ఆటల వేటలో నలుగురు ఏకలవ్యులు

భారత్‌ను బాస్కెట్ బాల్‌కు సన్నద్ధం చేసే ప్రయత్నంఏకలవ్య డాట్ కామ్ ద్వారా బాస్కెట్ బాల్ వార్తల ప్రచారంమహాభారతంలో ఏకలవ్యుడి గాధే ఆదర్శం

ఆటల వేటలో నలుగురు ఏకలవ్యులు

Monday April 27, 2015,

4 min Read

నిజమా! భారతదేశంలో నిజంగా బాస్కెట్ బాల్ ఆడతారా? తగినన్ని ఈవెంట్లు జరుగుతాయా ఇక్కడ ? ఈ ఏకలవ్యుల బృందానికి తరచూ ఎదురయ్యే ఒక ప్రశ్న ఇది. అవును మరి.. నిస్సిగ్గుగా, యధేచ్ఛగా క్రికెట్ పిచ్చి తలకెక్కించుకున్న దేశం మనది. అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్న ఎదురవటం సహజమే. భారత్‌లో చాలామంది బాస్కెట్ బాల్ లాంటి ఆటను పట్టించుకోనప్పుడు నలుగురు మాత్రం పట్టుదలతో ఈ ప్రసారాల చుట్టూ వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

గోపాల్,విష్ణు,అతిథ్

గోపాల్,విష్ణు,అతిథ్


అరవింద్ మొక్కపాటి, గోపాలకృష్ణన్ ఆర్, విష్ణు రవిశంకర్, అతిథి రావు భారతదేశంలో ప్రత్యామ్నాయ క్రీడలను మెరుగుపరచటమనే కలను సాకారం చేసుకోవటానికి ఏకమయ్యారు. క్రికెట్‌కు మోతాదు మించి ప్రాధాన్యం ఇవ్వటం వలన భారతదేశంలో ఇతర క్రీడల మీద మీడియా దృష్టి పడలేదన్నది వీళ్ళ అభిప్రాయం. అందుకే భారతదేశపు ఏకైక బాస్కెట్ బాల్ వార్తల వెబ్‌సైట్ ఏకలవ్యాస్. డాట్ కామ్ (ekalavyas.com) ద్వారా ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటి వరకూ దేశవిదేశాలో జరిగిన పదిహేనుకు పైగా టోర్నమెంట్లను కవర్ చేయటంతోబాటు ఈ సైట్‌లో అంశాల వారీగా లోతైన ఫీచర్లు, నిపుణుల కాలమ్స్, ఉన్నత శ్రేణి క్రీడాకారుల, కోచ్‌ల, రిఫరీల ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ అఫ్ ఇండియాకు అధికారిక మీడియా భాగస్వాములు కూడా.

మహాభారతంలో ఏకలవ్యుడి గాధ అందరికీ సుపరిచితమే. తనకు తానుగా ఎదిగిన విలువిద్యకారుడు. అడవిలో ఎవరి అండా, శిక్షణాలేకుండా తనకు విలువిద్యపట్ల ఉన్న ప్రేమతోనే తిరుగులేని వాడయ్యాడు. ఏకలవ్యుడిలాగానే భారతదేశంలో ప్రత్యామ్నాయ క్రీడలను పూర్తిగా విస్మరించారు. అందుకే వాళ్లు ఈ పేరు ఎంచుకున్నారు. ఏకలవ్యాస్ ప్రస్తుతం ప్రాథమిక వనరులనుంచి సమాచారం సేకరించటంలో నిమగ్నమైంది. ఎవరో సేకరించిన సమాచారం మీద ఆధారపడటం కంటే ఇది మెరుగని భావిస్తోంది. ఈ బృందం టోర్నమెంట్ల సమాచారం సేకరించి ప్రత్యక్ష ప్రసారాలతో బాటు అనేక కథనాలనూ అందిస్తుంది. బాస్కెట్ బాల్ మిత్రుల నుంచీ అభిమానులనుంచీ వస్తున్న స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. వాళ్ళకు నిధులెలా వస్తాయనేది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా బాస్కెట్ బాల్ అంత లాభదాయకమా అనేది మరో ప్రశ్న. ఇప్పటి దాకా వనరులు వాళ్ళ సొంతంగా దాచుకున్న డబ్బే. ప్రయాణ ఖర్చుల్లాంటివి మాత్రం వాళ్ళ క్లయింట్లే భరిస్తారు. 

“ఆ నోటా ఈ నోటా మా గురించి ప్రచారమయ్యాక ఏడాదిగా మా ప్రయత్నంలో ఎదుగుదల కనిపిస్తోంది. బాస్కెట్ బాల్ సంబంధిత కార్యక్రమాల ప్రమోషన్‌కి సోషల్ మీడియాలో పిలుపులందుతున్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమేణా మెరుగుపడుతోంది” అంటున్నారు గోపాల్.

వాళ్ళు పైకి ఎవరికీ చెప్పని విషయమేంటంటే ఈ విభాగంలో మొదటివారిగా వాళ్ళకుండే మెరుగైన స్థానం. “ఎంతైనా, మొదటి వాళ్ళం కావటం ఒక అరుదైన గౌరవం. మా నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేనిదది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది వేరే విషయం” అంటారు గోపాల్ గర్వంగా.

image


అన్ని స్టార్టప్స్‌లాగానే ఈ ఏకలవ్యాస్ బృందానికి ప్రతిరోజూ ఉద్వేగ భరితమే. అదే పనిగా కొత్త ఆలోచనలు చేయటం, కొత్త అవకాశాలు, కొత్త భాగస్వామ్యాలు వెతకటంతో గడిచిపోతుంది. ఆటల పట్ల చైతన్యం పెరిగేకొద్దీ ఈత, విలువిద్య, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా పెరిగిపోతున్నాయి. గోపాల్ మాటల్లో చెప్పాలంటే వీటి అవకాశాలు ఇప్పటిదాకా వాడుకోకపోవటం వలన మార్కెట్ పెరుగుతూవస్తోంది. ఈ క్రీడల్లో ప్రాథమిక స్థాయి నుంచీ అంటే.. కోచింగ్, మీడియా ప్రమోషన్, ఆటగాళ్ల ప్రాతినిధ్యం, ప్రసార హక్కులు, క్రీడాపరికరాలు, క్రీడా సంబంధ వస్తువుల అమ్మకాలు లాంటివి బాగా వృద్ధి చేయాలి. “ఈ మార్కెట్‌నే మేం పట్టుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో ఆటలపట్ల పెరుగున్న ఆసక్తిలో మేం భాగస్వాములం కావాలనుకుంటున్నాం'' అంటారు అరవింద్. పూర్తిగా లెక్కలు చెప్పాలంటే, 2013 సెప్టెంబర్‌లో వాళ్ళ ఫేస్ బుక్ పేజీ మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ వాళ్ళకు 12,000 లైక్స్ వచ్చాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. బాస్కెట్ బాల్ మరే ఇతర మాధ్యమంలోనూ ప్రసారం కాదు కాబట్టి వాళ్ళ వెబ్ సైట్‌లో లైవ్ కామెంటరీ ఫీచర్ అత్యంత ఆదరణ పొందింది. వాళ్ళ ఉనికి యూ ట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం లాంటి వేదికలమీదా ఉంటుంది.

అరవింద్

అరవింద్


''హుశా మేం చేసిన ఒక పొరపాటేంటంటే, కంటెంట్ తయారీ మీదనే దృష్టిపెట్టి పబ్లిసిటీ మీదా, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ రేటింగ్స్ మీదా ఎక్కువగా దృష్టి సారించలేదు. దాని ఫలితంగా ఏడాదిన్నర దాటినా చాలా మందికి మా ఉనికి తెలియలేదు. నిజంగా బాస్కెట్ బాల్ కొక వెబ్‌సైట్ ఉందన్నదే తెలియలేదు'' అని చెప్పారు గోపాల్. కేవలం కలలు కంటే చాలదు, దాని పట్ల మనకు ప్రేమ ఉండాలి. తమను తాము భాగస్వాములని చెప్పుకునే ఆ నలుగురూ వాళ్ళ స్కూలు రోజుల్లో, కాలేజి రోజుల్లో బాగా చురుగ్గా ఆటలాడేవారు. అరవింద్, గోపాల్, విష్ణు జోధ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీలో చదువుకున్నారు. అరవింద్ యూనివర్సీటీ ఫుట్ బాల్ జట్టు కెప్టెన్. అక్కడి క్రికెట్ జట్టులో ఆటగాడు కూడా. గోపాల్ ఆ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీమ్‌‌ లోనూ వాలీబాల్ టీమ్‌లోనూ ఉండేవాడు. విష్ణు అటు బాస్కెట్ బాల్ జట్టులోనూ ఇటు ఫుట్‌ బాల్ జట్టులోనూ ఆడేవాడు. అతిథ్, గోపాల్ ఇద్దరూ ఉడిపిలో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్లాస్‌మేట్స్. అతిథ్‌కి అథ్లెటిక్స్, వాలీబాల్, సంగీతం అంటే ప్రాణం కీలకమైన నలుగురు సభ్యులు కాకుండా ఆ బృందంలో వెబ్ సైట్ డెవలపర్ మనోజ్ నాయర్, తరచూ రాసే విద్యార్థులు, నిపుణులైన కాలమిస్టులు ఉన్నారు. స్వతంత్ర కార్టూనిస్టులు, గణాంక శాస్త్రవేత్తలు, ఫొటో జర్నలిస్టుల సేవలను అవసరానికి అనుగుణంగా వాడుకుంటారు. ఇతర ఆటల మీద దృష్టి పెట్టాలని కూడా వాళ్లకుంది. ఈ మధ్యనే మొదటిసారిగా జాతీయ స్థాయి అమెరికన్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కవర్ చేశారు. భారత్‌లో ప్రత్యామ్నాయ ఆటల పట్ల వైఖరి ఎలా ఉంది ? చాలా సానుకూలంగా ఉందంటుంది ఏకలవ్య బృందం. “భారతదేశాన్ని అంతర్జాతీయంగా క్రీడాశక్తిగా మార్చాలన్నది మా అభిమతం. దీర్ఘకాలంలో రానున్న తరాలకు కెరీర్ పరంగా మరిన్ని అవకాశాలు ఉండేలా చూడాలనీ కోరుకుంటున్నాం'' అంటున్నారు ఈ ఏకలవ్యులు.

బాస్కెట్ బాల్ గురించి అంతగా తెలియని వాళ్ళు ఇప్పుడైనా పరిజ్ఞానం పెంచుకోవటం అవసరం. భారత బాస్కెట్ బాల్ గురించి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివిగో : 

• దాదాపు 80 ఏళ్లకు పైబడిన బాస్కెట్ బాల్ చరిత్రలో భారత పురుషులజట్టు మొట్టమొదటిసారిగా నిరుడు చైనాను ఓడించింది.

• భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న క్రీడ బాస్కెట్ బాల్. ఎన్ బి ఏకు ముంబైలో ఆఫీస్ ఉంది. ఏటా వేసవిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాస్కెట్ బాల్ ఆటగాళ్ళు భారత దేశానికి వస్తుంటారు.

• భారత బాస్కెట్ బాల్ పురుషుల జట్టును యంగ్ కేజర్స్ అంటారు. 1980 లో పురుషుల జట్టు మాస్కో ఒలంపిక్స్‌కు క్వాలిఫై అయింది

• మహిళాబాస్కెట్ బాల్ జట్టు ప్రస్తుతం ఆసియాలో ఐదో ర్యాంకులో ఉంది.

• ప్రస్తుతం మన జట్టులో ఆడుతున్న గీతూ అన్నా జోస్ అమెరికా వారి మహిళా జాతీయ బాస్కెట్ బాల్ లీగ్ వారి సెలక్షన్స్‌కు ఆహ్వానం అందుకున్నారు. ఆ స్థాయికి వెళ్ళిన తొలి భారత జాతీయురాలు ఆమె.