'ఆల్టిట్యూడ్ సిండ్రోమ్'తో ఆకాశం అంచులను తాకే ఆనందం

'ఆల్టిట్యూడ్ సిండ్రోమ్'తో ఆకాశం అంచులను తాకే ఆనందం

Monday September 21, 2015,

3 min Read

సాజిష్, ర‌ణ‌దీప్.. ఇద్ద‌రూ ఒక‌ప్పుడు కార్పొరేట్ ఉద్యోగ‌స్తులే. ఇద్ద‌రికీ ట్రెకింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే త‌మ లాంటి అభిరుచి వున్న వారికి మ‌రింత మెరుగైన ట్రెకింగ్ అనుభ‌వాన్ని ఇవ్వ‌డానికి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఏడాది క్రితం ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ అనే అడ్వంచ‌ర్ ట్రావెల్ కంపెనీని మొద‌లుపెట్టారు.

కంపెనీ మొద‌లుపెట్టిన కొద్దిరోజుల్లోనే అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ ఏడాది మొద‌టి ఆరు నెలల్లోనే ఈ స్టార్టప్ ఉత్త‌రాఖండ్‌లో ఆరు ట్రెక్కింగ్ ట్రిప్పుల‌ను నిర్వ‌హించింది. భూటాన్, ఉత్త‌రాఖండ్ ల‌లోని ప‌ర్వ‌త‌ ప్రాంతాల్లో మరో ఏడు క్యాంపులు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

సాజిష్ స్వ‌యంగా ట్రెక్క‌ర్. బ్లాగ‌ర్. ప్రోమెటిస్ అనే ట్రెయినింగ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రు. ఒక‌ రోజు మ‌ధ్యాహ్నం త‌న ఆఫీసులో ప‌నిచేసుకుంటూ వుండ‌గా అత‌నికి అనుకోకుండా ఒక పేరు త‌ట్టింది. అప్ప‌టికి చాలా రోజులుగా అత‌ని మ‌న‌సులో ట్రెకింగ్, అడ్వంచ‌ర్.. ట్రావెలింగ్ రంగంలో ఏదైనా చేయాల‌నే కోరిక వుంది. అయితే, దానిపై పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌లేదు. కానీ ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ అనే ఈ పేరు అనుకోకుండా మ‌న‌సులోకి మెరుపులా వ‌చ్చాక‌, ఇక ఆల‌స్యం చేయ‌లేదు. వెంట‌నే ఆ పేరు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి అందుబాటులో వుందో లేదో నెట్‌లో వెతికాడు. అది అందుబాటులోనే వుంద‌ని తెలిసాక‌, వెంట‌నే ఆ పేరుతో వెబ్ సైట్ బుక్ చేసి.. ఇక వెనుతిరిగి చూడ‌లేదు.

కాలేజీ రోజుల నుంచి స్నేహితుడు, ట్రెకింగ్‌లో స‌హ‌చ‌రుడు, ప్రోమెటిస్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రు అయిన ర‌ణ్‌దీప్ కూడా సాజిష్ ఆలోచ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. అలా ఈ ఇద్ద‌రు స్నేహితులూ ట్రెకింగ్‌లో త‌మ అనుభవాన్నీ, అభిరుచినీ త‌మ వ్యాపారంగా మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

Co-founders Sajish GP (in black) and Randeep Hari.

Co-founders Sajish GP (in black) and Randeep Hari.


ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు

ప‌ర్వ‌తాల‌ను ఒక‌సారి అధిరోహిస్తే, అది జీవిత కాల వ్య‌స‌న‌మైపోతుంది. అందుకే వీలైనంత ఎక్కువ మందికి ఈ రుచి చూపించి.. వారిని ట్రెక్క‌ర్లుగా మార్చాల‌న్న‌దే ఈ సంస్థ ఆశ‌యం. ట్రెకింగ్ అంటే, మీరు చూడాల్సిన ప్రాంతాల జాబితాలో ఓ టిక్ పెట్టుక‌ోవ‌డం కాద‌న్న‌ది వీళ్ల ఫిలాస‌ఫీ.

  • ఎక్కువ‌ రోజుల ట్రిప్..

ఒక‌సారి ట్రెకింగ్‌కి బ‌య‌ల్దేరాక వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌చ్చు. మ‌రికొన్ని సార్లు కొంత మంది ఔత్సాహికుల‌కు పర్వతారోహణ అల‌వాటు లేక ఎక్కువ టైమ్ తీసుకోవ‌చ్చు. వీట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ ఎక్క‌వ రోజుల టూర్ ప్లాన్ చేస్తుంది. “ అడుగులో అడుగేసుకుంటూ న‌డిచే వాళ్ళు కూడా ట్రెకింగ్ ఎంజాయ్ చేయాల‌న్న‌దే మా ల‌క్ష్యం. చాలా మంది ఈ వ‌య‌సులో మాకు ట్రెకింగ్ ఏంట‌ని అనుకుంటారు. మ‌రి కొంద‌రు త‌మ‌కి అంత‌గా ఫిట్‌నెస్ లేద‌నుకుంటారు. అయితే, ట్రెకింగ్ అంటే అదేం బ్ర‌హ్మ విద్య కాదు.. న‌డ‌క లాంటిదే, కాక‌పోతే, ఇక్క‌డ అడ‌వుల్లో న‌డుస్తాం అంతే తేడా. అందుకే ఎవ‌రైనా ట్రెకింగ్ చేయొచ్చు అనే న‌మ్మ‌కాన్ని క‌లిగించాల‌నుకుంటాం ” అంటారు ర‌ణ్ దీప్.

  • త‌క్కువ మందితో గ్రూపులు

“ ఒక గ్రూపులో 12 మంది వుంటే బావుంటుంద‌ని మా అనుభ‌వంతో తెలుసుకున్నాం. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఒక్కోసారి ఐదుగురే వుండే చిన్న గ్రూపుల‌ని, 15 మంది వ‌ర‌కూ వుండే పెద్ద గ్రూపుల‌ని కూడా ట్రెకింగ్‌కి తీసుకెళ్తాం ” అన్నారు సాజిష్. పరిమిత ట్రెక్క‌ర్లు వుంటేనే ట్రెకింగ్ అనుభ‌వం బావుంటుంద‌నేది సాజిష్ అభిప్రాయం. ఎముక‌లు కొరికే చలిలో ఇర‌వై ముప్పై మంది టాయిలెట్ల ముందు వెయిట్ చేస్తుంటే ఎలా వుంటుందో మీరే ఊహించుకోండ‌ని జోక్ చేస్తారు. 

  • సంస్కృతికంగా మ‌మేక‌మ‌వుతాం..

చాలా వ‌ర‌కు ట్రెకింగ్‌ల‌ని స్థానిక ఉత్స‌వాల‌తో పాటు వ‌చ్చేలా ప్లాన్ చేస్తారు. ఒక‌వేళ అలా లేక‌పోయినా, గ్రూపులోని స‌భ్యులు.. స్థానిక వ్య‌క్తుల‌తో క‌లిసిపోయి వారితో క‌లిసి తిని తిర‌ిగేలా ఏర్పాట్లు చేస్తారు.

  • ఏరికోరి ఎంపిక చేసిన స్టాఫ్..

హిమాల‌యాల్లోని అనేక ప్రాంతాల్లో గైడ్‌లు , పోర్ట‌ర్లు, వంట వాళ్ళు.. ఇత‌ర‌త్రా స‌హాయ‌క వ్య‌క్తుల‌తో, సంస్థ‌ల‌తో ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వున్న సంస్థ‌ల‌తో కూడా భాగస్వామ్యం చేసుకోవాల‌నుకుంటోంది.

  • మ‌ల్టీ కోర్స్ మీల్స్... చాలా వ‌ర‌కు ట్రెక్స్ లో అందుబాటులో వుంటాయి

ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఏర్పాట్లు చేయ‌డం వ‌ల్ల ట్రెకింగ్ ట్రిప్ రేటు కూడా ఎక్కువవుతుంది. అయితే, సాదా సీదా టూర్ ఆప‌రేటర్ల‌తో పోలిస్తే, త‌మ రేటు కొంచెం ఎక్కువ‌యినా, హై ఎండ్ ఆప‌రేట‌ర్ల‌తో పోలిస్తే, చాలా త‌క్కువ ధ‌ర‌కే ఆ స్థాయి ప్రీమియమ్ సేవ‌లు అందిస్తామ‌ని ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ వ్య‌వ‌స్థాప‌కులు అంటారు. పాతిక నుంచి యాభైయేళ్ళ‌లోపు ప్రొఫెష‌నల్స్ మాత్రం సౌక‌ర్య‌వంతంగా వుంటూ, విశ్వ‌సనీయ‌మైన అనుభ‌వాన్నిచ్చే ట్రెకింగ్ ఆప‌రేట‌ర్ల కోసం చూస్తున్నారు. అలాంటి వాళ్ళే మా టార్గెట్ అని సాజిష్ అంటారు.

image


నోటి మాటే ప్ర‌చారం

ప్ర‌స్తుతం త‌మ వెబ్ సైట్, ఫేస్ బుక్ పేజీల ద్వారానే ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ మార్కెటింగ్ జ‌రుగుతోంది. అలాగే, ఒక‌సారి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు మ‌ళ్ళీ రావ‌డం, మ‌రికొంత మందిని తీసుకురావ‌డం వ‌ల్ల కూడా బిజినెస్ పెరుగుతోంది.

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌

ఇండియాలో స‌క్సెస్ అయిన ఈ మోడ‌ల్ ను ఇత‌ర దేశాల్లో కూడా అనుస‌రించేందుకు సాజిష్, ర‌ణ్ దీప్‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం హిమాల‌యాల‌ మీదే దృష్టి పెట్టిన ఈ టీమ్, త్వ‌ర‌లోనే స్వ‌దేశంలోనే కాక‌, విదేశాల్లో కూడా నెట్ వ‌ర్క్ విస్త‌రించాల‌నుకుంటోంది. కేవ‌లం భౌగోళికంగా విస్త‌రించ‌డ‌మేకాక‌, సాంస్కృతికంగా కూడా మ‌రిన్ని అనుభ‌వాల‌ని ట్రెక్క‌ర్ల‌కు అందించాల‌నుకుంటోంది.

మ‌న‌సుంటే, నిధులూ వుంటాయి.

ప్ర‌స్తుతానికి సొంత డ‌బ్బుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు, స్నేహితుల నుంచి సమీకరింంచిన నిధులతో ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ న‌డుస్తోంది. ఫండ్స్ సేక‌ర‌ణ‌కు తొంద‌ర‌ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌స్తుతానికి వీరు భావిస్తున్నారు. భ‌విష్య‌త్ లో ఫండ్స్ అవ‌స‌ర‌మై, ట్రావెలింగ్ అంటే మ‌క్కువ వున్న ఇన్వ‌ెస్టెర్ దొరికితే, అప్పుడు ఆలోచిద్దాం అని ర‌ణ్ దీప్ చెప్తున్నారు. “ ఇప్పుడిప్పుడే తాడు ప‌ట్టుకుని పైకెళ్తున్నాం. చూద్దాం ఒక ఏడాది త‌ర్వాత ఎక్క‌డుంటామో.. క‌చ్చితంగా పైనే వుంటాం.. ” అని స‌ర‌దాగా చెప్పారు.. సాజిష్.