95శాతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు కోడింగ్ చేయడం కూడా రాదట..!?

95శాతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు కోడింగ్ చేయడం కూడా రాదట..!?

Friday April 21, 2017,

2 min Read

ఆ మధ్య ఒకాయన అన్నారు.. శ్మశానాలు.. ఇంజినీరింగ్ కాలేజీలు ఊరిబయటే ఉంటాయి. అక్కడ శవాలు తగలబడుతుంటాయి.. ఇక్కడ విద్యార్ధుల జీవితాలు కాలిపోతుంటాయి. పెద్ద తేడాలేదు అని.

తరచి చూస్తే నిజమే అనిపిస్తోంది. అనిపించడం కాదు.. సర్వేలో తేలిన వాస్తవం కూడా అదే. 95 శాతం మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు కోడింగ్ రాదట. ఎంప్లాయిబిలిటీ అసెస్మెంట్ సంస్థ అస్పైరింగ్ మైండ్స్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఐటీ, డేటాసైన్స్, లాంటి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసేవారిలో 95 శాతం పనికిరారని సర్వే తేల్చింది. కేవలం 4.77 శాతం మంది మాత్రమే కచ్చితమైన లాజిక్ తో ప్రాగ్రాం రాయగలుగుతున్నారట.

image


500 కాలేజీల్లోని ఐటీ రిలేటెడ్ బ్రాంచిలకు చెందిన సుమారు 36వేల మంది ఇంజినీరింగ్ స్టూడెంట్లపై సంస్థ అధ్యయం చేసింది. వారిలో మూడింట రెండొంతుల మంది కంపైల్ చేసే కోడ్ రాయమంటే గుడ్లు తేలేశారు అందులో కేవలం 1.4 శాతం మంది మాత్రమే కరెక్ట్ కోడ్ రాయగలిగారు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోవడంతో దేశంలోని ఐటీ, డేటా సైన్స్ ఇకో సిస్టంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ విషయంలో దేశం మూడేళ్లు వెనక్కి వెళ్లిందని, దాన్ని అందుకోవాల్సిన అవసరం వుందని అస్పైరింగ్ మైండ్స్ సీఈవో అభిప్రాయ పడ్డారు.

నాణ్యత లేని విద్యాసంస్థల మూలంగా స్కిల్స్ విషయంలో స్టూడెంట్స్ ఘోరంగా వెనుకబడిపోయారనేది ఈ సర్వేద్వారా సుస్పష్టమైంది. కారణాలు ఏవైతేనేం, టైర్ వన్ కాలేజీలతో పోలిస్తే టైర్ త్రీ కాలేజీ విద్యార్ధులు ప్రోగ్రామింగ్ విషయంలో ఐదు రెట్లు వెనుకబడి ఉన్నారు. టాప్ 100 కాలేజీల్లో 69 శాతం విద్యార్ధులు కంపైల్ చేసే ప్రోగ్రాం రాయగలిగారు. మిగతా కాలేజీల్లో కేవలం 31 శాతం మాత్రమే కోడింగ్ చేశారు.

ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం హోం గార్డు ఉద్యోగాలకు దరఖాస్తులు కోరితే అందులో ఎక్కువ శాతం బీటెక్ విద్యార్ధులే ఉన్నారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలే ఇవి. ఇంజినీరింగ్ చదివి హోంగార్డు ఉద్యోగానికి అప్లికేషన్ ఏంటని ఆశ్చర్యపోయే రోజులు పోయాయి. ఎందుకంటే సరైన స్కిల్స్ లేక, చదివిన చదువుకి తగిన ఉద్యోగం సంపాదించుకోలేక విద్యార్ధులు చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు.

మొదట్లో అన్ని ఇంజినీరింగ్ కాలేజీలు వందశాతం ప్లేస్ మెంట్ అని జాయినింగ్ టైంలో ఊదరగొడతాయి. ఆ తర్వాత చేతులెత్తేస్తాయి. దేశంలో సుమారు 3వేల కాలేజీల వరకు చెప్పిన ప్రామిస్ నెరవేరుస్తున్నాయి. మిగతా కాలేజీ విద్యార్ధులంతా ఏదో ఒక ఉద్యోగంలే అని సరిపెట్టుకుంటున్నారు. లేదంటే ఐటీ రంగంలోనే అతి తక్కువ జీతానికి ఉద్యోగం చేస్తున్నారు.