సైలెంట్ హార్ట్ఎటాక్‌ని గుర్తించే పరికరాన్ని తయారుచేసిన 15ఏళ్ల కుర్రాడు  

0

సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు ఛాతిలో విపరీతమైన ననొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగుతాయి. దాన్నిబట్టి హార్ట్‌ ఎటాక్ వచ్చిందని చెప్పొచ్చు. అదే అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తే పై లక్షణాలేవీ కనిపించవు. సైలెంట్‌గా గుండెమీద దాడి జరుగుతుంది. ఒంట్లో చిన్నపాటి నలతగా మాత్రమే అనిపిస్తుంది. అలసటతో అలా అనిపిస్తుందేమో అని పెద్దగా పట్టించుకోరు. కానీ అలాంటివే కొంపముంచుతాయి. దాన్నే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు.

చెన్నయ్‌కి చెందినఆకాశ్ మనోజ్ తాతయ్యకు అలాంటి గుండెపోటే వచ్చింది. అతనికి బీపీ, షుగర్ ఉన్నప్పటికీ హెల్దీగానే ఉండేవాడు. కానీ హఠాత్తుగా స్ట్రోక్ రావడంతో కుప్పకూలిపోయాడు. చికిత్స అందించేలోపే చనిపోయాడు.

తాత మరణం ఆకాశ్‌ మనోజ్‌ని ఆలోచింపజేసింది. ఎందుకిలా గుండె సైలెంట్‌గా బ్రేక్ అయిపోతుంది? ఏ సింప్టమ్స్ లేకుండా వచ్చే సైలెంట్ హార్ట్ ఎటాక్‌లని గర్తించలేమా? 8వ ‌క్లాసులో వచ్చిన ఆలోచన ఆవిష్కరణ వైపు నడిపించింది. చిన్నప్పటి నుంచీ డాక్టర్ కావాలన్న తలంపు మరింత ఊపునిచ్చింది. తరచూ బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లైబ్రరీకి వెళ్లేవాడు. కార్డియాలజీకి సంబంధించిన పుస్తకాలు తిరిగేసేవాడు. జర్నల్ ఆర్టికల్స్ ఖర్చుతో కూడుకున్నవి. అదే లైబ్రరీ అయితే బెస్ట్ అనుకున్నాడు. ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించాడు.

ఆకాశ్ కనుగొన్న పరికర శరీరానికి ఎలాంటి హాని చేయదు. రక్తంలోని ప్రోటీన్, ఎఫ్‌ఏబీపీ3( ఫ్యాటీ యాసిడ్ బైండింగ్ ప్రోటీన్3)ని చెక్ చేస్తుంది. దాన్ని మణికట్టుకుని కట్టుకోవచ్చు. లేదా చెవి వెనుక భాగంలో అయినా పెట్టుకోవచ్చు. ఇదొక టెక్నికల్ డివైజ్.

ఆకాశ్ ఆవిష్కరణ తలపండిన వైద్య నిపుణులనే ఆశ్చర్యపరిచింది. పదో క్లాసులోనే అతను ఆలోచించిన తీరుకి వారంతా ముగ్దులయ్యారు. చడీచప్పుడు లేకుండా ఆగిపోయే గుండెను మనిషి కనుసన్నల్లో పెట్టిన తీరు నిజంగా వండర్. అభినందనలు వెల్లువలా వచ్చాయి. రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపొచ్చింది. ఇన్నోవేషన్ స్కాలర్స్ ఇన్ రెసిడెన్స్ కేటగిరీలో విశిష్ట అతిథిగా ఆహ్వానం అందుకున్నాడు.

తను తయారు చేసిన పరికరం ఎందరి ప్రాణాలనో నిలబెడుతుందని ఆకాశ్ బలంగా నమ్ముతున్నాడు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి, ఆసుపత్రి అందుబాటులో లేనివారికి ఇది బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాడు. పరికరానికి సబంధించిన పేటెంట్ హక్కుల కోసం ఫైల్ చేశాడు. ఈ డివైజ్‌ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టుగా చేపట్టి గ్రామాల్లో సరఫరా చేయాలని కోరుతున్నాడు.

ఢిల్లీ ఎయిమ్స్ లో కార్డియాలజీ చదవడానికి చిన్నతనంలోనే బాటలు పరుచుకున్న ఆకాశ్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. వయసుతో సంబంధం లేకుండా అపార వైద్య పరిజ్ఞానాన్ని బుర్రలో నిక్షిప్తం చేసుకున్న ఈ కుర్రాడు.. భవిష్యత్ లో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని కోరుకుందాం.

Related Stories