ఒకప్పుడు గృహ హింస బాధితురాలు.. ఇప్పుడు సీరియల్ ఆంట్రప్రెన్యూర్..!!

 

ఒకప్పుడు గృహ హింస బాధితురాలు.. ఇప్పుడు సీరియల్ ఆంట్రప్రెన్యూర్..!!

Saturday April 09, 2016,

2 min Read

నిత్యం భర్త వేధింపులు..! గృహ హింస, బెదిరింపులు..!!

అది ఇల్లు కాదు.. 900 స్వ్కేర్ ఫీట్ నరకం..! ఒక్కోసారి చచ్చిపోవాలనిపించేది..!!

కానీ ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు..! వాళ్ల ముఖాలు చూస్తే బాధ ఇట్టే ఎగిరిపోయేది..!!

బతికి సాధించాలన్న తపన రెట్టింపయ్యేది..! 

అయినా, భర్త పెట్టే కష్టాలను ఎంతకాలమని భరిస్తుంది..!?

అందుకే ఓ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకుంది..!!

ఇద్దరు పిల్లల్ని తీసుకొని భర్త నుంచి దూరంగా వెళ్లిపోయింది..!!

అప్పట్నుంచి ఆమె జీవితమే మారిపోయింది..!!

ఇప్పుడామె వార్తల్లో వ్యక్తి..!!

ఆమె మరెవరో కాదు..!!

ప్రముఖ సామాజిక కార్యకర్త స్మితా భారతి..!

1995. స్మితా భారతికి కొత్త జీవితం ప్రసాదించిన సంవత్సరం. భర్త నుంచి విడిపోయాక ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పోషించ‌డానికి ఆమె ట్యూష‌న్లు చెప్తుండేది. పుణెలోని కృష్ణ‌మూర్తి ఫౌండేష‌న్ లో ఏడాది పాటు ప‌నిచేసింది. త‌ర్వాత ఢిల్లీలోని వ‌సంత్ వ్యాలీ స్కూల్లో 1998 దాకా టీచర్ గా. ఆ త‌ర్వాత ఆంట్ర‌ప్రెన్యూర్ అవతారమెత్తింది. బీన్ బ్యాగ్స్ త‌యారు చేసే న‌ఫీస్ అనే కంపెనీలో కొన్నాళ్ల పాటు పనిచేసింది. అక్కడే జీవితానికి అవసరమయ్యే బిజినెస్ పాఠాలు నేర్చుకుంది.

సాక్షితో ప్ర‌యాణం..

గృహ హింస‌పై పోరాటం చేస్తున్న సాక్షి అనే ఎన్జీవోలో స్మితాది ప్ర‌ముఖ పాత్ర అని చెప్పాలి. స్త్రీ పురుష స‌మాన‌త్వం, గృహ హింస నిరోధం, స్త్రీ విద్య.. ఇలా ఆమె చేయ‌ని పోరాటం లేదు. 2007 నుంచి 2015 దాకా సాక్షి చైర్మ‌న్ గా ప‌నిచేశారు. ప‌ని స్థ‌లాల్లో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల నిరోధానికి ఒక ఉద్య‌మం న‌డిపారు. ఆడమగ స‌మాన‌త్వం కోసం గ‌ళం విప్పారు. క‌థ‌లు, నాట‌కాల ద్వారా గృహహింస‌, పిల్ల‌ల‌పై అత్యాచార సంఘ‌ట‌న‌లను వెలుగులోకి తెచ్చారు. జైల్లో ఖైదీల‌కు పాఠాలు చెప్పారు. ఎంతో మందిలో ప‌రివ‌ర్త‌న తెచ్చారు. ప్ర‌స్తుతం కేకే బిర్లా ఫౌండేష‌న్, విస్ కోంప్, రోట‌రీ వ‌ర‌ల్డ్ పీస్ స్వచ్ఛంద సంస్థల్లో ఆమె సీనియ‌ర్ స‌భ్యురాలు. 

స్మితాభారతి

స్మితాభారతి


నేను బాధితురాలిని కాదు. ఒక స‌ర్వైవ‌ర్ ని! గృహ హింస‌ను ధైర్యంగా ఎదుర్కున్న త‌ర్వాతే నా జీవితానికి ఒక అర్థం ప‌ర‌మార్థం ల‌భించింది. సాక్షి స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా గృహ హింస‌పై ఎన్నో పోరాటాలు చేశాం. ఎంద‌రో ఆడ‌వాళ్ల‌కు కొత్త జీవితాల‌ను ప్ర‌సాదించాం- స్మితా భార‌తి

ముగ్గురు ఫ్రెండ్స్ తో క‌లిసి

స్మితా భార‌తి బాగా చదువుకున్నావిడ. ఇంగ్లిష్ లిట‌రేచ‌ర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్! పుస్త‌కాల అనువాదం, నాట‌క ర‌చ‌న‌, థియేట‌ర్ వ‌ర్క్ షాప్స్ నిర్వ‌హించ‌డం లాంటి అనేక ఉద్యోగాలు చేశారు. 2005లో ముగ్గురు ఫ్రెండ్స్ తో క‌లిసి హంగ్రీ హార్ట్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించారు. స‌మ‌కాలీన జీవితాలు, వ్య‌క్తిగ‌త సంబంధాల ఇతివృత్తంతో అందులో నాట‌కాలు ప్ర‌దర్శించారు. 2005, 2006, 2007లో ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంట‌ర్ లో మూడు థియేట‌ర్ ఫెస్టివ‌ల్స్ నిర్వ‌హించారు. దేశ విదేశీ విద్యా సంస్థ‌ల్లో సేవ‌లందించారు. ద‌శాబ్ద కాలంలో 20కి పైగా నాట‌కాలు డైరెక్ట్ చేశారు. కొన్ని సినిమాలకూ ప‌నిచేశారు. నాట‌క ప్ర‌ద‌ర్శ‌న ఎగ్జిబిష‌న్లు నిర్వ‌హించారు. కొన్ని ఆడియో బుక్స్ డిజైన్ చేశారు.

కొత్త వారికి ప్రోత్సాహం..

హంగ్రీ హార్ట్ ఫెస్టివ‌ల్ ద్వారా ఎంతో మంది కొత్త న‌టులు, డైరెక్ట‌ర్లు, నాట‌క ర‌చ‌యిత‌ల‌కు లైఫ్ ఇచ్చారు స్మితా భార‌తి. త‌న 20 ఏళ్ల అనుభ‌వాన్ని రంగ‌రించి 2015 అక్టోబ‌ర్ లో భార‌తి క్రియేటివ్స్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా న‌గ‌రంలో జ‌రిగే ఈవెంట్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే అగ‌న్ ప‌కీ డాట్ కామ్ పేరుతో మ‌రో కొత్త వెబ్ సైట్ లాంచ్ చేయ‌బోతున్నారు. ఈవెంట్స్ కోసం వెతికే వారికి, ఈవెంట్ మేనేజ‌ర్ల‌కు ఇదొక వేదిక‌లా ప‌నిచేస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు స్మిత త‌న సంస్థ‌ల‌న్నింటినీ సొంత డ‌బ్బుతో ఏర్పాటు చేసినవే. ఇప్పుడామె ఫండ్స్ కోసం చూస్తున్నారు.

యువ‌తుల‌కు స్మిత సందేశం..

ఎప్పుడూ నైరాశ్యంలోకి వెళ్లొద్దు. ప‌ట్టుద‌ల‌గా ఉండండి. చేసే ప‌నినే న‌మ్మండి. ఇంకేమీ ప‌ట్టించుకోవ‌ద్దు. ఈ దారిలో కొన్ని రాళ్లూ ముళ్లూ స‌హ‌జం. వాటిని ధైర్యంగా దాటేయండి. ఇక విజ‌యం మీదే!!