డే కేర్ సెంటర్ల నిర్వహణలో కోట్లు కూడబెడ్తున్న 'ఫుట్ ప్రింట్స్'

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చైల్డ్ కేర్ సంస్థ ఫుట్‌ ప్రింట్స్.అమెరికా, బ్రిటన్ స్థాయిలో డే కేర్ సెంటర్ల నిర్వహణ.పిల్లల మానసిక వికాసానికి తోడ్పడేలా కరిక్యులం.మూడేళ్లలోనే ₹ 6కోట్ల టర్నోవర్ సాధించిన ఫుట్‌ప్రింట్స్.

డే కేర్ సెంటర్ల నిర్వహణలో కోట్లు కూడబెడ్తున్న 'ఫుట్ ప్రింట్స్'

Monday September 21, 2015,

4 min Read

బీహార్‌లో ఉన్న ఆ వృద్ధ జంట... టేబుల్‌పై ఉన్న స్మార్ట్‌ఫోన్ వంక యథాలాపంగా చూసి... తృప్తిగా ఊపిరి తీసుకున్నారు. వాళ్లు చూస్తున్నది... రోజూ కనిపించే దృశ్యమే. ఢిల్లీలోని డేకేర్ సెంటర్‌లో ఉన్న తమ మనవడు ఏం చేస్తున్నాడో చూస్తుంటారు వాళ్లు. ఇప్పుడా చిన్నారి ప్రశాంతంగా నిద్రపోతుండడం చూసి... తృప్తిగా ఫీలయ్యారా వృద్ధ జంట.

ఫుట్‌ప్రింట్స్ టీం

ఫుట్‌ప్రింట్స్ టీం


ప్రస్తుతం ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో డేకేర్ సెంటర్స్, ప్రీస్కూల్స్ నిర్వహిస్తోంది ఫుట్‌ప్రింట్స్. చిన్నారుల సంరక్షణకోసం ఈ వెంచర్‌ను ప్రారంభించేటపుడు పూర్వేష్ శర్మ, రాజ్ సింఘాల్, ఆశిష్ అగర్వాల్‌లు ఆశించినీది, కోరుకున్నదీ పేరెంట్స్‌లో ఈ నిశ్చింతనే.

చిన్నారులకు మెరుగైన వసతులు ఇస్తూ, ప్రపంచస్థాయి నాణ్యతను పాటిస్తూ... దానికి సాంకేతికతను జోడించి.. ఈ రంగంలో కొత్తదనానికి స్వాగతం పలకాలన్న వీరి కల సాకారమైందనే చెప్పాలి.

“ప్రతీ క్లాస్‌రూంలోనూ సీసీటీవీలు ఉంటాయి. మొబైల్ యాప్‌ ద్వారా ఇక్కడ ఏం జరుగుతోందో... వీడియో స్ట్రీమింగ్ చేస్తాం. ఇక్కడ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు.. మొదట కొన్నినెలలపాటు వీడియో స్ట్రీమింగ్‌ను ఫాలో అయ్యేవారు. మా మీద నమ్మకం ఏర్పడ్డాక.. ఇలా చూడ్డం తగ్గించేశారు. అయితే.. ఇప్పటికీ వారి గ్రాండ్ పేరెంట్స్ మాత్రం రోజూ తమ మనవళ్లు, మనవరాళ్లను చూసుకుంటూనే ఉంటార”ని చెబ్తున్నారు ఫుట్‌ప్రింట్స్ చైల్డ్ కేర్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ పూర్వేష్.

చరిత్రని చిన్నగా చెప్పుకుంటే ?

ఫుట్‌ ప్రింట్స్‌ వ్యవస్థాపకులు ముగ్గురూ స్నేహితులు. 1990ల్లో ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చేసేప్పుడు వీరు ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. 2009లో బ్రిక్ రెడ్ టెక్నాలజీస్ అనే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ స్టార్టప్‌కి ఫౌండింగ్ టీం మెంబర్లుగా పూర్వేష్, రాజ్‌లు మరోసారి కలిసి పని చేశారు.

ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలన్నది పూర్వేష్‌ లక్ష్యం. గత పదేళ్ల కాలంలో ఫుట్‌ప్రింట్స్ కంటే ముందే.. రెండు వెంచర్లను ప్రారంభించి విజయవంతగా నిర్వహించారు. వీటిలో ఒకటి ఈ-లెర్నింగ్ కంపెనీ కాగా... మరొకటి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీ. ఈ రెండు వెంచర్ల ప్రారంభానికి మధ్యలో... పూర్వేష్ మొదటి కొడుకు కబీర్ పుట్టాడు. కబీర్ జన్మించాక... తన లైఫ్‌లో చాలా మార్పులు వచ్చాయంటారు పూర్వేష్.

యురేకా...

తన చిన్నారిని ఉంచడం కోసం డేకేర్ సెంటర్ వెతికినపుడు ఓ విషయం అర్ధమైంది అతనికి. యూఎస్, యూకేలలో ఉన్నవాటితో.. మన దేశంలో ఉన్న డేకేర్ సెంటర్లను పోల్చితే.. చాలా తేడా కనిపించింది. ఇక్కడున్నవి పాటిస్తున్న ప్రమాణాలపై కూడా సంతృప్తి చెందలేదు పూర్వేష్.

“ఏ పిల్లలకైనా మొదటి ఐదారేళ్లు చాలా ముఖ్యం. పిల్లలలో మెదడు ఎదుగుదల, పరిణతి చెందడం ఈ వయసులోనే జరుగుతుంది. మన దేశంలో అందుబాటులో ఉన్న ప్రీస్కూల్స్, డే కేర్ సెంటర్లు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేద”న్నారు పూర్వేష్.

దేశంలోని పేరెంట్స్‌కి మంచి వసతులు ఉండే డే కేర్ సెంటర్లను అందించే లక్ష్యంతో.. స్నేహితులతో కలిసి... తానే ఓ వెంచర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇది పిల్లల్లో మానసిక వృద్ధిని కూడా పెంపొందించేదిగా ఉండాలని భావించారు పూర్వేష్. జూలై 2012లో గుర్‌గావ్‌లో మొదటి చైల్డ్ కేర్ సెంటర్‌ని ప్రారంభించారు.

ఫుట్‌ప్రింట్స్ ప్రత్యేకతలు

ప్రస్తుతం గుర్‌గావ్, నోయిడాల్లో ఐదు ప్రాంతాల్లో ఈ చైల్డ్ కేర్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. 3 నెలల నుంచి 5 ఏళ్ల వయసు పిల్లల వరకూ వీటిలో పదిలంగా చూసుకుంటారు. ప్రతీ సెంటర్‌లోనూ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చిన టీచర్లు, పిల్లలను చూసుకునేందుకు కేర్ టేకర్లు ఉంటారు.

“శిక్షణ పొందిన క్వాలిఫైడ్ టీచర్స్, కేర్ టేకర్స్... చిన్నారులకు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను నేర్పిస్తారు. ఈ పసివాళ్లు ఇతర పిల్లల కంపెనీని ఎంజాయ్ చేసేలా వాతావరణాన్ని రూపొందిస్తామని'' చెప్పారు పూర్వేష్.

పెద్దలు, చిన్నారుల ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకునేలా.. ప్రత్యేకంగా పరిశోధన చేసి మరీ డిజైన్ చేసిన కరిక్యులంను ఫుట్‌ప్రింట్స్‌లో అనుసరిస్తున్నారు. కొత్తవి నేర్చుకోవాలనే ఆలోచన, ఉత్తేజితపూరితమైన వాతావరణం ఉండడంతో.. పిల్లలు సొంతగా ఆలోచించి నేర్చుకోవడానికి వీలవుతుంది.

“సాధారణంగా 3 నెలల పసివాళ్లు ఏం నేర్చుకుంటారు అనుకుంటాం మనం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ వయసులో పిల్లలకు నేర్చుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు, శబ్దాలే కాదు.. చివరకు వాసనలతో కూడా... ఈ ప్రపంచం గురించి వారికి తెలుసుకునే శక్తి ఉంటుంది. మొహాలను గుర్తు పట్టడం నేర్చుకుంటారు, శబ్దాలను గుర్తించి ప్రతిస్పందిస్తారు. చిన్నారుల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఇంతకంటే మంచి ఏముంటుంది ” అంటూ పూర్వేష్ ప్రశ్నిస్తున్నారు.

చిన్నారులకు అందించే ఆహారం విషయంలో కూడా ఫుట్‌ ప్రింట్స్ భరోసా ఇస్తోంది. ముందుగా నిర్ణయించిన బ్యాలెన్స్‌డ్ డైట్ మాత్రమే అందిస్తారు. తామే తెచ్చిన ఆహారం ఇచ్చేందుకు కానీ, ఇక్కడే తయారు చేసిన ఫుడ్ కానీ... ఏదైనా ఎంచుకునే సౌలభ్యం పేరెంట్స్‌కి ఉంటుంది.

“సహజంగా ఇంట్లో పెద్దవారికి వండే ఆహారంలో చిన్నమార్పులు చేసి పిల్లలకు కూడా తినిపిస్తుంటారు. కానీ మా దగ్గర ఉండే చిన్నారులకు ప్రత్యేకమైన మెనూ ఉంటుంది. 30నుంచి 40 రకాల పళ్లు, కూరగాయలతో ఆహారం సిద్ధం చేస్తాం. పోషక విలువలతో కూడిన ఫుడ్‌ని అందించడం ద్వారా... వారి ఎదుగులకు కృషి చేస్తాం” అని చెప్పారు పూర్వేష్.

వీటన్నిటికంటే ముఖ్యంగా.. ప్రతీ క్లాస్‌రూంలోనూ అమర్చిన సీసీటీవీల ద్వారా వీడియోలను ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ చేస్తారు. దీని ద్వారా పిల్లలు ఏం చేస్తున్నారో... పేరెంట్స్ కానీ, గార్డియన్స్ కానీ.. రియల్ టైంలో చూస్తే వివరాలు తెలుసుకోవచ్చు. అంతే కాదు.. చిన్నారులు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, నిద్రపోతున్నారో, ఆడుకుంటున్నారో.. ఎస్ఎంఎస్‌ల ద్వారా అలర్ట్స్ కూడా పంపిస్తారు ఫుట్‌ ప్రింట్స్ టీం.

అమెరికా, బ్రిటన్‌లతో పోల్చితే.. తక్కువ ధరకే ఇక్కడ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది ఫుట్‌ప్రింట్స్. డైట్ లేకుండా ఏడాదికి ₹1.3 లక్షలు( సుమారు నెలకు ₹ 11వేలు), మీల్స్‌తో కలిపి అయితే... ఏడాదికి ₹ 1.5 లక్షలు( నెలకు ₹12,500) ఛార్జ్ చేస్తుంది ఫుట్‌ప్రింట్స్.

మార్కెట్ ఎంత? పోటీ ఏంటి ?

కే-12 ఎడ్యుకేషన్ అందించిన రిపోర్ట్ ప్రకారం దేశంలో 30కోట్లకు పైగా స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఉన్నారు. అంటే ఈ తరహా డేకేర్ సెంటర్లకు పుష్కలంగా అవకాశం ఉందనే విషయం స్పష్టమవుతోంది.

“మధ్య తరగతి ప్రజల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశ ప్రత్యేకత. వీరు పిల్లల చదువు, రక్షణపై ఎక్కువగా ఖర్చుపెట్టేందుకు సంసిద్ధంగా ఉంటున్నారు. దీంతో రాబోయే కాలంలో డే కేర్, ఎడ్యుకేషన్ సెంటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశముందం”టున్నారు ఫుట్‌ప్రింట్స్ సీఈఓ రాజ్ సింఘాల్.

ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి సర్వీసులు అందిస్తున్న సంస్థలు మరికొన్ని ఉన్నాయి. క్లే స్కూల్స్, మదర్స్ ప్రైడ్‌లు దేశ వ్యాప్తంగానూ, వుయ్ కేర్ బెంగళూరులోనూ ఇలాంటి డేకేర్ సేవలనే అందిస్తున్నాయి.

ఉందిలే మంచి కాలం ముందుముందునా

2012లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ ₹ 6 కోట్ల ఆదాయాన్ని గడించింది ఫుట్‌ప్రింట్స్. ఐదు సెంటర్ల ద్వారా మొత్తం 700 మంది చిన్నారుల పరిరక్షణ బాధ్యతలు నిర్వహించారు.

ఈ కంపెనీకి వెంచర్ కేపిటలిస్టుల మద్దతు ఎక్కువగానే ఉంది. ఇప్పటికే మూడు రౌండ్లలో ₹ 7కోట్లను ఏంజెల్ రౌండ్ ఫండింగ్ ద్వారా సమీకరించగలిగారు.

“ ఢిల్లీ, ఎన్‌సీఆర్ (నేషనల్ కేపిటల్ రీజియన్)లలో మరో 40 చైల్డ్ కేర్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే దేశంలోని ఇతర మెట్రో నగరాలకు విస్తరించే యోచన '' ఉన్నామంటున్నారు పూర్వేష్. ముంబై, బెంగళూరు, పూనే, హైద్రాబాద్, చెన్నైల్లోనూ.. త్వరలోనే ఫుట్‌ప్రింట్స్ చైల్డ్ కేర్ సెంటర్లు మొదలుకాబోతున్నాయి.

వెబ్‌సైట్