చేనేత కార్మికుల కోసం నూతన పొదుపు పథకం 

0

నేత కార్మికుల జీవితాలకు సామాజిక భద్రత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. నేత కార్మికుల కోసం ప్రత్యేకంగా పొదుపు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ సేవింగ్స్ స్కీం చేనేత కార్మికులతోపాటు, పవర్ లూమ్ వర్కర్లకు కూడా వర్తిస్తుంది. ఈ నెల 24న పోచంపల్లిలో ఈ పథకాన్ని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు.

గతంలో ఉన్న పొదుపు పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా మార్చింది. కార్మికులకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించేలా దీన్ని రూపకల్పన చేశారు. ఇప్పటిదాకా కార్మికుల వేతనాల్లో పొదుపు చేసుకునే 8 శాతానికి అదనంగా మరో 8 శాతం మాత్రమే మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చేవారు. ఇప్పుడు రూపొందించిన పథకంలో ప్రభుత్వం 8 శాతాన్ని రెట్టింపు చేసింది. మొత్తం16 శాతానికి మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వబోతోంది. హాండ్లూమ్స్ తో పాటు పవర్ లూమ్స్ కార్మికులకు కూడా ఇదే గ్రాంట్ లభిస్తుంది. అదే కాకుండా నేత కార్మికులకు భవిష్యత్ అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది.

కో-ఆపరేటివ్ సొసైటీల పరిధిలో పనిచేస్తున్న వారితోపాటు, సొంతంగా పనిచేస్తున్న కార్మికులు, డైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ వంటి చేనేత అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ స్కీం వర్తిస్తుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి నేతకారుడూ ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం అమలు కోసం అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. నేతన్నలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు ఈ పొదుపు పథకం సహాయపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.