేశంలో ఎంతో మంది తమదైన స్థాయిలో సమాజానికి సేవ చేశారు. ఇక్కడి జనజీవనంపై తమదైన ముద్రవేశారు. వీళ్లందరి నుంచి స్ఫూర్తి పొందుతూ.. మనం కూడా రియల్ లైఫ్ హీరోలుగా ఎదుగుదాం.