మైనింగ్ మాఫియా గుండెల్లో నిద్రపోతున్న ఓ సాధారణ కూలీ!

మైనింగ్ మాఫియా గుండెల్లో నిద్రపోతున్న ఓ సాధారణ కూలీ!

Sunday January 24, 2016,

2 min Read

మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా తెలుసుగా.. అందులో అతను ఓ ఊరును దత్తత తీసుకొని, అక్కడ స్కూలు కట్టించి, రోడ్లు నిర్మించి, భూకబ్జాదారులను ఎదిరించి గ్రామాన్ని కాపాడతాడు. కానీ అది ఫక్తు సినిమా. మరి నిజం జీవితంలో అలా జరుగుతుందా? ఎంతమంది గ్రామం కోసం, గ్రామస్తుల కోసం త్యాగం చేస్తారు? ఉన్న భూమిని నలుగురికీ పంచిపెట్టడానికి ఎంతమంది ముందుకొస్తారు? కానీ అచన్ నటరాజన్ అందరిలా ఆలోచించలేదు. 

image


గజం జాగా వుంటే దాన్ని రెండు గజాలు చేయడం ఎలా అని ఆలోచించే కాలమిది. పక్క బిట్టు కలుపుకోడానికి సొంతవాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడని రోజులివి. అలాంటిది సొంత ప్లేసును నలుగురికి పంచడమంటే మాటలు కాదు. దానం ఒక్కటే కాదు, దాని వెనుక అలుపెరుగని పోరాటం ఉంది. ఈ భూమిమీద అవ్యాజమైన ప్రేమ ఉంది. ప్రకృతి మీద వల్లమాలిన అభిమానం ఉంది. అన్నిటికి మించి మైనింగ్ మాఫియా మీద అలుపెరుగని పోరాటం ఉంది.

మాఫియాపై వార్

కేరళ. ఈ పేరు వింటే ప్రకృతి రమణీయత కళ్లముందు కదలాడుతుంది. కానీ పతనమ్ తిట్ట జిల్లా మైనింగ్ క్వారీల వల్ల కేరళ ఒక అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ జిల్లాలోని కొణ్ని అనే ప్రాంతం పూర్తిగా కొండలతో నిండివుంది. అక్కడే నివసిస్తాడు 80 ఏళ్ల అచన్ నటరాజన్. దినసరి కూలీ. అక్కడ అతిపెద్ద గ్రానైట్ క్రషర్ ఉంది. గ్రానైట్ వ్యాపారుల కన్ను ఆ కొండపై పడింది. అప్పటికే అక్కడివారి భూమిని దౌర్జన్యంగా తీసుకున్నారు. వారినెలాగైనా అడ్డుకోవాలనుకున్నాడు నటరాజన్. మైనింగ్ మాఫియాపై పోరాటం మొదలుపెట్టాడు. మిగతావారి భూమినీ లాక్కుంటారని గ్రహించిన నటరాజన్... మైనింగ్ వ్యాపారుల ఆట కట్టించేందుకు గొప్ప ఐడియా వేశాడు. జీవితాంతం పొదుపు చేసిన డబ్బులతో అర ఎకరా భూమి కొన్నాడు. ఆ భూమిని పది ప్లాట్లుగా విభజించి పది నిరుపేద కుటుంబాలకు పంచాడు. ఆ భూమిపై మైనింగ్ మాఫియా కన్ను పడకుండా జాగ్రత్తపడ్డాడు. వాళ్లు స్వాధీనం చేసుకోలేని విధంగా షరతులు విధించాడు.

"ఈ వయస్సులో ఉన్న నన్ను వాళ్లు బెదిరించారు. చంపేస్తామన్నారు. ఏదో ఒక రోజు నేను చనిపోతాను. కాబట్టి నాకు భయం లేదు. భూమిని లాక్కోవాలని ఎంతో ప్రయత్నించారు. చాలా డబ్బులు ఇస్తామన్నారు. కానీ నాకు అవసరం లేదు. అర ఎకరా భూమి కొని పదిమందికి పంచాను. కానీ వారికి ఈ భూమిపై పూర్తి హక్కులు ఇవ్వలేదు. కొన్ని నిబంధనలు పెట్టాను. మరో 70 ఏళ్ల వరకు ఈ భూమి యాజమాన్య హక్కుల్ని వేరొకరికి ఇవ్వకుండా షరతు విధించాను" అని వివరిస్తారు అచన్.

ఒకప్పుడు ఈ ప్రాంతం ఆకాశాన్ని తాకే కొండలకు ప్రసిద్ధి. కానీ మైనింగ్ వల్ల కొండలు పిండవుతున్నాయి. ఇప్పుడు కొన్నే మిగిలాయి. తన చుట్టూ ఉన్న నేలను లాక్కుంటూ ఉంటే ఎలా చూస్తూ ఉండగలను అంటారు అచన్. కొండల్ని తొలిచేయడం వల్ల జరిగే నష్టం ఏంటో తెలియదు కానీ... నేలతల్లిని గునపాలతో పొడిచెయ్యడం మంచిది కాదంటారాయన. సొంత డబ్బుతో పదిమందికి ప్లాట్లు పంచిన అచన్ మాత్రం... అల్యూమినియం షీట్లతో వేసుకున్న ఓ చిన్న షెడ్డులో 75 ఏళ్ల భార్యతో కలిసి జీవితాన్ని గడుపుతున్నాడు. భవిష్యత్తు కోసం ఏమీ దాచుకోకుండా అంతా ఊరికోసమే ధారపోశాడు. చిన్నప్పటి నుంచీ అంతే. సంపాదించినదంతా పర్యావరణ పరిరక్షణ ఖర్చుచేశాడు. నిరక్షరాస్యుడు, దినసరి కూలీ అయిన నటరాజన్ చేసిన సాహసం చూసి ఆ ఊరి వాళ్లంతా యోధుడిగా పిలుచుకుంటారు.