సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామింగ్ నుంచి అసొసియేట్ జీఎం వరకు.. టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తున్న సీమాలాల్‌

-సాఫ్ట్‌వేర్ రంగంలోనూ మహిళలకు తిరుగులేదని నిరూపించిన సీమాలాల్ సక్సెస్‌ స్టోరీ

0

సీమా లాల్ గులాబ్‌రాణి.. ఇండియాలో టెక్నాలజీ అడుగుపెట్టినప్పటి నుంచి ఆ రంగంలో దూసుకుపోతున్న మహిళ. సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె- ఇప్పుడు అత్యున్నత పొజిషన్‌లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఓ మహిళ ఈ స్థాయిలో ఉండటం భారత్‌లాంటి దేశాల్లో అరుదైన విషయమే. కానీ సీమ ఈ స్థాయికి చేరడానికి అకుంఠిత దీక్షే కారణం. ఓ వైపు కుటుంబ సమస్యలు, సమాజం నుంచి అవరోధాలు ఎదురైనా సీమ మాత్రం తనకెంతో మక్కువ అయిన టెక్నాలజీ రంగంలో లక్ష్యాన్ని అధిగమించారు.

సీమది హృద‌యాల‌ను క‌దిలించే కథనం. మహిళలందరికీ స్ఫూర్తిదాయకమైన స్టోరీ. ఆమెకు టెక్నాలజీ అంటే అమితమైన ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే పిచ్చి. కొత్త టెక్నాలజీ ఏదీ వచ్చినా దాన్ని నేర్చుకునేవరకూ నిద్రపోని మనస్తత్వం. వాస్తవానికి టెక్నాలజీ రంగంలో మహిళల సంఖ్య, పురుషలతో పోలిస్తే చాలా తక్కువ. కానీ పట్టుదల ఉంటే పురుషుల కంటే మంచి పేరును సంపాదించగలరని సీమ నిరూపించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో మహిళలకు తిరుగులేదని నిరూపించిన సీమ తన కెరీర్ విశేషాలను హర్‌ స్టోరీకి తెలియజేశారు.

సీమాలాల్
సీమాలాల్

బ్యాక్‌గ్రౌండ్..

సీమ ఎప్పుడు చదువుల్లో ముందుండేవారు. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) పూర్తి చేసిన వెంటనే ఫుణెలో పుజిట్స్ అనే కంపెనీలో సాఫ్ట్‌వేర్ కెరీర్‌ను ఆరంభించారు. అక్కడ కొన్నాళ్లు జాబ్ చేసిన తర్వాత ఢిల్లీలోని ఎన్‌ఐఐటి (నిట్)‌కు మారిపోయారు. నాలుగేళ్లపాటు నిట్‌లో పనిచేసిన తర్వాత కొంతకాలంపాటు కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో స్టార్టప్ కంపెనీలు, కన్సల్టెంట్‌ రంగాలపై దృష్టిపెట్టారు. ఢిల్లీలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా చేశారు. ఆ తర్వాత కొంతకాలం జావాలో పనిచేశారు. గుర్గావ్‌లోని సాపియెంట్ టెక్నాలజీలో చేరి రెండేండ్ల పాటు పనిచేశారు. 2003 నుంచి సోప్రాలో పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు సీనియర్ లీడ్ అర్కిటెక్ట్ వరకూ వెళ్లింది. సాఫ్ట్‌వేర్ బూమ్ ఇండియాలో మొదలైనప్పటి నుంచి ఆమె టెక్నాలజీ రంగంలోనే ఉన్నారు. అదే సీమాకు కలిసొస్తున్న అంశం. సుదీర్ఘ కాలంపాటు పనిచేసినా.. సాఫ్ట్‌వేర్ రంగంపై ఆమె వెగటు కలగలేదు. ఇంత సుదీర్ఘ కాలంగా సాఫ్ట్‌వేర్ రంగంలో కొనసాగడానికి కారణం.. ప్రొఫెషన్‌పై ఆమెకు ఉన్న వల్లమాలిన అభిమానమే.

మల్టీ ప్రాజెక్ట్‌ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్..

యూరోప్‌లోని క్లయింట్స్‌కు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను ఆర్కిటెక్ట్ చేసి ఇస్తారు సీమ. ప్రాడక్ట్‌ ఆలోచన దశలో ఉన్నప్పటి నుంచి- అది అమలై కస్టమర్లు ఉపయోగించుకునే వరకూ అన్ని దశల్లోనూ ఆమె పాలుపంచుకుంటారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో అనుభవమున్న సీమ ఒకేసారి వివిధ ప్రాజెక్టుల్లో పాలు పంచుకోవడం విశేషం. ఆపరేషనల్ లెవల్‌లో ప్రతిరోజు ఇంజినీరింగ్ బృందంతో కలిసి పనిచేస్తారు.

కష్టాల బండిలో ప్రయాణం..

సీమా పెళ్లయిన కొన్నేళ్లకే భర్త చనిపోయారు. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. అప్పట్లో భారత్‌లో సింగిల్ మదర్ అన్న ఆలోచనే ఎవరికీ వచ్చేది కాదు. కానీ ఆమె మాత్రం తన కాళ్లపై తానే నిలబడాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిప్రెషన్‌ నుంచి బయటపడి, కుమారుడి బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. కొన్నిసార్లు ఆఫీసు ఇల్లు సమన్వయం చేసుకోవడం చాలా కష్టమైంది. అయినా ఎప్పటికప్పుడు తనను తాను సంభాళించుకుంటూ, రెండింటిని సమన్వయపర్చుకున్నారు సీమ.

‘‘జీవితంలో సమస్యలు సహజమే. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ, కాలంతో పాటు పయనిస్తే విజయం పాదక్రాంతమవుతుంది’’ అని అంటారు సీమ.

టెక్నాలజీ రంగంలో మహిళలు..

మహిళలంటే భారత్‌లో వంటింటికే పరితమవుతున్న రోజులవి. కాలం మారుతున్నా.. రెండు దశాబ్దాల క్రితం టెక్నాలజీ రంగంలో మహిళలంటే ఒకరిద్దరు మాత్రమే ఉండేవారు. ఈ రంగంలోకి మరింత మంది మహిళలు రావాల్సిన అవసరముందంటారు సీమ. ‘టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఇది ఎంతో వేగవంతమైన రంగం. అలాగే ఎంతో ఉత్సాహవంతమైన రంగం కూడా. మనం ఎదుగుతున్నట్టుగానే, ఒదిగి ఉండాలి. ఎందుకంటే లీడర్‌గా మన సూచలన కోసం ఎందరో ఎదురుచూస్తుంటారు’ అని సీమ చెప్పారు.

టెక్నాలజీ రంగంపై ఆసక్తి ఉన్న మహిళలకు, ఈ రంగంలో కావాల్సినంత మంది రోల్‌మోడల్స్ ఉన్నారని ఆమె తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అంటారామె. కోర్ డెవలప్‌మెంట్ రంగంలోకి ప్రవేశిచేందుకు ఇప్పటికీ మహిళలు వెనుకాడుతున్నారు. అదే సీమను ఆవేదనకు గురిచేస్తున్నది. ఇంటి పనులు, ఇతర సమస్యల కారణంగా కోర్‌ డెవలప్‌మెంట్‌లో పనిచేయడానికి మహిళలు ఆసక్తి చూపడంలేదన్నది సీమ అభిప్రాయం. ఈ రంగంలో మహిళల సంఖ్య మరింత పెరగాలని ఆమె అభిలషిస్తున్నారు..

లక్ష్యం..

ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న ఈ హార్డ్‌వేర్ టెక్కి.. వచ్చే పదేండ్లలో మరింత ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటున్నారు. ఏదైనా ఓ సంస్థకు నాయకత్వం వహించాలన్నదే ఆమె లక్ష్యం. తన గమ్యాన్ని ముద్దాడే సత్తా తనకుందనీ ఆమె ధీమాగా చెప్తున్నారు. టెక్నాలజీ రంగంలోనూ సత్తా చాటే సామర్థ్యం మహిళలకు ఉందని సీమ చెప్తారు. టెక్నాలజీని ఆస్వాదిస్తే.. ఆ రంగంలో కొనసాగాలని ఆమె ఇతర మహిళలకు సూచిస్తున్నారు..