ఇంటి పెయింటింగ్ సమస్యలకు పరిష్కారం 'కలర్ క్యాన్'

0

దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. దుమ్మంతా దులిపేసి.. ఇంటినంతా సర్దుకోవాలి. శుభ్రం చేసుకుని.. వీలైతే.. ఇంటికో, ఆఫీసుకో పెయింట్లు కూడా చేయించుకోవాలి. కానీ.. అంత తీరిక, ఓపికలు లేవు. భరోసా ఉన్న వాళ్లు ఎవరైనా.. దొరికితే బావుండు. అన్నీ వాళ్లే సర్దేసి.. నీట్‌గా మనకు కావాల్సిన రంగులేసి వెళ్తే.. ఎంత సంతోషమో.. ! అని అనుకునే వాళ్లు బోలెడు మంది. కానీ ముందే ఈ రంగం కాస్త అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో.. లేదో.. చెప్పలేని పరిస్థితి. అందుకే ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ ముందుకు వచ్చింది హైదరాబాద్ స్టార్టప్ కలర్ క్యాన్.

Image credit - shutterstock

ఇల్లు, ఆఫీసులో పెయింటింగ్, కలర్ కాంబినేషన్స్, గ్రాఫిటీ, డూడుల్స్, వాల్ డెకొరేషన్.. ఇలా ఒక్కటేమిటి.. ఇల్లు అందంగా కనిపించేందుకు అవసరమైన అన్ని పరిష్కారాలనూ సూచిస్తోంది కలర్ క్యాన్. సాధారణంగా పెయింటింగ్ ఇండస్ట్రీ కాస్త అవ్యవస్థీకృతంగా ఉంటుంది. లేబర్‌తో డీల్ చేసే వ్యవహారం కాబట్టి.. చాలా మంది వెనక్కి తగ్గుతారు. కానీ ఇందులోనూ పెద్ద సంఖ్యలో ప్రొఫెషనల్స్ ఉన్నారని, మనకు కావాల్సినట్టు ఇంటిని రంగుల హరివిల్లు చేసి వెళ్తారని ఈ స్టార్టప్ చెబ్తోంది.

కలర్ క్యాన్ కో ఫౌండర్లు

ఇల్లు, ఆఫీస్ వాతావరణానికి సరిపడ కలర్ కాంబినేషన్లు, వాళ్ల అభిరుచులకు తగ్గట్టు రంగులు, అవసరమైతే.. వినూత్న డిజైన్లు, డిజైనర్లతో సంప్రదించి.. ఆర్ట్ వర్క్.. వంటివన్నీ చేసిపెడ్తామని చెబ్తున్నారు కలర్ క్యాన్ ఫౌండర్ అర్జున్ సింగ్. ఎవరి బడ్జెట్‌కు తగ్గట్టు వారికి వాల్ డాక్టర్‌లా సేవలు అందిస్తామని చెబ్తున్నారు.

ఎలా వచ్చిందీ ఆలోచన ?

తన కుటుంబంలోని వాళ్లు పండగుల సీజన్‌లో ఇంటికి రంగులను వేయించే బాధ్యతను యువకుడైన అర్జున్‌కు అప్పగించేవారు. చేసేది లేక.. ఆ బాధ్యతను నెత్తినవేసుకున్నారు. పెయింట్ల ఎంపిక, సరైన పెయింటర్లను గుర్తించడం, వారితో డీల్ మాట్లాడుకోవడం, ఇల్లంతటినీ సర్ది.. వాళ్లతో పనిచేయించే సరికి.. చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రతీ ఏడాదీ.. జరిగే.. ఈ తంతులో ఇంత కష్టముందా.. ? దీన్ని మనం సులువు చేయలేమా.. అనే ఆలోచన తట్టింది అర్జున్‌కు. అప్పటి నుంచే దీనిపై కసరత్తు మొదలుపెట్టారు.

బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసిన అర్జున్.. కొద్దికాలం పాటు చైనాలోని బెరో అనే రీసెర్చ్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఈ స్టార్టప్ ఆలోచనలే మదిలో మెదులుతూ ఉండేవి. ఆలోచనలు ఇతర మిత్రులతో పంచుకోవడంతో ఇద్దరు కో ఫౌండర్లతో ఓ స్టార్టప్ మొదలుపెట్టారు. సరైన్ ప్లానింగ్, మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో ఫెయిల్ అయింది. డబ్బులు పోయినా.. అనుభవం మిగిలింది. ఈ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలున్నాయనే బలమైన నమ్మకంతో అర్జున్ మరోసారి ఇందులోకి దిగాడు. తన తల్లి సిమి సింగ్‌ కో-ఫౌండర్‌గా రెడ్ చెర్రీ అనే సంస్థను ప్రారంభించారు. అదే సంస్థ కొద్దికాలం క్రితం కలర్ క్యాన్‌గా మారింది. అర్జున్ తల్లిదండ్రులు కూడా ఈ స్టార్టప్‌లో కీలక బాధ్యతలు పోషిస్తున్నారు.

ఏంటి వీళ్ల స్పెషాలిటీ ?

'' మా టీమ్ ఇంటిని పరిశీలించిన తర్వాత థీమ్, ఫర్నిచర్, కస్టమర్ ఆలోచనలన్నీ పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ల బడ్జెట్లో వాళ్లకు అనుకూలంగా పెయింటింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తాము. కొంత మంది డిజైనర్లతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్లు ఇచ్చిన డిజైన్లతో ఇంటికి కొత్త సొబగులు అద్దడంతో పాటు అవసరమైతే ఫర్నీచర్, డెకార్ ఐటెమ్స్‌కు కూడా అందిస్తా '' అంటున్నారు అర్జున్.

రెగ్యులర్‌గా ఇంటికి కలరింగ్ చేయంచుకునే వారితో పాటు కొత్త ఇళ్లలోకి వెళ్లేవారు వీళ్ల టార్గెట్ కస్టమర్లు. సాధారణంగా ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. డిజైన్లు, హోం డెకార్ వంటివి మధ్యతరగతి వాళ్లకు అందనంత ఎత్తులో ఉంటాయి. ఇక మామూలు పెయింటింగ్ సంగతి సరేసరి. కలర్ క్యాన్ ఈ రెండింటి కాంబినేషన్‌ అంటున్నారు అర్జున్. అందుబాటు ధరలో అందరికీ పెయింటింగ్ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యమని వివరిస్తున్నారు.

'' ప్రీమియం సెగ్మెంట్ ఎక్కడైనా ఉంటుంది. డబ్బులు ఖర్చు చేసే వాళ్లకు.. ఇంటీరియర్ డెకొరేటర్స్, ఆర్కిటెక్స్ దొరుకుతారు. కానీ అంత స్థోమత లేని వాళ్లకు మేము పరిష్కారం. వాళ్ల బడ్జెట్లో ఇంటికి ఓ కలర్‌ఫుల్ సొల్యూషన్ చూపిస్తాం '' - అర్జున్.

ప్రసుతానికి హైదరాబాద్‌లో పూర్తిగా విస్తరించిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లాలని కలర్ క్యాన్ చూస్తోంది. 2015 జూన్‌లో ప్రారంభమైన సంస్థ ఇప్పటివరకూ 35 ఇళ్లకు కలరింగ్ సొల్యూషన్స్‌ను అందించింది. ఈ ఏడాదిలోగా వంద ఇళ్లను చేరడం మొదటి టార్గెట్‌ అంటున్నారు అర్జున్. మార్కెటింగ్ కోసం పెయింట్ షాపులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు వివరించారు. ఖర్చు విషయానికి వస్తే.. సాధారణ పెయింటింగ్‌కు చదరపు అడుగు చొప్పున వసూలు చేస్తున్నారు. డెకార్, డిజైనింగ్, గ్రాఫిటీ, కలర్ సొల్యూషన్స్‌కు ప్రైజింగ్ వేరుగా ఉంది. రెండు, మూడు నెలల క్రితం సొంత నిధులతో మొదలైన ఈ ఫ్యామిలీ స్టార్టప్.. భారీ లక్ష్యాలనే నిర్దేశించుకుంది.

website

మా లక్ష్యం ఒకటే - ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసి మీ విజయగాధను వివరించడం ! వాళ్లలో స్ఫూర్తిని నింపడం.

Related Stories

Stories by Nagendra sai