ఈ బొగ్గు బిర్యానీ డోమినోస్‌ను బీట్ చేస్తుందా ?!

ఈ బొగ్గు బిర్యానీ డోమినోస్‌ను బీట్ చేస్తుందా ?!

Saturday January 16, 2016,

4 min Read

ఫుడ్ టెక్ స్టార్టప్స్ హంగామా ఈ మధ్య బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలన్నీ ఫుడ్ చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేకపోయినా.. ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం, డెలివరీ చేసే ఔట్‌లెట్స్ కొన్ని ఉండేవి. కాకపోతే భారతీయ ఫుడ్ వెరైటీస్‌కే పరిమితం కావడం, అది కూడా కొన్ని రెస్టారెంట్లే ఉండడంతో పోటీ అంతగా లేకపోయేది. జనాలు కూడా ఉన్నవాటితోనే అడ్జస్ట్ అయిపోయేవారు. అప్పుడు డోమినోస్ లాంటి కంపెనీలు ఒక్కసారిగా వస్తూవస్తూనే డామినేట్ చేశాయి. భారతీయులకు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న పిజ్జాలను బాగా దగ్గర చేసేశాయి. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మాట్లో ఇప్పటికీ డోమినోస్‌ స్థాయిలో సక్సెస్ అయిన సంస్థలు తక్కువనే చెప్పాలి. మెనూలో మార్పులు, టేస్ట్‌లో ఒక స్టాండర్ట్ మెయింటైన్ చేయడంతోనే డోమినోస్‌ ఇప్పటికీ ఓ రోల్ మోడల్.

image


ఈ పిజ్జా చైన్‌ను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారు లయన్ వెంచర్స్‌కు చెందిన అనురాగ్ మెహ్రోత్రా, క్రిష్ణకాంత్ ఠాకూర్. పిజ్జా ఫార్ములాను బిర్యానీకి అప్లై చేసి దూసుకుపోతున్నారు. ఏఐఎం మనీలా నుంచి ఎంబిఏ పూర్తి చేసిన అనురాగ్‌కు ఆర్థిక సేవల రంగంలో మంచి పట్టు ఉంది. ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబిఏ పూర్తి చేసిన క్రిష్ణకాంత్‌ది కూడా అలాంటి నేపధ్యమే. ఈ ఇద్దరూ కలిసి లయన్ వెంచర్స్‌ ఏర్పాటు చేసి మూడేళ్లుగా ఎన్నో సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు.

ఎలా వచ్చిందీ ఆలోచన

అనురాగ్, క్రిష్ణకాంత్ ఇద్దరూ ఓ సారి మోహమ్మద్ బోల్‌ అనే చెఫ్‌ను కలిశారు. అతడికి బిర్యానీ వండడంతో బాగా దిట్ట. అంతేకాదు భారత్, బ్రిటన్‌ల రుచులు కూడా బాగా పట్టాడు. మాటల సందర్భంలో క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల ఫార్మాట్‌ ఆలోచన తట్టింది. ఈ ఫార్మాట్‌లో పిజ్జాకు వచ్చినంత పేరు ఏ ఇతర భారతీయ ఫుడ్‌‌కూ దక్కలేదు. అదే వీళ్లలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. పిజ్జా, బర్గర్ల నుంచి భారతీయులకు తెలుసు. వాటిని బాగానే ఆదరిస్తారు. కానీ బిర్యానీ లాంటి లోకల్ టేస్ట్‌ ముందు మిగిలినవన్నీ బలాదూర్. అంత మార్కెట్ ఉన్నా ఇప్పటికీ ఓ జాతీయ స్థాయి బ్రాండ్ ఏదీ మన దగ్గర రాలేదు. 

''ఇదే ఆలోచన మా చార్‌కోల్ బిర్యానీ టీంలో జోష్ నింపుతోంది. ఆహార నాణ్యత, అదే స్థాయి నాణ్యత కొనసాగింపుతో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. వీటన్నింటితో పాటు వేళకు డెలివర్ చేయడం కూడా వ్యాపారానికి ముఖ్యమైన అంశాలు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మాస్ కన్స్యూమర్లకు చేరుకుంటాం. దేశవ్యాప్తంగా మా సేవలను విస్తరిస్తాం'' అంటున్నారు 34 ఏళ్ల క్రిష్ణకాంత్.

బిర్యానీలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు 500 మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వీళ్లలో వివిధ వయస్సులకు, రంగాలకు చెందిన వాళ్లున్నారు. అందరూ ప్రొడక్ట్‌కు ఓకె చెప్పారు. భారీ స్థాయిలో తయారీకి వ్యవస్థ లేకపోవడం, లాజిస్టిక్స్ చైన్, వాటిని నిల్వ చేసే టెక్నాలజీ లేకపోవడం వంటి ఇబ్బందులున్నాయని గుర్తించారు.

ఓ చెఫ్‌ లేదా కిచెన్‌పై ఆధారపడడం, పెద్ద ఎత్తున తయారు చేస్తేనే ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో ముమ్మాటికీ నిజం లేదని వాస్తవ పరిస్థితులను చూశాక అర్థం చేసుకున్నామంటారు కృష్ణకాంత్.

రుచిని కాపాడుతూనే..

ఒక దశలో చార్‌కోల్ బిర్యానీ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంది. అప్పుడు కూడా వీళ్లు భారీ ఖర్చులకు ఆస్కారం లేని లైట్ మోడల్‌కే ఎక్కువ మొగ్గుచూపారు. రవాణా వేళకు హోం డెలివరీ చేయడంపైనే దృష్టి నిలిపారు.

" ఓ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ తయారీ సంస్థతో భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. మాకంటూ ప్రత్యేకమైన రెస్టారెంట్లంటూ ఏవీ ఉండవు. వీళ్ల దగ్గరే ఆరు రకాల బిర్యానీలు తయారవుతాయి. ముంబైలోని కొలాబా నుంచి బోరివలీ వరకూ సునాయాసంగా డెలివర్ చేయగలుగుతున్నాం. డెలివరీ విషయంలో మాత్రం చాలా బలమైన భాగస్వామ్యులను ఎంపిక చేసుకున్నాం " అని చెప్తారు కృష్ణకాంత్. 

ఇంతకీ భాగస్వామ్యం కుదుర్చుకున్న ఆ ఫుడ్ జెయింట్ ఎవరో మాత్రం వివరాలు వెల్లడించలేదు. అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలున్న చెఫ్ మిఖైల్ సహానీ.. ఆ తర్వాత టీంలో చేరారు. కొత్త ప్రోడక్టులను తీసుకువచ్చేందుకు అతని అనుభవం కంపెనీకి ఎంతగానో ఉపయోగపడింది.

అన్నింటికంట ముఖ్యంగా బిర్యానీ రెసీపీ విషయంలోనూ ఓ స్టాండర్డైజ్డ్‌ ఫార్మాట్‌ నిర్ణయించుకున్నారు. దీనివల్లే బిర్యానీ, క్వాలిటీ, టేస్ట్‌లో రోజూ ఎలాంటి మార్పులూ ఉండవు. ఇక టెక్నాలజీ విషయంలోనూ ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తపడ్డారు. కస్టమర్ల కోసం వెబ్, యాప్ రూపొందించారు. పాయింట్ ఆఫ్ సేల్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ కోసం బ్యాక్ ఎండ్ ఇంటర్‌ఫేజ్ కూడా సిద్ధం చేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ బెంగళూరులో చదివిన గౌతం సింగ్ అనే గ్రాడ్యుయేట్ చార్‌కోల్ బిర్యానీకి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫుడ్ టెక్ స్టార్టప్‌కు అవసరమైన టెక్నాలజీ అప్పటికే మార్కెట్లో ఉన్నా.. వీళ్లు మాత్రం సొంతంగానే దీన్ని తమ అవసరాలకు తగ్గట్టు రూపొందించుకున్నారు.

సెప్టెంబర్ 2015లో చార్‌కోల్ బిర్యానీ సాఫ్ట్ లాంచ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ వ్యాపారం పది రెట్లు పెరిగిందని టీం చెబ్తోంది. ముంబైలో తమ పరిధిని ఎనిమిది ప్రాంతాలకు విస్తరించారు. ప్రతీ నెలా కనీసం 100 శాతం వృద్ధ కనిపిస్తోంది అంటున్నారు క్రిష్ణకాంత్. ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి డెలివరీ తీసుకోవడం వరకూ కస్టమర్ అనుభవం సాఫీగా సాగడం వల్లే ఇది సాధ్యమైందని వివరిస్తారు.

కస్టమర్లు యాప్, వెబ్ ద్వారా చార్‌కోల్ బిర్యానీని ఆర్డర్ చేసుకోవచ్చు. చూడచక్కటి ప్యాకింగ్‌తో డిస్పోజబుల్ బాక్స్‌లో బిర్యానీని డెలివర్ చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ లొకేషన్‌కు ఆర్డర్ అందినవెంటనే.. కస్టమర్‌కు దగ్గర్లో ఉన్న స్టోర్‌కు సమాచారం అందుతుంది. అతి త్వరగా ప్రోడక్ట్ డెలివర్ చేసేందుకు అనేక మంది సర్వీస్ ప్రొవైడర్స్‌తో వీళ్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఓ హైనెట్వర్త్ ఇండివిడ్యుయల్‌ నుంచి వీళ్లు ఫండింగ్ అందుకున్నారు. (ఫండింగ్, హెచ్‌ఎన్‌ఐ వివరాలు మాత్రం వెల్లడించలేదు) మరో రెండు నెలల్లో ముంబైలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని చూస్తున్నారు. బెంగళూరు, పుణె, ఎన్‌సిఆర్‌లకు విస్తరించే యోచనలో ఉంది ఈ టీం.

యువర్ స్టోరీ అభిప్రాయం

డోమినోస్‌ అన్ని లింకులను బ్రేక్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్లే సక్సెస్ సాధించింది. ప్రస్తుతం డోమినోస్‌ దగ్గర 30,000 మంది వరకూ పనిచేస్తుంటే అందులో 25 వేలకుపైగా సిబ్బంది కస్టమర్లతో తరచూ కనెక్ట్ అయ్యే వారే. జిపిఎస్ ట్రాకింగ్, ఫీడ్ బ్యాక్, కార్డ్‌ పేమెంట్స్.. ఇలా వివిధ డివైజులను రూపొందించి కస్టమర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేయడంతో పాటు వాళ్లకేం కావాలో తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చార్‌కోల్ బిర్యానీ కూడా ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందో చూడాలి.

ఈ స్పేస్‌లో ఇప్పటికే ఈజీఖానా, అమ్మీస్ బిర్యానీ, నవాబ్ షేక్ వంటివాళ్లున్నారు.

website