ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో చదివి... పౌష్టికాహార లోపంపై తెలుగమ్మాయి పోరాటం

ప్రఖ్యాత బిజినెస్ స్కూల్లో చదివి... పౌష్టికాహార లోపంపై తెలుగమ్మాయి పోరాటం

Monday October 05, 2015,

6 min Read

స్కూలింగ్ అంతా హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఆ తర్వాత ప్రపంచంలోని టాప్ బిజినెస్ స్కూల్ వార్టన్‌లో డ్యూయల్ డిగ్రీ, అక్కడ ఏ విద్యార్థీ చేయని విధంగా పెద్ద ఎత్తున ఓ కాన్ఫరెన్స్ ఏర్పాటు... ! ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్లు ఎవరైనా... టాప్ మేనేజ్‌మెంట్, కన్సల్టెంట్ కంపెనీలకు వెళ్లిపోయి.. ఏడెనిమిది అంకెల జీతాన్ని అందుకుని లైఫ్‌లో రిలాక్స్ అయిపోతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అలా కాదు. విదేశాలకు వెళ్లిన తన మూలాలను మరిచిపోలేదు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏదైనా ఓ పెద్ద సమస్యను పరిష్కారించాలని కంకణం కట్టుకుంది. పౌష్టికాహార లోపంతో బాధపడ్తున్న చిన్నారులకు పెద్ద దిక్కుగా నిలబడేలా ఇండియన్ ఇంపాక్ట్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

image


పర్వతనేని రిధిమ. సోషల్ ఆంట్రప్రెన్యూర్.. అండ్ సక్సెస్‌ఫుల్ బిజినెస్ విమెన్. కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర మనుమరాలు. పుట్టి పెరిగిందంతా ధనిక వాతావరణం, చదువు కూడా ఓక్రిడ్జ్ లాంటి అంతర్జాతీయ స్కూల్లో సాగింది. ఎండ కన్నెరుగని వ్యవహారం. ఆకలి బాధలు, కష్టాలు, కన్నీళ్లు లాంటివి తెలిసే అవకాశమే తక్కువ. అయితే చిన్నప్పుడు వాళ్ల తాతను కలిసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే మంత్రులు, అధికారులతో పాటు కార్యకర్తలను కూడా తను దగ్గరి నుంచి గమనించింది. వాళ్ల ఉళ్లలోని సమస్యలను ఆ గ్రామస్థులు తన తాతకు వివరించడం, ఏదైనా పరిష్కారం చూపాలని కోరుకోవడాన్ని చూసి ఆ పసి మనస్సు అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్ని సందర్భాల్లో వాళ్ల తాతతో కలిసి గ్రామాలకు తిరగడం, అక్కడి సమస్యలను తెలుసుకోవడం చేసేది.

నాయకత్వ లక్షణాలు నేర్చుకుంది అక్కడే

స్కూలింగ్ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా - వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరింది రిధిమ. అక్కడ ఇంజనీరింగ్, బిజినెస్‌లో డ్యూయల్ డిగ్రీని పొందింది. ఇక్కడే వ్యాపార కిటుకులతో పాటు నాయకత్వ లక్షణాలనూ అలవర్చుకుంది. అప్పటి వరకూ వార్టన్‌ స్కూల్లో ఏర్పాటు చేయని సప్లై చైన్ కాన్ఫరెన్స్‌ను సొంతంగా నిర్వహించి అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న అవకాశాలపై చర్చించేందుకు అక్కడ ఉన్న పెద్ద కంపెనీల సీఈఓలు, ఛైర్మన్‌లు అప్పట్లో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 

'' కాన్సెప్ట్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకూ ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఓ సరికొత్త అనుభూతితో పాటు ఎన్నో విషయాలను నేర్పిందని'' చెబుతారు రిధిమ.

రోజుకు 1500 మంది చిన్నారులు చనిపోతున్నారు

సరే గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత మళ్లీ ఇండియా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు రిధిమ. ఈ లోపు భారత దేశం ఎదుర్కొంటున్న ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపాలని భావించారు. ఏం చేస్తే బాగుంటుందని పరిశోధన చేస్తుండగా.. పోషకాహార లోపం ప్రధాన సమస్యగా గుర్తించారు. దేశంలో 42 శాతం మంది పిల్లలు సరైన పోషకాహారం లేక ఇబ్బంది పడ్తున్నారనే విషయాన్ని గ్రహించారు. అంతే కాదు ప్రతీ రోజూ 1500 మంది పిల్లలు ఈ కారణంగా మృత్యువాతపడ్తున్నారని తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు. విద్య, వైద్యం, మహిళా సాధికారత వంటి వాటి కంటే అతి ముఖ్యమైన ఈ లోపాన్ని సవరించాలని నిర్ణయించుకున్నారు.

image


బిజినెస్ స్కూల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థులకు ఇదే విషయాన్ని అర్థమయ్యేలా వివరించి.. ఏదైనా పరిష్కార మార్గం చూపిద్దామని అంతా అనుకున్నారు. ఐదుగురు విద్యార్థులతో కూడిన ఓ బృందం తయారైంది. పౌష్టికాహార లోపానికి కారణాలు ఏంటి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ? వివిధ దేశాలు అనుసరిస్తున్న వైఖరి వంటి వివరాలతో ఓ స్టోరీ బోర్డును తయారుచేశారు. అయితే కేవలం ఓ రిపోర్ట్ రాయడం వల్ల ఏ ప్రయోజనమూ లేదని అప్పుడే గ్రహించారు. ఏదో ఒక పరిష్కారానికి మార్గం వెతకాలనుకున్నారు. అప్పుడే ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తమ ప్రాజెక్ట్ వివరాలను ఇండియాలో ఉన్న రతన్ టాటాకు పంపించారు. ఆయన నుంచి సమాధానం కూడా వస్తుందో రాదో.. అసలు ఆ కవర్ ఆయన దాకా వెళ్తుందోలేదో కూడా తెలియదు.. అయినా సరే.. ఏదో ఒక బలమైన నమ్మకంతో పంపించారు.

'' నాతో పాటు మా బిజినెస్ స్కూల్లోని కొంత మంది విద్యార్థులకు రతన్ టాటా ఆదర్శం. వ్యాపారంలోనే కాదు మానవత్వం ఉన్న వ్యక్తిగా కూడా మాకు చాలా గౌరవం ఉంది. పెద్ద అంచనాలు ఏవీ పెట్టుకోకుండా మా ప్రాజెక్ట్ వివరాలను రతన్ టాటాకు పంపించాం. మీ లాంటి వాళ్లు వేల మంది రోజూ ఏవో ఒకటి పంపుతూనే ఉంటారు. అవన్నీ చదివే తీరిక ఆయనకు ఎక్కడిది ? అని చాలా మంది అన్నారు. అయినా సరే.. ఓ మార్గదర్శనం కోసం ఆయనకు పంపాం ".

టాటా నుంచి కబురొచ్చింది

2013 జూలైలో ఓ రోజు అనుకోకుండా ముంబై నుంచి రిధిమకు ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా రతన్ టాటా ఆఫీసు నుంచి. అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయింది. ఈ టీమ్ అంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. రతన్ టాటా రానే వచ్చారు. వాళ్లందరికీ నోటమాటరాలేదు. రిధిమ అండ్ టీం ఆలోచనను మెచ్చుకుంటూనే.. ప్రోత్సహించారు. మాల్‌న్యూట్రిషన్ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో సూచించారు. వాళ్లు చెప్పిన మోడల్‌లో మార్పు-చేర్పులు వివరించారు. ఎందుకంటే... టాటా బృందంలోని ఓ గ్రూప్ కూడా.. ఈ సమస్యపై అప్పటికే తన వంతు సాయాన్ని చేస్తోంది.

image


ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. అంత పెద్ద బిజినెస్ దిగ్గజం ఇచ్చిన బూస్టింగ్‌తో అడుగులు వేగంగా కదిలాయి. నవంబర్ 29, 2013లో 'ఇండియన్ ఇంపాక్ట్' ప్రపంచం ముందుకు వచ్చింది. రతన్ టాటా, జిఎంఆర్ ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభి వెళ్లారు. దీంతో మొదట్లోనే జాతీయ, అంతర్జాతీయ మీడియా అటెన్షన్‌ను ఆకర్షించింది ఈ స్వచ్ఛంద సంస్థ. రిధిమ ప్రెసిడింట్‌గా వ్యవహరిస్తే.. నిధి బాలసుబ్రమణ్యం వైస్ ప్రెసిడెంట్‌‌గా మార్కెటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు కోర్ టీమ్ సిబ్బంది, గ్రౌండ్ లెవెల్లో 218 మంది వాలంటీర్లతో సంస్థ పని ప్రారంభమైంది.

ఇంతకూ ఇండియన్ ఇంపాక్ట్ ఏం చేస్తుంది ?

పౌష్టికాహార లోపాన్ని తగ్గించి పిల్లలకు మేలైన ఆహారం అందేలా చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే వీళ్లు పరిమితమయ్యారు. ఇక్కడి అంగన్‌వాడీ కేంద్రాల గుర్తింపు, అవి ఎదుర్కొంటున్న మౌలిక వసుతుల కొరతతో పాటు మరింత మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సిబ్బంది పరిశీలిస్తారు. రాజధానిలో సుమారు 868 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే వాటిలో 600 కేంద్రాలు మాత్రమే పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి.

'' నగరంలో ఉండడం వల్ల ఈ కేంద్రాల్లో ఆహారానికి పెద్ద సమస్యలు లేవు. కానీ మౌలిక సదుపాయాల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. పాలు ఉంటాయి కానీ.. వాటిని తాగేందుకు గ్లాసులు ఉండవు. తినేందుకు గుడ్లు ఉంటాయి కానీ.. ఆరుగురికి కలిసి ఓ ప్లేట్ ఉంటుంది. మంచి నీళ్లకు వాటర్ ఫిల్టర్, టాయిలెట్లు, విద్యుత్, ఫ్లోర్ మ్యాట్స్ వంటి వాటిల్లో కొరత ఉంది. అయితే కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు మాత్రమే పరిపుష్టంగా ఉన్నాయి. మిగిలిన వాటిలో వసతులు లేకపోవడం వల్లే తల్లులు ఈ కేంద్రాలకు పిల్లలను పంపడం లేదని మా పరిశీలనలో తేలింది '' - రిధిమ.

అందుకే మొదట మౌలిక సదుపాయాల కోసం ఏర్పాట్లు చేశాం. కొంత మంది కార్పొరేట్లతో కలిసి సాయం చేస్తున్నాం. ఉబర్, ఫేస్ బుక్, కెలాగ్స్ వంటి సంస్థలు ఇండియన్ ఇంపాక్ట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అంతే కాదు.. ఎవరైనా కార్పొరేట్లు సాయం చేయాలని అనుకుని.. వాళ్లు ఉంటున్న ఏరియా పిన్ కోడ్ నెంబర్‌ను వెబ్ సైట్లో ఎంటర్ చేస్తే.. దగ్గర్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు వస్తాయి. వాటికి ఏ అవసరాలు ఉన్నాయి, ఆ కొరతను తీర్చడానికి ఏ సాయం చేయొచ్చో చెప్తారు. అవసరమైతే అక్కడి సిబ్బందితో మాట్లాడేందుకు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తారు. అప్పుడు నేరుగా అయినా కార్పొరేట్లు సాయం చేయొచ్చు.. లేకపోతే ఇండియన్ ఇంపాక్ట్‌ ద్వారా అయినా ఆ వస్తువులను పంపించే వీలుంటుంది. పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించేందుకు కృషి చేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలను ప్రతీ ఏడాదీ ఇండియన్ ఇంపాక్ట్ ప్రమోట్ చేస్తుంది. తమ వెబ్ సైట్లో వాళ్ల వివరాలను వెల్లడిస్తుంది. వాళ్లు చేస్తున్న పనులతో పాటు వాళ్లకు ఏం ఏం అవసరమో అందులో వివరిస్తుంది. ఔత్సాహికులు, కార్పొరేట్లు ఎవరైనా వాళ్లనే నేరుగా సంప్రదించి సాయం చేసే వీలుంటుంది.

కార్పొరేట్ల నుంచి నిధులు తీసుకోం

కార్పొరేట్ల నుంచి ఎలాంటి నిధులూ సేకరించడం లేదు. వాళ్లే నేరుగా మౌలిక సదుపాయాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించవచ్చు. కాకపోతే స్కూల్ విద్యార్థుల ద్వారా కొంత మొత్తాన్ని సమీకరిస్తున్నారు. ఒక్కో స్కూల్లో ఒక్కో లీడర్‌ను ఎంపిక చేస్తారు. వాళ్ల ద్వారా చిన్న మొత్తాలను సేకరించి.. ఆ దగ్గర్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకే సాయం చేయిస్తారు. వచ్చిన నిధుల్లో 90 శాతం పిల్లలకే ఉపయోగించి.. పది శాతం మాత్రం ఆపరేషన్స్ కోసం వినియోగిస్తామని రిధిమ వివరించారు.

ప్రారంభమైన మొదటి ఏడాదిలోనే 10,200 మందికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. రెండో ఏడాది ఈ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉందని రిధిమ వెల్లడించారు. చాలా మంది కార్పొరేట్ల తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి కార్యక్రమాల కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్లకు ఈ ప్రాజెక్టును వివరించి భాగస్వాములను చేసుకుంటున్నట్టు వివరించారు.

image


ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా..

రెండేళ్లుగా హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఎంతో నేర్పింది. అయితే ఇదే మోడల్ అన్ని చోట్లా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉంది. వేరే రాష్ట్రంలో అసలు ఆహారమే ప్రధాన సమస్యగా ఉండొచ్చు. అందుకే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మోడల్ ఫాలో అవుదామని అనుకుంటున్నాం. ఢిల్లీలో స్లమ్స్ ఎక్కువ. ఎక్కడెక్కడి నుంచో అక్కడికి లేబర్ వస్తూ ఉంటారు. అందుకే గ్రామాల్లో కంటే నగరాల్లోనే పిల్లలకు ప్రాణాపాయం ఎక్కువ. ఈ నేపధ్యంలో మొదట ఢిల్లీలో తమ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ఇండియన్ ఇంపాక్ట్ వ్యవస్థాపకులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆహ్మబాద్ వెళ్లి.. ఎనిమిదేళ్లలో దేశవ్యాప్తంగా తమ మోడల్‌ను విజయవంతంగా సక్సెస్ చేయాలని చూస్తోంది ఇండియన్ ఇంపాక్ట్. పూర్తిగా లో కాస్ట్ మోడల్ కావడం, నిధుల గురించి ఎవరిపైనా ఆధారపడకపోవడం, వాలంటీర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్లలకు సేవ చేయాలని అనుకోవడం తమకు కలిసొస్తోందని చెబ్తున్నారు.

కేవలం ఈ మిషన్ ప్రారంభానికి మాత్రమే పరిమితం కాకుండా రతన్ టాటా టీం కూడా... ఇండియన్ ఇంపాక్ట్‌కు ఇప్పటికీ సాయం అందిస్తోంది. వాళ్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ.. ప్రోత్సహిస్తోంది.

image


photo courtesy - ISB


సక్సెస్‌ఫుల్ బిజినెస్‌విమెన్ కూడా..

పర్వతనేని ఫ్యామిలీకి సీ వేస్ షిప్పింగ్ పేరుతో చాలా కాలం నుంచి వ్యాపారాలు ఉన్నాయి. వార్టన్‌ స్కూల్లో చదువుకుని వచ్చిన రిధిమకు అంతర్జాతీయ వాణిజ్యం, ట్రేడ్ జోన్లు వంటివాటిపై పూర్తిస్థాయి అవగాహన ఉంది. అందుకే ఆమె చిన్న వయస్సులోనే చెన్నై ఫ్రీ ట్రేడ్ జోన్‌ -వేర్‌హౌజింగ్ పేరుతో ప్రారంభమైన ఓ కొత్త డివిజిన్‌ బాధ్యతలు చేపట్టారు. భారత, దక్షిణాసియా ట్రేడర్లు.. గ్లోబల్ క్లైంట్లతో వ్యాపారం చేసి వాళ్ల నుంచి త్వరగా, తక్కువ డ్యూటీలతో సరుకులను తెప్పించుకునేందుకు ఇదో హబ్‌లా ఉపయోగపడ్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన ఈ ఫ్రీ ట్రేడ్ - వేర్‌హౌజింగ్‌ను రిధిమ మూడు నెలల్లోనే లాభాల్లోకి తీసుకువచ్చారు. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో విశేష అనుభవం ఉండడం వల్లే ఇది తనకు సులువుగా ఉందని ఆమె చెబుతారు.

'' 20-30 ఏళ్ల మధ్య ఉన్న మాలాంటి వాళ్లకు అటు వ్యాపారంతో పాటు ఇటు సామాజిక సేవ కూడా చేసే సత్తా ఉంటుంది. సరైన ప్లానింగ్, ఆలోచనల్లో స్పష్టత ఉంటే ఏమైనా చేయగలమనే ధీమా నాకు ఉంది '' అని ముగిస్తారు రిధిమ.