ఇలాంటి గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. గంగదేవిపల్లిపై ప్రధాని ప్రశంసల వర్షం

ఇలాంటి గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. గంగదేవిపల్లిపై ప్రధాని ప్రశంసల వర్షం

Tuesday February 28, 2017,

3 min Read

వ‌రంగల్ రూర‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లం గంగ‌దేవిప‌ల్లి గ్రామం. ఈ ఊరి గురించే ఇప్పుడు దేశమంతా చర్చ నడుస్తోంది. సాక్షాత్తూ దేశ ప్రధానే ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో గంగదేవిపల్లి సాధించిన ప్రగతిని మోడీ కొనియాడారు. అక్కడ మరుగుదొడ్ల నిర్వహణను శెభాష్ అని మెచ్చుకున్నారు. గత ప‌దిహేనేళ్ల నుంచి ఎన్నో అవార్డులు సాధించిన ఊరిని ఆకాశానికెత్తారు.

image


వాస్తవానికి గంగదేవిపల్లిలో 1995లోనే వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణాలను ఉద్య‌మంలా చేపట్టారు. టాయిలెట్ కోసం రెండు గుంత‌ల‌ను తీసి అందులో ఒక గుంత‌కు నేరుగా క‌నెక్ష‌న్ ఇచ్చారు. మ‌రొక గుంత‌ను రిజ‌ర్వ్ లో ఉంచారు. ఒక దాంట్లోకి విసర్జితాలు వెళ్లేలా ప్లాన్ చేశారు. అలా అన్ని మరుగుదొడ్లు 2014లో నిండిపోయాయి. అప్పుడు రెండో గుంతులోకి కనెక్షన్ మార్చారు. కొన్ని రోజులకు నిండిన గుంతల్లోని నీరు, తేమ పూర్తిగా ఇంకిపోయింది. మ‌లం కాస్తా ఎరువుగా మారింది. విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ బృందం ఇటీలే గ్రామాన్ని సందర్శించింది. అధికారులే స్వయంగా గుంతల్లోకి దిగి ఎరువులను పరిశీలించారు. ఆశ్చర్యం.. వాసన లేదు.. తేమలేదు.. అచ్చంగా పంటకు పనికొచ్చే బ్రహ్మాండమైన ఎరువు తయారైంది. రెండు గుంత‌ల మ‌రుగుదొడ్ల‌ గురించే కాదు ఊరి గురించి అనేక వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

వరంగల్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట రహదారికి ఆనుకుని- పచ్చని చెట్ల మధ్య ముద్దబంతిపూలన్నీ మాలకట్టినట్టుగా ఉంటుంది ఊరు. పల్లెటూరంటే ఒకటో రెండో చెప్పుకోదగ్గ విశేషాలుంటాయి. కానీ ఈ ఊరికి కొన్ని వందల ప్రత్యేకతలున్నాయి. ఆ మాటకొస్తే అంతర్జాతీయంగానూ ఈ విలేజ్‌ ప్రివిలేజ్‌ ని సంపాదించింది. గంగదేవిపల్లి అభివృద్ధి వెనుక ఏ ఒక్కరి శ్రమో లేదు. ఊరుమ్మడి బాధ్యత గ్రామాన్ని ఆదర్శంగా నిలిపింది. గంగదేవిపల్లి మొదట్లో మచ్చాపురం పంచాయతీ శివారు గ్రామంగా ఉండేది. 1994లో ప్రత్యేక పంచాయతీగా గుర్తించారు. అప్పటికి ఊళ్లో నాటుసారా ఏరులై పారేది. ఎన్నో జీవితాలు బలయ్యాయి. అప్పుడే గ్రామస్తుల్లో ఆలోచన మొదలైంది. మొదటి అడుగు ఎపుడూ ఒంటరిదే. కానీ రానురాను దారులు పరుచుకున్నాయి. అడుగులు జతకలిశాయి. చేయిచేయి కలిసింది. మొట్టమొదటి యుద్ధం నాటుసారామీద. ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, గ్రామస్తుల ఉక్కు సంకల్పం ముందు ఏదీ నిలవలేదు. సర్కారు సైతం ఊరి జనం ఆశయాన్ని కాదనలేదు. అందుకే 1982 నుంచి ఈ ఊళ్లో సంపూర్ణ మద్యనిషేధం అమలవుతోంది.

మొదటిసారి గ్రామ పంచాయితీగా ఏర్పడినప్పుడు గ్రామస్తులంతా కలిసి రిజర్వేషన్ లేకున్నా సరే సర్పంచ్ తో పాటు మొత్తం వార్డు మెంబర్లను మహిళలనే ఎన్నుకున్నారు. ఇలా రెండు టర్ములు మహిళలే గ్రామాన్ని పాలించారు. అలా గ్రామ పంచాయితీగా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు జిల్లా స్థాయిలో ప్రతీసారి గంగదేవిపల్లి ఉత్తమ గ్రామ పంచాయితీగా ఎన్నికవుతోంది. వందశాతం పన్నులు చెల్లిస్తారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టరు. ఇంటికో మరుగుదొడ్డి. ఇంటిటికీ చెట్లు. పాడి లేని ఇల్లు లేదు. కోడి ఎదిగితే సంసారం ఎదుగుతుందంటారు. అందుకే ఈ ఊళ్లో కోళ్లకి కొదవలేదు. ఊరంతా వందశాతం పచ్చదనం. వందశాతం పారిశుధ్యం. వందశాతం కుటుంబ నియంత్రణ. వందశాతం అక్షరాస్యత! ఇదీ ఈ పల్లె సాధించిన ఘనత. ఏ జంటకైనా ఇద్దరికి మించిన సంతానం ఉండదిక్కడ. ప్రతీ కుటుంబం చిన్న మొత్తాల పొదుపు సంస్థలో ఖాతాదారులే. బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉంటారు. పెద్దలు కూడా వయోజన విద్య ద్వారా చదువుకున్నారు.

కనీసం పక్కగ్రామాల కల్చర్ కూడా గంగదేవిపల్లికి సోకలేదు. అందరూ ఎరువులు, పురుగుల మందులతో వ్యవసాయం చేస్తుంటే ఈ ఊళ్లో మాత్రం సేంద్రీయ వ్యవసాయానికే మొగ్గు చూపుతారు. ఇవన్నీ ఒక్కరోజులో జరగలేదు. బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు, ప్రజల్లో పరివర్తన.. వెరసి గంగదేవిపల్లి రూపురేఖలే మారిపోయాయి!!

మంచినీళ్ల దగ్గర్నుంచి మరుగుదొడ్ల దాకా ఆ ఊరి బాగోగుల్ని కమీటీలే చూసుకుంటాయి. గ్రామ పంచాయితీ కమిటీ, మంచినీటి నిర్వహణ కమిటీ, వీధిలైట్ల నిర్వహణ కమిటీ, మద్యనిషేధ కమిటీ, డిష్ కమిటీ, ఆరోగ్య కమిటీ, లోన్స్ రికవరీ కమిటీ, సమస్యల పరిష్కార కమిటీ.. ఇలా అనేక కమిటీలున్నాయి. ఊళ్లో ప్రతీ వ్యక్తి ఏదో ఓ కమిటీలో మెంబరే. గ్రామస్తులు ఉచితంగానే టీవీ ప్రసారాలు చూస్తారు. ఎందుకంటే గ్రామ పంచాయితీయే స్వయంగా డిష్ నిర్వహిస్తోంది కాబట్టి. గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మంచినీటిని ఉచితంగానే అందిస్తున్నారు. కేవలం ఒక్క రూపాయికే 20 లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తారు.

గ్రామంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు కావడంతో చాలా వరకు ఘర్షణలు లేవు. చిన్న చిన్న గొడవలైనా గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల పంచాయితీ మొదలుకుని అన్ని రకాల గొడవలను కమిటీయే పరిష్కరిస్తుంది. ఊరిజనం ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు. పోలీసులు గ్రామంలో అడుగు పెట్టిందీ లేదు. పల్లెల్లో సైతం ప్రైవేటు పాఠశాలలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో గంగదేవిపల్లిలో ఒక్క ప్రైవేటు స్కూలు లేదు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారు. అందుకే చిన్నపల్లె అయినా సరే గ్రామంలో ఉన్నత పాఠశాలను తెచ్చుకోగలిగారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సర్కారీ స్కూలుకే పంపడానికి ఇష్టపడతారు. పిల్లలు కూడా అంతే. ప్రైవేటు స్కూలుకి వెళ్లం అంటారు.

దేశంలో ఆదర్శగ్రామాలు చాలానే ఉన్నాయి. కానీ గంగదేవిపల్లి అన్నిటికంటే చెప్పుకోదగ్గది. ఎంతగా అంటే.. దేశవిదేశాలు సైతం వచ్చి ఊరి బాగోగుల్ని పరిశీలించి పోతారు. అదొక టూరిజం స్పాట్! ఇప్పటిదాకా ఆ ఊరికి 200పైగా అవార్డులొచ్చాయంటే నమ్మశక్యం కాదు. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి నిర్మల్ అవార్డుతో పాటు, గూగుల్ ఎర్త్ వాళ్లు బెస్ట్ విలేజ్ అవార్డు అందజేశారు. దాదాపు 15 దేశాలకు చెందిన ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించి ఇక్కడి మార్పుని అధ్యయనం చేసి వెళ్లారు. ప్రతీ రాష్ట్రం నుంచి కూడా సందర్శకులు నిత్యం వస్తుంటారు.