జీవితాన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకోండి..! 

0


ఆడవాళ్లు అన్ని రంగాల్లోనూ దూసుకెళుతున్నారు... వందేళ్ల క్రితం వంటింటికే పరిమితమైన మహిళ....నేడు గడపదాటి ఏకంగా అంతరిక్షాన్ని ముద్దాడింది. వేల సంవత్సరాలుగా రాని ఈ మార్పు... కేవలం ఒక శతాబ్దకాలంలోనే వచ్చింది. దీనికి ఆర్ధిక, శాస్త్రసాంకేతికంగా, సామాజికంగా, రాజీకయంగా వస్తున్న పరిణామాలే కారణం.

సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా.... మహిళలు సంప్రదాయాన్ని పాటిస్తూనే...విలువలకు కట్టుబడి ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో (భారత్) అటు ఆధునిక పోకడలను ఇటు సంప్రదాయ విలువను రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తున్నారు. ఇది ఒక రకంగా కత్తిమీద సామే. అయినప్పటికీ త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా మ‌న దేశంలోనే వ‌ర్కింగ్ ఉమెన్‌గా చొర‌వ తీసుకొని కెరీర్ల‌ను ఎంచుకుంటున్నవారు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. నిజం చెప్పాలంటే వారు ఇంకా తొలి త‌రంలోనే ఉన్నారు. అంటే కెరీర్ ఆప్ష‌న్ ను ఎంచుకున్న మ‌హిళ‌లకు వారి కుటుంబంలో కానీ, వారి చుట్టు పక్క‌ల కానీ చాలా త‌క్కువ‌మంది మాత్ర‌మే రోల్‌ మోడ‌ల్స్ క‌నిపిస్తారు.

వెస్టర్న్ సొసైటీలో మ‌హిళ‌లు త‌మ కెరీర్ల‌ను ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ల‌భిస్తుంది. కుటుంబ ఒత్తిళ్లు, స‌మాజంలో చిన్న‌చూపు లాంటి స‌మ‌స్య‌లు పెద్ద‌గా ఉండ‌వు. కానీ మ‌న దేశంలో అటు కుటుంబ‌ బాధ్య‌త‌లు, ఇటు సంప్ర‌దాయం, మధ్యలో కెరీర్. వీట‌న్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ జీవితం గడపాల్సి ఉంటుంది. కొంతమంది మ‌హిళ‌లు మాత్రం ధైర్యంగా సంప్ర‌దాయ విలువ‌ల‌ను ఎదురించి నిల‌బ‌డిన‌ప్ప‌టికీ అలాంటి ఘటనలు పెద్ద‌గా వెలుగు చూడ‌వు.  

 అటు బాధ్య‌త‌లు, ఇటు కెరీర్ రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు పాటించాల్సిన సూత్రాలు కొన్ని మీకోసం.

1. మీ విలువ‌ల‌ను మీరే నిర్దేశించుకోండి..

మీ జీవితాన్ని ముందు మీరు నిర్వ‌చించుకుంటే మనం ఏం కావాల‌నుకుంటామో అది సాధించే అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎవ‌రు.. ఏం సాధించాల‌ని అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. అది కూడా మీ కులం, మ‌తం, మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, దేశం ఇలా అన్నింటిని వ‌దిలి.. అస‌లు మీరు ఎవ‌రు అనేది తేల్చుకోండి. అప్పుడు మ‌న ప‌ర్స‌నాలిటీకి సంబంధించిన స‌మాధానాలు ఒక్కొక్కటీ దొరుకుతాయి. ప్ర‌ఖ్యాత జ‌ర్మ‌న్ ఫిలాస‌ఫ‌ర్ ఫ్రెడ్రిక్ నిషే ఇలా అంటాడు... ఎవ‌రైతే తమ జీవితంలో ఏం సాధించాల‌నే సంగ‌తి గుర్తిస్తారో, వాళ్లు జీవితంలో ఎదుర‌య్యే ఎలాంటి స‌మ‌స్య‌ల‌నైనా ఎదిరిస్తారు. ఎప్పుడైతే మిమ్మ‌ల్ని మీరు గుర్తించి.. మీ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంటారో.. అప్పుడు వాటిని సాధించే క్ర‌మంలో మీరు పాటించాల్సిన విలువలు కూడా నిర్ణ‌యించుకుంటారు.

2. మిమ్మ‌ల్ని మీరు న‌మ్మండి..

మీ మ‌నస్సు మాట వినండి.. మీరు చేసే ప‌నిని ఒక‌టికి రెండుసార్లు ఆలోచించండి. ఆ త‌ర్వాత నే న‌మ్మ‌కం ఏర్ప‌ర‌చుకోండి. అంతేకాదు అది వ్య‌క్తిగత జీవిత‌మైనా, కెరీర్ లో నైనా స‌రే.. న‌మ్మ‌క‌మే పునాది. అదే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది.

3. స్ఫూర్తి పొందండి

ఒకవేళ మీ చుట్టూ ఉన్న వ్య‌క్తుల నుంచి కానీ, స‌మాజం నుంచి కానీ స్ఫూర్తి పొంద‌లేకపోతే, మంచి పుస్త‌కాల నుంచి, లేదా గొప్ప వ్య‌క్తుల చ‌రిత్ర‌ను తెలుసుకొని ఇన్ స్పైర్ అవండి. ముఖ్యంగా మ‌హిళల్లో ఉన్నత వ్య‌క్తుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందండి. వారి జీవితాల్లో స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌టప‌డిన తీరు, వారు తీసుకున్న నిర్ణ‌యాలు మీకు కచ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

4. ఆలోచ‌నే ఆయుధం..

ఆలోచించి ముందుకు సాగితేనే మీరు చేసే ప‌నిలోనూ, ద్వేషం, కోపం మీ ఆలోచ‌న‌ని క‌నుమ‌రుగు చేస్తాయి. ఆవేశం అనర్థాల‌కు దారితీస్తుంది. అందుకే ఆలోచించండి. ఐడియాలు త‌డ‌తాయి. అప్పుడే మీ జీవితంలో సంతోషం సాధ్యం అవుతుంది. ఆలోచ‌న అనేది మ‌నిషిని అభివృద్ధివైపు న‌డిపిస్తుంది. ఎలాగైతే మీరు తినే మీ ఇష్ట‌మైన ఫుడ్‌లోంచి కరివేపాకును ఏరివేస్తారో అలాగే మీ జీవితంలోంచి ఆవేశాన్ని ఏరివేయండి.

5. మీ వ్య‌తిరేకులను గౌర‌వించండి..

మిమ్మ‌ల్ని ఎవ‌రైతే వ్య‌తిరేకిస్తోరో వారిని గౌర‌వించండి. మీ ప‌ట్ల వ్య‌తిరేక‌తను కూడా చిరున‌వ్వుతో స్వీక‌రించండి. మీతో విబేధించేవారిని అర్థం చేసుకొనేందుకు ప్ర‌య‌త్నించండి. అప్పుడే మాన‌వ సంబంధాలు ఏర్ప‌డి ఘ‌ర్ష‌ణ‌లు, వ్య‌తిరేక వాతావ‌ర‌ణం తొల‌గి ప్ర‌శాంత‌త నెల‌కొంటుంది.

6. మీ జీవితాన్నే పాఠాలుగా చెప్పండి..

మ‌నం జీవితంలో ఎన్నో ర‌కాల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని ఉంటాం. అలాంటి ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎంతో సంఘ‌ర్ష‌ణకు లోనై ఉంటాం. వాటినే న‌లుగురికి చెప్పి, వారిలోనూ స్ఫూర్తి నింపండి. వారి జీవితంలోని ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లను సైతం తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించండి. అది మీకు థ్రిల్ తో పాటు కొత్త విష‌యాల‌ను కూడా తెలుసుకునేలా చేస్తుంది.

7. స‌మాజాన్ని కూడా ప‌ట్టించుకోండి..

మీ కెరీర్లో మీరు ఎంతో ఉన్నత స్థాయిని పొందిన‌ప్ప‌టికీ, ఒక మ‌హిళ‌గా ఎన్నో అవ‌రోధాల‌ను దాటుకొని ఆ స్థాయికి చేరుకొని ఉంటారు. మ‌రి అదే స్థానాన్ని పొందేందుకు ఎంద‌రో మ‌హిళ‌లు జీవితంలో సంఘ‌ర్ష‌ణకు గురవుతారు. వారిని వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించండి. మ‌హిళా విద్య‌, మ‌హిళ‌ల ఉపాధి లాంటి వాటికి మీ తోడ్పాటు ఇవ్వండి. ముఖ్యంగా స్త్రీ పురుష విబేధాలు రూపుమాపేందుకు నడుంబిగించండి

ఇలా చేస్తేనే జీవితంలో అటు బాధ్యతలు, కెరీర్ రెండూ సమానంగా సాగి.. జీవితం విజయవంతం అవుతుంది. 

Related Stories

Stories by vennela