ఆ పల్లె దేశంలోనే మొట్టమొదటి పుస్తకాల పల్లె

ఆ పల్లె దేశంలోనే మొట్టమొదటి పుస్తకాల పల్లె

Thursday May 11, 2017,

2 min Read

ఇంటినిండా పుస్తకాలుంటే ఓ చిన్న సైజు లైబ్రరీ అంటారు. అదే ఒక ఊరినిండా పుస్తకాలు ఉంటే ఆ ఊరిని ఏమనాలి? పుస్తకాల పల్లె అనాలి. అలాంటి పల్లె గురించే మీరు తెలుసుకోబోతున్నారు. మహారాష్ట్రలోని ఆ గ్రామం దేశంలోనే మొదటి పుస్తకాల పల్లెగా ఎలా మారిపోయిందో మీరే చదవండి.

image


చుట్టూ పచ్చని కొండలు. ఎటుచూసినా స్ట్రాబెర్రీ తోటలు. పర్వతాల మధ్య నుంచి సన్నగా జాలువారే జలపాతాలు. పక్కనే మహాబలేశ్వర్‌. కాస్త దూరంలోనే పంచగని. అడుగడుగునా టూరిస్టుల సందడి. నిత్యం ప్రకృతి రమణీయతతో శోభిల్లే ఈ ఊరి పేరు భిలారా. మహారాష్ట్రలోని ఈ హిల్ స్టేషన్- ఒకప్పుడు బ్రిటిష్ వారికి ఇష్టమైన వేసవి విడిది. సహ్యాద్రి పర్వత సానువుల్లో అందమైన పొదరిల్లులాంటి ఈ గ్రామం- కేవలం పర్యాటక స్థలమే కాదు.. దేశంలోనే మొట్టమొదటి పుస్తకాల పల్లెగా కూడా రికార్డులకెక్కింది.

ఫేస్ బుక్, వాట్సప్, వచ్చాక బుక్ రీడింగ్ అటకెక్కింది. ఈకాలం పిల్లల చేతుల్లో పుస్తకాల కంటే, స్మార్ట్ ఫోన్సే ఎక్కువ కనిపిస్తన్నాయి. ఇలాగే ఉంటే, అయితే భవిష్యత్ లో పుస్తకం ఉనికే ఉండదు. అందుకే మహారాష్ట్ర సర్కారు పుస్తకాల పల్లె అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. పుస్తకం తన ఉనికి కోల్పోవద్దనే సదుద్దేశంతో- మొదటగా భిలార్ అనే టూరిస్టు స్పాట్ ని ఎంచుకుంది. ఊరంతా పుస్తకాల విశిష్టతను తెలిపేలా అందంగా పెయింటింగ్ వేయించారు. ఎక్కడ అడుగు పెట్టినా పుస్తకం అనే రూపం వెంటాడుతుంది. అంత అందంగా ముస్తాబు చేశారు. 

 గ్రామంలో సుమారు 10వేల మంది జనాభా ఉంది. పుస్తకాలు కూడా పదివేలకు పైగా ఉన్నాయి. అంటే మనిషికో పుస్తకం ఉందన్నమాట. సుమారు 25 సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా కథలు, సాహిత్యం, చరిత్ర, సామాజిక అంశాలు, జీవితగాథలు, చిన్న పిల్లల పుస్తకాలు ఉంటాయి. చదువుకోడానికి కుర్చీలు టేబుల్స్ ఇచ్చారు. అయితే పుస్తకాలన్నీ స్థానిక భాష మరాఠీలో మాత్రమే కనిపిస్తాయి. మొదటగా మాతృభాష పటిష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో- అక్కడి భాషా సాంస్కృతిక శాఖ ముందుగా సొంత లాంగ్వేజీకి ప్రాధాన్యం ఇచ్చింది.

బ్రిటన్‌లో హేయ్ ఆన్‌ వేయ్ అనే పట్టణానికి ఒక విశేషం ఉంది. 1962లో అక్కడ ఓ చిన్న పుస్తకాల షాపు వెలసింది. దాని స్ఫూర్తితో చుట్టుపక్కల లెక్కలేనన్ని బుక్ షాప్స్ అవతరించాయి. దాంతో ఆ ఊరు టౌన్‌ ఆఫ్‌ బుక్స్‌గా ప్రసిద్ధి చెందింది. ఆ స్ఫూర్తితోనే భిలార్ గ్రామాన్ని పుస్తకాల పల్లెగా తీర్చిదిద్దారు. ఇది సక్సెస్‌ అయితే దేశ వ్యాప్తంగా టూరిజం కేంద్రాలన్నీ పుస్తక పఠనా కేంద్రాలుగా రూపాంతరం చెందుతాయనడంలో సందేహం లేదు.