కళ్లులేని అద్భుత ఫోటోగ్రాఫర్ కథ

ఆగ్మెంటెడ్ రియాలిటీతో వండర్ క్రియేట్ చేస్తున్న ప్రణవ్

కళ్లులేని అద్భుత ఫోటోగ్రాఫర్ కథ

Tuesday January 24, 2017,

3 min Read

కళ్లుండీ ప్రపంచంలోని అందాలను చూడలేని వారే అసలైన అంధులు. నిజమే చూడాలంటే కళ్లే అవసరం లేదు. పరిసరాలపై మనసు లగ్నం చేస్తే మనోతెరపై సాక్షాత్కరించే ప్రతీ వస్తువు అపురూపంగా కనిపిస్తుంది.

సాధారణంగా అంధుల గురించి స్ఫూర్తిదాయక కథనాలు ఎలా వుంటాయంటే, వాళ్లు పాటలు శ్రావ్యంగా పాడుతారనో, సంగీత పరికరాలు అద్భుతంగా వాయిస్తారనో, ఇంకేదో అద్భుతాలు చేస్తారనో చూస్తుంటాం.. వింటుంటాం. అంటే, వాళ్లను తక్కువ అంచనా వేయడం కాదు ఉద్దేశం. కానీ, మీకు పరిచయం చేయబోయే ఒక అంధుడు ఊహకందని అద్భుతాలు చేస్తున్నాడు. కళ్లతో సంబంధం లేకుండా మనోనేత్రంతో అద్భుత కళాఖండాలు తీస్తున్నాడు.

కళ్లులేకుండా ఫోటోలు తీయడం అనేది ఇమాజిన్ చేసుకోలేం. ఫోటోలు తీయడమనేదే ఒక ఆర్టు. కళ్లున్న ప్రతీవారూ చేయలేరు. కానీ ఈ చిమ్మచీకట్లను ఒంపుకున్న ప్రణవ్ కళ్లు లోకంలోని అందాలన్నీ కెమెరాలో బంధిస్తున్నాయి.

image


ప్రణవ్ లాల్ పుట్టుకతోనే అంధుడు. అలాగని విధి రాతను తిడుతూ కూచోలేదు. శివుడు మూడో నేత్రంతో లోకాన్ని చూస్తున్నట్టు.. ప్రణవ్ అంత:నేత్రంతో సృష్టిని అందాలను కెమెరాలో బంధిస్తున్నాడు. టెక్నాలజీని మూడో నేత్రంగా మలుచుకున్న ప్రణవ్.. ఫోటోగ్రఫీ మీద మనసు లగ్నం చేశాడు. కంప్యూటర్ కు అనుసంధానం చేసిన ఆగ్మెంటెడ్ రియాలిటీ పరికరం ద్వారా, ఎదురుగా ఉండే దృశ్యాన్ని సౌండ్ రూపంలో ఇమాజిన్ చేసుకుంటాడు. అతని మస్తిష్కంలో తీయాలనుకున్న ఫోటో, ఒక బ్రోకెన్ డిస్టింక్ట్ మ్యాపింగ్ లా ఏర్పడుతుంది. దాన్నుంచి ఎలాంటి శబ్దం వెలువడుతుందో గ్రహిస్తాడు. ఆ సౌండులోంచి మూడు అస్పష్ట గుణాలు వింటాడు. ఒకటి శబ్ద తీవ్రత. అది ఆబ్జెక్ట్ ఎత్తుని సూచిస్తుంది. రెండు వాల్యూమ్. అది పిక్చర్ స్పష్టతను, లేదంటే కాంతిని తెలియజేస్తుంది. మూడోది పానింగ్. అలా తీయబోయే ఫోటోను తన సెన్స్ తో మూడు రకాలుగా ఇమాజిన్ చేసుకుంటాడు. పిక్చర్ గురించి మైండ్ లో ఒక క్లారిటీ రాగానే, సెకండ్ కెమెరాతో క్లిక్ మనిపిస్తాడు. అంతే.. అద్భుతం ఆవిష్కృతమవుతుంది. మహామహా ఫోటోగ్రాఫర్లే అబ్బుపడే ఔట్ పుట్ వస్తుంది.

ప్రణవ్ సాధారణ ఫోటోగ్రాఫర్ కాదు. ఏదో సరదాకు ఇంట్లో వాళ్లను ఫోటో తీయడమో, తెలిసినవాళ్లను క్లిక్ మనిపించడమో చేయడు. అసలు మనుషుల్నే పట్టించుకోడు. పక్కా ప్రొఫెషనల్ మాదిరి.. సృష్టిలోని అందాలను కెమెరాలో బంధిస్తాడు. లాండ్ స్కేప్స్ ఆర్కిటెక్చర్ ను మాత్రమే ఎంచుకుంటాడు. ప్ర‌కృతి రమణీయతను ఒడిసిపడతాడు. సముద్రం మీదుగా రెక్కలు విప్పార్చి ఎగిరిపోయే ఒంటరి పక్షిని బంధిస్తాడు. తథాగతుడి మౌనముద్రలోని ఊహకందని తాత్వికతను చిత్రీకరిస్తాడు. బూడిదరంగు ఆకాశాన్నీ, పచ్చటి తివాచీ పరుచుకున్న పర్వతాన్ని కలిపి కుడతాడు. బండరాళ్ల మీద పారే సెలయేటి గలగలల్ని ఒంపుగా ఒడిసి పడతాడు. చేప పిల్ల ఈదులాడే దృశ్యాన్ని నేర్పుగా తీస్తాడు. ఒడ్డున కెరటం భళ్లుమన్న టైమింగ్ మిస్సవ్వడు.

ఇదే ఆగ్మెంటెడ్ రియాలిటీ వాయిస్ పరికరం

ఇదే ఆగ్మెంటెడ్ రియాలిటీ వాయిస్ పరికరం


ఏంటా మూడో నేత్రం

అదొక ఆగ్మెంటెడ్ రియాలిటీ డివైజ్. దానిపేరు వాయిస్. డచ్ దేశానికి చెందిన పీటర్ మీజర్ దాని సృష్టిర్త. వాయిస్ అనే ఈ హెడ్ గేర్.. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని సౌండ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ శబ్దాన్ని బట్టి ఎదురుగా ఉండే ఆబ్జెక్ట్ ఏంటో అంచనా వేస్తారు. అది గుర్తించేవారి మేథస్సుపై ఆధారపడి వుంటుంది. వాయిస్ పరికంలో ఒక కెమెరా ఉంటుంది. అది శివుడి మూడోనేత్రంలాంటిది. దాన్ని ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తో అనుసంధానం చేస్తారు. మనం చూసే ఆబ్జెక్ట్ ని ఆ సాఫ్ట్ వేర్ ధ్వని రూపంలోకి మారుస్తుంది. ఆ శబ్దాన్ని బోన్ కండక్షన్ హెడ్ ఫోన్స్ అనే మరో డివైజ్ ద్వారా వింటారు. ఒకవేళ శబ్దం ఎడమవైపు ఉంటే లెఫ్ట్ హెడ్ ఫోన్ ఒక్కటే పనిచేస్తుంది. కుడి వైపున వినిపిస్తే రైట్ హెడ్ ఫోన్లో మాత్రమే వినిపిస్తుంది. అలా దృశ్యాన్ని ఇమాజిన్ చేసుకుని కెమెరాతో ఫోటో తీస్తారు. శబ్దాన్ని బట్టి ఫోటో తీయడం అనేది అంత ఈజీ కాదు. మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని కచ్చితంగా అంచనావేయగలగాలి.

ట్రావెల్ చేయడమంటే ప్రణవ్ కు ఇష్టం. ఇప్పటికే దేశమంతా చుట్టేశాడు. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేశాడు. విదేశాల్లోనూ పర్యటించాడు. వాయిస్ పరికరం ఒక్కసారి తలకు పెట్టుకుంటే ఒక ఉపగ్రహమేదో తనని నడిపిస్తున్నట్టుగా, రిమోట్ సెన్సార్ ద్వారా ముందుకుపోతున్నట్టు ఫీలవుతాడు. ఎవరి సాయమూ అక్కర్లేదు. శబ్దాన్ని బట్టి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో తన పని తానే చేసుకుంటాడు. గబగబా మెట్లు ఎక్కి దిగుతాడు. 

కళ్లు లేకున్నా టెక్నాలజీని ఒడసిపట్టడంలో ప్రణవ్ టాలెంటే వేరు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయడంలో దిట్ట. సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్నాడు. వాస్తవానికి టెన్త్ తర్వాత అతను చదివింది కామర్స్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అతణ్ని సైన్స్ చదవాడినికి వీల్లేదని చెప్పింది. దాంతో ఇంటర్లో కామర్స్ తీసుకోవాల్సి వచ్చింది.

అమ్మానాన్నలు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. ప్రణవ్ ఆరో తరగతి చదివేటప్పుడే ఇంట్లో ఒక సైన్స్ లాబ్ క్రియేట్ చేశాడు. అందులో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రయోగాలు చేసేవాడు.

వాయిస్ పరికరం తనలాంటి వాళ్ల అభిరుచిని సింప్లిఫై చేసింది. కానీ ఎందుకో ప్రణవ్ కు దానిపై ఆదారపడటం ఇష్టం లేదు. ఎంతకాలం తలకు అవి చుట్టుకుని తిరగాలంటాడు. అందుకే తనకంటూ సొంతంగా ఒక వెంచర్ నెలకొల్పాలనే పట్టుదలతో ఉన్నాడు. విజన్ మరింత షార్పుగా ఉండేలా, ఆగ్మెంటెడ్ రియాలిటీ మెయిన్ స్ట్రీమ్ లో ఒక వాయిస్ హార్డ్ వేర్ క్రియేట్ చేయాలన్నది అతని లక్ష్యం.