కొరియర్ బాయ్‌గా మారిన బ్యాంకర్ - అదే మిరాకిల్ !

ఓ ఘటనతో చలించిపోయిన ధృవ్ లక్రా... మూగ, చెవిటి వాళ్ల కోసం ఏదో చేయాలనే తపన..

కొరియర్ బాయ్‌గా మారిన బ్యాంకర్ - అదే మిరాకిల్ !

Tuesday March 31, 2015,

5 min Read


ఒక 20 ఏళ్ల కుర్రాడు ముంబైలోని ఓ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అతడి పక్కన మరో చిన్నపిల్లవాడు కూడా కూర్చుని ఉన్నాడు. కానీ చిన్నపిల్లవాడిలో ఏదో తెలియని ఆందోళన, కంగారు కనిపిస్తున్నాయి. తెలియని గాబరాతో ముచ్చెమటలు పడ్తున్నాయి. ఏదో చెప్పాలని, ఏదో అడగాలని ఉంది కానీ.. మౌనంగా ఉన్నాడు. ఇంతలో బస్సు కండక్టర్ వచ్చి 'ఎక్కడికి వెళ్లాలంటూ' ఆ పిల్లవాడిని అడిగాడు. అయినా సమాధానం లేదు. కాసేపు చూసి కండక్టర్ అలా ముందుకు వెళ్లాడు. పక్కన కూర్చున్న యువకుడిలోనూ అలజడి మొదలైంది. ఇక తట్టుకోలేక సమస్య ఏంటంటూ ఆ పిల్లవాడిని అడిగేశాడు. అప్పుడూ మౌనమే... ! పేపర్ తీసి అతికష్టం మీద తాను వెళ్లాల్సిన చోటు రాసిచూపాడు. కండక్టర్ కు అర్థమయ్యేలా చెప్పి టికెట్ తీయించాడు. మళ్లీ అదే ఆందోళన. స్టేజ్ వచ్చిన ప్రతీసారీ కండక్టర్ వైపు చూడడం, మళ్లీ ఇతని ముఖానికేసి చూడడం. అలా అరగంట ప్రయాణం తర్వాత అర్థమైంది ఆ పిల్లవాడు మాట్లాడలేడు, వినలేడు అని. అతడు బస్సులో చేసిన ఆ ప్రయాణమే ఒక కొత్త వ్యాపారానికి బీజం పడింది. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. రీల్ స్టోరీ కాదు...మిరాకిల్ కొరియర్స్ అధినేత ధృవ్ లక్రా రియల్ స్టోరీ.

దేశంలో మూగ,చెవిటి వాళ్ల సంఖ్య దాదారు 6 కోట్ల వరకూ ఉంటుందని ఓ లెక్క. అనేక కారణాలతో ఈ సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. కానీ వాళ్లలో 66 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారని తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. పుట్టుకతో వచ్చిన ఈ సమస్య ఆ పిల్లలు పెద్దయ్యే కొద్దీ కొండలా పెరుగుతూనే పోతుంది. సమాజంలో చిన్నచూపు చూసే వాళ్లు కొందరైతే... జాలి చూపించే వాళ్లు ఇంకొందరు. కానీ వీళ్లెవ్వరూ ఉద్యోగాలు ఇచ్చి వాళ్లను ఆదుకోరు. అలా సమాజంలో మూగ,చెవిటి వాళ్లు పడే ఇబ్బందిని రెండు ముక్కల్లో రాయలేం, చెప్పలేం. కానీ మనలా ఒక్క క్షణం అలా నిట్టూర్చి మరిచిపోలేదు ధృవ్ లక్రా. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తిచేసి లక్షణమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా వదులుకున్నాడు. ఇలాంటి వాళ్ల కోసం మిరాకిల్ కొరియర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి మనందరికీ ఆదర్శమయ్యాడు.

ధృవ్ లక్రా, మిరాకిల్ కొరియర్స్ సిఈఓ

ధృవ్ లక్రా, మిరాకిల్ కొరియర్స్ సిఈఓ


కొరియర్ బాయ్ ఫ్రం స్టాన్ ఫర్డ్ ఎంబిఏ !

ముంబైకి చెందిన ధృవ్ లక్రా జమ్మూలో విద్యాభ్యాసం చేశాడు. ముంబైలోని హెచ్.ఆర్. కాలేజీలో డిగ్రీపూర్తైంది. డిఎస్పి మెరిల్లించ్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా మంచి ఉద్యోగం లభించింది. మొదట్లో ఉత్సాహంగానే ఉన్నా.. తర్వాత మెల్లిగా లక్రాలో అసంతృప్తి మొదలైంది. ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం పట్టిపీడిస్తూనే ఉంది. నెలనెలా జీతంతో ఆర్థిక సంతృప్తి ఉంది కానీ ఆత్మ సంతృప్తి మాత్రం లేదు. అలా రెండేళ్లపాటు నెట్టొకొచ్చాడు. చివరకు ఒక రోజు కఠినమైన నిర్ణయం తీసుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇంత మంచి ఉద్యోగం వదులుకుని 2005లో దస్రా అనే స్వచ్ఛంద సంస్థలో చేరాడు. ఇదే సమయంలో పైచదువుల కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీగా దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తం స్కాలర్ షిప్ తో అక్కడ సీటు దక్కింది. దీంతో అక్కడికి వెళ్లి విద్యను పూర్తిచేశాడు. భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే అతడో విషయాన్ని మాత్రం నిక్కచ్చిగా అనుకున్నాడు. కార్పొరేట్ ఉద్యోగానికి వెళ్లకుండా సమాజానికి పనికొచ్చేది చేయాలని బలంగా నిశ్చయించుకున్నాడు. లోలోపల అతడిని దహించివేస్తున్న ఆ బస్సు సంఘటన పదే పదే గుర్తువస్తోంది. ఇక ఆలస్యం చేయలేదు.

ఎంబిఏ సమయంలో స్కాలర్ షిప్ ద్వారా వచ్చిన డబ్బును దాచి రూ.21000 పోగేశాడు. 'మిరాకిల్ కొరియర్స్' ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. తన సంస్థలో కేవలం మూగ,చెవిటి వారిని నిర్ణయించుకున్నాడు. తాను కూడా మెల్లిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సైగల ద్వారా ఒక విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఔపోసన పట్టాడు. తర్వాత తన స్నేహితుడి ఇంటిలో చిన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. దగ్గరున్న ఒక ఎన్జీఓకు వెళ్లి తన ప్రాజెక్ట్ గురించి వివరించాడు. పైలెట్ ప్రాజెక్టు కోసం ఇద్దరిని పంపమని అడిగాడు ధృవ్ లక్రా.

తనదగ్గరున్న డబ్బుతో ఆ ఇద్దరికీ యూనిఫార్మ్ కుట్టించి, కొరియర్ డెలివరీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశాడు. కొద్ది రోజుల కృషి తర్వాత థర్మాక్స్ సంస్థ ముందుకొచ్చి తమ ఆఫీసులో కొద్దిస్థలాన్ని వారికి ఇచ్చింది. దీంతో కొంత ధైర్యం పొందిన లక్రా తన వ్యాపారాన్ని మార్కెట్ చేసేందుకు పదిహేను రోజుల ఫ్రీ ఆఫర్ పెట్టాడు. అయినా ఏ మాత్రం స్పందన రాలేదు. మూగ, చెవిటి వాళ్లు కీలకమైన కొరియర్స్ ను ఎలా డెలివర్ చేస్తారంటూ ప్రతీ ఒక్కరూ అనుమానం వ్యక్తం చేశారు. మరికొన్ని సంస్థలైతే తీవ్రస్థాయిలో నిరుత్సాహపరిచాయి. ''సాధారణంగా మనం ఎవరూ కొరియర్ బాయ్స్ తో మాట్లాడం. వాళ్లు ఇచ్చిన పార్సిల్ తీసుకుని సంతకం చేసి పంపేస్తాం. దీనికి ఎవరైతే ఏంటి? " అనే మాటనే ధృవ్ లక్రా పదే పదే అందరికీ చెప్పేవాడు. చివరకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ముందుకు వచ్చింది. పెద్ద కంపెనీ ఆర్డర్ కావడంతో ఇతురలను ఒప్పించేందుకు కాస్త సులువైంది. కానీ ఎవరూ ముఖ్యమైన డాక్యుమెంట్లు, చెక్కులు ఇచ్చిన దాఖలాలే లేవని లక్రా తెగ బాధపడేవాడు. అందరూ బరువైన బల్క్ ప్యాకేజీలు ఇచ్చేందుకే మొగ్గుచూపేవారు. ఓ వైపు ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటూ వాళ్లకు ట్రైనింగ్ ఇస్తూ ఏ రోజుకు ఆ రోజు కంపెనీని మెరుగు చేసుకుంటూనే అడుగులు వేశాడు.

ఒకసారి రంజాన్ ముందు మూడువేల గ్రీటింగ్ కార్డుల ఆర్డర్ వచ్చింది. పండుగకు రెండే రోజుల సమయం ఉంది. కానీ మూడువేల కార్డుల బట్వాడా అంతే అంత సులువు కాదు అది కూడా ముంబైలాంటి నగరంలో. అయినా సరే ధైర్యంగా ఆ ఆర్డర్ ఒప్పుకున్నాడు లక్రా. ఉద్యోగులపైనే భారం వేసి చేతులు దులుపుకోకుండా... తాను కూడా కార్డులు డెలివర్ చేసి కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

సైగలతోనే పనిపూర్తి

సైగలతోనే పనిపూర్తి


ఇప్పుడు మిరాకిల్ కొరియర్స్ లో 70 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో నలుగురు మేనేజీరియల్ స్థాయి సిబ్బంది తప్ప అంతా మూగ,చెవిటి వాళ్లే. 35-40 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. పార్సిళ్లను వేరుచేసి బాయ్స్ కు సరఫరా చేసే బ్యాక్ ఎండ్ పనికి 20 ఏళ్లలోపు మహిళలు ఉన్నారు. వాళ్లూ ఇలాంటి గిఫ్టెడ్ పీపులే. ఇప్పుడు నెలకు ఈ సంస్థ 65 వేల పార్సిళ్లను డెలివర్ చేస్తుంది. ఇప్పుడు ముంబైలో రెండు ప్రాంతాల్లో ఆఫీసులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ చేస్తున్న కృషిని చూసి వాళ్లను ప్రోత్సహించేందుకు ఆదిత్య బిర్లా సంస్థ ఒక చోట ఉచితంగా తమ స్థలాన్ని వీళ్లకు ఇచ్చారు. ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఏటికేడు గణనీయమైన వృద్ధిని కనబరుస్తూనే ఉంది.

వాళ్లతో పనిచేయించడం అంత సులువా ?

ధైర్యంగా ప్రాజెక్టును మొదలుపెట్టాడే కానీ ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక అవాంతరం ధృవ్ లక్రాను వెంటాడుతూనే ఉంది. సాధారణంగా ఇలాంటి వాళ్లలో చదివిన జనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటుంది. వారికి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంత సులువు కాదు. అలా అని వారిపై కోప్పడితే అసలు తన కర్తవ్యమే నెరవేరదు. అందుకే వ్యవస్థను మొత్తం వాళ్ల కోసమే డిజైన్ చేశాడు. ఆఫీసులో ప్రతీ వ్యవహారమూ సైగలతోనే జరుగుతుంది. కస్టమర్లకు సంబంధించిన సమాచారాన్ని డెలివరీ బాయ్స్ కు చేరవేసేందుకు ఎస్ఎంఎస్ అత్యద్భుత సాధనం అంటాడు లక్రా. అడ్రస్ మార్పు లేదా కస్టమర్ తో ఏదైనా సమస్య గురించి చెప్పాలంటే బాయ్స్ కు ఆఫీస్ కు ఎస్ఎంఎస్ చేస్తారు. అక్కడ ఉన్న టెలిఫోన్ ఆపరేటర్ కస్టమర్ తో మాట్లాడి మళ్లీ రిటర్న్ ఎస్ఎంఎస్ పంపుతాడు. అలా ఫీల్డ్ లో ఉన్నవారితో కమ్యూనికేషన్ అంతా ఎస్ఎంఎస్ ద్వారానే కొనసాగుతుంది. ప్రతీవారం జరిగే మీటింగ్ లో సమస్యలను చర్చించుకుని దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు.

మాకేం తక్కువ

మాకేం తక్కువ


ఇప్పుడు అనేక కార్పొరేట్ సంస్థలకు మిరాకిల్ కొరియర్స్ అంటే అపారమైన నమ్మకం. గోద్రెజ్, మహీంద్రా, తెహెల్కా, మ్యాంగో ట్రీ, నెట్వర్క్ 18, ఐ.డి.ఎఫ్.సి, డి.ఎస్.పి. బ్లాక్ రాక్ వంటి బడా సంస్థలు వీళ్ల క్లైంట్లుగా మారారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఎన్నో సమస్యలను అధిగమించిన ఈ సంస్థ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఏదైనా లోపం ఉన్న వాళ్లు లోలోపల మగ్గిపోవాల్సిన అవసరం లేదని, దాన్ని కూడా అవకాశంగా మలుచుకుని ధైర్యంగా పోరాడవచ్చని ధృవ్ లక్రా ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాడు. అంతేకాదు దృష్టిలోపం ఉన్నవాళ్లను తీసుకోవడానికి కూడా ఏమైనా అవకాశాలున్నాయోమో పరిశీలిస్తున్నాడు.

చేసేది వ్యాపారమే అయినా ఇలాంటి సోషల్ ప్రాజెక్టును అన్ని కష్టనష్టాలకు ఓర్చి చేసిన ధృవ్ లక్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే !


ఇవే ప్రోత్సాహం !

2009లో హెలెన్ కెల్లర్ అవార్డ్

ఎకోయింగ్ గ్రీన్ ఫెలోషిప్ అవార్డ్ 2009

2010లో రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబులిటీస్ అవార్డ్