ఈ ఐదుగురు బామ్మల విజయగాథలు వింటే ఆశ్చర్యపోతారు..!!

0


ఇవాళరేపు 55-60 ఏళ్లకే హరే రామా అంటూ మూలకు పడుతున్నారు. 70 దాటితే వాళ్లను చంటిపిల్లల్లాగా చూసుకోవాలి. ఇక 80 వయసున్న వాళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. మంచం మీదికే అన్నీ. 90, ఆపైన వాళ్లు అంతకంటే సెన్సిటివ్. లేవలేరు. కూచోలేరు. నడవలేరు. ఎముకల గూడు, మీటర్ తోలు అన్నట్టు కనిపిస్తారు.

కానీ ఇప్పడు మీరు చదవబోయే బామ్మలు అట్టాంటిట్టాంటి బామ్మలు కాదు. వాళ్ల పనివాళ్లు కూడా చేసుకోలేని వయసులో అద్భుతాలు సృష్టించారు. మలిసంధ్యలో మరుపురాని రికార్డులను తిరగరాశారు. ఆ ఐదుగురి విజయగాథలు చదివితే మీరే ఆశ్చర్యపోతారు..!

ఎడమ నుంచి కుడి; తిమ్మక్క, వి.నానమ్మల్, మెహర్ మూస్
ఎడమ నుంచి కుడి; తిమ్మక్క, వి.నానమ్మల్, మెహర్ మూస్

వి.నానమ్మాళ్

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్- ఒక యోగా టీచర్. 96 ఏళ్ల వయసు. అయినా ఇప్పటికీ ఆమె శరీరాన్ని విల్లులా వంచుతుంది! నానమ్మాళ్ యోగాసనాలు వేస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే! ముసలావిడ తలకిందులుగా వేసే ఆసనం అయితే అద్భుతం. కాకలు తీరిన యోగా గురువులు సైతం ఆమె ముందు బలాదూర్! నానమ్మాళ్ పదేళ్ల వయసులోనే యోగా నేర్చుకున్నారు. 20 వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటిదాకా ఆమె మందు బిళ్ల కూడా మింగలేదంటే నమ్మండి. అంత ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా నానమ్మాళ్ ఖ్యాతి గడించారు.

మెహర్ హీరోయిస్ మూస్

ముంబైకి చెందిన 70 ఏళ్ల మెహర్ మూస్ ఒక ట్రావెలర్. ఇప్పటివరకు 181 దేశాలను చుట్టేశారు. ఆమెకు 18 పాస్ పోర్టులు ఉన్నాయి! అంటార్కిటికా వెళ్లిన తొలి భారతీయ మహిళ ఆమెనే. ఏ దేశ పౌరులనైనా సరే ఇట్టే స్నేహితులుగా మార్చేసుకోవడం మెహర్ స్పెషాలిటీ. చీమలు, కందిరీగలను తింటూ అమెజాన్ అడవుల్లో ఆమె చేసిన సాహసయాత్ర అద్భుతమని చెప్పాలి. అక్కడితో ఊరుకోలేదు. ఈ భూ ప్రపంచాన్ని చుట్టగా ఓ 25 దేశాలు మిగిలాయి. అవి కూడా చూసి రావడానికి రెడీ అవుతున్నారు.

సాళుమరద తిమ్మక్క

ఏం! పిల్లలు లేకుంటే బాధపడాలా? పిల్లలంటే మనుషులేనా? చెట్లు చేమలు మాత్రం సంతానం కాదా అంటారు కర్ణాటకకు చెందిన తిమ్మక్క. ప్రముఖ పర్యావరణవేత్త అయిన తిమ్మక్కకు కడుపు పండలేదు. దాంతో చెట్లనే తమ పిల్లలుగా భావించారు. సొంతూరులో విరివిగా చెట్లు పెంచారు. హుళికల్ నుంచి కుడూర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లను నాటారు. వాటిని సొంత పిల్లల్లా సాకారు. 103 ఏళ్ల వయసులోనూ తిమ్మక్క ఇప్పటికీ హుషారుగా చెట్లు నాటుతారు. స్వయంగా వాటికి నీళ్లు పోస్తారు. 1996లో తిమ్మక్కకు నేషనల్ సిటిజన్స్ అవార్డు లభించింది.

ఓంకారి పన్వర్

ఓంకారి పన్వర్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి! 70 ఏళ్ల వయసులో ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చారంటే నమ్మశక్యం కాదు. ఓంకారి పన్వర్, చరణ్ సింగ్ దంపతులకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అయితే ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో వంశోద్ధారకుడు లేడని- దంపతులు బాధపడేవారు. ఎలాగైనా సరే వారసుడిని కనాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ప్రమాదకరమైన ఐవీఎఫ్ పద్ధతిలో పన్వర్ కవలలకు జన్మనిచ్చింది. అబ్బాయి, అమ్మాయి పుట్టారు. అలా ఓంకారి పన్వర్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ మదర్ అయింది!

సంతోష్ పర్హార్

ఈమె వయసు 59 ఏళ్లు. రిటైర్ స్కూల్ ప్రిన్సిపల్. ఇప్పుడు స్కై డైవర్. ఆరు పదుల వయసులో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి ఔరా అనిపించారు. కెనడాలోని ఎడ్మాంటన్ గగనతలంలో ఆమె ఈ ఫీట్ సాధించారు. స్కై డైవింగ్ చేసిన భారతీయుల్లో పర్హార్ అత్యంత ఎక్కువ వయస్కురాలు కావడం విశేషం.

ఇప్పుడు చెప్పండి! వీళ్లు నిజంగా గ్రేటా..? కాదా..? ఐదు పదుల వయసు దాటినా వండర్స్ క్రియేట్ చేయడం అర్రిబుర్రి యవ్వారం కాదు. జీవితంలో చిన్న కుదుపుకే నైరాశ్యంలోకి వెళ్లే నేటి యువతరానికి వీళ్లు నిజంగా స్ఫూర్తి ప్రదాతలు!

Related Stories

Stories by RAKESH