ఆన్‌లైన్‌ ఫర్నిచర్ మార్కెట్ దున్నేస్తున్న 19 ఏళ్ల కుర్రాడు!!

ఆన్‌లైన్‌ ఫర్నిచర్ మార్కెట్ దున్నేస్తున్న 19 ఏళ్ల కుర్రాడు!!

Sunday October 25, 2015,

3 min Read

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ సామెత కాస్తా... ఇంటీరియర్స్ చూసి ఇల్లాలిని చూడమన్నారు అన్నట్లుగా మారిపోయింది. నాలుగు గోడల ఓ ఇంటిని అందమైన నివాసంగా మార్చడంలో గృహోపకరణాలదే కీలక పాత్ర అనడంలో సందేహమే లేదు. అందుకే ఈ కాలంలోనూ లైఫ్ ఎంత బిజీగా మారినా... ఇంటికి సంబంధించిన ఫర్నీచర్‌ను దగ్గరుండి మరీ సౌకర్యంగా ఉండేట్లు తీర్చిదిద్దుకోవడంపై జనాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక అలాంటి వినియోగదారుల సమయాన్ని ఆదా చేసేందుకు.. ఇప్పటికే ఎన్నో వెబ్ సైట్లు ఆన్ లైన్లో సంప్రదాయబద్దమైన ఫర్నీచర్ అమ్మకాలు జరుపుతున్నాయి. అయితే వీటిలో కొన్ని సైట్లు మాత్రమే వివిధ రకాల డిజైన్‌లను అందిస్తున్నాయి. ఈ లోటును భర్తీ చేసే ఆలోచనతోనే ముకుంద్ అగర్వాల్ అనే 19ఏళ్ల యువకుడు బ్రౌన్ స్ట్రా అనే కొత్త స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాడు.

' ఫర్నీచర్ అమ్మకాలు జరిపే వ్యాపారాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ, ఎవ్వరూ అందుబాటులోని వివిధ ఆప్షన్లపై దృష్టిసారించడంలేద'న్నది ముకుంద్ అభిప్రాయం.

image


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన వివిధ ఫర్నీచర్ డిజైన్ల ప్రదర్శనశాలగా బ్రౌన్ స్ట్రాను అభివర్ణించవచ్చు. వ్యాపార కుటుంబానికి చెందిన ముకుంద్‌కు ఈ రంగంలో రాణించడం పెద్ద కష్టమేమీ కాలేదు. బ్రౌన్ స్ట్రాను స్థాపించక ముందు చార్టెడ్ అకౌంటెన్సీ అభ్యసించిన ఈ యువ వ్యాపారవేత్త ఆ తరువాత తండ్రి గ్రెనైట్ తయారీ వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించాడు. కానీ, స్వతహాగా ఏదైనా చేయాలని ముందు నుంచీ తపనపడుతున్న తాను గృహోపకరణాల ఎగుమతులను అధ్యాయనం చేసేందుకు జోధ్ పూర్ చేరుకున్నాడు.

'మా కజిన్ పెళ్లి కోసం దుస్తులు కొనుగోలు చేసేందుకు అతడితో కలసి జోథ్ పూర్‌కు వెళ్లాను. అతడు తన పనిలో బిజీగా ఉంటే.. నేను మాత్రం ఫర్నీచర్ షాపుల చుట్టూ తిరుగుతున్నాను. వినియోగదారులకు ఫర్నీచర్ లోనూ వివిధ వెరైటీలను అందుబాటులోకి తీసుకురావాలనేదే నా కోరిక. మార్కెట్లో నెలకొన్న ఓ రకమైన శూన్యాన్ని గుర్తించాను. అదే బ్రౌన్ స్ట్రా కు ఊపిరులూదింద'ని చెబుతాడు ముకుంద్.

బ్రౌన్ స్ట్రా ప్రత్యేకత

బ్రౌన్ స్ట్రా సంప్రదాయబద్దమైన ఫర్నీచర్ కాకుండా... వివిధ రకాల ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసువచ్చింది.

'డిజైనర్ ఫర్నీచర్‌ను అందించడమే మా ప్రధాన లక్ష్యం. రంగు, ఫినిషింగ్, ఫ్యాబ్రిక్, లెదర్... ఇలా అన్నింటిలోనూ వివిధ ఆప్షన్స్‌ను అందుబాటులో ఉంచాం. కాబట్టి, తమ ఇంటికి ఏది సరిగ్గా సరిపోతుందో ఎంపిక చేసుకునే వెసులుబాటు కొనుగోలుదారులకు లభిస్తుంది. ఇది ప్రయాసతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి, చాలా కొద్ది మంది మాత్రమే ఫర్నీచర్‌లో వెరైటీని కోరుకుంటారు. కాబట్టి, సంప్రదాయబద్దమైన డిజైన్లనూ అందుబాటులో ఉంచుతామ'ని వివరిస్తున్నాడు ముకుంద్.

image


మార్కెటింగ్

బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ స్టార్టప్‌కు సరైన మార్కెటింగ్ టీమ్ లేకపోవడం వల్ల ఇప్పటివరకూ 25 ఎంక్వైరీలు మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పటివరకూ 45వేలకు ఒక్క ఆర్డర్‌ను మాత్రమే అందుకున్నారు.

'మా వెబ్ సైట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభం అయ్యాక సోషల్ మీడియా ద్వారా ప్రచారం ప్రారంభిస్తాం' అని నమ్మకంగా చెబ్తున్నాడు ముకుంద్.

B2C మోడల్ ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు బ్రౌన్ స్ట్రా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఫర్నీచర్ మార్కెట్ కు రూ.1,40,000 కోట్లు. అందులో 750 కోట్లు ఆన్ లైన్ అమ్మకాల ద్వారానే సమకూరుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రంగంలో అస్థిరత్వం నెలకొందనే చెప్పాలి. దీనితో పోల్చుకుంటే సంప్రదాయబద్ధమైన ఫర్నీచర్‌కే ఎక్కవ మార్కెట్ ఉంది. ఇప్పటికీ.. ఎక్కువమంది స్థానిక కార్పెంటర్లతోనే తమ ఇంటికి సంబంధించిన గృహోపకరణాలను చేయించుకుంటున్నారు. ఏమైనా.... ప్రస్తుతం కార్పెంటర్లు.. ఆన్ లైన్ మార్కెట్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.

కాంపిటిషన్

ప్రస్తుతం బ్రౌన్ స్ట్రా ఫినిషింగ్, ప్యాకింగ్ యూనిట్‌ను నెలకొల్పే ఆలోచనలో ఉంది. తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎగుమతులపైనా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నాడు ముకుంద్.

' ప్రస్తుతం ఎంతోమంది హోల్ సేల్‌గా ఎగుమతులు చేస్తున్నారు. కానీ, మేము మాత్రం అమెరికా, యూరోప్ లో రిటైల్‌గా ఎగుమతులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని తన కొత్త ఆలోచనను యువర్ స్టోరీతో షేర్ చేసుకున్నాడు ముకుంద్.

ఏమైనా... ప్రస్తుతం భారత్ లో ఈ- కామర్స్ లోనూ గృహోపకరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. అయితే ఈ కామర్స్‌ను ధనికులే ఎక్కవగా వినియోగిస్తారు కాబట్టి, బ్రౌన్ స్ట్రా వంటి స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ పైనే ఆధారపడాల్సి ఉంటుంది.

website