ఆటిజం పిల్లలకు ఆత్మీయ శిక్షణ ఇస్తున్న డా.లావణ్య

ఏప్రిల్ 2న అంతర్జాతీయ ఆటిజం డే

0

ఆటిజం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపించిన ఈ కమ్యూనికేషన్ డిజార్డర్ మనదేశంలో క్రమేపీ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆటిజం పిల్లలు ఏడు కోట్ల మందికి పైనే ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి లెక్క. మన దేశంలో సుమారు కోటి మందికి పైచిలుకు ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఆరు లక్షల మంది మగపిల్లలున్నారు. 

నిజానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్‌ డిజార్డర్‌. దాన్ని భూతద్దంలోంచి చూడాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం చేసేదీ కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో ఆటిజం లక్షణాలున్నట్టే. పైన చెప్పిన ఆరు లక్షల మందిలో చాలామందికి ఎటువంటి డయాగ్నసిస్‌ జరగలేదు. వారిలో ఆ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు.

చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. విపరీతమైన కోపంతో ఉంటారు. చిరాకు పడతారు. వస్తువులను చిందరవందర చేసేస్తుంటారు. కొందరికి వచ్చిన మాటలు కూడా పోతుంటాయి. అలాంటి పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అన్నిటికంటే ముందుగా సమాజంలో ఆటిజం పిల్లల పట్ల వ్యవహరించే ధోరణి మారాలి. ఆ దిశగా కృషి చేస్తున్నారు డాక్టర్ లావణ్య.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఆక్యుపేషనల్‌ థెరపీ, ప్లే అండ్‌ స్టడీ గ్రూప్స్‌, ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపీ, సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ వంటివి ఇస్తున్నారు.అన్నీ ఒక్కసారిగా కాకుండా, అమ్మాయి, అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని, వారికి తగ్గట్టే ప్రోటోకాల్ రూపొందించారు.

జననం క్లినిక్ అనే సంస్థ ద్వారా ఆటిజం పిల్లల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తున్నారు. లావణ్యకు ఈ రంగంలో 22 ఏళ్ల అనుభవం ఉంది. చెన్నయ్ నుంచి 12 ఏళ్లక్రితం హైదరాబాద్ వచ్చారు. ఏడాది నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు రకరకాల థెరపీలతో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె దగ్గర 33 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే కాక, ఏపీ నుంచి చెన్నయ్ నుంచి కూడా పేరెంట్స్ వస్తుంటారు.

థెరపీ మూలంగా పిల్లల్లో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు కార్తీక్ అనే కుర్రాడి తల్లి. మాటలే కాకుండా సంజ్ఞలతో చెప్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిల్లల పట్ల సమాజంలో చులకన భావం పోవాలంటారామె. ఆటిజం స్కూల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇతర స్కూల్స్ కూడా ఇలాంటి పిల్లలను చేర్చుకోవాలని అనిత సూచిస్తున్నారు.

ఆటిజం పిల్లలను సమాజం చూసే కోణం మారాలని అనిల అనే మరో పేరెంట్ చెప్తున్నారు. అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల మధ్య ఇలాంటి పిల్లలుంటే వచ్చే నష్టమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. వాళ్లలా చదవడానికి ట్రై చేస్తారు. వాళ్లలా రాయడానికి ప్రయత్నిస్తారు. అది మంచిదే కదా అనేది అనిల భావన.

నిజమే కదా.. ఆటిజం పిల్లలను అసాధరణంగా చూడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల్లో ఆటిజంపై అవగాహన పెరగాలి. సమాజంలో మార్పు రావాలి. ఒకప్పుడు ఐన్ స్టీన్, ఐజక్ న్యూటన్ కూడా ఆటిజంతో బాధపడ్డవారే. అలాంటివారు ఎంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, రేపు ఈ పిల్లలు కూడా జ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఏ డాక్టర్లో, సైంటిస్టులో కావొచ్చు. అందులో ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఏటా ఏప్రిల్ రెండున జరుపుకునే వరల్డ్ ఆటిజం డే ఈసారి Toward Autonomy and Self-Determination థీమ్ తో ముందుకొచ్చింది.   

Related Stories

Stories by team ys telugu