ఇంటర్నెట్ రెస్టారెంట్ లో ఇంటి భోజనం

ఇంటర్నెట్ రెస్టారెంట్ లో ఇంటి భోజనం

Monday April 04, 2016,

3 min Read


నెట్ కేఫ్ ల గురించి విన్నాంగానీ… ఈ ఇంటర్నెట్ రెస్టారెంట్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? ఇలాంటి వినూత్న ఆలోచనే చేశారు రాజేశ్ చౌహానీ, సంజీవ్ సింఘాల్, బాల్ దిగెంట్. స్టార్టప్ ఆలోచనతో ఇన్ గ్రేడియంట్ బాక్స్ పెట్టాలనుకున్నారు. లాభసాటిగా ఉంటుందనుకుని ఇంటర్నెట్ రెస్టారెంట్ పెట్టారు. ఇన్ గ్రేడియంట్ బాక్స్ అంటే ఒక డిష్ వండుకోవడానికి అవసరమైన అన్ని దినుసులను ఒక బాక్స్ లో పెట్టి పంపించడం అన్నమాట.

2015లోనే ఈ ఐడియా వచ్చింది. అయితే ఇది ఇండియన్ మార్కెట్లో వర్కవుట్ కాదని తర్వాత గ్రహించారు. ఆ స్థాయికి ఇండియన్ మార్కెట్ వెళ్లాలంటే ఇంకో ఐదేళ్లు పడుతుంది. ఇన్ గ్రేడియంట్ బాక్స్ ఐడియా బాగానే ఉందని కస్టమర్లు చెబుతున్నా… అది వర్కవుట్ కావాలంటే చాలా టైం పడుతుందంటున్నారు రాజేశ్. సామాన్లు పంపిస్తే వాటితో వంట చేసుకునేంత ఓపిక, తీరిక జనాలకు లేవిప్పుడు.

image


ఎన్నో మలుపులు – ఒక రూపు

ఇన్ గ్రేడియంట్ బాక్సులు వర్కవుట్ కావన్న ఉద్దేశంతో … ఆన్ లైన్లోనే రెడీ టూ ఈట్ ఫుడ్స్ బిజినెస్ ప్రారంభించారు. తమ స్టార్టప్ కు ఇన్నర్ చెఫ్ అని పేరుపెట్టారు. ప్రారంభంలో శాండ్ విచ్, సలాడ్, జ్యూస్ ఆన్ లైన్లో అమ్మారు. ఒక్కో ఫుడ్ బాక్స్ ధర 2 వందల నుంచి 250 రూపాయలుగా నిర్ణయించారు. ఆరోగ్యకరమైన భోజనం కావాలనుకునే ప్రొఫెషనల్స్ లక్ష్యంగా బిజినెస్ ప్రారంభించారు.

తర్వాత భోజనంతోపాటు ఫలహారాలు కూడా అందించడం మొదలుపెట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇండల్జ్ పేరుతో డిజర్ట్ ను ప్రత్యేకంగా అమ్ముతున్నారు. డిజర్ట్స్ ను సొంతంగా తయారు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే మేమే వాటిని తయారుచేసి ఇస్తామంటోంది ఇన్నర్ చెఫ్ రెస్టారెంట్. గృహిణులతో ఈ డిజర్ట్స్ తయారుచేయించి కస్టమర్లకు అందిస్తోంది.

“ఇన్నర్ చెఫ్ లో భాగంగా ఏర్పాటుచేసిన ఇండల్జ్ నుంచే మాకు 30 శాతం వరకు ఆదాయం వస్తోంది. ఫుడ్ మెనూలో భాగంగా ఇప్పుడు చాలా మంది డిజర్ట్స్ వాడుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు ప్రయోగాలు చేసి, ఫోకస్ చేసి రుచికరమైన ఫుడ్ అందిస్తున్నాం. అదే మా ఎదుగుదలకు కారణం .” రాజేశ్
image


ఇన్నర్ చెఫ్ కు ఒక ప్రత్యేక ఫుడ్ మోడల్ ఉంది. నగరాల్లో సెంట్రల్ కిచెన్స్ ఏర్పాటు చేశారు. నమ్మకమైనవారికి ఫుడ్ తయారీ ఔట్ సోర్సింగ్ ఇస్తున్నారు. దీంతో చాలా నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఫుడ్ ను వేగంగా అందివ్వగలుగుతున్నారు. ప్యాకేజింగ్, డెలివరీ సిస్టమ్, కస్టమర్లతో మాట్లాడటం అంతా పక్కాగా చేస్తున్నారు.

క్యూరేటెడ్ మార్కెట్ ప్లేస్ మోడల్ లో ఇండల్జ్ పనిచేస్తోంది. గృహిణులు తయారు చేసిన ఫుడ్ ను టేస్ట్ చేసి, క్వాలిటీ స్క్రీనింగ్ తర్వాత వాటిని కస్టమర్లకు పంపిస్తున్నారు. వంద నగరాలకు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నారు. వెయ్యి బేకర్స్ తో మాట్లాడారు. ఇండియన్ డిజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ పైనా దృష్టిపెట్టారు.

సరిహద్దులను చెరిపేస్తున్నారు

గుర్గావ్, ఢిల్లీల్లో విజయం సాధించాక గత నవంబర్ నుంచి ఇతర నగరాలకు విస్తరించడం మొదలుపెట్టిందీ కంపెనీ. బెంగళూరులో సెంట్రల్ కిచెన్ లు ఏర్పాటు చేశారు. కోరమంగళంలో ఈట్ ఆన్ గో ను గత నెలలోనే టేకోవర్ చేసి మరాఠా తాలీ అందిస్తున్నారు. ఇందిరానగర్ మార్కెట్ ను సైతం కైవసం చేసుకున్నారు. గత నెలలో అంటే మార్చిలోనే గుర్గావ్ లోని ఫ్లేవర్ ల్యాబ్స్ ను కొనుగోలుచేసింది ఇన్నర్ చెఫ్స్. మొబైల్ కిచెన్ ప్లేస్ లోనూ స్థానం సంపాదించారు. ముంబైలోనూ ఇన్నర్ చెఫ్ అడుగుపెట్టింది. హైదరాబాద్, చెన్నైలో త్వరలో సేవలను ప్రారంభించనున్నారు.

“దేశంలో ఫుడ్ మార్కెట్ చాలా పెద్దది. డోర్ డెలివరీ మార్కెట్ విలువే 15 బిలియన్ డాలర్లు. మార్కెట్లో చాలా రకాల కంపెనీలున్నాయి. డొమినోస్, అగ్రిగేటర్స్, డిస్కవరీ మోడల్స్ ఇలా. కానీ ఇన్నర్ చెఫ్ మోడల్ మాత్రం… ఫుడ్ ను స్వయంగా టెస్ట్ చేశాకే… కస్టమర్ కు వెళ్తుంది. అదే మా సక్సెస్ సీక్రెట్. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఏ బిజినెస్ కైనా క్వాలిటీ చాలా ముఖ్యం.” శృతి

ఇన్నర్ చెఫ్ కు సగటు ఆర్డర్ విలువ ఐదు వందల రూపాయలు. ఒక్కో ఐటం ధర వంద నుంచి 3 వందల వరకు ఉంటుంది. నెలకు 40 శాతం ఆర్డర్స్ పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యికిపైగా ఆర్డర్స్ వచ్చిపడుతున్నాయి. డిమాండ్ కు తగ్గట్లుగా పలు ప్రాంతాల్లో కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నర్ చెఫ్ పంపించే ఫుడ్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటోందని డాక్టర్లే చెబుతున్నారు. ఫుడ్ క్వాలిటీ, కిచన్ మెయింటెన్స్ లో ఏమాత్రం రాజీ లేదు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లుకట్టినట్లు చాలా జాగ్రత్తగా బిజినెస్ డెవలప్ చేస్తున్నారు.

image


ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ ఎలా ఉంది?

ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ లో చాలా స్టార్టప్స్ వచ్చాయి. ఇదే మోడల్ లో ఫ్రెష్ మెనూ స్టార్టప్ వచ్చింది. జోమాటో, స్విగ్గీ, హోలా చెఫ్ ఇలా ఇప్పటికే ఇంటర్నెట్ రెస్టారెంట్ రంగంలో సత్తా చాటుతున్నాయి. ఫుడ్ బిజినెస్ కు చాలా మార్కెట్ ఉంది. అయితే ఎంత టేస్టీగా వండినా… రోజూ ఒకేలాంటి ఆహార పదార్థాలు వండితే ఎవరికైనా బోర్ కొడుతుంది. కస్టమర్లు ఎప్పుడూ కొత్త రుచులే కోరుకుంటారు. మార్కెట్లో ఇంకా చాలా స్టార్టప్స్ కు అవకాశం ఉంది.